ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థలకు కేంద్ర మంత్రి గోయల్ ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. విమానాశ్రయాలు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయదల్చుకునే సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేసేలా రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్ కంపెనీలు కలిసి పని చేయొచ్చని మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చని గోయల్ వివరించారు.
ఫ్రెంచ్ ఫారిన్ ట్రేడ్ అడ్వైజర్లకు సంబంధించిన ఆసియా–పసిఫిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ విమానయాన సంస్థలు 1,500 పైచిలుకు విమానాలకు ఆర్డర్లివ్వగా అందులో సింహభాగం వాటా ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌బస్‌కి లభించాయి. భారత్‌లో సుమారు 750 ఫ్రెంచ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 75 భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇరు దేశాల మధఅయ 2023–24లో 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment