ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న భారత మార్కెట్
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్‌ను పెట్టుబడులకు గొప్ప కేంద్రంగా మధ్య ప్రాచ్యం, జపాన్, ఐరోపా యూనియన్ (ఈయూ), యూఎస్ గుర్తిస్తున్నట్టు చెప్పారు. ఇది లక్షలాది కొత్త ఉద్యోగాలకు దారితీస్తున్నట్టు తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.
దేశీ మార్కెట్ బలంగా ఉండడం, నైపుణ్య, మేధో వనరుల లభ్యత, చట్టాలకు కట్టుబడి ఉండడం, స్పష్టమైన నియంత్రణలు సానుకూల వ్యాపార వాతావరణం, వ్యాపార సులభ నిర్వహణకు వీలైన ప్రగతిశీల విధానాలు.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు మంత్రి గోయల్ చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ఒకానొక పెద్ద ఫండ్ నిర్వహణ సంస్థ సీఈవోతో గత నెలలో యూఎస్‌లో భేటీ అయ్యాను. అదే సంస్థ భారత్‌లోనూ భారీ పెట్టుబడులు కలిగి ఉంది.
గడిచిన పదేళ్ల కాలంలో భారత్‌లోని తమ పెట్టుబడులు తమ ఫండ్స్ చేసిన పెట్టుబడుల్లో అత్యుత్తమ పనితీరు చూపించినట్టు నాతో పంచుకున్నారు. గత 20 ఏళ్ల నుంచి భారత్‌లో ఇన్వెస్టర్లుగా ఉన్నప్పటికీ, 80 శాతం పెట్టుబడులు ఇటీవలి సంవత్సరాల్లోనే పెట్టినట్టు చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టి 20 ఏళ్ల అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారత్‌కు వచ్చి మరో విడత పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించనున్నట్టు ప్రకటించారు’’ అని గోయల్ తను అనుభవాలను వెల్లడించారు. భారత స్టాక్ మార్కెట్ చక్కని పనితీరు భారీగా ఫ్‌ఐఐ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు.
ప్రతి నెలా రూ.38వేల కోట్లు..
అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ ప్రతి నెలా సగటున 4.5 బిలియన్ డాలర్ల (రూ.38,000 కోట్లు) ఎఫ్‌డీఐలు గడిచిన ఏడాది కాలంగా భారత్‌లోకి వస్తుండడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐ 42 శాతం పెరిగి 42 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్)నూ ఎఫ్‌డీఐలు 45 శాతం పెరిగి 29.79 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71.28 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని భారత్ ఆకర్షించింది. సేవల రంగాలు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికం, ట్రేడింగ్, నిర్మాణం, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు ఎక్కువ ఎఫ్‌డీఐలను రాబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment