WEF Conference
-
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో గౌతమ్ అదానీ సమావేశమైన అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్‌రాజ్ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అదానీ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతోపాటు గిగా సేల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి సమావేశమయ్యారు. తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీ సీఎంతో సమావేశమై తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. రాష్ట్ర పెట్టుబడి ఒప్పందాలు (రూ.కోట్లలో) అదానీ గ్రూప్ : రూ.12,400 కోట్లు ఆరాజెన్ : రూ.2,000 కోట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : రూ.9,000 కోట్లు గోడి ఇండియా : రూ.8,000 కోట్లు వెబ్ వర్స్ : రూ.5,200 కోట్లు గోద్రెజ్ : రూ.1,270 కోట్లు -
ప్రపంచాన్ని నియంత్రించే వేదిక
దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడుగులు వేస్తున్నది. ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ తమ సభ్యులు ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రపంచంలో జరిగే కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. గత నాలుగు దశాబ్దాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో వేలాది మంది అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు,బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, దేశాధినేతలు, ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ధనిక దేశాల విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇంతమంది నాయకులు, ప్రముఖులు అక్కడ పోషించే పాత్ర ఏమిటో తెలియదు. ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఈ సంవత్సరం కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు దావోస్(స్విట్జర్లాండ్) పోతున్నారు– మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. తెలంగాణా నుంచి దావోస్ ప్రతి సమావేశంలో పాల్గొనే మంత్రి గారు వెళ్తున్నారు. ఈ సమావేశాలు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక ప్రైవేటు సంస్థ. దీని ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రపంచంలో రెండు పెట్టుబడిదారీ నమూనాలు ఉన్నాయి. మొదటిది: చాలా పాశ్చాత్య సంస్థలు స్వీకరించిన ‘షేర్ హోల్డర్ క్యాపిటలిజం’. దీని ప్రకారం ఒక కార్పొరేషన్ ప్రాథమిక లక్ష్యం దాని లాభాలను గరిష్ఠంగా పెంచడం, తద్వారా వాటాదారు లకు లాభాలు పంచడం. రెండవ నమూనా: ‘స్టేట్ క్యాపిటలిజం’. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. చైనా, ఇంకా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తరహ వ్యవస్థ ఇటీవల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రెండింటికి భిన్నంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధినేత క్లాస్ శ్వాబ్ ప్రతిపాదించిన మూడవ తరహా ‘స్టేక్ హోల్డర్ పెట్టుబడిదారీ విధానం’లో ప్రైవేట్ కంపెనీలకు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది ఒక విధంగా మన దేశంలో అమలవుతున్న సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ) లాంటిది. ఇది మంచిదేగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తున్నది. వైఫల్యం చెందినప్పటికీ ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తూ, ప్రపంచ పరిపాలన మీద దృష్టి పెడుతున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ సమస్యలో అయినా ‘డబ్ల్యూఈఎఫ్’ సభ్యులు తమ ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఆలోచనలతో క్లాస్ శ్వాబ్ రాసిన పుస్తకం: ‘ది గ్రేట్ రీసెట్’. దీనిలో భాగస్వామ్య పెట్టుబడిదారీ విధానంతో పాటు తనదైన మార్క్సిజం బ్రాండ్‌తో ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని పిలుపు ఇచ్చాడు. దశాబ్దాలుగా ఒక క్లబ్ మీటింగ్ తరహాలో ఇక్కడ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. నయా ఉదారవాదం పునాదిగా కార్పొరేట్ వాణిజ్య ఒప్పందాల వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయడం ఇక్కడి ప్రక్రియలో భాగం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లకు దన్నుగా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను ప్రోత్సహించడానికి ఈ సమావేశాలను వాడుకుంటున్నారు. వాస్తవానికి, ఈ ఆర్థిక వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచీకరణ ద్వారా ఉన్నత వర్గాల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడ టమే. 1990లో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైనప్పుడు గనులు, బ్యాంకులు, గుత్తాధిపత్య పరిశ్రమలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయం చేస్తుందని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడైన వెంటనే 1992 జనవరిలో ‘డబ్ల్యూఈఎఫ్’ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను మార్చుకుని ‘పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ’ను స్వీకరించారు. చైనా, వియత్నాం, కంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటే తమ దేశానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాయి. 1997లో అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ ‘దావోస్ మగవాడు’ (దావోస్ మ్యాన్) అనే పదాన్ని సృష్టించారు. ‘దేశ సరిహద్దులను కనుమరుగవుతున్న అవరోధాలుగా, జాతీయ ప్రభు త్వాలను గతానికి అవశేషాలుగా చూస్తూ– అటువంటి ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఉపయోగకరమైన పని ఉన్నత వర్గాల పుడమి స్థాయి కార్యకలాపాలను సులభతరం చేయడమే అని నమ్మేవారు’ అంటూ ఈ పదాన్ని ఆయన విశ్లేషించారు. ఏటా దావోస్ సమావేశాలకు హాజరయ్యేవాళ్ళు తమ పరపతి, వనరులు పెంచుకోవడానికీ, ఇతరులతో కలిసి తమ ఆధిపత్యానికి అడ్డంకులు తొలగించుకోవడానికీ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఒకానొక సమావేశంలో, బోరిస్ బెరెజోవ్స్కీ నేతృత్వంలోని ఏడుగురు రష్యన్ నేతలు బోరిస్ యెల్ట్సిన్ తిరిగి ఎన్నిక కావడానికి నిధులు సమకూర్చాలనీ, ‘తమ దేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి’ కలిసి పనిచేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ కూటమి అనుకున్నది సాధించింది. ఇది వారందరినీ ఇంకా ధనవంతులను చేసింది. 2009 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రజలకు విశ్వాసం తగ్గినప్పటికీ, ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి దావోస్ పని చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫౌండేషన్ బోర్డు (దాని అత్యున్నత పాలక సంస్థ)లో ప్రపంచ కుబేరులు ఉన్నారు. 2002లో ఏర్పాటైన మరొక పాలక మండలి ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్’ను 100 మంది ప్రముఖులతో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, వార్షిక సమావేశ ఎజెండా తయారీకి ఈ మండలి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. 2015 నాటికి ‘డబ్ల్యూఈఎఫ్’ వార్షిక వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందాలంటే దాదాపు 7 లక్షల డాలర్ల రుసుము కట్టాలి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామి సభ్యులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లేస్, బ్లాక్ రాక్, బీపీ, చెవ్రాన్, సిటీ, కోకాకోలా, క్రెడిట్ సూయిజ్, డ్యూష్ బ్యాంక్, డౌ కెమికల్, ఫేస్బుక్, జీఈ, గోల్డ్‌మాన్ శాక్స్, గూగుల్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, సీమెన్స్, టోటల్, యూబీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో జరిగే కార్పొరేట్, ఆర్థిక శక్తి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ప్రతిఘటన ఉద్యమాల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ఆసక్తి చూపిస్తున్నది. 1999లో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ ఆసక్తి స్పష్టమైంది. అప్పటి నిరసనల వల్ల సియాటెల్ నగరంలో కీలక వాణిజ్య చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలను పెరుగుతున్న ‘ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం’గా ‘డబ్ల్యూఈఎఫ్’ అభివర్ణించింది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో, లేదా నిరంకుశంగా అణిచివేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. 2001 జనవరిలో దావోస్ సమావేశాలకు అంతరాయం కలగకుండా అసాధారణ భద్రతా చర్యలు తీసుకున్నారు. దావోస్ పట్టణం చుట్టూ కాంక్రీట్ బ్లాక్‌లు అమర్చి, కంచెకు అవతలి వైపునే వేలాది పోలీసులు నిరసనకారులను నిలువరించారు. అదే సమయంలో, దావోస్‌కు ప్రతి వేదికగా బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో ఏర్పడిన వరల్డ్ సోషల్ ఫోరమ్ కాలక్రమేణా బలహీనపడగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బలపడింది. అన్ని దేశాల ఒప్పందం మేరకు ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడగా, ఒక ప్రైవేటు సంస్థ అయిన ‘డబ్ల్యూఈఎఫ్’ బలపడుతున్నది. తన దగ్గర ఉన్న కోట్లాది సొమ్ముతో అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. కరోనా మహమ్మారి గురించిన వివిధ దేశాల ప్రభుత్వాల స్పందనను, విధానాలను శాసించే స్థితికి కూడా ఈ సంస్థ చేరిందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్ పంప్డ్ స్టోరేజ్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా దావోస్‌లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్, గ్రీన్కో గ్రూప్ ఎండీ, సీఈవో అనిల్ చలమలశెట్టి, దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ సెషన్ మోడరేటర్‌గా వ్యవహరించారు. డీ కార్బనైజ్డ్ ఎకానమిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అమితాబ్‌కాంత్ ప్రశంసించగా రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వామి కానున్నట్లు ఆర్సలర్ మిట్టల్ గ్రూపు ప్రకటించింది. డీ కార్బనైజ్డ్ ఆర్థిక వ్యవస్థ దిశగా ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, జీరో కార్బన్ కోసం అనుసరించాల్సిన విధానాలు, గ్రీన్ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... సీకోయ్ క్యాపిటల్ ఎండీ రాజన్‌తో సీఎం జగన్ బ్యాటరీ తరహాలో పంప్డ్ స్టోరేజీ పర్యావరణ పరిరక్షణకు కర్బన రహిత యంత్రాంగం ఏర్పాటు చాలా కీలకం. ఈ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వకుంటే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పర్యావరణ, సామాజికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం మన బాధ్యత. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడకు (దావోస్) రావడానికి కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాం. పంప్డ్ స్టోరేజీ ఒక బ్యాటరీ తరహాలో పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా సౌరవిద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులు కూడా అక్కడ రానున్నాయి. జుబిలియంట్ గ్రూప్ చైర్మన్ కాళీదాస్తో సీఎం జగన్ నిరంతర విద్యుత్తు ఈ విధానంలో ఒక డ్యామ్ నిర్మిస్తాం. అందులో కేవలం 1 టీఎంసీ నీటిని వినియోగిస్తాం. దీన్ని ఉపయోగించి విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు (పీక్ అవర్స్‌లో) నీటిని వదిలి విద్యుదుత్పత్తి చేస్తాం. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు (నాన్ పీక్ అవర్స్‌లో) మళ్లీ నీటిని రిజర్వాయర్‌లోకి వెనక్కి లిఫ్ట్ చేస్తాం. అప్పుడు పవన, సౌర విద్యుత్ వాడుకుంటాం. దీనివల్ల 24 గంటలపాటు పగలు, రాత్రి కూడా పవర్ అందుబాటులోకి వస్తుంది. చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది స్ధిరమైనది, ఆర్థికంగా బలమైనది. వినియోగం తక్కువగా ఉన్న సమయంలో (నాన్ పీక్ అవర్స్‌లో) పవన, సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ కరెంట్‌ను ఉపయోగించుకుని నీటిని మళ్లీ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తాం. ఇది చాలా సులువైన మెకానిజమ్. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఏస్ అర్బన్ డెవలపర్స్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు గ్రీన్ పరిశ్రమలు.. డీశాలినైజేషన్ 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి చేయగల సామర్ధ్యం ఏపీకి ఉంది. ఏపీలో అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. సంప్రదాయ పరిశ్రమల నుంచి సంప్రదాయేతర పరిశ్రమలకు కూడా మార్పు చెందవచ్చు. సంప్రదాయ పరిశ్రమ నుంచి గ్రీన్ పరిశ్రమగా మారడంతో పాటు ఈ పవర్‌ను ఉపయోగించుకుని హైడ్రోజన్,అమ్మోనియా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో నీటి డీశాలినైజేషన్ (నిర్లవణీకరణ) ప్రక్రియ కూడా చేయవచ్చు. వీటన్నింటికీ ఏపీ మీకు స్వాగతం పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణపై సానుకూల దృక్పథంతో ముందుకొస్తే స్వాగతం పలుకుతాం. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్రెమంట్తో సీఎం జగన్ ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ ప్రపంచంలో కర్బన కాలుష్యానికి భారత్ కారణం కాదు. గ్రీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూపిన చొరవ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్ ప్లాంట్ ద్వారా చౌకగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత పునరుత్పాదక ఇంధన పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది. ఏపీలో 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తనలో యావత్ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సీఎం జగన్ ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్ హరిత ఉదజని. ఫెర్టిలైజర్లు, స్టీల్, రిఫైనరీ, షిప్పింగ్ రంగాలు కూడా గ్రీన్ హైడ్రోజన్ వినియోగం దిశగా మారాల్సి ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చూపిన చొరవ ఆదర్శంగా నిలవనుంది. భారత్‌లో కర్బన ఉద్గార కారకాల తలసరి వినియోగం చాలా తక్కువ. అయితే కర్బన రహిత పారిశ్రామికీకరణ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్ తొలి దేశంగా నిలవాల్సి ఉంది. ఇది ఒక సవాల్ కాదు. అందివచ్చిన అవకాశంగా చూడాలి. – అమితాబ్‌కాంత్, నీతి ఆయోగ్ సీఈవో ఏపీ.. ఎంతో అనుకూలం ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టాం. గ్లోబల్ రెన్యువబుల్ ప్రాజెక్టు కోసం గ్రీన్కో కంపెనీతో కలసి పని చేస్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ 27 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ రెన్యువబుల్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించా. అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి కానుండడం, తక్కువ నీటి వినియోగం నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చాం. రోజంతా 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుండడం అద్భుతం. భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. పునరుత్పాదకాలు, హరిత ఉదజని కోసం మా వంతుగా పూర్తి చొరవ చూపుతాం. అన్ని రకాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం. – ఆదిత్య మిట్టల్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో -
CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు
సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్) వేదికగా గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, ఆయా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తి చేసి 18 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం తాజా ఒప్పందాలను కుదుర్చుకుంది. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా ఎస్ఈజెడ్ ఏర్పాటుపై కూడా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదానీ సంస్థతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేలమందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. దీంతో ఒక్క గ్రీన్ ఎనర్జీ విభాగంలోనే దావోస్ వేదికగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నట్లైంది. గ్రీన్ కో గ్రీన్‌సిగ్నల్.. కర్బన రహిత విద్యుదుత్పత్తికి గ్రీన్కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 8 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఒప్పందం జరిగింది. ఇందులో వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ ప్రాజెక్టు, 5 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 2 వేల మెగావాట్ల విండ్(పవన విద్యుత్) ప్రాజెక్టు ఉన్నాయి. దీని కోసం రూ.37 వేల కోట్ల పెట్టుబడిని ఆ సంస్థ పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 6 వేల మెగావాట్లతో అరబిందో రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వంతో అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2 వేల మెగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులు ఉంటాయి. ప్రస్తుతం కాకినాడ ఎస్ఈజెడ్లో సదుపాయాలను వినియోగించుకుని ఈ ప్రాజెక్టులను అరబిందో రియాల్టీ చేపట్టనుంది. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.28 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బందరులో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్.. మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. గ్రీన్ ఎనర్జీతో సహాయంతో ఈ జోన్లో పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టనుంది. ఈ జోన్లో ప్రపంచస్థాయి కంపెనీలకు అవసరమైన వసతులు కల్పిస్తారు. బహ్రెయిన్‌కు ఏపీ ఎగుమతులు దావోస్‌లో మూడో రోజు మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీపాతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ, హై ఎండ్ టెక్నాలజీ విభాగాల్లో అవకాశాలను ప్రధానంగా తెలియచేశారు. రాష్ట్రం నుంచి బహ్రెయిన్‌కు విరివిగా ఎగుమతులపై చర్చించారు. విద్యారంగంలో పెట్టబడులపై సల్మాన్ అల్ ఖలీపాతో చర్చలు జరిపారు. అనంతరం సెకోయ క్యాపిటల్ ఎండీ రంజన్ ఆనందన్‌తో సీఎం జగన్ సమావేశమై స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధిపై చర్చించారు. సెకోయా క్యాపిటల్ ఏపీలో కార్యకలాపాల ప్రారంభం అంశంపైనా చర్చించారు. అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ ► డబ్ల్యూఈఎఫ్ వేదికగా ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రెమంట్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చే విధంగా ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రంలో భారీగా రానుండటంతో ఆ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ► వ్యవసాయం, ఆహారం, ఫార్మా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జుబిలియంట్ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కాళీదాస్ హరి భర్తియాతో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌పై విస్తృతంగా చర్చించారు. విశాఖలో ఐఐఎం క్యాంపస్ నిర్మాణం వచ్చే ఆగస్టు నాటికి పూర్తి కానుందని, దీనికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్లు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాళీదాస్ హరి భర్తియా తెలిపారు. ► ప్రఖ్యాత స్టీల్ దిగ్గజ కంపెనీ ఆర్సెల్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్ జగన్ సమావేశమై గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తిపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్కో భాగస్వామ్యంతో ఏపీలోకి అడుగుపెడుతున్నామని ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నట్లు వెల్లడించారు. తమ కంపెనీ తరఫున 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఐఎసీఎల్, ఎల్ అండ్ టీలతో జాయింట్ వెంచర్ రెన్యూ పవర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌తో రెన్యూ పవర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుమంత్ సిన్హా సమావేశమయ్యారు. రాష్ట్రంలో హైడ్రోజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణతో సీఎం జగన్ సమావేశమై టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. విశాఖను హై ఎండ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ వివరించారు. -
CM YS Jagan Davos Tour: తయారీ హబ్‌గా ఏపీ
సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ ఊపందుకునేలా సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం. కాలుష్యం లేని పారిశ్రామిక ప్రగతి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీ, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కోవిడ్ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా అడుగులు ముందుకు వేశాం. పాలనలో విప్లవాత్మక సంస్కరణలతో అనేక సేవలు అందిస్తున్నాం. పలు రంగాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. – దావోస్ వేదికపై సీఎం జగన్ సాక్షి, అమరావతి: పర్యావరణ హిత తయారీ రంగంలో అవకాశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు, కాలుష్యం లేని ఇంధన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తొలి రోజు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ప్లాట్‌ఫాం పార్ట్నర్గా ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్, బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని పలువురు కొనియాడారు. కొత్త పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా విద్య, వైద్య రంగాలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి ఏపీలో పెట్టుబడుల అవకాశాలకు సంబంధించిన సమాచారం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుడ్ హబ్‌గా ఏపీ దావోస్‌లోని కాంగ్రెస్ సెంటర్లో డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లాజ్ మాట్లాడుతూ.. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితులను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ష్వాప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగు పరచడంపై శ్రద్ధ పెట్టామని చెప్పారు. సోషల్ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదిక ద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని ఆకాక్షింస్తూ.. ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాల గురించి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్య రంగాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడప వద్దకే సేవలు అందిస్తున్నామని చెప్పారు. డబ్ల్యూఈఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు చూపుతున్న అధికారులు వైద్య రంగంలో భాగస్వామ్యం కండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్యం – వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో కాంగ్రెస్ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్ క్లినిక్స్.. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాస్పత్రులు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకుని, జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలను తెలియజేసేలా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. కాలుష్య రహిత వ్యవస్థే లక్ష్యం డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టెయిన్‌బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యం ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై, ఇంధన రంగం భవిష్యత్‌పై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. లేకపోతే నీటి వనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని వివరించారు. విండ్, సోలార్, హైడల్.. ఈ మూడింటినీ సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని విశదీకరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం జగన్‌తో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే డబ్ల్యూఈఎఫ్ ఒప్పందంతో ఉపయోగాలు ఇలా.. ► డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. ► రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికత, కాలుష్యం లేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారం అందిస్తుంది. ► రాష్ట్రాన్ని అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ► నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో రాష్ట్రానికి మార్గనిర్దేశం లభిస్తుంది. ఏపీ చర్యలు భేష్ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) గ్లోబల్ చైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సీఎం జగన్ సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో తూర్పు భాగానికి రాష్ట్రం గేట్వేగా మారేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇందుకోసం కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం ప్రారంభించామన్నారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్ చైర్మన్ బక్నర్ ప్రశంసించారు. నైపుణ్య మానవ వనరులను తయారు చేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అనంతరం మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది. అనంతరం ముఖ్యమంత్రి.. అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. దావోస్‌లో నేడు సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలు ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడనున్నారు. స్విస్ కాలమానం ప్రకారం ఉ.8:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉ.11.45 గంటలకు) సెషన్ ప్రారంభం. టెక్ మహీంద్రా ఛైర్మన్, సీఈఓ సీపీగురానీతో భేటీ.. దస్సాల్ట్ సీఈఓ బెర్నార్డ్ ఛార్లెస్‌తో సమావేశం. è జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో భేటీ. హీరోమోటార్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ పవన్ ముంజల్‌తో సమావేశం.. ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ. మరింత మంది ప్రముఖులనూ కలిసే అవకాశం. -
ఇంకా ఇంత అంతరమా?
సంపద రాకపోకల గురించి శతకకారుడొక మంచి మాట చెప్పాడు. ‘సిరి తా వచ్చిన వచ్చును, సరళముగా నారికేళ సలిలము భంగిన్...’ అన్నాడు. అంటే, కాలం కలిసొస్తే కొబ్బరి నీళ్లు దొరికినంత సరళంగా, సులువుగా సంపద వచ్చి చేరుతుందని కవి హృదయం. పోయే విషయం లోనూ... ‘సిరి తా పోయిన పోవును, కరిమింగిన వెలగపండు కరణిన్ సుమతీ!’ అంటాడు. ఏనుగు తినడానికి ముందు, తిన్న తర్వాత కూడా బయటకు వెలగపండు అంతే నిక్షేపంగా కనబడుతుంది, కానీ, లోపల గుజ్జంతటినీ వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఏనుగు లాగేస్తుంది. అలా తెలియకుండానే సంపద వెళ్లిపోతుందని ఉవాచ. ఒకరికి సంపద ఎంత తేలిగ్గా రావచ్చో అంతే చడీచప్పుడు లేకుండా వెళ్లిపోనూ వచ్చని, అది స్థిరం కాదని చెప్పడం కవి ఉద్దేశం. కానీ, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో తేడా ఉంది. ఏమంటే, వచ్చే వాళ్లకు పైన చెప్పినట్టు తేలిగ్గా, సులభంగా సంపద వచ్చి చేరుతోంది. ఇక పోయే వాళ్లకు పాపం, చడీచప్పుడు లేకుండా సంపద దక్కకుండా పోతోంది. దాంతో ఆర్థిక అంతరాలు బాగా పెరుగుతున్నాయి. ధనవంతులు ఇంకా సంపన్ను లవుతుంటే, పేదలు మరింత పేదరికంలోకి జారి, బతుకు సమరం నెగ్గలేక చతికిలపడుతున్నారు. మన దేశంలో ఒక శాతం జనాభా దగ్గర ఉన్న సంపద, 70 శాతం అట్టడుగు జనాభా (అంటే, 95 కోట్ల మంది) వద్దనున్న సంపదకు నాలుగురెట్లపైనే అధికం అంటే ఆలోచించండి! దావోస్‌లో సోమవారం ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్లుఈఎఫ్) యాభయవ వార్షిక భేటీ సందర్భంగా ఎప్పట్లాగే ‘ఆక్స్‌ఫామ్’ ఓ నివేదిక విడుదల చేసింది. ‘జాగ్రత్తకు వేళాయె’ (టైమ్ టు కేర్) అంటూ ఈ అధ్యయన నివేదిక వెల్లడించిన వివరాలు సగటు ఆలోచనాపరుల్ని కలవరపరుస్తున్నాయి. ఇంతటి ఆర్థిక అంతరాలు ఎడతెగని సామాజిక అసమానతలకు, అశాంతికి దారితీస్తున్నాయి. భూమ్మీది 60 శాతం జనాభా (460 కోట్ల మంది) వద్ద కన్నా ఎక్కువ సంపద ప్రపంచంలోని 2,153 మంది కోటీశ్వరుల వద్ద పోగులుపడి ఉందనేది తాజా లెక్క! దశాబ్ద కాలంలో ప్రపంచ కోటీశ్వరుల సంఖ్య రెట్టింపయింది. అసమానతల్ని తొలగించే నిర్దిష్ట విధానాలు, కార్యక్రమాలు లేకుండా ఈ అంత రాల్ని తగ్గించడం దాదాపు అసంభవమని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో అశాంతికి కారణమౌతున్న సామాజిక, రాజకీయ అంశాలకు తోడు ఈ ఆర్థిక అంతరాల సమస్య తోడవడం అగ్నికి ఆజ్యం పోస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక ‘గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్’ కూడా ఇలాంటి హెచ్చరికే చేసింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) గుర్తించిన 195 ప్రపంచ దేశాల్లో 40 శాతం, అంటే 75 దేశాల్లో ఈ సంవత్సరం (2020) అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయన్నది ‘వెరిక్స్ మ్యాపిల్ క్రాఫ్ట్’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డాటా విశ్లేషణ సంస్థ అంచనా! అందులో భారత్ కూడా ఉంది. 2019 లో హాంగ్‌కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్ వంటి 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులుంటే ఇప్పుడా దేశాల సంఖ్య 75కు చేరుతోంది. ఆర్థిక అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తున్న దుస్థితి దాదాపు అన్ని ఖండాల్లోనూ ఉంది. అవినీతి, పాలకుల ఆశ్రితపక్షపాతం, రాజ్యాంగ ఉల్లంఘనలు, అడ్డగోలుగా పెరిగే నిత్యావసరాల ధరలు వంటివే ఆర్థిక అంతరాల వృద్ధికి కారణమని ఎకనమిక్ ఫోరమ్ భావన. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లోనూ వ్యక్తులు, కుటుంబాల వార్షికాదాయాల్లో పెరుగుతున్న వ్యత్యాసాలు రికార్డు స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అవకాశాల అంతరాలే ఆర్థిక అసమానతలకు కారణం. ఉన్న వాళ్లకు అన్నీ సమకూరుతాయి. తద్వారా వాళ్లు సంపదను పెంచుకుంటున్నారు. అవకాశాల్లోనే అన్యాయం వల్ల పేదలు తమ పరిస్థితిని ఎప్పటికీ మెరుగు పరచుకోలేకపోతున్నారు. ఉద్యోగాలుండవు, ఉపాధి దొరకదు, జీవన ప్రమాణాలు మెరుగుపరచుకునే ఆస్కారమే శూన్యం! అరకొర సంపాదన కూడా రోజువారీ ఖర్చు లకు తోడు విద్య, వైద్యం వంటి అత్యవసరాలకే కరిగిపోతోంది. ఇక సంపద వృద్ధికి అవకాశ మెక్కడ? వారి ఆర్థికస్థితి మెరుగుకు దోహదపడకుండా, ఎంత సేపూ వారిని ఓటు బ్యాంకులుగా పరిగణించే పాలనా వ్యవస్థలు ఎప్పటికప్పుడు తృణమో, పణమో తాయిలాలు అందించి పబ్బం గడుపుకుంటున్నాయి. ‘అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డించే...’ పద్ధతిలో ఎర్ర తివాచీలు పరచి కార్పొరేట్లకు దాసోహమంటున్నాయి. పెద్ద ఖర్చుతో కూడుకున్న మన ఎన్నికల సమయంలో వారు వీరికి, అధికారం చేపట్టాక వీరు వారికి పరస్పరం తోడ్పడుతూ ప్రజాధనం కొల్లగొడుతున్న ఫార్ములాలే సమాజంలో ఆర్థిక అంతరాల్ని పెంచుతున్నాయి. ఏటా ఇది పెరు గుతోంది. 63 మంది భారత అతి ఐశ్వర్యవంతుల సంపద 2018–19 కేంద్ర మొత్తం బడ్జెట్ (రూ.24,42,200 కోట్లు) కంటే ఎక్కువ. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు, మన అంతరాల సమాజం... మధ్యలో మెట్లు, నిచ్చెనల్లేని బహుళ అంతస్తు భవనం లాంటిది. పై అంతస్తుల్లో ఎవరైనా అనర్హు లున్నా కిందకు రారు. కింది అంతస్థుల్లోని వారిలో యోగ్యులున్నా పైకి రాలేరు. కాలక్రమంలో మన వ్యవస్థలు ఈ దుస్థితినే మరింత పెంచిపోషిస్తున్నాయి. మరి మన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ రక్షణలు, పంచవర్షప్రణాళికలు, భారీ బడ్జెట్లు... ఏం ఫలితాలు సాధించి నట్టు? అనే ప్రశ్న సహజం. ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అంతరాల్ని తొలగిం చాలన్నది యూఎన్ నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో (ఎస్డీజీ) ముఖ్యమైంది. అసమానతల్ని పూడ్చే ప్రత్యేక ఆర్థిక వనరుల్ని సమకూర్చుకునే అవకాశాలున్నా మన ప్రభుత్వాలు సంపన్నులపై పన్ను విధింపులో ఉదారంగా ఉంటున్నాయి. ప్రపంచ జనాభాలో శీర్షాన ఉన్న ఒక శాతం సంప న్నులు 0.5 శాతం పన్ను ఎక్కువ చెల్లిస్తే, వచ్చే పదేళ్లలో విద్య–వైద్యం, పిల్లలు–వృద్ధుల సంక్షేమం వంటి కీలక రంగాల్లో 11.70 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించొచ్చు. ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ ప్రతిపాదనే! -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
డబ్ల్యూఈఎఫ్‌లో మహిళా దిగ్గజాల హవా
దావోస్: ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలువురు మహిళా వ్యాపార దిగ్గజాలు కూడా పాల్గొంటున్నారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ నీతా అంబానీతో పాటు ఆమె కుమార్తె ఈషా అంబానీ కూడా ఉన్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డెరైక్టర్‌గా ఈషా పాల్గొంటున్నారు. అటు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా ఇందులో ఉన్నారు. వీరితో పాటు షాను హిందుజా, సంజనా గోవిందన్ జయదేవ్, ప్రియా హీరనందానీ వాందేవాలా, వందన్ గోయల్ మొదలైన వారు ఉన్నారు. మొత్తం 2,500 మంది డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటుండగా ఇందులో 17 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. గడిచిన 2-3 ఏళ్లలో మహిళల సంఖ్య ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.ఇందులోనూ భారత్ నుంచి హాజరవుతున్న వారి సంఖ్య మరీ తక్కువ. ఈ విషయంలో చైనా, అమెరికా పరిస్థితి మెరుగ్గా ఉంది. మరోవైపు, ఈసారి సదస్సులో యువ మహిళా వ్యాపారవేత్తలు మాత్రం చెప్పుకోతగ్గ ఉన్నారు. గ్లోబల్ షేపర్స్ గ్రూప్‌లో 50 మంది యువ లీడర్లు ఉండగా.. అందులో సగభాగం పైగా మహిళలే ఉన్నారు. వినియోగదారులకు 1.5 ట్రిలియన్ డాలర్లు: ఐహెచ్ఎస్ తగ్గుతున్న చమురు ధరల వల్ల దాదాపు 1.5 టిలియన్ డాలర్ల సంపద వినియోగదారులకు బదిలీ అవుతుందని ప్రముఖ ప్రపంచ విశ్లేషణా, సమాచార సేవల సంస్థ ఐహెచ్ఎస్ పేర్కొంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల ప్రారంభం రోజు ఐహెచ్ఎస్ ఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశాల్లో ఇదొకటని సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ నారీమన్ బెహ్రావాష్ అన్నారు.