Unorganized workers
-
అసంఘటిత రంగంలో ఉపాధి వెల్లువ
న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలోని సంస్థల్లో (అన్ఇన్కార్పొరేటెడ్/వ్యక్తుల ఆధ్వర్యంలోని) ఉపాధి అవకాశాల పరంగా మెరుగైన పరిస్థితులున్నట్టు ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో 10 శాతం మేర ఉద్యోగాలు పెరగ్గా, సంస్థల సంఖ్య 12 శాతం వృద్ధితో 7.34 కోట్లకు చేరినట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు విభాగం (ఎంవోఎస్పీఐ) ప్రకటించింది. వ్యవసాయేతర అసంఘటిత రంగ సంస్థలపై ఈ సర్వే (ఏఎస్యూఎస్ఈ) జరిగింది.2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ కాలంలో ఈ సంస్థలకు సంబంధించి జోడించిన స్థూల అదనపు విలువ (జీవీఏ) 16.52 శాతంగా ఉన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. 2024 సెప్టెంబర్ నాటికి అసంఘటిత రంగంలో ఉద్యోగాల సంఖ్య 12.05 కోట్లకు చేరగా, 2023 సెప్టెంబర్ నాటికి 10.96 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఏడాది కాలంలో కోటికి పైగా ఉపాధి అవకాశాలు సమకూరినట్టు వెల్లడించింది.ఇతర సేవల విభాగంలో అత్యధికంగా 18 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా.. ఆ తర్వాత తయారీ విభాగంలో 10 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగింది. మహిళల ఆధ్వర్యంలోని సంస్థల సంఖ్య 22.9 శాతం నుంచి 26.2 శాతానికి పెరిగింది. వ్యాపార నిర్వహణలో మహిళల పాత్ర పెరగడాన్ని ఇది సూచిస్తోంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 4,98,024 సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వేతనాల్లోనూ వృద్ధి.. ఇంటర్నెట్ వినియోగిస్తున్న సంస్థలు 21.1 శాతం నుంచి 26.7 శాతానికి పెరిగాయి. డిజిటల్ టెక్నాలజీలవైపు సంస్థలు మళ్లుతుండడం దీని వెనుక నేపథ్యంగా ఉంది. 2023–24లో అసంఘటిత రంగంలో నియమితులైన ఉద్యోగికి వేతన చెల్లింపులు సగటున 13 శాతం పెరిగాయి. అత్యధికంగా తయారీ రంగంలో కార్మికుల వేతనాల్లో 16 శాతం వృద్ధి కనిపించింది. సగటు కార్మికుడి నుంచి జీవీఏ రూ.1,41,769 నుంచి రూ.1,49,742కు పెరిగింది. -
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్‌కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్‌ల గురించి తెలుసుకుని పార్ట్‌టైమ్‌గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్‌ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్‌పై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్‌కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
PMSYM: నెలకు రూ.3 వేల పెన్షన్, దరఖాస్తు చేసుకోవడం ఎలా?
సాక్షి, ముంబై: దేశంలోని అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ యోజన నెలవారీ పెన్షన్ అందించనుంది. వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు ఈ పథకం కింద నెలకు రూ.3,000 పెన్షన్ ఈ పథకం అందిస్తుంది. ముఖ్యంగా రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం ఉన్న టైలర్లు, చెప్పులు కుట్టేవాళ్లు, రిక్షా పుల్లర్లు , ఇంటి కార్మికులు వంటి అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల దాకా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. అర్హతలు ♦ దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి ♦ తప్పనిసరిగా ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. ♦ అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు EPFO, NPS, NSIC సబ్స్క్రైబర్లు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. పీఎం శ్రమ యోగి మన్ధన్ యోజన వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి మంధన్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి కార్మికుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ వస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు, నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉన్నవారు ఈ పథకాని అర్హులు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంత పెట్టుబడి పెట్టాలి? కార్మికుల సహకారం ఆధారంగా ఈ పెన్షన్ లభిస్తుంది. ఇందుకు కోసం ప్రతి నెలా రూ.55 నుండి రూ. 200 వరకు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. ఒక వేళ పింఛనుదారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ సందర్భంలో ప్రతి పెన్షనర్ సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ పొందుతారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మన్ధన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫాం నింపిన తరువాత రిజిస్టర్డ్‌మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపీని ఎంటర్ చేస్తే చాలు. ఇక ఆఫ్‌లైన్ ద్వారా అయితే కామన్ సర్వీస్ సెంటర్లో వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు. Get yourself registered on PMSYM by following these steps.@mygovindia @DGLabourWelfare #pmsym #registration #onlineregistration pic.twitter.com/P23XngQwOw — Ministry of Labour (@LabourMinistry) February 7, 2023 -
‘ఈ–శ్రమ’లో 78.47 లక్షల మంది
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొలిసారిగా అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ–శ్రమ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిద్వారా వారికి సామాజిక భద్రత పథకాలను వర్తింప చేయడంతో పాటు ప్రమాద బీమాను అమలు చేయనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల డేటాను ఈ–శ్రమ పోర్టల్ ద్వారా సేకరించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 28.48 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఈ–శ్రమ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా కూడా కార్మికులు వివరాలను నమోదు చేసుకోవచ్చు. సచివాలయాల ద్వారా నమోదు అసంఘటిత రంగ కార్మికులను ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా నిర్మాణ కార్మికులు, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులతో పాటు వ్యవసాయ, వలస కూలీల వివరాలను ఈ–శ్రమ పోర్టల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,47,859 మంది ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు అయ్యారు. అత్యధికంగా వ్యవసాయ రంగంలో 53,38,805 మంది, నిర్మాణ రంగంలో 5,66,680 మంది కార్మికులు నమోదు అయ్యారు. వీరిలో మహిళా కార్మికులే అధికం. 55.83 శాతం మహిళా కార్మికులు, 44.16 శాతం పురుష కార్మికులు నమోదయ్యారు. ఈ–శ్రమ పోర్టల్‌లో వివరాల నమోదు పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150.93 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 7.16 లక్షల మంది, అత్యల్పంగా ఎన్టీఆర్ జిల్లాలో 20,893 మంది కార్మికులు ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదయ్యారు. వివరాల నమోదు అనంతరం అసంఘటిత కార్మికులకు ఈ–శ్రమ కార్డు జారీ చేస్తారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు బీమా కింద అందజేస్తారు. ప్రమాదంలో పూర్తి వైకల్యం బారినపడితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తారు. దీంతో పాటు వివిధ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను వర్తింప చేస్తారు. ఆయా రంగాల్లో కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. -
ఈ–శ్రమ్ పోర్టల్‌లోకి 4 కోట్ల అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ: ప్రారంభించిన రెండు నెలల్లోపే 4 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల పేర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఆదివారం తెలిపింది. నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. చాలా రంగాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో అత్యధిక భాగం నిర్మాణ, వ్యవసాయ రంగాలకు చెందిన వారేనని పేర్కొంది. ఈ పోర్టల్ ఆధారంగానే అసంఘటిత రంగ కారి్మకులకు అన్ని రకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది. మొత్తం 4.09 కోట్ల అసంఘటిత రంగ కారి్మకుల్లో 50.02% మంది లబి్ధదారులు మహిళలు కాగా 49.98% మంది పురుషులని వివరించింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని కూడా తెలిపింది. నమోదైన వారిలో ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపింది. నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్ మొబైల్ అప్లికేషన్‌ను గానీ వెబ్‌సైట్‌ను గాని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంకా, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు), రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాలకు వెళ్లాలని వివరించింది. నమోదైన వారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే డిజిటల్ ఈ–శ్రమ్ కార్డు అందజేస్తారనీ, వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ–శ్రమ్ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవికలత్వం ప్రాపించినా రూ.2 లక్షల పరిహారం అందుతుందనీ, పాక్షిక అంగ వైకల్యమైతే రూ.1 లక్ష సాయం అందుతుందని తెలిపింది. -
చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి
‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్ మహదేవన్ ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది. ‘చెరకు కట్ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్ మహదేవన్. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి. బీడ్‌లో బతుకుపోరు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను. దారుణమైన దోపిడి చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు. నెలసరి తప్పించుకోవడానికి జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్స్టాండింగ్ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమా కథలో... ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది. – సాక్షి ఫ్యామిలీ -
మోదీ సర్కార్ మెగా సర్వే
దేశ వాస్తవిక ఆర్థిక సమర్థతపై మదింపు వేసేందుకు కేంద్రం తొలిసారిగా భారీ సర్వే నిర్వహించనుంది. ఈ ఆర్థిక సర్వేలో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు సహా అసంఘటిత రంగ కార్మికుల్ని జోడించనుంది. వివిధ అధ్యయనాలు పరిగణనలోకి తీసుకోని ఉద్యోగాలను ఇందులో కలపనుంది. భారీ ఎత్తున ప్రామాణిక ఆర్థిక సర్వే జరపడం వల్ల వ్యవస్థ పరిణామాలను మెరుగ్గా సమీక్షించేందుకు, వివిధ కార్యక్రమాలు, పథకాలు, విధాన సంబంధిత ప్రణాళికలపై సరైన అంచనా వేసే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మాసాంతంలో ఆరంభం పాతిక కోట్లకు పైగా కుటుంబాలు, ఏడు కోట్ల వ్యాపార సంస్థలు ఈ సర్వే పరిధిలోకి రాగలవని అంచనా వేస్తున్నారు. జూన్ మాసాంతానికి ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చునని, ఆరు మాసాల్లో సర్వే నివేదికలు అందవచ్చునని భావిస్తున్నారు. ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందంటూ ప్రతిపక్షం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంలో పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులను స్వయం ఉపాధి పొందుతున్న ఉద్యోగులుగా పేర్కొంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేక పార్టీలు ఎద్దేవా చేశాయి. 2018–19 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోవడం, గత 17 త్రైమాసికాలతో పోల్చుకుంటే అత్యంత కనిష్టానికి చేరుకోవడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన సర్కారు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను, ఉపాధిని పెంచేందుకు బుధవారం ప్రధాని మోదీ రెండు కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
పీఎం చేతులమీదుగా పెన్షన్ స్కీం పత్రం అందజేత
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన ఎర్ర హరినాథ్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్–యోగి మందాన్ పెన్షన్ స్కీమ్ పత్రాన్ని అందుకున్నారు. ఈ పథకాన్ని అహ్మదాబాద్‌లో ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రధాన మంత్రి చేతులమీదుగా సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రాన్ని స్వీకరించాలని రెండు రోజుల క్రితం పీఎం కార్యాలయం నుంచి హరినాథ్‌కు సమచారం అందింది. ఈ సందర్భంగా మంగళవారం హరినాథ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పెన్షన్ పత్రాన్ని అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పారు. తాను ఎప్పుడూ మోదీని నేరుగా చూస్తానని అనుకోలేదన్నారు. సంఘ సేవకుడైన హరినాథ్ ఎంతోమంది కార్మికులకు పెన్షన్‌తో పాటు కార్మిక సభ్యత్వాలను అందజేశారు. -
కార్మికులకు వరం ‘మాన్‌ధన్’
సాక్షి, మరికల్: ‘ఎవరో వస్తారు.. ఏమో సాయం చేస్తారని.. ఎదురుచూసి మోసపోకు మిత్రమా..’ అని మోసపోకముందే ప్రధానమంత్రి అసంఘటిత కార్మికులకు చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘శ్రమ యోగి మాన్‌ధన్ పథకంలో చేరి పింఛన్ అవకాశం దక్కించుకొండి..’ అని ప్రచారం సాగిస్తున్నారు. అసంఘటిత కార్మికులకు ఈ పథకం ఓ వరంలా ఉపయోగపడుతుంది. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారందరూ పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరాలని ఆహ్వానిస్తుంది. జీవితాంతం పింఛన్.. ఉద్యోగుల మాదిరి అసంఘిటిత రంగాల్లోని కార్మికులు నెలనెలా పింఛన్‌ను పొందనున్నారు. రెక్కాడితే డొక్కాడని కార్మికులు వయసుమీపడితే నిశ్చితంగా శేషజీవితం గడపనున్నారు. ఆరుపదుల వయస్సులో ఆర్థిక ఇబ్బందులను అదిగమించనున్నారు. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం ద్వారా వేలాది మంది కార్మికులు కల సాకారం కొబోతుంది. 18 నుంచి 40 ఏళ్లు ఉన్నవారు అర్హులు.. ఈ పథకంలో చేరే వారు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండాలి. వయస్సును బట్టి నెల, నెలకు తమపేర్ల మీద డబ్బులు కడితే అంతే మొత్తం కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాల వయస్సు రాగానే నెలకు రూ.3వేల చొప్పున పింఛన్ సౌకర్యం కల్పిస్తుంది. మిగితా అన్ని పింఛన్ పథకలతో పాటు అదనంగా పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పింఛన్ వస్తుంది. ఒక వేళ లబ్ధిదారుడు మృతి చెందితే నామినీకి పింఛన్ వర్తిస్తుంది. అసంఘిటిత కార్మికులకు వరం దేశ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం ఆ సంఘటిత కార్మికులకు వరం లాంటింది. ఇందులో భవన నిర్మాణ, హమాలీ, రిక్షా, వ్యవసాయ కూలీలు, ఇళ్లలో పనిచేసే వారు, టీస్టాల్, తదితర చిన్న, చిన్న వ్యాపారులు సైతం ఈ పథకంలో చేరాడానికి అర్హులు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వారందరూ ఈ పథకంలో చేరి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కిస్తులు కడితే 60వ ఏట నుంచి ప్రతి నెలకు రూ.3వేలు పింఛన్ సౌకర్యం ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేపసుకోవాలి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరే లబ్ధిదారుల దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామంలో ఓ కమన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 18నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారందరూ తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్‌ను జతపర్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ వయస్సు వారికి ఎంత ప్రీమియం వయస్సు లబ్ధిదారుడి వాటా కేంద్రం వాటా రూ.నెలకు మొత్తం రూ.లో రూ.నెలకు 18 55 55 110 19 58 58 116 20 61 61 122 21 64 64 128 22 68 68 136 23 72 72 144 24 76 76 152 25 80 80 160 26 85 85 170 27 90 90 180 28 95 95 190 29 100 100 200 30 105 105 210 31 110 110 220 32 120 120 240 33 130 130 260 34 140 140 280 35 150 150 300 36 160 160 320 37 170 170 340 38 180 180 360 39 190 190 380 40 200 200 400 అవగాహన కల్పించాలి అసంఘటిత కార్మికుల కోసం పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకంపై అధికారులు పూర్తి స్థాయిలో కార్మికులకు అవగాహన కల్పించి ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులను చేర్పించాలి. అన్ని రంగాల్లో పని చేసే కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలకు ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వనుంది. అధిక శాతం కార్మికులను చేర్పించేందుకు కృషి చేస్తాం. – రమేష్, భవన నిర్మాణ కార్మికుడు, మరికల్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోండి అసంఘటిత కార్మికులకు వృద్ధ్యాప్యంలో ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పథకం అమలు చేసింది. ఇందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు, వ్యవసాయ కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కమన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకుంటే 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు నెలకు ఎంతో డబ్బులు కడితే అంతే మొత్తం కేంద్రం ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. 60 ఏళ్ల అనంతరం నెలకు రూ.3వేల పింఛన్ వరిస్తుంది. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలి. – రాజ్‌కుమార్, జిల్లా లెబర్ ఆఫీసర్, నారాయణపేట -
వీరిని ‘మీ టూ’ చేరేదెలా?
లైంగిక వేధింపులపై నిరసనగా ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం.. పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న కొందరు వ్యక్తుల నిజ రూపాలు బట్టబయలు చేసింది. వినోదం, మీడియా రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ‘మీ టూ’ ఉద్యమం కారణంగా తెరపైకి వచ్చాయి. అయితే, పలు ఇతర రంగాల్లోని మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు బట్టబయలయ్యే స్థాయికి ఈ ఉద్యమం చేరుకోలేదు. అసంఘటిత రంగంలోని శ్రామిక మహిళలు భరిస్తున్న వేధింపుల వేదన వారి పెదవి దాటడం లేదు. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం గురించి గానీ, మీటూ ఉద్యమం గురించి గానీ తెలియని లక్షలాది మంది మహిళలు మనదేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇళ్ళల్లో పనిచేసే మహిళలపై జరుగుతున్న లైంగిక హింస తీవ్రత పూర్తి స్థాయిలో బయటకు తెలియడం లేదు. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో కొన్ని సర్వేలు జరిగాయి. గ్రామాలను వీడి పట్టణాలకు వలస వచ్చిన లక్షలాది మందిలో అత్యధికులు ఇళ్లల్లో పనివారుగా చేరుతారు. వారిలో మహిళలే ఎక్కువ. ఆ మహిళలపై జరిగే లైంగిక హింసకు అంతే లేని పరిస్థితి ఉంది. తామున్న దుర్భర ఆర్థిక పరిస్థితుల కారణంగా తమపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వారు బయటకు చెప్పుకోలేరు. కుటుంబం నుంచి లభించే సహానుభూతి తక్కువే. ఇంటిపని చేసే స్త్రీల సమస్యలపై పనిచేసే హరియాణాలోని గురుగావ్‌లో ఉన్న ‘మహిళా కామ్‌గార్ సంఘటన్’ ఇటీవలే అసంఘటిత రంగ శ్రామిక మహిళల్లో మీటూ ఉద్యమ చైతన్యాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. తమపై జరిగే లైంగిక వేధింపులు, హింస పట్ల నిశ్శబ్దాన్ని వీడాలని ప్రచారం చేస్తోంది. ఈ సంస్థలో దాదాపు 7000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇళ్ళల్లో పనిచేసుకునే మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పెద్దగా బయటకు రావని, రేప్ జరిగినప్పుడే ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అనితాయాదవ్ చెప్పారు. వేధింపులపై సర్వే దేశంలో మొత్తం 42 లక్షల మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో 29 లక్షల మంది మహిళలు, 13 లక్షల మంది పురుషులు ఉన్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల్లో ఇళ్లల్లో పనిచేసుకునే పార్ట్‌టైం శ్రామిక మహిళలపై మార్తా ఫారెల్ ఫౌండేషన్ ఇటీవల జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. ఆ వివరాలు.. ► పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వారు 29% కాగా, వారిలో 19% ఆ వేధింపులను మౌనంగా భరించారు. వారిలో 10% కుటుంబ సభ్యులకు, తోటి పనివారికి చెప్పారు. ► వేధింపులు తాళలేక పని వదిలేసి వెళ్ళిన వారు 2.3% ► యజమానుల చేతిలో అవమానాలకు గురైన వారు 61.8%. 2012లొ ఆక్స్‌ఫామ్ ఇండియా అధ్యయనంలో కూడా శ్రామిక మహిళల్లో 29 శాతం మంది పని ప్రదేశాల్లో తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నట్టు వెల్లడైంది. ఇళ్ళల్లో పనిచేసుకుని బతికే స్త్రీల్లో 23 శాతం మంది, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసే మహిళల్లో 16 శాతం మంది నిత్యం లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. డొమెస్టిక్ వర్కర్స్ రక్షణ కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని జిల్లాలోని లోకల్ కంప్లెయింట్స్ కమిటీలకు అనుసంధానం చేయాలని హార్వర్డ్ మిట్టల్ ఇనిస్టిట్యూట్ ఇండియా డైరెక్టర్ సంజయ్‌కుమార్ సూచిస్తున్నారు. -
వేధింపులు ఉండవు: దత్తాత్రేయ
హైదరాబాద్: అంసఘటిత కార్మికుల కోసం పారదర్శకమైన విధానాలు తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అయితే యాజమాన్యాలపై వేధింపులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. కార్మికుల శ్రేయస్సు కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కార్మికులకు నాణ్యమైన సేవలు అందించడం కోసం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐపీలను ఆధునీకరిస్తామని దత్తాత్రేయ చెప్పారు.