establishment of industries
-
మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు. రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల అనుసంధానం భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వైద్య విద్య బలోపేతం ♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. అత్యున్నత విద్యాలయాలు ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్ కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. పోలవరం పురోగమనం ♦ 2019మే నాటికి 42 శాతం హెడ్ వర్క్‌లు 70 శాతానికి చేరిక ♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్ గేట్ల ఏర్పాటు. ♦ గతేడాది నవంబర్ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్ ప్రారంభం. ♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్ త్వరలో పూర్తి. ♦ గతేడాది సెపె్టంబర్ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రారంభం. ♦ 2022 సెపె్టంబర్ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. ♦ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతి. పారిశ్రామిక పరుగులు ♦ 2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు ♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్íÙప్ల ఏర్పాటు ♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం -
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్‌రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
CM Jagan: పెట్టుబడులతో రండి
విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. విశాఖలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని మీ అందరినీ కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఏపీలో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వివిధ దేశాల దౌత్యాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ సన్నాహక సదస్సుకు హాజరయ్యారు. అత్యుత్తమ సౌకర్యాలు ‘విశాఖపట్నంలో మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటులో మీకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రారంభోపన్యాసంతో పాటు సదస్సు చివరలో ఏపీలో పెట్టుబడులకు గల సానుకూలతలను సీఎం వివరించారు. ‘విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నా. విశాఖలో పెట్టుబడులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమ్మిట్‌కు హాజరు కావాలని మీ అందరినీ వ్యక్తిగతంగా కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి’ అని సీఎం జగన్ సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్, అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ అధికారులు జవహర్ రెడ్డి, కరికాలవలవన్, సృజన శరవేగంగా అనుమతులు.. చౌకగా సదుపాయాలు పరిశ్రమలకు అనుమతుల విషయంలో రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమలులో ఉందని సీఎం జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, శరవేగంగా అనుమతులివ్వడం ద్వారా పారిశ్రామికవేత్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీటి సదుపాయం లాంటివి దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే చాలా తక్కువగా, సరసమైన ధరలకే అందిస్తున్నట్లు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీలో పుష్కలమైన వనరులు ఉన్నాయని, 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 14,680 మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు జరిగాయని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి ఏపీలో వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ రూపొందించిన వీడియోను సదస్సులో ప్రదర్శించారు. ఏపీలో అనుకూలతలు ఇవీ.. పెట్టుబడులకు ఆంధ్రపదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవని సన్నాహక సదస్సులో సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా అపార పెట్టుబడుల అవకాశాలను సోదాహరణంగా ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి మీరే (ప్రతినిధులు) ఇంతకుముందు చెప్పారని గుర్తు చేస్తూ పెట్టుబడులతో ముందుకొచ్చేవారికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలియచేశారు. 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అగ్రగామిగా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో ఉంది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. తద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందో స్పష్టమవుతోంది. ► రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సాహం ఇస్తున్నామో తెలియచేసేందుకు ఇదే నిదర్శనం. ► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉంది. ఇవన్నీ వివిధ ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉన్నాయి. ► రాష్ట్రంలో పలు ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లున్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ► ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. పరిపాలనపరమైన విషయాల్లో కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఏపీని మన రాష్టంగా భావించండి. ► అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు (పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎనర్షియా అవార్డు– 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) తదితర అవార్డులు ఏపీకి లభించాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వెల్లడిస్తున్నాయి. -
భారత్‌లోనే లిస్ట్ చేయండి..
న్యూఢిల్లీ: భారత్‌లోనే కంపెనీలు ఏర్పాటు చేయాలని, దేశీయంగానే లిస్ట్ చేయాలని అంకుర సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. ఏదో కొంత అధిక మొత్తం నిధులు లభిస్తాయన్న ఆశతో ఇతర దేశాల బాట పట్టొద్దని హితవు పలికారు. ‘ఇది మీ దేశం. దీన్ని మీ మార్కెట్‌గా పరిగణించుకోండి. మీ సంస్థను నమోదు, ఏర్పాటు చేసుకోవడం మొదలుకుని లిస్టింగ్ చేయడం, పన్నులను కట్టడం వరకూ ఇక్కడే చేయాలని కోరుతున్నాను‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన అంతర్జాతీయ యూనికార్న్ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు సృష్టిస్తున్న మేథో సంపత్తిని పరిరక్షించాలని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కు ఆయన సూచించారు. అలాగే స్టార్టప్ సంస్థలు స్వీయ నియంత్రణను కూడా పాటించాలని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు , నైతికతకు పెద్ద పీట వేయాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటే యువ స్టార్టప్‌ల స్ఫూర్తి దెబ్బతింటుందని గోయల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లోకి పెట్టుబడులు .. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులు భారీ స్థాయిలో తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఏకీకృత చెల్లింపుల విధానం యూపీఐని ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. యువ జనాభా ఆకాంక్షలతో ప్రస్తుతం చిన్న పట్టణాలు కూడా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కేంద్రాలుగా మారుతున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. వృద్ధిలోకి వస్తున్న చిన్న వ్యాపారాలకు తోడైతే దేశీయంగా స్టార్టప్ వ్యవస్థలో మరెన్నో యూనికార్న్‌లను సృష్టించడంలో ఇవి కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు రాయితీలు
సిరిసిల్ల: పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనువైందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన మలేషియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో మలేసియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఏర్పాటు చేసిన సదస్సులో బుధవారం మంత్రి మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ పార్కు., మల్టీ పర్పస్ పార్కులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రవాసులు స్వరాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే.. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది వివిధ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ‘మైట’అధ్యక్షుడు సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి, ఉపాధ్యక్షురాలు అశ్విత, ముఖ్య కార్యవర్గ సభ్యులు కిరణ్‌గౌడ్, ప్రతీక్, సత్య, సందీప్, సంతోష్, మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు కాంతారావు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములు
ఉంగుటూరు: పశ్చిమగోదావరిజిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సోలార్ పవర్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రెండు పంటలు పండుతున్నా పరిశ్రమలు లేక ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూముల కొరత సమస్యగా ఉందంటూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి లభిస్తుందని, కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. -
తిరుధామం.. పారిశ్రామిక తోరణం
ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి శ్రీకాళహస్తి-ఏర్పేడు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భూముల సేకరణ స్థలం కావాలని ఏపీఐఐసీకి వినతులు తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమి సేకరించేందుకు కసరత్తు తిరుపతి: తిరునగరిలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రం వీడిపోయాక తిరుపతి పరిశ్రమల కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో వందలాది పరిశ్రమలు నెలకొల్పారు. తిరుపతి సమీపంలోని విమానాశ్రయం వద్ద రూ.1,070కోట్ల పెట్టుబడితో శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీ హబ్ ఏర్పడింది. విద్యా సంస్థలు ఐఐటీ, ఐజర్‌కు శంకుస్థాన చేశారు. చెన్నె, బెంగళూరు నగరాలకు తిరుపతి అందుబాటులో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉండటం కలిసొచ్చే అంశం. 1,720 ఎకరాలు సిద్ధం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలో 1,720 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. పీలేరు సమీపంలో 600 ఎకరాలు, కలికిరి సమీపంలోని తాటిగుంటపల్లెలో 1000, గంగవరం మండలం గండ్రరాజులపల్లెలో 120 ఎకరాలు ఉన్నాయి. ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు తిరుపతి సమీపంలోనే భూములు కావాలని దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని సేకరించడానికి ఏపీఐఐసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జిల్లాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించారు. శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో.. తిరుపతి చుట్టుపక్కల భూములు లేకపోవడంతో శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాల వైపు పారిశ్రామికవేత్తలు దృష్టి సారించినట్లు సమచారం. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఇబ్బంది తలెత్తితే కాళంగి రిజర్వార్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేశారు. ఇటీవలే సర్వే కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఐటీ కంపెనీలు.. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు తిరుపతిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుపతి సమీపంలోని విమానాశ్రయ సమీపంలో, ఏర్పేడు ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించినట్లు తెలుస్తోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ రూ.1,500 కోట్లతో తిరుపతిలో క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు, ఇందులో భాగంగానే కంపెనీ ప్రతినిధులు అనువైన ప్రదేశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తిరుపతి నగరంలో పరిశ్రమలు స్థాపించేందుకు కంపెనీ యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుతం ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి. -
పరిశ్రమలకు ప్రథమ గమ్యం.. తెలంగాణ
ఫ్రెంచి బృందంతో భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రథమ గమ్యస్థానమని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్, భారత్‌తో ఆర్థిక సంబంధాల ప్రత్యేక ప్రతినిధి పాల్ హెర్మెలిన్ నేతృత్వంలోని 44 మంది ఫ్రెంచి ప్రతినిధుల బృందం మంత్రి జూపల్లితో బుధవారం సచివాలయంలో భేటీ అయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధన దిశగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంలోని ప్రత్యేకతలను మంత్రి జూపల్లి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చే వారికి విమానాశ్రయంలోనే ఎర్రతివాచీతో స్వాగతం పలికి, అవినీతి, జాప్యానికి తావులేకుండా పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌లో వున్న భౌగోళిక, వాతావరణ అనుకూలతలు వివరించారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలు, ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థలు తెలంగాణలో తమ సంస్థల స్థాపించిన విషయాన్ని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన ద్వారా భారత్, ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు. తెలంగాణ ఆర్దికాభివృద్ధికి వివిధ రంగాల్లో సహకారం అందిస్తామని భారత్‌లో ఫ్రెంచి రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్ పేర్కొన్నారు. ప్రస్తుత భేటీ తెలంగాణలో ఫ్రెంచి సంస్థల భవిష్యత్ పెట్టుబడులకు బాటలు వేస్తుందన్నారు. ఆల్స్టార్మ్, డెసాల్ట్, ఈగిస్, జోడియాక్స్, లూమిప్లాన్, పోమా, సిస్ట్రా, థేల్స్ వంటి బహుళ రవాణా వ్యవస్థకు చెందిన సంస్థలతోపాటు ఏసీఎంఈ, సిటెలిమ్, ఎన్జీ, స్నెయిడెర్, సోలెయిర్ డెరైక్ట్ తదితర విద్యుత్ సంస్థల ప్రతినిధులు ఫ్రెంచి బృందంలో వున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు పట్టణాభివృద్ధి, హెచ్ఎండీఏ, ట్రాన్స్‌కో, పీసీబీ తదితర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఫ్రెంచి బృందం నేడు మరోమారు భేటీ కానుంది. -
లక్ష్యం
శ్రీసిటీలో వెయ్యి పరిశ్రమల ఏర్పాటు లక్ష మందికి ఉద్యోగావకాశాలు 12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 11 కంపెనీలకు భూమిపూజ చేసిన సీఎం రోడ్లు అభివృద్ధి చేస్తామని ప్రకటన సత్యవేడు : శ్రీసిటీలో వెయ్యి పరిశ్రమల ఏర్పాటే లక్ష్యమని, ప్రస్తుతానికి 10శాతం కంపెనీలే వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇక్కడ వెయ్యి కంపెనీలు ఏర్పాటైతే లక్ష మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. శ్రీసిటీలో శుక్రవారం ముఖ్యమంత్రి 12పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, మరో 11కంపెనీలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పెప్సికో యూనిట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో సీఎం మాట్లాడుతూ సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలోని శ్రీసిటీలో 7600 ఎకరాల్లో 25 దేశాలకు చెందిన 106 పరిశ్రమల ఏర్పాటుకు *20,500 కోట్లు పెట్టుబడి పెట్టారని, 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. జపాన్‌కు చెందిన 16 కంపెనీలు, అమెరికాకు చెందిన 9కంపెనీలు, మరిన్ని కంపెనీలు ఇందులో ఉన్నాయన్నారు. సౌత్ ఇండియాలో పెప్సీ మార్కెట్‌ను పెంచేందుకు శ్రీసిటీలో 86 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయని, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ మామిడితోటలు అధికంగా ఉన్నాయని చెప్పారు. బొప్పాయి,మామిడి, అరటి రైతులకు ఈ ప్లాంటు ఏర్పాటుతో రైతులకు ఆదాయం మెరుగుపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. శ్రీసిటీలో ట్రిపుల్ఐటీ, ఐఐఎఫ్ఎం ఏర్పాటు చేయాలని కోరారని,ప్రస్తుతం ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నెల్లూరులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణపట్నం కాకుండా మరో పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తిరుపతి, ఏర్పేడు, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి రోడ్లు శ్రీసిటీకి అనుసంధానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు వ్యవసాయంపై దృష్టిపెట్టాలని కోరారు. అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీలు ఏర్పాటు కావాలని, ఇండస్ట్రీ ఏర్పాటుకు 21 రోజుల్లో క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. పెప్సీకో సీఈవో ఇంద్రనూయి లాగే మహిళలు ఎదగాలని కోరారు. స్థానిక కంపెనీలు సీఈవోలుగా ఎక్కువ మంది మహిళలనే నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెప్సికో సీఈవో సందీవ్చద్దా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చైర్మన్ శివకుమార్, మంత్రులు నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, సుగుణమ్మ , శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఇండస్ట్రియల్ సెక్రటరీ రావత్ తదితరులు పాల్గొన్నారు.