లైంగిక వేధింపులపై నిరసనగా ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం.. పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న కొందరు వ్యక్తుల నిజ రూపాలు బట్టబయలు చేసింది. వినోదం, మీడియా రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ‘మీ టూ’ ఉద్యమం కారణంగా తెరపైకి వచ్చాయి. అయితే, పలు ఇతర రంగాల్లోని మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు బట్టబయలయ్యే స్థాయికి ఈ ఉద్యమం చేరుకోలేదు. అసంఘటిత రంగంలోని శ్రామిక మహిళలు భరిస్తున్న వేధింపుల వేదన వారి పెదవి దాటడం లేదు.
పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం గురించి గానీ, మీటూ ఉద్యమం గురించి గానీ తెలియని లక్షలాది మంది మహిళలు మనదేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇళ్ళల్లో పనిచేసే మహిళలపై జరుగుతున్న లైంగిక హింస తీవ్రత పూర్తి స్థాయిలో బయటకు తెలియడం లేదు. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో కొన్ని సర్వేలు జరిగాయి. గ్రామాలను వీడి పట్టణాలకు వలస వచ్చిన లక్షలాది మందిలో అత్యధికులు ఇళ్లల్లో పనివారుగా చేరుతారు. వారిలో మహిళలే ఎక్కువ. ఆ మహిళలపై జరిగే లైంగిక హింసకు అంతే లేని పరిస్థితి ఉంది.
తామున్న దుర్భర ఆర్థిక పరిస్థితుల కారణంగా తమపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వారు బయటకు చెప్పుకోలేరు. కుటుంబం నుంచి లభించే సహానుభూతి తక్కువే. ఇంటిపని చేసే స్త్రీల సమస్యలపై పనిచేసే హరియాణాలోని గురుగావ్‌లో ఉన్న ‘మహిళా కామ్‌గార్ సంఘటన్’ ఇటీవలే అసంఘటిత రంగ శ్రామిక మహిళల్లో మీటూ ఉద్యమ చైతన్యాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. తమపై జరిగే లైంగిక వేధింపులు, హింస పట్ల నిశ్శబ్దాన్ని వీడాలని ప్రచారం చేస్తోంది. ఈ సంస్థలో దాదాపు 7000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇళ్ళల్లో పనిచేసుకునే మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పెద్దగా బయటకు రావని, రేప్ జరిగినప్పుడే ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అనితాయాదవ్ చెప్పారు.
వేధింపులపై సర్వే
దేశంలో మొత్తం 42 లక్షల మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో 29 లక్షల మంది మహిళలు, 13 లక్షల మంది పురుషులు ఉన్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల్లో ఇళ్లల్లో పనిచేసుకునే పార్ట్‌టైం శ్రామిక మహిళలపై మార్తా ఫారెల్ ఫౌండేషన్ ఇటీవల జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. ఆ వివరాలు..
► పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వారు 29% కాగా, వారిలో 19% ఆ వేధింపులను మౌనంగా భరించారు. వారిలో 10% కుటుంబ సభ్యులకు, తోటి పనివారికి చెప్పారు.
► వేధింపులు తాళలేక పని వదిలేసి వెళ్ళిన వారు 2.3%
► యజమానుల చేతిలో అవమానాలకు గురైన వారు 61.8%.
2012లొ ఆక్స్‌ఫామ్ ఇండియా అధ్యయనంలో కూడా శ్రామిక మహిళల్లో 29 శాతం మంది పని ప్రదేశాల్లో తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నట్టు వెల్లడైంది. ఇళ్ళల్లో పనిచేసుకుని బతికే స్త్రీల్లో 23 శాతం మంది, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసే మహిళల్లో 16 శాతం మంది నిత్యం లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. డొమెస్టిక్ వర్కర్స్ రక్షణ కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని జిల్లాలోని లోకల్ కంప్లెయింట్స్ కమిటీలకు అనుసంధానం చేయాలని హార్వర్డ్ మిట్టల్ ఇనిస్టిట్యూట్ ఇండియా డైరెక్టర్ సంజయ్‌కుమార్ సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment