అనుకున్నదొకటి.. అయినదొకటి! | trade tensions China announced counter tariffs on a range of US products coal LNG crude oil machinery cars | Sakshi
Sakshi News home page

అనుకున్నదొకటి.. అయినదొకటి!

Published Tue, Feb 4 2025 12:50 PM | Last Updated on Tue, Feb 4 2025 2:55 PM

trade tensions China announced counter tariffs on a range of US products coal LNG crude oil machinery cars

ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి అమెరికా బొగ్గు, ద్రవరూపంలో ఉన్న సహజ వాయువు (ఎల్ఎన్‌జీ), ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, కొన్ని కంపెనీలకు చెందిన ప్రీమియం కార్లు.. వంటివాటిని బారీగానే దిగుమతి చేసుకుంటోంది. దాంతో భవిష్యత్తులో వీటిపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవల అమెరికా విధించిన సుంకాల పెంపునకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా అనుసరించిన సుంకాల పెంపు విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని, రెండు దేశాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి విఘాతం కలిగిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని చైనా స్పష్టం చేసింది. కొత్త టారిఫ్‌ల్లో బొగ్గు, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులపై 15 శాతం సుంకం, ముడిచమురు, వ్యవసాయ యంత్రాలు, ప్రీమియం కార్లపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైన దేశాలను శిక్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల చైనా వస్తువులపై 10% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..

చైనా అమెరికాకు వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా కౌంటర్ టారిఫ్‌లతో పాటు, యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ గూగుల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తును అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. చైనా మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా పోటీదారులకు అన్యాయం చేసే ఏదైనా వ్యాపార పద్ధతులను ఉపయోగించిందా అనే దానిపై దర్యాప్తు దృష్టి సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాపై సుంకాలు విధిస్తే వాణిజ్యం పరంగా కొంత వెనక్కి తగ్గుతుందని భావించిన అమెరికాకు.. చైనా ఇలా తిరికి టారిఫ్‌లు విధించడం కొంత ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం యూఎస్‌ భారత్‌వైపు చూసేలా ప్రయత్నాలు జరగాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement