Oxfam report
-
రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద
ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా 2024లో 2 ట్రిలియన్ డాలర్ల(రూ.170 లక్షల కోట్లు)కు పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్షల కోట్ల)కు చేరిందని ఆక్స్‌ఫామ్(Oxfam) తాజా నివేదిక వెల్లడించింది. ఇది రోజుకు 5.7 బిలియన్ డాలర్లకు సమానమని తెలిపింది. ఇది గతేడాది కంటే మూడు రెట్లు పెరుగుదలను సూచిస్తుంది. ఇది అతి సంపన్నుల సంపద పెరుగుదలను, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతుంది.నివేదికలో కీలక అంశాలు‘టేకర్స్ నాట్ మేకర్స్’ అనే శీర్షికతో రూపొందించిన ఆక్స్‌ఫామ్ నివేదికలో బిలియనీర్ల సంపద 2023 కంటే 2024లో మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందింది. బిలియనీర్ల సంఖ్య 2024లో 204 పెరిగి మొత్తం 2,769కి చేరింది. అందులో 41 మంది ఆసియాకు చెందిన వారున్నారు. ఆసియాలో బిలియనీర్ల సంపద విలువ 299 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25.42 లక్షల కోట్ల) మేర పెరిగింది.ఈ ఏడాది సమకూరిన సంపదలో గణనీయమైన భాగం 60% వారసత్వం, వ్యవస్థ లేదా కంపెనీలపై గుత్తాధిపత్యం, క్రోనీ కనెక్షన్ల(అధికారంలోని వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండడం) ద్వారా చేకూరింది. 30 ఏళ్లలోపు ఉన్న బిలియనీర్‌కు తమ సంపద వారసత్వంగా వచ్చిందే. వచ్చే 20-30 ఏళ్లలో ప్రస్తుత 1000 మందికి పైగా బిలియనీర్లు తమ 5.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.442 లక్షల కోట్ల)సంపదను తమ వారసులకు అందించనున్నారు.కుబేరుల సంపద గణనీయంగా పెరిగినప్పటికీ దాదాపు సగం మంది రోజుకు 6.85 డాలర్ల(రూ.550) కంటే తక్కువ ఆదాయంతో మనుగడ సాగిస్తున్నారు. ఈ సంఖ్యలో 1990 నుంచి మెరుగుదల కనిపించడంలేదు.ఇదీ చదవండి: కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులుఆర్థిక అసమానతలుపెరుగుతున్న బిలియనీర్ల సంపద, ప్రపంచ పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ నివేదిక చూపుతుంది. మహిళలు తీవ్రమైన పేదరికంతో అసమానంగా ప్రభావితమవుతున్నారు. 10 మందిలో ఒకరు రోజుకు 2.15 డాలర్లు(రూ.170) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఈ అసమానతలను పరిష్కరించడానికి వ్యవస్థాగత మార్పులు అవసరమని నివేదిక చెబుతుంది. అతి సంపన్నుల(Billionaires)పై పన్ను విధించడం, గుత్తాధిపత్యాలను తొలగించడం వంటి విధానాలను అనుసరించాలని సూచిస్తుంది. ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆందోళనలు వెలిబుచ్చిన విషయాన్ని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ గుర్తు చేశారు. -
Oxfam Inequality Report 2024: డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడా..!
ప్రపంచంలో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దాంతో ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి అయిదుగురి నికర సంపద విలువ, కొవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. అదే సమయంలో 500 కోట్లమంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ‘ఇనీక్వాలిటీ ఇంక్.’ పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ లాభాలు పెరిగినా.. ఉద్యోగాల్లో కోత అతిపెద్ద కంపెనీల్లో డెబ్భై శాతం సంస్థల్లో ఒక బిలియనీర్ సీఈఓ ఉన్నారు. ఈ కంపెనీలు 10.2 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నాయి. అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జీడీపీల కంటే అధిక సంపద వీరి వద్దే ఉంది. గత మూడేళ్లలో 148 పెద్దకంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను నమోదు చేశాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు లక్షల మంది ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. 500 కోట్ల మంది పేదలు.. ప్రపంచంలోని అగ్రగామి అయిదుగురు ధనవంతులు ఇలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 నుంచి 405 బిలియన్ డాలర్ల (రూ.33.61 లక్షల కోట్ల) నుంచి 464 బిలియన్ డాలర్లు (రూ.38.51 లక్షల కోట్లు) పెరిగి 869 బిలియన్ డాలర్ల (రూ.72.12 లక్షల కోట్ల)కు చేరింది. అంటే గంటకు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.116 కోట్ల) చొప్పున వీరు సంపదను పోగేసుకున్నారు. ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 లక్షల కోట్ల డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యులు మాత్రం మరింత పేదలయ్యారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం వీరిలో నుంచి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద)ను చూడడానికి ఒక దశాబ్దం పడుతుంది. పేదరికం మాత్రం మరో 229 ఏళ్లకు గానీ అంతం కాదు. భారీగా తగ్గిన కార్పొరేట్ పన్నులు.. ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని వేతనాలు.. ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఇదీ చదవండి: మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..? మహిళల కంటే పురుషుల వద్దే అధికం.. ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు(రూ.8.23 కోట్లు) ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం. -
Oxfam: దేశంలో 77శాతం సంపద ఎక్కడుందంటే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత జీడీపీ వృద్ధి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఒక వైపు మన జీడీపీ పెరుగుతుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం దేశ సంపదలో 77శాతం కేవలం 10శాతం ధనవంతుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 119 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. రోజుకు కనీసం 70 మంది కొత్తగా మిలియనీర్లు అవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు విద్య, వైద్య ఖర్చులు భరించలేక దేశీయంగా ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. ఇండియాలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపైనా సరైన దృష్టి సారించాలి. లేకుంటే, ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయి, దేశ ఆర్థిక పురోగతి దెబ్బతింటుందని నివేదిక చెబుతుంది. -
‘డిజిటల్’ అంతరాలు!
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాలవారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇండియా డిజిటల్ డివైడ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది. పురుషులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు మహిళలకు తక్కువగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక తెలిపింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్‌హోల్డ్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. ► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► పేదల్లో 40 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్ ఇండెక్స్ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది. ► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. -
దేశం... ధనవంతుల భోజ్యం?
బలవంతుడిదే రాజ్యం అని లోకోక్తి. కానీ, ఇప్పుడు ధనవంతుడిదే రాజ్యం. ఈ సమకాలీన సామాజిక పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నదే అయినా, తాజాగా లెక్కలతో సహా వెల్లడైంది. ప్రభుత్వేతర సంస్థ ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ తన తాజా ప్రపంచ సంపద నివేదికలో ససాక్ష్యంగా కుండబద్దలు కొట్టింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన ఈ నివేదికలోని అంశాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కరోనా కాలం నుంచి ప్రపంచమంతటా ఆర్థిక అంతరాలు బాగా పెరిగాయన్న వాదన అక్షరాలా నిజ మని రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, నిరుద్యోగం పెరిగిన వేళ ప్రపంచంలోనూ, భారత్‌లోనూ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే పోగుపడుతుండడం ఆందోళనకరం. 2020 నుంచి కొత్తగా సమకూరిన 42 లక్షల డాలర్లలో మూడింట రెండు వంతుల సంపద ప్రపంచంలోని ఒకే ఒక్క శాతం అపర కుబేరుల గుప్పెట్లో ఉంది. మిగతా ప్రపంచ జనాభా సంపాదించిన సొమ్ముకు ఇది దాదాపు రెట్టింపు అనే నిజం విస్మయపరుస్తుంది. మన దేశానికొస్తే అగ్రశ్రేణి ఒక్క శాతం మహా సంపన్నుల చేతిలోనే 2012 నుంచి 2021 మధ్య జరిగిన సంపద సృష్టిలో 40 శాతానికి పైగా చేరింది. ఇక, దేశ జనాభాలో అడుగున ఉన్నవారిలో సగం మంది వాటా మొత్తం 3 శాతమే. కరోనా వేళ ధనికులు మరింత ధనవంతులయ్యారు. కరోనాకు ముందు భారత్‌లో 102 మంది బిలి యనీర్లుంటే, ఇప్పుడు వారి సంఖ్య 166కు పెరిగింది. కరోనా నుంచి గత నవంబర్‌కు దేశంలో శత కోటీశ్వరుల సంపద 121 శాతం పెరిగింది. మరోమాటలో నిమిషానికి 2.5 కోట్ల వంతున, రోజుకు రూ. 3,068 కోట్లు వారి జేబులో చేరింది. కనివిని ఎరుగని ఈ తేడాలు కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. అలాగే, సంపన్నుల కన్నా, పేద, మధ్యతరగతి వారిపైనే అధిక పన్ను భారం పడుతోందన్న మాట ఆగి, ఆలోచించాల్సిన విషయం. భారత్‌లో జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయంలో 64 శాతం జనాభాలోని దిగువ సగం మంది నించి ప్రభుత్వం పిండుతున్నదే. అగ్రస్థానంలోని 10 శాతం ధనికుల ద్వారా వస్తున్నది 4 శాతమే అన్న మాట గమనార్హం. ఇవన్నీ సముద్రంలో నీటిబొట్లు. భారతదేశం శరవేగంతో కేవలం సంపన్నుల రాజ్యంగా రూపాంతరం చెందుతోందన్న అంచనా మరింత గుబులు రేపుతోంది. ధనికుల దేవిడీగా మారిన వ్యవస్థలో దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్‌లు, మహిళలు, అసంఘటిత కార్మికుల లాంటి అణగారిన వర్గాల బాధలకు అంతమెక్కడ? అర్ధాకలితో అలమటిస్తున్నవారికీ, మధ్యతరగతికీ మెతుకు విదల్చడానికి సందేహిస్తున్న పాలకులు జేబు నిండిన జనానికి మాత్రం గత బడ్జెట్లోనూ కార్పొరేట్ పన్నుల్లో తగ్గింపు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం విడ్డూరం. ధనికులకు పన్ను రాయితీలిస్తే, వారి సంపద క్రమంగా దిగువవారికి అందుతుందనేది ఓ భావన. అది వట్టి భ్రమ అని ఆక్స్‌ఫామ్ తేల్చేసింది. కొద్దిరోజుల్లో కొత్త బడ్జెట్ రానున్న వేళ పెరుగుతున్న ఆర్థిక అంతరాన్ని చక్కదిద్దడానికి సంపద పన్ను విధించాలంటోంది. పేద, గొప్ప తేడాలు ఇప్పుడు ఎంతగా పెరిగాయంటే, భారత్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 మంది కుబేరులపై 5 శాతం పన్ను వేసినా చాలు. దాంతో దేశంలో పిల్లలందరినీ మళ్ళీ బడి బాట పట్టించవచ్చు. దేశంలోకెల్లా మహా సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపద నిరుడు 2022లో 46 శాతం మేర పెరిగింది. దేశంలోని అగ్రశ్రేణి 100 మంది అపర కుబేరుల సమష్టి సంపద ఏకంగా 66 వేల కోట్ల డాలర్లకు చేరింది. అదానీ ఒక్కరికే 2017 – 2021 మధ్య చేకూరిన లబ్ధిపై 20 శాతం పన్ను వేస్తే, రూ. 1.79 లక్షల కోట్లు వస్తుంది. దాంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50 లక్షల పైమందికి ఏడాదంతా ఉపాధినివ్వవచ్చని ఆక్స్‌ఫామ్ ఉవాచ. ఈ అంచనాలు తార్కికంగా బాగున్నా, ఆచరణాత్మకత, గత అనుభవాలను కూడా గమనించాలి. సంపద పన్ను సంగతే తీసుకుంటే, మనదేశంలో 1957లోనే దాన్ని ప్రవేశపెట్టారు. కానీ, భారీ ఎగవేతలతో లాభం లేకపోయింది. అసమానతలూ తగ్గలేదు. చివరకు, సంపద పన్ను వసూళ్ళతో పోలిస్తే, వాటి వసూలుకు అవుతున్న ఖర్చు ఎక్కువుందంటూ 2016–17 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని ఎత్తేశారు. అందుకే, మళ్ళీ సంపద పన్ను విధింపు ఆలోచనపై సమగ్రంగా కసరత్తు అవసరం. పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి. కాకుంటే, భారత్ లాంటి దేశంలో మధ్యతరగతిని పక్కనపెడితే, మహా సంపన్నులపై ఏ పన్ను వేసినా, అడ్డదోవలో దాన్ని తప్పించుకొనే పనిలో ఉంటారనేది కాదనలేని వాస్తవం. కాబట్టి, భారీ పన్నుల ప్రతిపాదన కన్నా దేశ సామాజిక – ఆర్థిక విధానంలో వారిని భాగం చేయడం లాంటి ఆలోచనలు చేయాలి. విద్య, వైద్యం, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనల్లో ఈ కుబేరుల సంపదను పెట్టేలా చూడాలి. దారిద్య్ర నిర్మూలనకు కార్పొరేట్ అనుకూలత కన్నా సామాన్య ప్రజానుకూల విధానాలే శరణ్యం. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసాన్నీ నివారించాలి. కార్పొరేట్ భారతావనిలో సీఈఓలు ఓ సగటు మధ్యశ్రేణి ఉద్యోగితో పోలిస్తే 241 రెట్ల (కరోనాకు ముందు ఇది 191 రెట్లు) ఎక్కువ జీతం సంపాదిస్తున్న వేళ... సత్వరం ఇలాంటి పలు దిద్దుబాటు చర్యలు అవసరం. గత 15 ఏళ్ళలో 41 కోట్లమందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తెచ్చామని లెక్కలు చెప్పి, సంబరపడితే చాలదు. ఇప్పటికీ అధికశాతం పేదసాదలైన ఈ దేశంలో ఆర్థిక అంతరాలు సామాజిక సంక్షోభానికి దారి తీయక ముందే పాలకులు విధానపరమైన మార్పులు చేయడమే మార్గం. -
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
కళ్లముందున్న వివక్ష కనబడదా?
ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ (ఐఐడీఎస్) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది. రమేష్ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్(ఐఐడీఎస్) బయటపెట్టింది. ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్ బై కాస్ట్’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ సర్వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు. ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు. ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు. ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు. ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు
న్యూఢిల్లీ/దావోస్: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బచర్ వ్యాఖ్యానించారు. బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది. ► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు ► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి. 310 కోట్ల మంది నిరుపేదల కంటే 10 మంది కుబేరుల సంపాదనే ఎక్కువ భారత్‌లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ► భారత్‌లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు ► భారత్‌లో టాప్–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. ► టాప్– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. ► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. ► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి. ► కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు. -
Oxfam Report: డబ్బు వెల్లువలా వస్తూనే ఉంది, కానీ..
కరోనా మహమ్మారి కోరలు చాచిన రెండేళ్లలో (2020, 2021) సంవత్సరాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల సంపద రెట్టింపైనట్టు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రకటించింది. Oxfam Davos 2022 నివేదిక ప్రకారం.. అంతకుముందు 14 ఏళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా టైంలోనే ఇది మరింతగా వృద్ధి చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది. అదే సమయంలో పేదరికం, అసమానతలు తారాస్థాయికి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది. బిలియనీర్.. బిలియన్ డాలర్, అంతకు మంచి సంపద ఉన్నవాళ్లు. 2021లో భారత్ విషయానికొస్తే బిలియనీర్ల సంపద రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి.. 142 మందికి చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 40 మంది బిలియనీర్లు చేరారు!. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021లో 142 మంది భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు. అంటే.. దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలకుపైనే. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది. ►భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది. ►భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. ► రెండో వేవ్ ఇన్ఫెక్షన్ టైంలో ఆరోగ్య మౌలిక వసతులు, అంత్యక్రియలు, శ్మశానాలే ప్రధానంగా నడిచాయి. ► భారత్‌లో అర్బన్ అన్ఎంప్లాయిమెంట్ విపరీతంగా పెరిగిందని(కిందటి మేలో 15 శాతం), ఆహార అభద్రత మరింత క్షీణించింది. ► సంపద పునఃపంపిణీ పాలసీలను సమీక్షించాలని గ్లోబల్ ఆక్స్‌ఫామ్ దావోస్ నివేదిక భారత ప్రభుత్వానికి సూచిస్తోంది. ►గౌతమ్ అదానీ.. భారత్‌లో అత్యధికంగా అర్జించిన వ్యక్తిగా ఉన్నారని, ప్రపంచంలోనే ఈయన స్థానం ఐదుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. అదానీ 2021 ఏడాదిలో 42.7 బిలియన్ డాలర్ల సంపదను జత చేసుకున్నట్లు.. మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముకేష్ అంబానీ 2021లో 13.3 బిలియన్ డాలర్లు వెనకేసుకోగా.. ఈయన మొత్తం సంపద విలువ 97 బిలియన్డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్జీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది. ►ఈ పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా, సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది. ► అసమానతలు కరోనా సమయంలో ఎంతలా విస్తరించాయంటే.. ఆరోగ్య సదుపాయాల్లేక, ఒకవేళ ఉన్నా అవి అందుబాటులోకి రాక రోజూ 21,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు. ►కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►స్టాక్ ధరల నుంచి.. క్రిప్టో, కమోడిటీస్ అన్నింటి విలువా పెరుగుతూ వస్తోంది. ►ప్రపంచంలోని 500 మంది ధనికులు 1 ట్రిలియన్ డాలర్ల సంపదను వెనకేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. -
గ్రామీణ భారతంపై కరోనా దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ దేశంలోని గ్రామీణ ప్రాంతాలపై తీవ్రంగా ప్రభావం చూపిందని.. దేశ ప్రజారోగ్య వ్యవస్థలోని లోపాలు, లోటుపాట్లు అనేకం బయటపడ్డాయని ఆక్స్‌ఫామ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. వైద్యారోగ్యపరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి, విపత్తు వంటివి సంభవిస్తే.. దానిని ఎదుర్కొనేందుకు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నమనేది తేలిపోయిందని వ్యాఖ్యానించింది. దేశంలో వైద్య వసతులు, కరోనా ఉధృతి తదితర అంశాలపై ఆక్స్‌ఫామ్ ఇండియా సంస్థ తాజాగా ‘ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2021: ఇండియాస్ అనీక్వల్ హెల్త్‌కేర్ స్టోరీ’ పేరిట నివేదిక విడుదల చేసింది. ప్రభుత్వపరంగా అందించే వైద్య సేవలే.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజల మధ్య ‘ఆరోగ్య సేవల అసమానతలు, అంతరాల’ను తగ్గించేందుకు ఉపయోగపడతాయని అందులో పేర్కొంది. కానీ దేశంలోని వివిధ వర్గాల ప్రజల్లో ఇప్పటికే ఏర్పడిన సామాజిక, ఆర్థిక అసమానతలు.. అటు ఆరోగ్య రంగంలోనూ అసమానతలకు కారణమైనట్టు వెల్లడించింది. ఇటీవల వైద్యారోగ్య రంగంలో భారత్ మంచి పురోగతిని సాధించినా.. అది ప్రైవేట్ రంగంలోనే ఉండడం వల్ల పేద, అణగారిన వర్గాలు వైద్యసేవల్లో అసమానతలను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. నివేదికలో ప్రధాన అంశాలివీ.. ► దేశంలో ఉన్నతాదాయ వర్గాలతో పోల్చితే.. తక్కువ ఆదాయం పొందేవారు ఐదు రెట్లు అధికంగా కోవిడ్ బారినపడ్డారు. ► కరోనా రెండో వేవ్‌లో ఏర్పడిన పరిస్థితులను పరిశీలిస్తే.. దేశంలో వైద్యపరమైన మౌలిక వసతులు సరిగ్గా లేవనేది స్పష్టమైంది ► గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనాతో తీవ్రంగా ప్రభావితం అయ్యారు. నగరాల్లో మధ్య, ఎగువ మధ్యతరగతిపై అధికంగా ప్రభావం కనిపించింది. ► ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలు ఫీజుల వసూలు, మందుల బ్లాక్ మార్కెటింగ్ బయటపడింది. ► దేశంలో వ్యాక్సినేషన్ సజావుగా సాగలేదు. ► నేషనల్ హెల్త్ ప్రొఫైల్ (2017) డేటా ప్రకారం.. దేశంలో 10,189 మందికి ఒక ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ ఉన్నారు. 90,343 మందికి ఒక ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ► 2010–20 మధ్యకాలంలో ప్రతి 10 వేల మందికి అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 9 నుంచి 5కు తగ్గింది. ► దేశంలో 70 శాతం గ్రామీణ జనాభా కాగా.. ఆ ప్రాంతాల్లో 40 శాతమే బెడ్లు ఉన్నాయి. ఆక్స్‌ఫామ్ నివేదికలో చేసిన సిఫార్సులివీ.. ► ధనికులు, పేదల మధ్య ఆరోగ్యసేవల విషయంలో అంతరాలు, అసమానతలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేయాలి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్ పెంచాలి. ఎస్సీలు, ఎస్టీల జనాభాకు తగ్గట్టుగా కేటాయించాలి. ► అణగారిన, అట్టడుగు వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజారోగ్య సౌకర్యాలు మెరుగుపరచాలి. ► ఔట్ పేషెంట్ కేర్‌ను వైద్య బీమా పథకాల్లో అంతర్భాగం చేయాలి. ► ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నచోట కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు కేటాయించి, డయాగ్నొస్టిక్ సేవలు, అత్యవసర మందులు ఇవ్వాలి. ► అన్ని రాష్ట్రాలు ‘పేషెంట్స్ రైట్స్ చార్టర్’ను నోటిఫై చేసేలా ఆదేశించాలి. ► ఇష్టారీతిన బిల్లులు వసూలు చేయకుండా ప్రైవేట్ ఆరోగ్య రంగాన్ని క్రమబద్ధీకరించాలి. ► వైద్యారోగ్య వ్యవస్థలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలి. కొండ ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, గ్రామీణ, ఇతర సుదూర ప్రాంతాల్లో వైద్య పరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ► తాగునీరు, పారిశుధ్యం, అక్షరాస్యత తదితర సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. -
కోవిడ్‌తో నిమిషానికి ఏడుగురు.. ‘ఆకలి వైరస్’కు 11 మంది
కైరో: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, గ్లోబల్ వార్మింగ్, అంతర్యుద్ధ పరిస్థితులు ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. తినడానికి తిండి లేక ఆకలిబాధతో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది మరణిస్తున్నట్టుగా పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్’’ అన్న పేరుతో ఆక్స్‌ఫామ్ సంస్థ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు మరణిస్తూ ఉంటే, అదే సమయంలో ఆకలి బాధ తట్టుకోలేక నిమిషానికి 11 మంది మరణించడం హృదయ విదారకర పరిస్థితులకు అద్దం పడుతోందని ఆ సంస్థ సీఈఓ అబ్బీ మ్యాక్స్‌మ్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మన ఊహకి కూడా అందని దుర్భర పరిస్థితుల్ని ఎందరో ఎదుర్కొంటున్నారు. అంతర్యుద్ధాలు, పర్యావరణ మార్పులతో ఏర్పడే విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు కోట్లాది మందిని తిండికి దూరం చేశాయి’’ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్లపై బాంబులు వేస్తున్నారు. పండిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో దుర్భర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఆకలిని పెంచేస్తున్నాయి. ఇలాంటి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది’’ అని మ్యాక్స్‌మ్యాన్ అన్నారు. నివేదికలో అంశాలివే.. ► ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 2 కోట్లు పెరిగింది. ► ఆహార కొరతని ఎదుర్కొంటున్న వారిలో దాదాపుగా 66% మంది మిలటరీ సంక్షోభం నెలకొన్న దేశాల్లోనే ఉన్నారు ► కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో 5,20,000 మంది ఆకలితో నకనకలాడిపోతున్నారు ► కోవిడ్–19 ప్రభావం, వాతావరణ మార్పులతో గత ఏడాదికాలంలోనే ఆహార ఉత్పత్తుల ధరలు 40% పెరిగాయి ► గత ఏడాది కాలంలో ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు ఆరు రెట్లు పెరిగిపోయాయి ► కరోనా కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై చేసే ఖర్చు 5,100 కోట్ల డాలర్లు పెరిగింది. ఆకలి కేకల్ని నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన ఖర్చు కంటే మిలటరీపై చేస్తున్న ఖర్చు ఆరు రెట్లు ఎక్కువ. ► అఫ్గానిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ దేశాల్లో ఆకలి కేకలు అత్యధికంగా ఉన్నాయి. -
ఆ ‘వైరస్’ తో నిమిషానికి 11 మంది మృతి
వెబ్‌డెస్క్: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. అయితే కరోనాను మించిన మరో మహమ్మారి చాప కింద నీరులా భూమ్మీద దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనాను మించిన మరణాలు ఈ మహమ్మారి కాటుకు గురవుతున్నాయి. కరోనాను మించిన ఆ భయంకర వైరస్ పేరు ఆకలి. అవును ఆక్స్ ఫాం అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలు ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. ఆకలిరాజ్యం పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైంది పేరిట విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం ఈ భూమ్మిదీ నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారని తేలింది. కరోనాను మించి ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. సైనిక సంక్షోభం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. వీరికి తినడానికి బుక్కెడు బువ్వ దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతోన్న సాయం కూడా తగ్గుతోంది. సైన్యంపైనే ఖర్చు కరోనా, లాక్ డౌన్ లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా యుద్ద పరిస్థితుల కారణంగా తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాల పటిష్ఠత కోసం ఖర్చు చేయక తప్పలేదని వెల్లడించింది. ఈ ఖర్చు రూ. 5,100 కోట్ల డాలర్లు దాటిందని.... పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఇది ఆరు రెట్లు ఎక్కువని తేల్చి చెప్పింది. అంతర్ యుద్దాలతో ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి అంతర్ యుద్దాల్లో చిక్కుకున్న దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని సూత్రీకరించింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది. -
ధనికులు, పేదల మధ్య ఇంత అగాధమా?
మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్‌లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్‌ఫామ్ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద పది కోట్లమంది నిరుపేదల సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా. ఆర్థిక వృద్ధి నమూనాలు బలిసిన వారిని మరింత బలిసేలా అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం. కరోనా మహమ్మారి తొలి వేవ్ దేశదేశాలను లాక్డౌన్ బారిన పడవేసినప్పటి నుంచి ప్రధానంగా సంపన్నదేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు 9 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనపు డబ్బును ముద్రించాయి. దీంతో ఆయా ఆర్థిక వ్యవస్థలు కాస్తా ఊపిరి పీల్చుకున్నాయనే చెప్పాలి. ఆర్థికవేత్త, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిర్ శర్మ ప్రకారం, ఈ మహమ్మారి సంపన్నుల సంపదను మరింత పెంచే ఉద్దీపన శక్తిగా మారిపోయింది. ఆయా ప్రభుత్వాలు ప్రకటిం చిన ఉద్దీపన ప్యాకేజీల్లో అధిక భాగం ఆర్థిక మార్కెట్లలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి నయా సంపన్నుల నికర సంపదగా మారిపోయాయని రుచిర్ మే 16న ఫైనాన్షియల్ టైమ్స్‌లో రాశారు. మహమ్మారి తొలి వేవ్ కాలంలోనే అతి సంపన్నుల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. అంటే దేశాలు ఆర్థికవ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేయడానికి మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే మార్కెట్లు ధనరాసులను తరిలించుకుపోయాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రజల చేతుల్లోని సంపద పరోక్షంగా నయా సంపన్నుల జేబుల్లోకి సునాయాసంగా తరలిపోవడమే. బ్రూక్సింగ్స్ సంస్థ చేసిన మదింపు ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల 40 లక్షల మంది దారిద్య్ర రేఖ దిగువకు నెట్టబడ్డారని తెలిసినప్పుడే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే అత్యంత దారిద్య్రంలో కూరుకుపోయిన అత్యధిక జనాభా విషయంలో భారత్ ఇప్పుడు నైజీరియానే అధిగమించింది. భారత్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారీ జనసంఖ్యకు ఇప్పుడు మరో 8 కోట్ల 50 లక్షల మంది జతకావడం విశేషం. కోవిడ్–19 సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసం ఫలితంగా మరింత జనాభా దారిద్య్ర రేఖ కిందికి దిగజారిపోవడం ఖాయమనిపిస్తుంది. అయితే మనం గుర్తించకపోయిన విషయం ఏమిటంటే.. ప్రపంచం నుంచి కటిక దారిద్య్రాన్ని నిర్మూలించడానికి కేవలం 100 బిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చిస్తే సరిపోతుంది. మహమ్మారి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో ఇది అత్యంత చిన్న భాగం మాత్రమే. సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి ఆర్థిక వ్యవస్థలు చేసిన ప్రయత్నంలో దారిద్య్ర నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోయింది. దారిద్య్రం నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగుపడుతోందన్నది అర్థం కావడం లేదు. ఉద్దీపన ప్యాకేజీల్లో అతి చిన్న భాగాన్ని దారిద్య్ర నిర్మూలన కోసం వెచ్చించి ఉంటే, ఈ ప్రపంచం మరింత నివాస యోగ్యంగా ఉండేది. ఈలోగా, కరోనా మహమ్మారి ఆదాయ అసమానత్వాన్ని కనీవినీ ఎరుగని పరాకాష్ట స్థితికి తీసుకుపోయింది. అమెరికాలోని బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 44.6 శాతానికి పెరిగిపోయిందని ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీ పేర్కొంది. ఇదే కాలంలో అమెరికాలో 8 కోట్లమంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 16 కోట్ల మంది సంపదతో పోలిస్తే 50 మంది అగ్రశ్రేణి సంపన్నుల సంపద అధికంగా ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇక భారత్ విషయానికి వస్తే ఆదాయాల మధ్య అసమానత ఏమంత తక్కువగా లేదు. 2013 నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక ప్రకారం సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయాన్ని పరిశీలిస్తే, సగటున నెలకు రూ. 6,426లు మాత్రమే ఉంటోందని తెలుస్తుంది. అందుకనే సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ పంటలకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్ ఇనీక్వాలిటీ వైరస్ రిపోర్ట్‌తో దీన్ని పోల్చి చూడండి. మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్‌లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్‌ఫామ్ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పది కోట్లమంది సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా.పెరిగిన ఈ సంపద పేదల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో అర్థం చేసుకోవడానికి, సార్వత్రిక ప్రాథమిక ఆదాయంపై ప్రయోగ ఫలితం కేసి చూడాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి రెండేళ్లకుముందు అంటే 2018 ప్రారంభంలో కెనడాలో ఫౌండేషన్ ఫర్ సోషల్ చేంజ్ చారిటబుల్ సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాతో కలిసి వాంకోవర్ ప్రాంతంలోని నివాసాలు లేని 50 కుటుంబాలకు 7,500 కెనడియన్ డాలర్లను (6,206 అమెరిన్ డాలర్లు) ఇచ్చాయి. ఏడాది తర్వాత ఈ డబ్బు ఎలా ఉపయోగపడింది అనే అంశంపై చారిటీ సంస్థ జరిపిన పరిశీలనలో అద్భుత ఫలితాలు కనిపించాయి. పైగా ఇలా నగదు సరఫరా అనేది ఎంతో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చింది. నిరుపేదలకు డబ్బుతో ఎలా వ్యవహరించాలో తెలీదంటూ సమాజంలో ఉండే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, తమకు అందిన పరిమితమైన ఆర్థిక సహాయాన్ని కూడా వారు ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టంగా వెల్లడిం చాయి. ప్రధానంగా ఆ కాస్త మొత్తాన్ని వారు ఆహారం, దుస్తులు, ఇంటి నిర్వహణ వంటి అవసరాలకు మాత్రమే తెలివిగా ఖర్చుపెట్టారు. వార్తా నివేదికల ప్రకారం ప్రాథమిక ఆహారంపై వినియోగం 37 శాతం పెరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో నిరుపేదలు డ్రగ్స్, ఆల్కహాల్‌పై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. అంతవరకు నివాస స్థలం లేకుండా గడిపిన వీరు తాము ఉండటానికి ఒక గూడుకోసం ప్రయత్నించి పక్కా ఇళ్లను సంపాదించుకోవడంపై పని చేశారు. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు రోటీ, కపడా, మకాన్ ఎంతో ప్రాధాన్యత కల అంశాలుగా ఉంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇలాంటి చిన్న మొత్తాలతో నగదును బదలాయించడం అనేది దారిద్య్రం కోరలనుంచి పేదలను గణనీయంగా బయట పడేస్తుంది. నిరుపేదల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ఈ విశిష్ట ప్రక్రియను అమలు చేయడానికి బదులుగా... ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను రాయితీలు, బ్యాంక్ బకాయిల రద్దు, బెయిలవుట్లు, కార్పొరేట్ ప్రోత్సాహకాల పేరిట భారీ స్థాయిలో సంస్థలకు సబ్సిడీలను అందించడం రూపంలో మరింత డబ్బును సంపన్నుల జేబుల్లోకి చేరే తరహా విధానాల కొనసాగింపును మనం చూస్తూ వస్తున్నాం. పేదలకు వారి వాటా వారికిచ్చే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా, ఒక విచిత్రమైన వాదనను మన ఆర్థిక పండితులు తీసుకొస్తుంటారు. అదనపు డబ్బును నేరుగా పేదలకు బదలాయిస్తే సమాజంలోని ప్రతిఒక్కరూ ఖర్చుపెట్టడం అలవాటు చేసుకుని మరింత ద్రవ్యోల్బణం పెరగడానికి కారకులవుతారని మేధావుల ఉవాచ. ఈ వాదనకు అనుగుణంగానే ఆర్థిక వృద్ధి నమూనాలు చాలా తెలివిగా సమాజంలో ఆదాయాల మధ్య అసమానతకు మరింత తోడ్పడేలా పథకాలను రూపొందిస్తూ వస్తున్నాయి. అంటే బలిసిన వారిని మరింత బలిసేలా ఈ విధానాలు అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితి లోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అంబానీ సెకను సంపాదన.. సామాన్యుడికి ఎన్నేళ్లంటే!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోయాయి. సామాన్యులు పూట గడిచేందుకు అష్టకష్టాలు పడుతుండగా.. కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఎగిసింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ దేశాన్ని ముట్టడించిన నాటి నుంచి దేశీయంగా 100 మంది టాప్ బిలియనీర్ల సంపద విలువ సుమారు రూ. 12,97,822 కోట్ల మేర పెరిగింది. ఈ మొత్తాన్ని కటిక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న 13.8 కోట్ల మంది పేదలకు పంచితే .. వారికి తలా ఓ రూ. 94,045 లభిస్తుంది. కరోనా కష్టకాలాన్ని విశ్లేషిస్తూ.. ’అసమానత వైరస్’ పేరిట ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలోని భారత్ అనుబంధంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సామాన్యులు, సంపన్నుల మధ్య అసమానతల గురించి వివరించేందుకు.. ప్రపంచంలోనే టాప్ సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద, ఆదాయాలను ఆక్స్‌ఫామ్ పరిగణనలోకి తీసుకుంది. అంబానీ ఒక్క గంటలో ఆర్జించే ఆదాయాన్ని నైపుణ్యాలు లేని కార్మికుడు సంపాదించాలంటే ఏకంగా 10,000 సంవత్సరాలు పడుతుందని లెక్క వేసింది. ఇక అంబానీ సెకనులో ఆర్జించే ఆదాయాన్ని సంపాదించాలన్నా కనీసం మూడేళ్లు పడుతుందని పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. తీవ్రమైన అసమానతలను పరిష్కరించేందుకు సత్వరం చర్యలు తీసుకోకపోతే.. సంక్షోభం ముదిరే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. మహామాంద్యానికి సమాన సంక్షోభం.. గడిచిన వందేళ్లలో ఇలాంటి ప్రజారోగ్య సంబంధ సంక్షోభం ఈ స్థాయిలో తలెత్తడం ఇదే ప్రథమమని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. 1930లో తలెత్తిన మహామాంద్యంతో సరిపోల్చతగిన స్థాయి ఆర్థిక సంక్షోభానికి ఇది దారి తీసిందని తెలిపింది. మహమ్మారి కారణంగా తమ తమ దేశాల్లో ఆదాయ అసమానతలు భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వేలో 87% మంది ఆర్థిక వేత్తలు అభి ప్రాయపడినట్లు వివరించింది. ఈ ఆక్స్‌ఫామ్ సర్వేలో 79 దేశాలకు చెందిన జెఫ్రీ శాక్స్, జయతి ఘోష్, గాబ్రియల్ జక్మన్ వంటి 295 మందికి పైగా దిగ్గజ ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. ప్రతి గంటకూ 1.70 లక్షల ఉద్యోగాలు కట్.. కరోనా సంక్షోభ సమయంలో సంపన్నుల సంపద మరింతగా పెరగ్గా పేదలు మరింత పేదరికంలోకి జారిపోయారు. లాక్డౌన్ అమలు చేసిన 2020 మార్చి నాటి నుంచి బొగ్గు, ఐటీ, ఆయిల్, టెలికం, ఫార్మా, విద్య, రిటైల్ తదితర రంగాలకు చెందిన కుబేరులు గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సైరస్ పూనావాలా, ఉదయ్ కోటక్, అజీం ప్రేమ్‌జీ, సునీల్ మిట్టల్, రాధాకిషన్ దమానీ, కుమార మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్ వంటి వారి సంపద అనేక రెట్లు పెరిగింది. అయితే, 2020 ఏప్రిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆ నెలలో ప్రతీ గంటకూ 1,70,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది. నివేదిక ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. లాక్డౌన్ పూర్వ స్థాయితో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగిత 15 శాతం పెరిగింది. మహమ్మారి తీవ్రంగా ఉన్న కాలంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. వీరిలో సింహభాగం (75 శాతం మంది) 9.2 కోట్ల మంది అసంఘటిత రంగానికి చెందినవారేనని ఆక్స్‌ఫామ్ వివరించింది. ఆరోగ్యానికి అత్యంత తక్కువ కేటాయింపులు.. ‘ఆరోగ్యానికి ప్రభుత్వాలు చేసే కేటాయింపులు చూస్తే అత్యంత తక్కువ కేటాయింపులతో భారత్ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంటుంది. కరోనా మహమ్మారి కాలంలో పెరిగిన టాప్ 11 దేశీ కుబేరుల సంపదపై కనీసం ఒక్క శాతం పన్ను విధించినా.. జన ఔషధి పథకానికి కేటాయింపులు 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది. తద్వారా పేదలు, బడుగు వర్గాలకు చౌకగా ఔషధాలు అందించవచ్చు‘ అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పదేళ్ల పాటు లేదా ఆరోగ్య శాఖను పదేళ్ల పాటు నడిపించేందుకు సరిపోతుందని వివరించింది. ‘డేటా ప్రకారం మహమ్మారి కాలంలో అంబానీ ఆర్జించిన ఆదాయం ... దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కనీసం 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు కరోనా కారణంగా కటిక పేదరికంలోకి జారిపోకుండా దాదాపు అయిదు నెలల పాటు ఆదుకోవడానికి సరిపోతుంది‘ అని పేర్కొంది. -
ఆక్స్‌ఫాం నివేదిక.. చేదు నిజాలు
ఏటా విడుదలయ్యే నివేదికల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్థిక అసమానతలనూ, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్రా అంతరాలనూ ఆక్స్‌ఫాం ఏకరువు పెడుతుంది. ఏడాదిగా ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది గనుక ఈసారి నివేదిక మరింత గుబులు పుట్టించేదిగా వుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లు్యఈఎఫ్) సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫాం నివేదికలు విడుదలవుతుంటాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మామూలు గానే అన్ని దేశాల్లోనూ వ్యత్యాసాలు పెంచాయి. కానీ సంక్షోభం తలెత్తినప్పుడు, విలయం విరుచుకు పడినప్పుడు ఇక చెప్పేదేముంటుంది? కొన్ని నెలలక్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదిక వెలువరిస్తూ తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ తలకిందులు కాబోతున్నాయని, కోట్లాదిమంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం వున్న దని హెచ్చరించింది. ఆ నివేదిక వచ్చాక మన దేశంతో సహా అనేక దేశాలు సంక్షోభాన్ని అధిగమిం చటం కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అట్టడుగు వర్గాలకు చేయూతనందించే అనేక పథ కాలు రూపొందించాయి. వేరే దేశాల మాటెలావున్నా మన దేశంలో మాత్రం వాటివల్ల పెద్దగా ఫలితం రాలేదని తాజా ఆక్స్‌ఫాం నివేదిక తెలియజెబుతోంది. భారత్‌ను అసమానత అనే వైరస్ పట్టి పీడిస్తున్నదని, పర్యవసానంగా సంపన్నులు మరింత సంపద పోగేసుకోగా, అంతో ఇంతో పొట్ట పోషించుకునేవారు సైతం ఉపాధి కోల్పోయి కొత్తగా దారిద్య్రంలోకి జారుకున్నారని నివేదిక వ్యాఖ్యా నించటం గమనించదగ్గది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో ఆ వైరస్‌ను కొందరు ‘సోషలిస్టు వైరస్’గా చమత్కరిం చారు. ధనిక, పేద తేడా లేకుండా అందరినీ అది కాటేసిందని, దాని పర్యవసానంగా అందరూ ఒక్క లాగే ఇబ్బందులు పడ్డారని అనుకున్నారు. సంపన్నుల్లోనూ ఆ వ్యాధి వచ్చినవారూ, మరణించిన వారూ వుండొచ్చు. కానీ ఆ వర్గానికి అందుబాటులో వుండే ఆధునిక వైద్య సౌకర్యాలు ఇతరులకు లేవు. అలాగే వారికుండే ఆర్థిక వెసులుబాటు ఇతరులకు వుండదు. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతో పాటు జెండర్ మొదలుకొని అనేకానేక అంశాల్లో వుండే అసమానతల వల్ల మనలాంటి సమాజాల్లో ఏర్పడే ఏ సంక్షోభాలైనా వాటిని మరింత పెంచుతాయి. అందువల్లే భిన్న రంగాలను శాసిస్తున్న మోతుబరులు లాక్డౌన్ కాలంలో తమ సంపద అపారంగా పెంచుకుంటే సాధారణ పౌరులు మాత్రం బతుకు భయంతో తల్లడిల్లారని ఆక్స్‌ఫాం నివేదిక ఎత్తిచూపుతోంది. మన దేశంలో లాక్డౌన్ సమయంలో భాగ్యవంతుల సంపద 35 శాతం పెరగ్గా లక్షలాదిమంది సాధారణ పౌరులు జీవిక కోల్పోయారని గణాంకాలంటున్నాయి. నిరుడు మార్చి మొదలుకొని ఇంతవరకూ వందమంది శత కోటీశ్వరుల సంపద 12,97,822 కోట్ల మేర పెరగ్గా... ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రతి గంటకూ 1,70,000 మంది చొప్పున సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారని నివేదిక వెల్లడిస్తోంది. అంటే శత కోటీశ్వరులు వున్న సంపదను కాపాడుకోవటమే కాదు... దాన్ని మరిన్ని రెట్లు పెంచుకోలిగారు. కరోనా ప్రమాదం ముంచుకొచ్చాక మన దేశంలో కఠినమైన లాక్డౌన్ అమలైంది. అది ప్రభుత్వాల సంసిద్ధతను పెంచటంతోపాటు, వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆ రెండు అంశాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇటలీవంటిచోట్ల మన మాదిరిగా వలస కార్మికుల సమస్య లేదు గనుక లాక్డౌన్ అక్కడ సమర్థవంతంగా అమలైంది. మన దేశంలో మాత్రం పనిలేక, ఆకలిదప్పులకు తట్టుకోలేక భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు నడక దారిన తరలివెళ్లటం మొదలుపెట్టారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించటానికి పోలీసులు ప్రయత్నించటం, వారి కళ్లుగప్పి గమ్యస్థానాలు చేరడానికి సాధారణ ప్రజానీకం ప్రయత్నించటం కొన్ని నెలలపాటు మన దేశంలో నిత్యం కనబడిన దృశ్యం. దారిపొడవునా ఆ క్రమంలో బలైనవారెందరో! దానికితోడు సరైన పోషకాహారం లభించక, జాగ్రత్తలు పాటించటం సాధ్యంకాక ఎందరో కరోనా బారినపడ్డారు. ఎన్నో రాష్ట్రాల్లో వైరస్ కేసుల సంఖ్య చూస్తుండగానే పెరిగి కలవరపరిచింది. ఆ మహమ్మారి కాటేసిన దేశాల వరసలో అమెరికా తర్వాత మనదే రెండో స్థానం. కోటీ 6 లక్షలమందికిపైగా జనం కరోనా బారిన పడితే 1,53,525 మంది మరణించారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకున్నవారి స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆక్స్‌ఫాం నివేదిక చాటుతోంది. త్వరలో 2021–22 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫాం నివేదికలోని అంశాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా చేయాల్సివేమిటో ఆలోచించటం అవసరం. లాక్డౌన్ పర్యవసానంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించటానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఏమేరకు ప్రభావం కలిగించాయన్నది కూడా సమీక్షించాలి. నిరుడు ఏప్రిల్–నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ వ్యయం వాస్తవ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే తగ్గిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంతక్రితం సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ ఎనిమిది నెలలకాలంలో ప్రభుత్వ వ్యయం 4.7 శాతం పెరిగినట్టు కనబడుతున్నా, 6 శాతంకన్నా ఎక్కువగా వున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక ఆ వ్యయం గణనీయంగా తగ్గిన వైనం వెల్లడవుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వగైరా రంగాలన్నిటా ఇప్పటికే వున్న వ్యత్యాసాలను కరోనా అనంతర పరిస్థితులు ఎన్ని రెట్లు పెంచాయో ఆక్స్‌ఫాం నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ రంగాల్లో ప్రభుత్వ వ్యయం అపారంగా పెరిగితే తప్ప... నేరుగా ప్రజానీకం చేతుల్లో డబ్బులుండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యత్యాసాలు ఆగవు. సంక్షోభాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని సకాలంలో నివారణ చర్యలు తీసుకున్నప్పుడే సమాజం సజావుగా సాగు తుంది. లేనట్టయితే అది అశాంతిలోకి జారుకుంటుంది. -
గంటకు అంబానీ ఆదాయం ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ:ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతాకాదు. దిగ్గజ ఆర్థికవ్యవస్థలు కూడా తీవ్ర మాంద్యంలోకి జారుకున్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా దేశీయంగా కోట్లాదిమంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. కనీసం ఆదాయం లేక తీరని సంక్షోభంలోకి కూరుకుపోయారు. ఈ సంక్షోభానికి సంబంధించిన ఆక్స్‌ఫాం నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలో తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలపై ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సోమవారం ఈ నివేదికను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పుంజుకుంది. దీంతో వారి ఆస్థి 422.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఈ విషయంలో అమెరికా చైనా, జర్మనీ, రష్యా , ఫ్రాన్స్ తరువాత భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. కరోనావై మహమ్మారి మూలంగా భారతదేశంలోని దేశ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగింది. మరోవైపు పేదలు నిరుద్యోగం, ఆకలితో చావులకు గురయ్యారు. కోట్లాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా ఆదాయ అసమానతల రేషియో మరింత దిగజారిందని వ్యాఖ్యానించింది. లాక్డౌన్ సమయంలో 84 శాతం కుటుంబాలు వివిధ రకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని, 2020 , ఏప్రిల్‌లోనే ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. ఇది అనధికారిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వీరిలో 75 శాతం మంది అనధికారిక రంగంలో 9.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ఈ పరిస్థితులను వెంటనే పరిష్కరించకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఆక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహార్ హెచ్చరించారు. మరోవైపు లాక్డౌన్ అమలు చేసిన 2020 మార్చి కాలంనుంచి భారతదేశంలోని టాప్ 100 బిలియనీర్ల ఆదాయం భారీ పెరుగుదలను చేసింది. అంతేకాదు వీరి ఆదాయాన్ని 138 మిలియన్ల పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి, రూ. 94,045 చొప్పున పంచడానికి సరిపోతుందని వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఒక గంటలో ఆర్జించిన సంపదను పొందాలంటే సగటు నైపుణ్యం లేని కార్మికుడికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. అలాగే ఒక సెకనులో సృష్టించిన దాన్ని సాధించాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని నివేదిక తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో ఉన్న అసమానతలను కూడా ఎత్తి చూపిన నివేదిక మరో కీలక వ్యాఖ్య చేసింది. కోవిడ్ సమయంలో దేశంలోని టాప్ 11 బిలియనీర్లు ఆర్జించిన సంపదపై కేవలం ఒక శాతం పన్ను విధించినా ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన మందులను అందించే కేంద్ర జనఔషధి పథకం కేటాయింపులను 140 రెట్లు పెంచుకోవచ్చని అభిప్రాయపడింది. అలాగే 2020 ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ముఖ్యంగా లాక్డౌన్ తరువాత మహిళా నిరుద్యోగిత 15 శాతం పెరిగిందని నివేదించింది. కాగా 2020 ఆగస్టులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ గ్రహం మీద నాల్గవ ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మహమ్మారి సమయంలో ఒకవైపు దేశంలో 24 శాతం మంది ప్రజలు నెలకు 3,000 లోపే ఆర్జించగా, అంబానీ మాత్రం గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారు. ఒక్క అంబానీ ఆర్జించిన సంపాదనతోనే 40 కోట్లమంది అసంఘటిత కార్మికులను కనీసం అయిదునెలలపాటు ఆదుకోవచ్చని ఆక్స్‌ఫాం నివేదించడం గమనార్హం. -
రోజుకు రూ. 2,200 కోట్లు పెరిగింది!
సమాజంలో పేద-ధనిక మధ్య వ్యత్యాసం పెరుగుతూ పోతోందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ నివేదించింది. భారతీయ కోటీశ్వరుల సంపద గత ఏడాది భారీగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ స్టడీ తేల్చింది. సోమవారం విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2018లో భారతీయ కుబేరుల సంపద రోజుకు 2వేల,200 కోట్ల రూపాయల మేర పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద12శాతం పుంజుకుని రోజుకు దాదాపు 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో 1 శాతం మంది ఆదాయం 39 శాతం పెరగ్గా, పేదవారి ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరిగిందని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో తేలింది. భారత్ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం 9 మంది బిలియనీర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గత ఏడాది 26 మంది బిలియనీర్లు మరింత ధనికులై కోట్లకు పడగలెత్తితే.. సుమారు 3.8 బిలియన్ల మంది పేదలు ఇంకా దారిద్యంలోనే మగ్గుతున్నారని రిపోర్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 119కి చేరింది. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు చేరిందని ఆక్స్ ఫామ్ తెలిపింది. 2008 తర్వాత ఇదే భారీ పెరుగుదల. 2018-2022 మధ్య భారత్ నుంచి కొత్తగా రోజుకు 70 మంది మిలియనీర్లుగా కొత్తగా ఈ జాబితాలో చేరతారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. ప్రపంచ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో సగం పేద జనాభా వద్ద సొమ్ము 11 శాతం తగ్గిపోయింది అని ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో మొత్తం సంపదలో 77.4శాతం కేవలం జనాభాలోని కేవలం 10శాతం మంది చేతుల్లో వుంది. అంతేకాదు 51.53శాతం సంపద 1 శాతం ధనవంతుల వద్ద ఉంది. 60 శాతం మంది జాతీయాదాయంలో 4.8 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. భారత్‌లో 10 శాతం జనాభా 13.6 కోట్ల మంది ప్రజలు కడుపేదవారుగా మారిపోతున్నారనీ, 2004 నుంచి అప్పుల్లోనే మగ్గిపోతున్నారు. వైద్య, ప్రజా ఆరోగ్య, పారిశుద్ధ్యం, నీటి సరఫరా కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం రెవెన్యూ, ఖర్చులు రూ. 2,08,166 కోట్లుగా ఉన్నాయనీ, ఇది భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ రూ. 2.8 లక్షల కోట్ల సంపద కంటే తక్కువని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 112 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 115 మిలియన్ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్ బెజోస్ ఆదాయంలో 1 శాతం ఆదాయం సమానమని ఆక్స్‌ఫామ్ స్టడీ వ్యాఖ్యానించింది. 2008లో పలు ప్రపంచదేశాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని ఆక్స్‌ఫామ్ స్టడీలో తేలింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆరోగ్య, విద్య వంటి ప్రజా సేవలపై అతి తక్కువ నిధులతో అసమానతలను పెంచుతోంటే...మరోవైపు సూపర్ సంపన్నులు, కార్పొరేట్స్ దశాబ్దాల కాలంగా తక్కువ పన్నులు చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ అమెరికా శాఖ వైస్ ప్రెసిడెంట్ పాల్ ఓబ్సీన్ తెలిపారు. కోట్లాది పేదలు, బడుగువర్గాలు రోజుకు అయిదున్నర డాలర్లకన్నా తక్కువ సంపాదిస్తూ దుర్భరంగా బతుకులీడుస్తున్నారన్నారు. ఇది పేద మహిళల, బాలికల విషయంలో మరీ అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన కళ్ళ ముందున్న ఆర్ధిక వ్యవస్థ చాలా ‘అమానుషం‘ గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ధనికులు మరింత ధనికులు కావడాన్ని తాము వ్యతిరేకించకపోయినప్పటికీ..అదే సమయంలో పేదల సంపద కూడా పెరగాలి.. ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అని పాల్ వ్యాఖ్యానించారు. తమ తాజా నివేదికను అన్ని దేశాలకూ పంపుతామని చెప్పారు. BREAKING: Billionaire fortunes grew by $2.5 billion a day last year as the poorest people saw their wealth fall – our latest inequality report is out today: https://t.co/aVgdwB6i07 #wef19 #FightInequality #BeatPoverty pic.twitter.com/mc2HW1dDSp — Oxfam International (@Oxfam) January 21, 2019 -
వీరిని ‘మీ టూ’ చేరేదెలా?
లైంగిక వేధింపులపై నిరసనగా ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం.. పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న కొందరు వ్యక్తుల నిజ రూపాలు బట్టబయలు చేసింది. వినోదం, మీడియా రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ‘మీ టూ’ ఉద్యమం కారణంగా తెరపైకి వచ్చాయి. అయితే, పలు ఇతర రంగాల్లోని మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు బట్టబయలయ్యే స్థాయికి ఈ ఉద్యమం చేరుకోలేదు. అసంఘటిత రంగంలోని శ్రామిక మహిళలు భరిస్తున్న వేధింపుల వేదన వారి పెదవి దాటడం లేదు. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం గురించి గానీ, మీటూ ఉద్యమం గురించి గానీ తెలియని లక్షలాది మంది మహిళలు మనదేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇళ్ళల్లో పనిచేసే మహిళలపై జరుగుతున్న లైంగిక హింస తీవ్రత పూర్తి స్థాయిలో బయటకు తెలియడం లేదు. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో కొన్ని సర్వేలు జరిగాయి. గ్రామాలను వీడి పట్టణాలకు వలస వచ్చిన లక్షలాది మందిలో అత్యధికులు ఇళ్లల్లో పనివారుగా చేరుతారు. వారిలో మహిళలే ఎక్కువ. ఆ మహిళలపై జరిగే లైంగిక హింసకు అంతే లేని పరిస్థితి ఉంది. తామున్న దుర్భర ఆర్థిక పరిస్థితుల కారణంగా తమపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వారు బయటకు చెప్పుకోలేరు. కుటుంబం నుంచి లభించే సహానుభూతి తక్కువే. ఇంటిపని చేసే స్త్రీల సమస్యలపై పనిచేసే హరియాణాలోని గురుగావ్‌లో ఉన్న ‘మహిళా కామ్‌గార్ సంఘటన్’ ఇటీవలే అసంఘటిత రంగ శ్రామిక మహిళల్లో మీటూ ఉద్యమ చైతన్యాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. తమపై జరిగే లైంగిక వేధింపులు, హింస పట్ల నిశ్శబ్దాన్ని వీడాలని ప్రచారం చేస్తోంది. ఈ సంస్థలో దాదాపు 7000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇళ్ళల్లో పనిచేసుకునే మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పెద్దగా బయటకు రావని, రేప్ జరిగినప్పుడే ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అనితాయాదవ్ చెప్పారు. వేధింపులపై సర్వే దేశంలో మొత్తం 42 లక్షల మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో 29 లక్షల మంది మహిళలు, 13 లక్షల మంది పురుషులు ఉన్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల్లో ఇళ్లల్లో పనిచేసుకునే పార్ట్‌టైం శ్రామిక మహిళలపై మార్తా ఫారెల్ ఫౌండేషన్ ఇటీవల జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. ఆ వివరాలు.. ► పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వారు 29% కాగా, వారిలో 19% ఆ వేధింపులను మౌనంగా భరించారు. వారిలో 10% కుటుంబ సభ్యులకు, తోటి పనివారికి చెప్పారు. ► వేధింపులు తాళలేక పని వదిలేసి వెళ్ళిన వారు 2.3% ► యజమానుల చేతిలో అవమానాలకు గురైన వారు 61.8%. 2012లొ ఆక్స్‌ఫామ్ ఇండియా అధ్యయనంలో కూడా శ్రామిక మహిళల్లో 29 శాతం మంది పని ప్రదేశాల్లో తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నట్టు వెల్లడైంది. ఇళ్ళల్లో పనిచేసుకుని బతికే స్త్రీల్లో 23 శాతం మంది, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసే మహిళల్లో 16 శాతం మంది నిత్యం లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. డొమెస్టిక్ వర్కర్స్ రక్షణ కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని జిల్లాలోని లోకల్ కంప్లెయింట్స్ కమిటీలకు అనుసంధానం చేయాలని హార్వర్డ్ మిట్టల్ ఇనిస్టిట్యూట్ ఇండియా డైరెక్టర్ సంజయ్‌కుమార్ సూచిస్తున్నారు. -
‘దావోస్’ దారి మార్చుకోవాలి
జనావళిపై ప్రపంచీకరణను రుద్ది, దానిద్వారా దేశదేశాల్లోని సహజ వనరులను అపరిమితంగా కొల్లగొట్టిన అగ్రరాజ్యాలు స్వరం మార్చి ఇప్పుడు రక్షణాత్మక విధానాలకు తిరోగమిస్తున్న వేళ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘ప్రపంచాన్ని బాగా కలవర పెడుతున్న అంశాలపై చర్చించడానిక’ంటూ డబ్ల్యుఈఎఫ్ 1971లో ఈ వార్షిక సమావేశాలకు అంకురార్పణ చేసింది. వర్తమాన ప్రపంచ ధోరణులపైనా, పర్య వసానంగా పుట్టుకొచ్చిన సమస్యలపైనా, వాటివల్ల కలిగే ప్రమాదాలపైనా మేధో మథనం చేయడం, పరిష్కారాలను సూచించడం ఈ సమావేశాల ఉద్దేశం. ఎప్పటిలానే ఈసారి కూడా దావోస్‌కు దాదాపు వంద దేశాల నుంచి ప్రపంచ కుబేరులు, రాజకీయ నాయకులు, వివిధ దేశాల అధినేతలు, ఆర్థికమంత్రులు, బ్యాంకర్లు, కార్పొరేట్ అధిపతులు, మేధావులు, పాత్రికేయులు 3,000మంది హాజరయ్యారు. డబ్ల్యుఈఎఫ్ తో సమస్యేమంటే ప్రపంచంలో పెరిగిపోతున్న అసమానతల గురించి అక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకోవడమే తప్ప కార్యాచరణ శూన్యం. పేద, గొప్ప తారతమ్యాలు అంతకంతకూ పెరగడమే తప్ప తగ్గుతున్న దాఖలాలు లేవు. ఇందుకు ఏటా విడుదలవుతున్న ఆక్స్‌ఫామ్ నివేదికలే సాక్ష్యం. ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సాధించిన ప్రగతి గురించి చెబుతూ వెల్లడించిన గణాంకాలు సదస్సులో పాల్గొన్నవారిని సహజంగానే ఆకట్టుకుని ఉంటాయి. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ఈ సదస్సులో పాల్గొన్నప్పుడు భారత్ జీడీపీ దాదాపు రూ. 26 లక్షల కోట్లుంటే ఇప్పుడది ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వా ములను చేసి, ఆ ఫలాలు అందరికీ దక్కేటందుకు అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కానీ ఆయన ప్రసంగానికి ముందురోజే ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదిక ఈ అభివృద్ధి తీరుతెన్నులను ఎత్తిచూపింది. కేవలం 1 శాతంగా ఉన్న సంపన్నుల వద్ద 73 శాతం సంపద చిక్కుకున్నదని తెలిపింది. ఆదాయాల్లో వ్యత్యాసాలు, సంపద పంపిణీలో అసమతుల్యత అంతిమంగా సామాజిక అశాంతికే దారితీస్తాయి. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన నివేదిక ఈ వ్యత్యాసాల గురించి మరింత లోతుగా పరిశీలించింది. ప్రభుత్వాలు ఆర్థికా భివృద్ధికి ప్రాధాన్యమిచ్చినంతగా సామాజిక సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వక పోవడాన్ని ప్రస్తావించింది. సమ్మిళిత వృద్ధిలో మన పొరుగునున్న పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ కన్నా దిగువనున్నామని ఆ నివేదిక చెప్పడాన్నిబట్టి మోదీ ప్రస్తావించిన ఆర్థిక ప్రగతంతా ఎవరి గుప్పిట చిక్కుకున్నదో ఇట్టే అర్ధమవుతుంది. ఎంతసేపూ వృద్ధి రేటు చుట్టూ తిరుగుతూ దాన్నే నిజమైన వృద్ధిగా పరిగ ణించొద్దని సామాజికార్థిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఒక దేశం నిజమైన అభివృద్ధి అక్కడి పౌరుల ఆర్థిక భద్రతలో, వారి సామాజిక అభివృద్ధిలో, అక్కడి ఉద్యోగితలో, జీవనప్రమాణాల్లో ఉంటుంది తప్ప జీడీపీలో కాదు. అసమానతలను పారదోలేందుకు, సంపద పంపిణీ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి చర్యలూ లేకపోవడం వల్ల గణాంకాలు ఘనంగా కనబడుతున్నా సగటు పౌరుల జీవనం మెరుగుపడటం లేదు. ఏడెనిమిదేళ్లుగా మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకున్నదంటే దానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో క్షీణిం చిన చమురు ధరల పర్యవసానమని మరువకూడదు. గత కొన్ని వారాలుగా అవి మళ్లీ పైపైకి పోతున్నాయి. ఇంధన వినియోగం దేశంలో నిరుటితో పోల్చినా రెట్టింపయింది. నిరుడు చమురు డిమాండు రోజుకు 93 వేల బ్యారెళ్లు ఉంటే ఇప్పుడది 1,90,000 బ్యారెళ్లు అయింది. మనకు కావలసిన చమురులో 80 శాతం దిగుమతుల ద్వారానే లభిస్తుంది. కనుక చమురు ధర పైపైకి ఎగిసేకొద్దీ ఆమేరకు విదేశీ మారకద్రవ్య నిల్వలు హరించుకుపోతాయి. అందువల్ల తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మన ఆర్థిక వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవడం అవసరం. నిరుడు సదస్సుకు చైనా ప్రధాని షీ జిన్‌పింగ్ హాజరై హడావుడి చేయడం వల్ల కావొచ్చు ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తదితరులు వస్తున్నారు. మన ప్రధాని ఒకరు దావోస్ సదస్సుకు వెళ్లడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దావోస్ వచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ దేశాధినేత అడుగుపెడుతున్నారు. అయితే తాను వెళ్లేది ‘అమెరికాకే అగ్ర ప్రాధాన్యం’ అన్న తన నినాదాన్ని నొక్కి చెప్పడానికేనని ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యాల ప్రయోజనాలను నెరవేర్చే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను ఇన్నేళ్లుగా బడుగు దేశాలకు అంటగట్టి వాటిని ప్రపంచీకరణలో భాగస్వాములను చేయడంలో ప్రపంచ ఆర్థిక వేదిక పాత్ర తక్కు వేమీ కాదు. ఆ వేదిక పైనుంచే ప్రపంచీకరణ స్ఫూర్తికి విరుద్ధమైన అభిప్రాయాలు ఆయన వ్యక్తం చేస్తే అది ఆసక్తిదాయకమే. ఆక్స్‌ఫామ్ 2010నాటి నివేదిక ప్రపంచ జనాభాలోని సగంమంది ఆస్తికి సమానమైన సంపద కేవలం 388మంది కుబేరుల వద్ద కేంద్రీకృతమైందని తెలి పింది. మరో ఆరేళ్లకు... అంటే 2016లో విడుదలైన సంస్థ నివేదిక ప్రకారం ఆ సగం సంపదా మొత్తం 62మంది కుబేరుల వద్దకు చేరిందని వెల్లడించింది. తాజా నివేదిక ఇప్పుడా సంపద కేవలం 8మంది వద్ద ఉన్నదంటున్నది. ఆ కుబేరులు పన్నుల బెడదలేని మారుమూల దేశాల్లో 7.6 లక్షల కోట్ల డాలర్ల సంపద దాచి పెట్టారని చెబుతోంది. ప్రపంచ ఆర్థిక ప్రగతి దేనికి దారితీస్తున్నదో, చివరికెలాంటి ఫలితాలిస్తున్నదో ఈ నివేదిక అద్దం పడుతోంది. దీన్ని గురించి దావోస్‌లో ఆత్మ పరిశీలన చేసుకుంటేనే... సరైన పరిష్కారానికి ప్రయత్నిస్తేనే ఈ సదస్సుకొక అర్ధం, పరమార్ధం ఉంటుంది. లేనట్టయితే ఎప్పటిలా ఊకదంపుడు ఉపన్యాసాల వేదికగా మిగిలిపోతుంది. -
ఆర్థిక అసమానతలు పైపైకి
దావోస్: ఆర్థిక వృద్ధి గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ దేశీయంగా ఆర్థిక అసమానతలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతేడాది జరిగిన మొత్తం సంపద సృష్టిలో 73 శాతం సొమ్మంతా ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది. అదే సమయంలో దేశ జనాభాలో దాదాపు సగభాగమైన 67 కోట్ల మంది పైగా పేదల సంపద కేవలం ఒకే ఒక్క శాతం పెరిగింది. అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే తరుణంలో ఈ నివేదిక విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడంపై దృష్టి పెడుతున్న ప్రపంచ దేశాల నేతలు ఆక్స్‌ఫామ్ నివేదికపై కూలంకషంగా చర్చించనున్నారు. ఓవైపు తిండికి కూడా గతిలేక కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోతుంటే.. సంపన్నులు మరింత సంపద పోగు చేసుకునేలా ప్రపంచ ఎకానమీ తీరుతెన్నులు మారుతున్నాయని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో పేర్కొంది. కేంద్ర బడ్జెట్‌కి సమాన సంపద .. ఆక్స్‌ఫామ్ 2017కి సంబంధించి నిర్వహించిన సర్వేలో భారత్‌లో కుబేరుల సంపద రూ. 20.9 లక్షల కోట్లకు పైగా పెరిగినట్లు వెల్లడైంది. ఇది 2017–18 కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌కి దాదాపు సరిసమానం. ఆక్స్‌ఫామ్ గతేడాది నిర్వహించిన సర్వేలో 2016లో దేశీయంగా మొత్తం సంపదలో 58 శాతం వాటా ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉన్నట్లు వెల్లడైంది. అంతర్జాతీయంగా నమోదైన సగటు 50 శాతం కన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రభుత్వ విధానాలను బడా కంపెనీలు ప్రభావితం చేస్తుండటం, ఉద్యోగులు అణిచివేతకు గురవుతుండటం, వాటాదారులకు మరిన్ని లాభాలు పంచే యావతో.. కార్పొరేట్ కంపెనీలు వ్యయాలను భారీగా తగ్గించుకుంటూ ఉండటం తదితర అంశాలు.. కార్పొరేట్ బాసులు, వాటాదారుల లాభాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ సర్వేలో మొత్తం పది దేశాలకు చెందిన 70,000 మంది ప్రజలు పాల్గొన్నారు. 17 మంది కొత్త బిలియనీర్లు.. గతేడాది భారత్‌లో కొత్తగా 17 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. దీంతో వీరి సంఖ్య 101కి చేరింది. భారతీయ బిలియనీర్ల సంపద పరిమాణం గతేడాదితో పోలిస్తే రూ. 4.89 లక్షల కోట్లు పెరిగి రూ. 20.7 లక్షల కోట్లకు చేరింది. ఇది అన్ని రాష్ట్రాలు కలిపి.. విద్య, ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్లో దాదాపు 85 శాతానికి సమానం. 37 శాతం దేశీ బిలియనీర్లకు కుటుంబం నుంచి వారసత్వంగా సంపద వచ్చింది. దేశీయంగా మొత్తం బిలియనీర్ల సంపదలో వీరి సంపద వాటా 51 శాతం మేర ఉంది. బిలియనీర్ల సంఖ్య పెరగడమనేది ఎదుగుతున్న ఎకానమీకి సంకేతం కాదని, విఫలమవుతున్న ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో నిషా అగర్వాల్ వ్యాఖ్యానించారు. సంపన్నులు, పేద వర్గాల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుండటం మరింత అవినీతికి దారితీస్తుందని తెలిపారు. ‘2017లో బిలియనీర్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ప్రతి రెండు రోజులకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చారు. ఇక 2010 నుంచి బిలియనీర్ల సంపద సగటున ఏడాదికి 13 శాతం మేర పెరిగింది. ఇది సామాన్య ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల కన్నా ఆరు రెట్లు ఎక్కువ. సాధారణంగా వారి జీతభత్యాలు ఏడాదికి సగటున కేవలం 2% మాత్రమే పెరిగాయి‘ అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. దేశీయం గా గ్రామీణ ప్రాంతాల్లో కనీస వేతనం అందుకునే ఒక సామాన్యుడు.. ఒక దిగ్గజ దుస్తుల తయారీ సంస్థ సీఈవో వార్షిక వేతన స్థాయిని అందుకోవడానికి ఏకంగా 941 సంవత్సరాలు పడుతుందని అధ్యయనం అంచనా వేసింది. ఇక అమెరికాలోనైతే.. సీఈఓ సుమారు ఒక రోజులో ఆర్జించే వేతనం.. ఒక సామాన్య ఉద్యోగి ఏడాది సంపాదనకు సమానంగా ఉంటోంది. ఈ చర్యలు అవసరం.. కేవలం కొద్ది మంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరేలా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దేలా భారత ప్రభుత్వం దృష్టి సారించాలని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఉద్యోగావకాశాలు ఊతమిస్తూ కార్మిక శక్తి ప్రాధాన్యం ఎక్కువగా ఉండే రంగాలను ప్రోత్సహించడం, వ్యవసాయంలో పెట్టుబడులు పెంచడం, ప్రస్తుత సామాజిక సంక్షేమ పథకాలను మరింత సమర్ధంగా అమలు చేయడం వంటి చర్యలతో సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించింది. -
ఆక్స్‌ఫామ్ సంచలన రిపోర్టు: ప్రధానికి కీలక సూచనలు
దావోస్: ఆక్స్‌ఫామ్ ఇండియా సంచలన నివేదికను విడుదల చేసింది. దేశంలోని కోట్లామంది పేదరికంలోనే మగ్గుతుండగా సంపన్నుల సంపద మరింత పెరుగుతోందని తాజా రిపోర్టులో వెల్లడించింది. 2017లో భారత్‌లో లక్షాధికారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ అధ్యయనాన్ని విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌లో సంపద ఎక్కువ భాగం అత్యంత ధనవంతులైన కొద్ది మంది వద్దే కేంద్రీకృతమై ఉందని 'రివార్డ్ వర్క్, నాట్ వెల్త్' పేరుతో నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది. 2017 సంవత్సరంలో సంపద సృష్టిలో 73శాతం కేవలం ఒక్క శాతం మంది వద్దే ఉందని ఆక్స్‌ఫామ్ సర్వే తెలిపింది. సర్వే ప్రకారం.. భారత్‌లోని ఒక్క శాతం ధనికుల సంపద 2017లో రూ.20.9లక్షల కోట్లు పెరిగింది. ఇది దాదాపుగా ఓ ఏడాది కేంద్ర బడ్జెట్‌తో సమానం. మరోవైపు దాదాపు 67కోట్ల మంది భారతీయుల సంపద కేవలం ఒక్క శాతమే పెరిగిందని నివేదించింది. 2010 నుంచి భారత్‌లో బిలియనీర్ల సంపద ఏడాదికి సగటున 13శాతం పెరిగిందట. సాధారణ ఉద్యోగి సంపదతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. భారత్‌లో ఓ ప్రముఖ కంపెనీలో అధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్ ఏడాదిపాటు సంపాదించిన మొత్తం సొమ్మును.. గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం తీసుకునే ఓచిన్న ఉద్యోగి సంపాదించడానికి దాదాపు 941 ఏళ్లు పడుతుందనే షాకింగ్ అంశాన్ని కూడా ఈ సర్వే తెలిపింది. అంతేకాదు ఇదే అమెరికాలో అయితే ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ ఒక్క రోజు తీసుకునే వేతనాన్ని.. సాధారణ ఉద్యోగి సంపాదించడానికి ఏడాది పడుతుందట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం ధనివంతులైన కేవలం ఒక్క శాతం మంది వద్దకు చేరిందని సర్వే తెలిపింది. సుమారు 3.7బిలియన్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏమాత్రం వృద్ధి లేదని పేర్కొంది. కాగా ఈ సమావేశానికి భారత ప్రధానమంతి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. గత20 ఏళ్లలో తొలిసారిగా ఇండియా ప్రధాని ఈ సదస్సు హాజరవుతుండగా బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేవలం కొంతమంది అదృష్టవంతుల కోసమేకాకుండా ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలని భారత ప్రభుత్వాన్ని ఆక్స్‌ఫామ్ కోరింది. మరిన్ని ఉద్యోగాలు సృష్టించే కార్మికశక్తిని ప్రోత్సహించటం, వ్యవసాయంలో అధిక పెట్టుబడి పెట్టుబడులు, సామాజిక రక్షణ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ప్రోత్సాహకరమైన అభివృద్ధిని సాధించాలని సూచించింది. -
58% సంపద 1% సంపన్నుల వద్దే
-
58% సంపద 1% సంపన్నుల వద్దే
ప్రపంచ సగటు కంటే ఎక్కువ • దేశంలో పెరిగిపోతున్న అసమానత్వం • 70% మంది సంపదకు సమాన మొత్తం 57 మంది సొంతం • 84 మంది కుబేరుల సంపద 248 బిలియన్ డాలర్లు • తొలి మూడు స్థానాల్లో ముకేశ్ అంబానీ, దిలీప్ సంఘ్వి, ప్రేమ్‌జీ • ఆక్స్‌ఫామ్ నివేదికలో వెల్లడి దావోస్ (స్విట్జర్లాండ్): సంపద అసమానత్వం దేశంలో పెచ్చుమీరిపోతోంది. రోజులో రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంతో దేశంలో సుమారు 30 శాతం మంది ఒకవైపు అల్లాడుతుంటే... మరోవైపు దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే తిష్టవేసింది. ఈ అసమానత్వంలో ప్రపంచ సగటు రేటు 50 శాతాన్ని మన దేశం దాటేసింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా సంపన్నులు, ప్రముఖులు సమావేశం అవుతున్న తరుణంలో... ఈ వాస్తవాలను ఆక్స్‌ఫామ్ అనే హక్కుల గ్రూపు ‘యాన్ ఎకానమీ ఫర్ 99 పర్సెంట్’ పేరుతో సోమవారం విడుదల చేసింది. ఇక సమగ్రాభివృద్ధి సూచీలోనూ అభివృద్ధి చెందుతున్న 79 దేశాలను తీసుకుని చూస్తే వాటిలో భారత్‌ది 60వ స్థానం. అంటే కింది నుంచి 19 స్థానాలపైన. ఇందులో మరింత నివ్వెరపరిచే వాస్తవం ఏమిటంటే పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనాల కంటే కూడా మనం కింద ఉండడం. చివరికి ప్రతిభతో పోటీ పడే విషయంలోనూ మన దేశం మెరుగైన స్థానంలో లేదు. 3 స్థానాలు దిగజారి సూచీలో భారత్ 92వ స్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. సంపద అసమానత్వం ⇔ దేశంలో మొత్తం సంపద 3.1 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో కింది నుంచి 70 శాతం మంది జనాభా సంపద 216 బిలియన్ డాలర్లు. ఆశ్చర్యంగా దేశంలో 57 మంది బిలియనీర్ల సంపద కూడా ఇంచుమించుగా 216 బిలియన్ డాలర్లే. ⇔ దేశంలోని 84 మంది బిలియనీర్ల సమష్టి సంపద 248 బిలియన్ డాలర్లు. వీరిలో తొలి మూడు స్థానాల్లో ఉన్నవారు... 1.ముకేశ్ అంబానీ (19.3 బిలియన్ డాలర్లు) 2. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌సంఘ్వి (16.7బిలియన్ డాలర్లు) 3. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ (15 బిలియన్ డాలర్లు). ప్రపంచవ్యాప్తంగా... ⇔ ఈ ప్రపంచ పేదల్లో 50 శాతం మంది దగ్గరున్న సంపదకు సమాన స్థాయిలో 8 మంది బిలియనీర్లు కలిగి ఉన్నారు. ప్రపంచ మొత్తం సంపద 255.7 ట్రిలియన్ డాలర్లు. ఇందులో 6.5 ట్రిలియన్ డాలర్లు బిలియనీర్ల సంపదే. 1. బిల్‌గేట్స్ (75 బిలియన్ డాలర్లు) 2. అమన్సియో ఒర్టెగా (67 బిలియన్ డాలర్లు) 3. వారెన్ బఫెట్ (60.8 బిలియన్ డాలర్లు). ⇔ 2015 నుంచి సంపన్నులు ఒక్క శాతం మంది మిగతా ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉండడం జీర్ణించుకోలేని వాస్తవం. వచ్చే 20 ఏళ్లలో 500 మంది 2.1 ట్రిలియన్ డాలర్ల సంపదను తమ వారసులకు అప్పగించనున్నారని... ఇది 130 కోట్ల జనాభా కలిగిన భారత జీడీపీ కంటే పెద్ద మొత్తం అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ దృష్ట్యా వారసత్వ పన్నును విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ⇔ ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం కలిగించే మానవత్వంతో కూడిన ఆర్థిక రంగాన్ని నిర్మించాల్సిన సమయమిదే. అంతేకానీ ఏ కొద్ది మంది కోసమో కాదు అని నివేదికలో ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ⇔ భారత్, చైనా, ఇండోనేషియా, లావోస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ధనికులైన 10 శాతం మంది ప్రజలు తమ ఆదాయ వాటాను గత రెండు దశాబ్దాల్లో 15 శాతం పెంచుకున్నారు. అదే సమయంలో అత్యంత పేదలైన 10 శాతం మంది ప్రజలు 15 శాతం సంపదను కోల్పోయారు. వెట్టి చాకిరీ.. కార్పొరేట్ల లాభార్జన దేశంలో బాలకార్మికులు, బలవంతపు వెట్టిచాకిరీ జరుగుతున్న తీరునూ ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రస్తావించింది. ప్రపంచంలో పెద్దవైన వస్త్ర కంపెనీలకు భారత్‌లోని కాటన్ స్పిన్నింగ్ మిల్లులు సరుకులను అందిస్తున్నాయి. ఇవి బాలికలతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ గణాంకాల ప్రకారం దేశంలో 58 లోల మంది బాలకార్మికులు ఉన్నారని నివేదిక పేర్కొంది. సమగ్రాభివృద్ధిలో మన నంబర్ 60 పొరుగు దేశాల కంటే వెనుకంజ సమగ్రాభివృద్ధి సూచీలో మన దేశం చెప్పుకోతగ్గ స్థితిలో లేదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 79 ఆర్థిక వ్యవస్థల్లో... పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ల కంటే దిగువన 60వ స్థానంలో భారత్ ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ‘సమగ్ర వృద్ధి, అభివృద్ధి నివేదిక – 2017’ను విడుదల చేసింది. చాలా దేశాలు అసమానత్వాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆర్థిక వృద్ధికి వచ్చిన అవకాశాలను జార విడుచుకుంటున్నాయని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. దశాబ్దాలుగా విధాన కర్తలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా, ప్రమాణాలను తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉందని సూచించింది. సమగ్రాభివృద్ధి సూచీలో లిత్వేనియా ప్రథమ స్థానంలో ఉంది. అజర్బైజాన్, హంగరీ, పోలండ్, రొమేనియా, ఉరుగ్వే, లాత్వియా, పనామా, కోస్టారికా, చిలే వరుసగా పది స్థానాలను ఆక్రమించాయి. చైనా (15), నేపాల్ (27), బంగ్లాదేశ్ (36), పాకిస్తాన్ (52) మనకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. భారత్‌లో పురుషులకే వేతనాలు ఎక్కువ.. భారత్‌లో మాత్రం వేతనాల విషయంలో లింగ వివక్ష ఎక్కువే ఉందని ఆక్స్‌ఫామ్ అధ్యయనం పేర్కొంది. ఒకేరకమైన ఉద్యోగాల్లో పురుషులు మహిళల కంటే 30% కంటే అదనంగా వేతనాలు అందుకుంటున్నారని తెలిపింది. 60% మంది మహిళలు తక్కువ వేతనాలు అందుకుంటున్నవారే. కేవలం 15% మంది మహిళలు మాత్రం అధిక వేతనాలు తీసుకోగలుగుతున్నారు. అధిక వేతనాల స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం అంతగా లేకపోవడమే కాకుండా అనుభవానికి తగ్గట్టు వేతనాలు ఇచ్చే విషయాల్లో లింగ తారతమ్యత ఉన్నట్టు ఈ వాస్తవాలు తెలియజేస్తున్నాయని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. దేశంలో అత్యున్నత సమాచార కంపెనీ సీఈవో అందుకుంటున్న వేతనం అదే కంపెనీలో సాధారణ ఉద్యోగి వేతనం కంటే 416 రెట్లు ఎక్కువ. సర్కారు ఇవి చేస్తే పేదరికం ఉండదు.. పేదరికానికి చరమగీతం పలకడానికి ఆక్స్‌ఫామ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ‘‘సంపదపై ఎక్కువగా దృష్టి పెట్టడం ఆపాలి. వారసత్వ పన్నుతోపాటు, మొత్తం పన్ను వసూళ్లలో తక్కువ వాటా ఉన్న సంపద పన్నును సైతం పెంచాలి. పన్ను మినహాయింపులను ఎత్తివేయాలి. కార్పొరేట్ పన్నును తగ్గించడాన్ని మానుకోవాలి. షేర్ హోల్డర్ల ప్రయోజనాల కోసం పనిచేసేవి కాకుండా తమ ఉద్యోగులు, సమాజ హితం కోసం పనిచేసే కంపెనీలను ప్రోత్సహించాలి. కార్పొరేట్లు, సంపన్నులైన వ్యక్తులు పన్ను ఎగవేతలను అరికట్టాలి. ఆరోగ్యం, విద్యపై పెట్టుబడుల కోసం తగిన నిధులు రాబట్టుకోవాలి. ఆరోగ్యంపై జీడీపీలో కేటాయింపులను 1% నుంచి 3%కి పెంచాలి. విద్యపై కేటాయింపులను 3 నుంచి 6% చేయాలి’’ అని సూచించింది. ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు.. దేశంలో ఆటోమేషన్ కారణంగా పావుశాతం కంటే ఎక్కువ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నాయని... ప్రపంచ వ్యాప్తంగానూ ఆటోమేషన్ చాలా కంపెనీలను ప్రభావితం చేస్తుందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ మ్యాన్‌పవర్‌గ్రూపు దావోస్‌లో విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. కొత్త టెక్నాలజీల వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ప్రత్యేక నైపుణ్యాల అవసరం ఏర్పడిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో 18వేల కంపెనీలపై సర్వే చేయగా... 90% కంటే ఎక్కువే డిజిటైజేషన్‌వల్ల వచ్చే రెండేళ్లలో తమ కంపెనీలపై ప్రభావం పడతాయని తెలిపాయి.