అమెరికా ‘కంట్రీఫస్ట్’ విధానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విధించిన సుంకాలను భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా, భారతదేశం చాలా సంవత్సరాలుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా, కొన్నింటిపై వివాదాలున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఇరు దేశాలు ఆరు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సానుకూల చర్యగా ఇరు వర్గాలు అభివర్ణించాయి. ఏదేమైనా, కొత్త సుంకాల భయం ప్రస్తుతం కీలకంగా మారుతుంది.
టారిఫ్ భయాలకు కారణాలు
ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌తో వాణిజ్య లోటుపై అమెరికా గళమెత్తింది. ఈ అసమతుల్యతలను పరిష్కరించడానికి, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది. సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తుంది. యూఎస్ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తే టారిఫ్‌ల విధానం భారత్‌కు విస్తరించే అవకాశం ఉంది.
యూఎస్ సుంకాల వల్ల భారత్‌పై ప్రభావం
ఎగుమతుల క్షీణత: భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా సుంకాల ద్వారా లక్ష్యంగా చేసుకున్న రంగాల్లో మార్కెట్ అవకాశాలు తగ్గడం, ఆదాయాలు క్షీణించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇది ఆ రంగాల్లో ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు: దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు భారతీయ వినియోగదారులకు ఖర్చులు పెరగడానికి దారితీస్తాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తుంది.
వాణిజ్య సంబంధాలు: టారిఫ్‌ల విధింపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రతీకార చర్యలకు దారితీస్తుంది. రెండు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
ఇప్పుడేం చేయాలంటే..
సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి, దానివల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన విధానాలు అన్వేషించాలి. అందుకు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం కూడా అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment