
కనికరించని మున్సిపల్ సిబ్బంది తల్లడిల్లిన కూతురు
పరిచయస్తుల సహకారంతో అంత్యక్రియలు
జోగిపేట(మెదక్): అభాగ్యురాలైన వృద్ధురాలి శవం రోడ్డుపై 12 గంటల పాటు ఉన్నా మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు. అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు వేడుకున్నా కనికరించలేదు. వివరాలిలా ఉన్నాయి. జోగిపేట పట్టణంలో విద్యావతి (68) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటూ కాగితాలు, పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని తన కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగిస్తుంది.
కుమార్తెకు వివాహం చేసింది. కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో చౌటకూరు మండలం శివ్వంపేట ప్రాంతంలోని కంపెనీలో పని చేస్తోంది. శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని అమ్మా..అమ్మా అంటూ పిలిచినా ఉలుకు పలుకూ లేకపోవడంతో బోరున విలపిస్తూ కూర్చుంది. ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అంత్యక్రియలు చేయాలని కోరింది. పోలీసులకు చెబితేనే చేస్తామని వారు చెప్పారు.
రోడ్డుపై వెళ్తున్న పోలీసులకు కూడా చెప్పినా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరూ రాకపోవడంతో పటాన్‌చెరు ప్రాంతంలో తనకు తెలిసిన వారికి కూతురు ఫోన్ చేసింది. వారు వచ్చి మున్సిపల్ అధికారులను వేడుకున్నా స్పందించలేదు. దీంతో రూ.2 వేలకు అంబులెన్స్‌ను మాట్లాడుకొని రూ.1,500కు జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లి మృతదేహం వద్ద కూతురు ఏడవడం రోడ్డుపై వెళ్లే వారి హృదయాలను కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment