![Piyush Goyal asks start-ups to put in place some regulation standards - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/29/PIYUSH-GOYAL.jpg.webp?itok=G0HGEgze)
న్యూఢిల్లీ: భారత్‌లోనే కంపెనీలు ఏర్పాటు చేయాలని, దేశీయంగానే లిస్ట్ చేయాలని అంకుర సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. ఏదో కొంత అధిక మొత్తం నిధులు లభిస్తాయన్న ఆశతో ఇతర దేశాల బాట పట్టొద్దని హితవు పలికారు. ‘ఇది మీ దేశం. దీన్ని మీ మార్కెట్‌గా పరిగణించుకోండి. మీ సంస్థను నమోదు, ఏర్పాటు చేసుకోవడం మొదలుకుని లిస్టింగ్ చేయడం, పన్నులను కట్టడం వరకూ ఇక్కడే చేయాలని కోరుతున్నాను‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన అంతర్జాతీయ యూనికార్న్ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు సృష్టిస్తున్న మేథో సంపత్తిని పరిరక్షించాలని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కు ఆయన సూచించారు.
అలాగే స్టార్టప్ సంస్థలు స్వీయ నియంత్రణను కూడా పాటించాలని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు , నైతికతకు పెద్ద పీట వేయాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటే యువ స్టార్టప్‌ల స్ఫూర్తి దెబ్బతింటుందని గోయల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లోకి పెట్టుబడులు .. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులు భారీ స్థాయిలో తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఏకీకృత చెల్లింపుల విధానం యూపీఐని ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. యువ జనాభా ఆకాంక్షలతో ప్రస్తుతం చిన్న పట్టణాలు కూడా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కేంద్రాలుగా మారుతున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. వృద్ధిలోకి వస్తున్న చిన్న వ్యాపారాలకు తోడైతే దేశీయంగా స్టార్టప్ వ్యవస్థలో మరెన్నో యూనికార్న్‌లను సృష్టించడంలో ఇవి కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment