ఏడాది కాలంలో 10 శాతం పెరుగుదల
7.34 కోట్లకు చేరిన సంస్థలు
26 శాతం మహిళలు నిర్వహిస్తున్నవే
కేంద్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలోని సంస్థల్లో (అన్‌ఇన్‌కార్పొరేటెడ్/వ్యక్తుల ఆధ్వర్యంలోని) ఉపాధి అవకాశాల పరంగా మెరుగైన పరిస్థితులున్నట్టు ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 2024 సెప్టెంబర్తో ముగిసిన ఏడాది కాలంలో 10 శాతం మేర ఉద్యోగాలు పెరగ్గా, సంస్థల సంఖ్య 12 శాతం వృద్ధితో 7.34 కోట్లకు చేరినట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు విభాగం (ఎంవోఎస్‌పీఐ) ప్రకటించింది. వ్యవసాయేతర అసంఘటిత రంగ సంస్థలపై ఈ సర్వే (ఏఎస్‌యూఎస్‌ఈ) జరిగింది.
2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ కాలంలో ఈ సంస్థలకు సంబంధించి జోడించిన స్థూల అదనపు విలువ (జీవీఏ) 16.52 శాతంగా ఉన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. 2024 సెప్టెంబర్ నాటికి అసంఘటిత రంగంలో ఉద్యోగాల సంఖ్య 12.05 కోట్లకు చేరగా, 2023 సెప్టెంబర్ నాటికి 10.96 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఏడాది కాలంలో కోటికి పైగా ఉపాధి అవకాశాలు సమకూరినట్టు వెల్లడించింది.
ఇతర సేవల విభాగంలో అత్యధికంగా 18 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా.. ఆ తర్వాత తయారీ విభాగంలో 10 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగింది. మహిళల ఆధ్వర్యంలోని సంస్థల సంఖ్య 22.9 శాతం నుంచి 26.2 శాతానికి పెరిగింది. వ్యాపార నిర్వహణలో మహిళల పాత్ర పెరగడాన్ని ఇది సూచిస్తోంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 4,98,024 సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
వేతనాల్లోనూ వృద్ధి..
ఇంటర్నెట్ వినియోగిస్తున్న సంస్థలు 21.1 శాతం నుంచి 26.7 శాతానికి పెరిగాయి. డిజిటల్ టెక్నాలజీలవైపు సంస్థలు మళ్లుతుండడం దీని వెనుక నేపథ్యంగా ఉంది. 2023–24లో అసంఘటిత రంగంలో నియమితులైన ఉద్యోగికి వేతన చెల్లింపులు సగటున 13 శాతం పెరిగాయి. అత్యధికంగా తయారీ రంగంలో కార్మికుల వేతనాల్లో 16 శాతం వృద్ధి కనిపించింది. సగటు కార్మికుడి నుంచి జీవీఏ రూ.1,41,769 నుంచి రూ.1,49,742కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment