మానవీయ కోణంలో పారిశ్రామికాభివృద్ధి
పలు రాష్ట్రాల పారిశ్రామిక విధానాల అధ్యయనం
* పారిశ్రామికవేత్తలుగా ఎస్సీ, ఎస్టీ మహిళలు
* హైదరాబాద్‌కు దూరంగా ‘కాలుష్య’ పరిశ్రమలు
* పరిశ్రమల శాఖపై కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మానవీయ కోణంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ పనిచేస్తుందని ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇటీవల పరిశ్రమల శాఖ బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం పరిశ్రమల భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, పెట్టుబడిదారులను తెలంగాణకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ద్వారా పెట్టుబడులు వస్తున్నా దానికి పారిశ్రామిక వర్గాల్లో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘ప్రమోషనల్ వింగ్’ ఏర్పాటు చేయాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడంతో పాటు ఇదివరకే స్థాపించిన వాటిని కాపాడుకుంటూ వృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యతలో రాష్ట్రం తక్కువ ర్యాంకు సాధించడానికి కారణాలను ఆరా తీశారు. టీఎస్‌ఐపాస్ ఆవిష్కరణలో ఆలస్యమే అందుకు కారణమని అధికారులు వివరించారు.
ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అసోచామ్, ఫిక్కి, డిక్కి వంటి పారిశ్రామిక, వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ చుట్టూ వున్న కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించేందుకు వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
చేనేత కార్మికులకు తగిన ప్రతిఫలం
చేనేత కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలముండేలా ప్రణాళికలు రూపొందించాలని చేనేత, జౌళి శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. తమిళనాడు కో ఆప్టెక్స్ తరహాలో చేనేత, పవర్‌లూమ్ వస్త్ర దుకాణాల ఏర్పాటును పరిశీలించాలన్నారు. చేనేత విభాగంలో విభజన సమస్యలపై సమీక్ష జరిపారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చేనేత, వస్త్ర పరిశ్రమ డైరక్టర్ సభ్యసాచి ఘోష్, ఆప్కో ఎండీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.