చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి | Bittersweet has been selected for the Kolkata International Film festival | Sakshi
Sakshi News home page

చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి

Published Fri, Jan 22 2021 12:16 AM | Last Updated on Fri, Jan 22 2021 8:27 AM

Bittersweet has been selected for the Kolkata International Film festival - Sakshi

‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్‌ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్‌ మహదేవన్‌ ‘కడ్వా గూడ్‌’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్‌) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది.

‘చెరకు కట్‌ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్‌ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్‌ మహదేవన్‌. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్‌’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి.

బీడ్‌లో బతుకుపోరు

మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్‌ ఫ్యాక్టరీలకు  ప్రతి సంవత్సరం అక్టోబర్‌ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్‌ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్‌ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్‌’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను.

దారుణమైన దోపిడి
చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్‌’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్‌ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే  80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు.

నెలసరి తప్పించుకోవడానికి
జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్‌ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్‌స్టాండింగ్‌ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్‌ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్‌ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్‌ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్‌ మహదేవన్‌.

ఈ సినిమా కథలో...
ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్‌ మహదేవన్‌. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement