![EFTA And Israel Investors to Explore Business Opportunities in India](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/pitush.jpg.webp?itok=sDVDuxVh)
అవకాశాల పరిశీలనకు వచ్చే వారం పర్యటన
టెక్నాలజీ, తయారీ ప్లాంట్లపై ఆసక్తి
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్‌టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్‌కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు.
2024లో ఈఎఫ్‌టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, నార్వే, లీష్‌టెన్‌స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.
24 బిలియన్ డాలర్ల వాణిజ్యం..
ఈఎఫ్‌టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్‌టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్‌లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment