
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం(Trade Tensions) ముదురుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు(tariffs) విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా దిగుమతులపై సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా సోమవారం నుంచి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై బీజింగ్ సుంకాలు అమలు చేసింది.
ట్రంప్ ఓటర్ బేస్ లక్ష్యంగా..
కొత్త చైనా సుంకాలు చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తితో సహా యూఎస్ వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిపై 10-15 శాతంగా అమలు చేస్తున్నారు. అలాగే సోయాబీన్స్, పంది మాంసం, పాడి ఉత్పత్తులపై కూడా ఈ సుంకాలు అమలు చేయాలని చైనా నిర్ణయించింది. అమెరికాలో ట్రంప్ ఓటర్ బేస్‌ను ఆధారంగా చేసుకొని, వ్యవసాయ రాష్ట్రాల్లోని వారే లక్ష్యంగా ఈ సుంకాలను చైనా జాగ్రత్తగా రూపొందించినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పరిస్థితులు మరింత క్లిష్టతరం?
యూఎస్-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో చైనా నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతోంది. వినియోగదారుల వ్యయ సామర్థ్యం తగ్గుతోంది. దీర్ఘకాలిక స్థిరాస్తి రంగం సంక్షోభంలోకి వెళుతుంది. రికార్డు స్థాయిలో యువత నిరుద్యోగంతో అవస్తలు పడుతున్నారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, చైనా తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ పరిస్థితిని మెరుగ్గా నిర్వహిస్తామని చైనా అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి క్రియాశీల ఆర్థిక విధానాల అవసరాన్ని నొక్కిచెప్పిన చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్ ఇటీవల ఈ సంవత్సరానికి 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇదీ చదవండి: మహిళలకూ కావాలి సమగ్ర బీమా
చర్చలకు దారి తీస్తాయా..
ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న కొద్దీ పరస్పరం ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్ సుంకాలు అమెరికాపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి రూపొందించినప్పటికీ అవి ఇరు వర్గాల మధ్య చర్చలకు దారితీసే అవకాశం కూడా కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాలు పరిష్కారానికి దారితీస్తాయా లేదా మరింత ఉధృతికి అవకాశం కల్పిస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment