
హైదరాబాద్: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.
ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..
ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.
250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులు
అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు.
దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి.
కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది.
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది.