
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది.
క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్‌లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది.
జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది.
అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్‌వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.
పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.
స్టార్లు లేకుండానే...
స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్‌లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.
జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.
తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.
ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్‌లో సెమీఫైనల్‌కు చేరింది.
నిరీక్షణకు తెరదించుతూ..
తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్‌లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.
అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది.
ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు.
మౌలిక వసతుల్లో భేష్..
సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్‌డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్‌లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.
‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.
2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.
కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..!
Comments
Please login to add a commentAdd a comment