
లేదంటే మనుగడే ప్రశ్నార్థకం
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: ఆవిష్కరణలతోనే భారత ఫార్మా పరిశ్రమ రాణించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆవిష్కరణలు లేకపోతే ఈ పరిశ్రమే మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఫార్మా రంగం పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కోసం ఎప్పుడూ ప్రభుత్వంపైనే ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేవారు. ‘‘దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రతి దాని కోసం ప్రభుత్వం వైపు చూసే బలహీన మనస్తత్వ ధోరణి నెలకొంది. ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించినప్పుడే పరిశోధన నిర్వహిద్దామని అనుకుంటారు. విజయానికి ఆవిష్కరణలే ఆధారమైన పరిశ్రమ ఇది.
ఎవరైతే ఆవిష్కరణకు దూరంగా ఉంటారో వారి కథ ముగిసినట్టే’’అని ముంబైలో ఫార్మా కంపెనీలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి వ్యాఖ్యానించారు. మారుతున్న జీవనశైలి తీరులు, సమాజం, రోగుల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ కూడా మారాలని సూచించారు. ప్రాజెక్టులతో ఫార్మా పరిశ్రమ ముందుకు వచ్చి.. ప్రభుత్వం, విద్యా సంస్థల సహకారంతో పరిశోధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక్కడ ఆవిష్కరణలతో పేటెంట్లు సంపాదించుకుని, ఇక్కడి నుంచి ఎగుమతులు చేయాలని పిలుపునిచ్చారు. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) కింద 2023–28 కాలానికి కేంద్రం రూ.50,000 కోట్ల నిధిని ప్రకటించడం గమనార్హం. దీని కింద పరిశోధన, ఆవిష్కరణలకు చేయూతనివ్వనుంది.
ఆ దేశాల్లో ఆవిష్కరణలే బలం..
స్విట్జర్లాండ్, యూఎస్, జపాన్ దేశాల్లో తలసరి ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉందని, ఇందుకు అక్కడి కంపెనీల ఆవిష్కరణలే కారణమని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘నాణ్యత, ఆవిష్కరణ అన్న రెండు అంశాలపై మీ మనుగడ ఆధారపడి ఉంది’’అని పేర్కొన్నారు. ప్రజావేగులుగా మారి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న, నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీల గుట్టు బయటపెట్టాలని పులుపునిచ్చారు. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను దత్తత తీసుకుని, ఉత్తమ తయారీ విధానాలను అనుసరించడం ద్వారా అవి వృద్ధి చెందేందుకు సహకారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment