గ్రీన్‌ ఎనర్జీతో గ్రీన్‌ సిగ్నల్‌ | CM Jagan Davos Tour 33 thousand MW pumped storage power 33 thousand MW of pumped storage power generation | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఎనర్జీతో గ్రీన్‌ సిగ్నల్‌

Published Wed, May 25 2022 4:51 AM | Last Updated on Wed, May 25 2022 8:49 AM

CM Jagan Davos Tour 33 thousand MW pumped storage power 33 thousand MW of pumped storage power generation - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలతో అరబిందో గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) సందర్భంగా దావోస్‌లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్, ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈవో ఆదిత్య మిట్టల్, గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ, సీఈవో అనిల్‌ చలమలశెట్టి, దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్‌ హెడ్‌ రిచర్డ్‌ సెషన్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. డీ కార్బనైజ్డ్‌ ఎకానమిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అమితాబ్‌కాంత్‌ ప్రశంసించగా రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వామి కానున్నట్లు ఆర్సలర్‌ మిట్టల్‌ గ్రూపు ప్రకటించింది. డీ కార్బనైజ్డ్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, జీరో కార్బన్‌ కోసం  అనుసరించాల్సిన విధానాలు, గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే... 

సీకోయ్‌ క్యాపిటల్‌ ఎండీ రాజన్‌తో సీఎం జగన్‌ 

బ్యాటరీ తరహాలో పంప్డ్‌ స్టోరేజీ
పర్యావరణ పరిరక్షణకు కర్బన రహిత యంత్రాంగం ఏర్పాటు చాలా కీలకం. ఈ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వకుంటే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పర్యావరణ, సామాజికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం మన బాధ్యత. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడకు (దావోస్‌) రావడానికి కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో ఇంటిగ్రేటెడ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు పనులను ప్రారంభించాం. పంప్డ్‌ స్టోరేజీ ఒక బ్యాటరీ తరహాలో పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా సౌరవిద్యుత్, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు కూడా అక్కడ రానున్నాయి.
జుబిలియంట్‌  గ్రూప్‌ చైర్మన్‌ కాళీదాస్‌తో సీఎం జగన్‌ 

నిరంతర విద్యుత్తు
ఈ విధానంలో ఒక డ్యామ్‌ నిర్మిస్తాం. అందులో కేవలం 1 టీఎంసీ నీటిని వినియోగిస్తాం. దీన్ని ఉపయోగించి విద్యుత్‌ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు (పీక్‌ అవర్స్‌లో) నీటిని వదిలి విద్యుదుత్పత్తి చేస్తాం. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు (నాన్‌ పీక్‌ అవర్స్‌లో) మళ్లీ నీటిని రిజర్వాయర్‌లోకి వెనక్కి లిఫ్ట్‌ చేస్తాం. అప్పుడు పవన, సౌర విద్యుత్‌ వాడుకుంటాం. దీనివల్ల 24 గంటలపాటు పగలు, రాత్రి కూడా పవర్‌ అందుబాటులోకి వస్తుంది. చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది స్ధిరమైనది, ఆర్థికంగా బలమైనది. వినియోగం తక్కువగా ఉన్న సమయంలో (నాన్‌ పీక్‌ అవర్స్‌లో)  పవన, సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ కరెంట్‌ను ఉపయోగించుకుని నీటిని మళ్లీ రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేస్తాం. ఇది చాలా సులువైన మెకానిజమ్‌.
సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు 

గ్రీన్‌ పరిశ్రమలు.. డీశాలినైజేషన్‌
33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుదుత్పత్తి చేయగల సామర్ధ్యం ఏపీకి ఉంది. ఏపీలో అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. సంప్రదాయ పరిశ్రమల నుంచి సంప్రదాయేతర పరిశ్రమలకు కూడా మార్పు చెందవచ్చు. సంప్రదాయ పరిశ్రమ నుంచి గ్రీన్‌ పరిశ్రమగా మారడంతో పాటు ఈ పవర్‌ను ఉపయోగించుకుని హైడ్రోజన్,అమ్మోనియా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్‌ పద్ధతిలో నీటి డీశాలినైజేషన్‌ (నిర్లవణీకరణ) ప్రక్రియ కూడా చేయవచ్చు.  వీటన్నింటికీ ఏపీ మీకు స్వాగతం పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణపై సానుకూల దృక్పథంతో ముందుకొస్తే స్వాగతం పలుకుతాం.
ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లుక్‌రెమంట్‌తో సీఎం జగన్‌ 

ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ 
ప్రపంచంలో కర్బన కాలుష్యానికి భారత్‌ కారణం కాదు. గ్రీన్‌ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చూపిన చొరవ యావత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా చౌకగా కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత పునరుత్పాదక ఇంధన పవర్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది. ఏపీలో 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తనలో యావత్‌ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది.
నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో సీఎం జగన్‌ 

ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్‌ హరిత ఉదజని. ఫెర్టిలైజర్లు, స్టీల్, రిఫైనరీ, షిప్పింగ్‌ రంగాలు కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం దిశగా మారాల్సి ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం చూపిన చొరవ ఆదర్శంగా నిలవనుంది. భారత్‌లో కర్బన ఉద్గార కారకాల తలసరి వినియోగం చాలా తక్కువ. అయితే కర్బన రహిత పారిశ్రామికీకరణ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్‌ తొలి దేశంగా నిలవాల్సి ఉంది. ఇది ఒక సవాల్‌ కాదు. అందివచ్చిన అవకాశంగా చూడాలి.
– అమితాబ్‌కాంత్, నీతి ఆయోగ్‌ సీఈవో

ఏపీ.. ఎంతో అనుకూలం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టాం. గ్లోబల్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో కంపెనీతో కలసి పని చేస్తున్నాం. ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌ 27 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించా.

అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి కానుండడం, తక్కువ నీటి వినియోగం నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5,000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చాం. రోజంతా 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగనుండడం అద్భుతం. భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. పునరుత్పాదకాలు, హరిత ఉదజని కోసం మా వంతుగా పూర్తి చొరవ చూపుతాం. అన్ని రకాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం.
– ఆదిత్య మిట్టల్, ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement