గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, నాస్కామ్ అధ్యక్షురాలు దేవయానీ ఘోష్, అసోచామ్ అధ్యక్షుడు సుమంత్ సిన్హా , సీఐఐ సదరన్ చాప్టర్ అధ్యక్షురాలు సుచిత్ర ఎల్లా, మంత్రి అమర్‌నాథ్
విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. విశాఖలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని మీ అందరినీ కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఏపీలో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వివిధ దేశాల దౌత్యాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్ సన్నాహక సదస్సుకు హాజరయ్యారు.
అత్యుత్తమ సౌకర్యాలు
‘విశాఖపట్నంలో మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటులో మీకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రారంభోపన్యాసంతో పాటు సదస్సు చివరలో ఏపీలో పెట్టుబడులకు గల సానుకూలతలను సీఎం వివరించారు. ‘విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది.
రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నా. విశాఖలో పెట్టుబడులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమ్మిట్‌కు హాజరు కావాలని మీ అందరినీ వ్యక్తిగతంగా కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి’ అని సీఎం జగన్ సూచించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్, అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా,
భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీ అధికారులు జవహర్ రెడ్డి, కరికాలవలవన్, సృజన
శరవేగంగా అనుమతులు.. చౌకగా సదుపాయాలు
పరిశ్రమలకు అనుమతుల విషయంలో రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమలులో ఉందని సీఎం జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, శరవేగంగా అనుమతులివ్వడం ద్వారా పారిశ్రామికవేత్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీటి సదుపాయం లాంటివి దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే చాలా తక్కువగా, సరసమైన ధరలకే అందిస్తున్నట్లు వివరించారు.
రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీలో పుష్కలమైన వనరులు ఉన్నాయని, 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 14,680 మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు జరిగాయని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి ఏపీలో వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ రూపొందించిన వీడియోను సదస్సులో ప్రదర్శించారు.
ఏపీలో అనుకూలతలు ఇవీ..
పెట్టుబడులకు ఆంధ్రపదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవని సన్నాహక సదస్సులో సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా అపార పెట్టుబడుల అవకాశాలను సోదాహరణంగా ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి మీరే (ప్రతినిధులు) ఇంతకుముందు చెప్పారని గుర్తు చేస్తూ పెట్టుబడులతో ముందుకొచ్చేవారికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలియచేశారు.
11.43 శాతం జీఎస్‌డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అగ్రగామిగా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో ఉంది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. తద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందో స్పష్టమవుతోంది.
► రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సాహం ఇస్తున్నామో తెలియచేసేందుకు ఇదే నిదర్శనం.
► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉంది. ఇవన్నీ వివిధ ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉన్నాయి.
► రాష్ట్రంలో పలు ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లున్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి.
► ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. పరిపాలనపరమైన విషయాల్లో కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఏపీని మన రాష్టంగా భావించండి.
► అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు (పోర్ట్ లెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ ఎనర్షియా అవార్డు– 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) తదితర అవార్డులు ఏపీకి లభించాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment