ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా 2024లో 2 ట్రిలియన్ డాలర్ల(రూ.170 లక్షల కోట్లు)కు పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్షల కోట్ల)కు చేరిందని ఆక్స్‌ఫామ్(Oxfam) తాజా నివేదిక వెల్లడించింది. ఇది రోజుకు 5.7 బిలియన్ డాలర్లకు సమానమని తెలిపింది. ఇది గతేడాది కంటే మూడు రెట్లు పెరుగుదలను సూచిస్తుంది. ఇది అతి సంపన్నుల సంపద పెరుగుదలను, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతుంది.
నివేదికలో కీలక అంశాలు
‘టేకర్స్ నాట్ మేకర్స్’ అనే శీర్షికతో రూపొందించిన ఆక్స్‌ఫామ్ నివేదికలో బిలియనీర్ల సంపద 2023 కంటే 2024లో మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందింది. బిలియనీర్ల సంఖ్య 2024లో 204 పెరిగి మొత్తం 2,769కి చేరింది. అందులో 41 మంది ఆసియాకు చెందిన వారున్నారు. ఆసియాలో బిలియనీర్ల సంపద విలువ 299 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25.42 లక్షల కోట్ల) మేర పెరిగింది.
ఈ ఏడాది సమకూరిన సంపదలో గణనీయమైన భాగం 60% వారసత్వం, వ్యవస్థ లేదా కంపెనీలపై గుత్తాధిపత్యం, క్రోనీ కనెక్షన్ల(అధికారంలోని వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండడం) ద్వారా చేకూరింది. 30 ఏళ్లలోపు ఉన్న బిలియనీర్‌కు తమ సంపద వారసత్వంగా వచ్చిందే. వచ్చే 20-30 ఏళ్లలో ప్రస్తుత 1000 మందికి పైగా బిలియనీర్లు తమ 5.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.442 లక్షల కోట్ల)సంపదను తమ వారసులకు అందించనున్నారు.
కుబేరుల సంపద గణనీయంగా పెరిగినప్పటికీ దాదాపు సగం మంది రోజుకు 6.85 డాలర్ల(రూ.550) కంటే తక్కువ ఆదాయంతో మనుగడ సాగిస్తున్నారు. ఈ సంఖ్యలో 1990 నుంచి మెరుగుదల కనిపించడంలేదు.
ఇదీ చదవండి: కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులు
ఆర్థిక అసమానతలు
పెరుగుతున్న బిలియనీర్ల సంపద, ప్రపంచ పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ నివేదిక చూపుతుంది. మహిళలు తీవ్రమైన పేదరికంతో అసమానంగా ప్రభావితమవుతున్నారు. 10 మందిలో ఒకరు రోజుకు 2.15 డాలర్లు(రూ.170) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఈ అసమానతలను పరిష్కరించడానికి వ్యవస్థాగత మార్పులు అవసరమని నివేదిక చెబుతుంది. అతి సంపన్నుల(Billionaires)పై పన్ను విధించడం, గుత్తాధిపత్యాలను తొలగించడం వంటి విధానాలను అనుసరించాలని సూచిస్తుంది. ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆందోళనలు వెలిబుచ్చిన విషయాన్ని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment