థామస్ లాయిడ్ ఎండీ నందీత సెహగల్ బృందంతో మంత్రి కేటీఆర్ భేటీ. చిత్రంలో జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రెండోరోజు గురువారం ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో థామస్ లాయిడ్ గ్రూప్ కార్యకలాపాల విస్తరణపై.. ఆ సంస్థ ఎండీ నందిత సెహగల్ నేతృత్వంలోని ప్రతినిధులతో చర్చించారు. పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి పనిచేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి చూపడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో కలిసి రావాలని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ హాల్ఫార్డ్, ప్రొ వైస్ చాన్స్‌లర్ పొలార్డ్‌లతో జరిగిన భేటీలో కోరారు. హైదరాబాద్‌లో తమ కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు త్వరలో స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్‌ఎస్‌బీసీ ప్రతినిధులు పాల్ మెక్ పియర్సన్, బ్రాడ్‌హిల్ బర్న్‌లు తెలిపారు.
గ్లాక్సో స్మిత్‌క్లైన్ విస్తరణ
ఫార్మా రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్.. తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తుందని సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి హెడ్ ఫ్రాంక్ రాయిట్ వెల్లడించారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్ నుంచి ‘హాలియన్’ పేరిట వేరుపడిన హెల్త్‌కేర్ విభాగం స్వతంత్రంగా పనిచేస్తోందని, ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.710 కోట్లకుపైగా పెట్టుబడితో 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైన్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఫార్మా వర్సిటీపై కింగ్స్ కాలేజీతో..
హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధిం చిన పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో కలిసి పనిచేసేందుకు లండన్ కింగ్స్ కాలేజీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్ సమ క్షంలో.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కింగ్స్ కాలేజీ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ కమ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షిట్జి కపూర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఫార్మాసిటీ విజన్‌లో భాగమని.. హైదరాబాద్ ఫార్మా సిటీ అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
వరుసగా భేటీలు..
మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం గురువారం లండన్‌లో వివిధ కంపెనీల అధిపతులతో వరుసగా భేటీలు నిర్వహించింది. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, సొసైటీ ఆఫ్ మోటార్ మ్యాన్యుఫాక్చరర్స్, ట్రేడర్స్ సంయుక్త సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ పాలసీకి ఆకర్షితులై దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. తర్వాత కేటీఆర్ బృందానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ అధ్యక్షుడు లార్డ్ కరన్ బిల్మోరియా యూకే పార్లమెంటులో ఆతిథ్యమిచ్చారు. అనంతరం పలువురు ఎంపీలతోపాటు సీఐఐ, ఇండో బ్రిటిష్ ఏపీపీజీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఎయిరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. తర్వాత బిల్మోరియాతో కలిసి బ్రిటన్ పార్లమెంటును సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment