రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం! | MoUs Signs Between States And Corporates In Davos 2024 WEF Summit | Sakshi
Sakshi News home page

Davos Summit: రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం!

Published Thu, Jan 18 2024 10:26 AM | Last Updated on Thu, Jan 18 2024 2:52 PM

MoU Sign Between States And Corporates In Davos 2024 WEF Summit - Sakshi

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

అదానీ గ్రూప్‌ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో గౌతమ్‌ అదానీ సమావేశమైన అనంతరం ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సీఈవో ఆశిష్‌రాజ్‌ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అదానీ తెలిపారు.

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదిరింది. 

తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 
గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్‌ అండ్‌ డీతోపాటు గిగా సేల్‌ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్‌ గోడి సమావేశమయ్యారు.

తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్‌ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్‌ మౌంటేన్‌ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్‌. ఐరన్‌ మౌంటేన్‌ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్క్స్‌ సీఈవో నిఖిల్‌ రాఠీ సీఎంతో సమావేశమై తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. 

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాదిర్‌ గోద్రెజ్‌ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే..

రాష్ట్ర పెట్టుబడి ఒప్పందాలు (రూ.కోట్లలో)

  • అదానీ గ్రూప్‌ : రూ.12,400 కోట్లు
  • ఆరాజెన్‌ : రూ.2,000 కోట్లు
  • జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : రూ.9,000 కోట్లు
  • గోడి ఇండియా : రూ.8,000 కోట్లు
  • వెబ్‌ వర్స్‌ : రూ.5,200 కోట్లు
  • గోద్రెజ్‌ : రూ.1,270 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement