పరిశ్రమలకు ప్రథమ గమ్యం.. తెలంగాణ
ఫ్రెంచి బృందంతో భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రథమ గమ్యస్థానమని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్, భారత్‌తో ఆర్థిక సంబంధాల ప్రత్యేక ప్రతినిధి పాల్ హెర్మెలిన్ నేతృత్వంలోని 44 మంది ఫ్రెంచి ప్రతినిధుల బృందం మంత్రి జూపల్లితో బుధవారం సచివాలయంలో భేటీ అయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధన దిశగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంలోని ప్రత్యేకతలను మంత్రి జూపల్లి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చే వారికి విమానాశ్రయంలోనే ఎర్రతివాచీతో స్వాగతం పలికి, అవినీతి, జాప్యానికి తావులేకుండా పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇస్తామన్నారు.
పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌లో వున్న భౌగోళిక, వాతావరణ అనుకూలతలు వివరించారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలు, ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థలు తెలంగాణలో తమ సంస్థల స్థాపించిన విషయాన్ని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన ద్వారా భారత్, ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు. తెలంగాణ ఆర్దికాభివృద్ధికి వివిధ రంగాల్లో సహకారం అందిస్తామని భారత్‌లో ఫ్రెంచి రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్ పేర్కొన్నారు. ప్రస్తుత భేటీ తెలంగాణలో ఫ్రెంచి సంస్థల భవిష్యత్ పెట్టుబడులకు బాటలు వేస్తుందన్నారు.
ఆల్‌స్టార్మ్, డెసాల్ట్, ఈగిస్, జోడియాక్స్, లూమిప్లాన్, పోమా, సిస్ట్రా, థేల్స్ వంటి బహుళ రవాణా వ్యవస్థకు చెందిన సంస్థలతోపాటు ఏసీఎంఈ, సిటెలిమ్, ఎన్జీ, స్నెయిడెర్, సోలెయిర్ డెరైక్ట్ తదితర విద్యుత్ సంస్థల ప్రతినిధులు ఫ్రెంచి బృందంలో వున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు పట్టణాభివృద్ధి, హెచ్‌ఎండీఏ, ట్రాన్స్‌కో, పీసీబీ తదితర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఫ్రెంచి బృందం నేడు మరోమారు భేటీ కానుంది.