Bittersweet
-
చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి
‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్ మహదేవన్ ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది. ‘చెరకు కట్ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్ మహదేవన్. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి. బీడ్‌లో బతుకుపోరు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను. దారుణమైన దోపిడి చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు. నెలసరి తప్పించుకోవడానికి జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్స్టాండింగ్ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమా కథలో... ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది. – సాక్షి ఫ్యామిలీ -
తెలివైన వారు ఎవరంటే..?
జీవన వికాసం శ్రీశ్రీ రవిశంకర్ వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్ర: సమాజంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి. వీటిని నివారించలేమా? శ్రీశ్రీ రవిశంకర్: సమాజంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు ఉన్నాయి? ఆనందంగా లేకపోవటం వలన. ఆనందంగా ఉన్న మనిషి పనిగట్టుకుని ఎవరినీ కదిలించటం, గొడవలు పెట్టుకోవటం చేయడు. ఆనందంగా ఉన్న వ్యక్తి కేవలం ఆనందాన్నే పంచుతాడు. ఆనందంగా లేనివారే ఈ సమాజంలో మరింత దుఃఖాన్ని సృష్టిస్తున్నారు. మనం సమాజానికి ఆనందాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా ఆనందం ఉండలేదు. అయితే మన ఆలోచనా విధానంలో, మన దృక్పథంలో, మన సమాజంలో మార్పు తేవటం అవసరం. ఆధ్యాత్మికత ఆ మార్పుకు ఆధారం కాగలదు. నేరస్తుల దృక్పథం సైతం మార్చబడుతుంది. ఎందుకంటే ప్రతీ మనిషి అంతరంగంలోనూ సౌందర్యం, ఆనందం ఉంటుంది. మనం దానిని తట్టిలేపితే చాలు, వారిలోపల ఉన్న శక్తిసంపద పైకి ఉబికివస్తుంది. అప్పుడిక అన్ని చెడ్డ భావనలను వారు మరచిపోతారు. వాటిని వదిలేస్తారు అంతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, అపి చేత్సుదురాచారో భజతే మాం అనన్యభాక్. సాధరేవ స మన్తవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. ఎంతటి దురాచారాలకు లోబడినవారైనా సరే జ్ఞానంలోకి వచ్చినపుడు, ధ్యానం చేయటానికి సంకల్పించినపుడు, ఆధ్యాత్మికపథంలోకి అడుగిడినపుడు వారిని మనం క్షమించాలి, వారి తప్పులను క్షమించాలి. ఎందుకంటే వారు సరియైన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. సంస్కృతంలో ఒక సూక్తి ఉన్నది, కావ్య శాస్త్ర విచారేషు కాలో గచ్ఛతి ధీమతః తెలివైనవారు వారి సమయాన్ని జ్ఞానచర్చలలో, సంగీతం, సాహిత్యం, విజ్ఞానం తెలుసుకోవటంలో, ప్రజలను సమైక్యపరచటంలో గడుపుతారని అర్థం. మూర్ఖులు దీనికి విరుద్ధంగా తమ సమయాన్ని ఎల్లప్పుడూ వ్యసనాలలో, తగాదాలలో, కొట్లాటలలో గడుపుతారు. ఇక్కడ మనలో అనేకమంది తెలివైనవారు ఉన్నారు. తెలివైనవారే ఆధ్యాత్మికం వైపు వస్తారు. ఎవరు తెలివైనవారు? ఎవరిలోనైతే కొంచెం ఆధ్యాత్మికత ఉన్నదో వారే. ఆ కొంచెమూ లేనట్లయితే వారు కళ్ళకు గంతలు కట్టిన గుఱ్ఱ ం వంటివారు. విశాల దృష్టి ఉండదు. వారి జీవితాన్ని వారు చూసుకోలేరు. వారు నిజంగా ఎవరో వారికి తెలియదు. మనకు ఈ జ్ఞానం, సమాజాన్ని మార్చే తెలివి ఉన్నది. ఏదేనా అన్యాయం జరుగుతుండగా మీరు చూశారనుకోండి, ఏం జరుగుతుంది? కోపం వస్తుంది. మీరు కోపంగా ఉన్నపుడు మీరు చేయాలనుకున్నదాన్ని చేయలేరు. ఎందుకంటే మీశక్తిలో చాలాభాగాన్ని కోపం హరించివేస్తుంది. అయితే మీ కోపపు దిశను సృజనాత్మకతవైపు మళ్ళించినపుడు ఎటువంటి పరిస్థితినైనా మీరు మార్చగలరు. మీలో ఆ జ్ఞానం, ఆ శక్తి సంపూర్ణంగా ఉన్నాయి. మీరు ధ్యానం ద్వారా సంపాదించి అంతశ్శక్తి, ఆధ్యాత్మికత పనికివచ్చేది అప్పుడే. శ్రీకృష్ణుని కిరీటంగా నెమలిపింఛం ఎందుకు ఉంటుందో తెలుసా? సాధారణంగా రాజులకు ఉండే కిరీటం చాలా బరువుగా ఉంటుంది. వారి బాధ్యతను అది సూచిస్తూ ఉంటుంది. కిరీటం ధరించినవారు ఏమంత ఆనందంగా ఉండలేరు. అయితే కిరీటంలో నెమలిపింఛం ఉన్నపుడు అది, ఆ కిరీటం తేలికగా ఉన్నదని సూచిస్తూ ఉంటుంది. దాని అర్థం నీవు బాధ్యతను తీసుకోవాలి, అదే సమయంలో నెమలి పింఛంలా తేలికగా, దానిలోని రంగులలా ఉత్సాహభరితంగా ఉండాలి. నీపై ఉంచిన బాధ్యతను ఒక బరువుగా భావించి కుంగిపోవటం లేదు. నీవు జ్ఞానాన్ని కలిగిఉన్నపుడు నీ కిరీటం నెమలి పింఛమంత తేలికగా ఉంటుంది. www.artofliving.org