
వీడిన మహిళ మిస్సింగ్ కేసు
గజ్వేల్ సమీపంలో గల కోమటిబండ
అడవిలో మృతదేహం లభ్యం నిందితుడి రిమాండ్
గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.
వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
గ్రామంలో ఉద్రిక్తత
యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment