
కాళ్లు కడిగిన కాసేపట్లోనే గుండెపోటుతో మృతి
కామారెడ్డిలో ఘటన
భిక్కనూరు(హైదరాబాద్): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు.
ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment