
రోమ్: పోప్ ఫ్రాన్సిస్(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్‌లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది. వచ్చే వారమంతా ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని కూడా వైద్యులు స్పష్టం చేశారు. బ్రాంకైటిస్, న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన పోప్ ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరిన విష యం తెల్సిందే. శుక్రవారం మొదటిసారిగా పోప్ ఆరోగ్యంపై వారు స్పష్టత ఇచ్చారు.
‘అప్పుడప్పుడూ ఆయనకు విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆక్సిజన్‌ను అందజేస్తున్నాం. న్యుమోనియా రెండు ఊపిరితిత్తుల్లోనూ ఉంది. దీని నివారణ వైద్య చికిత్సలకు ఆయన సరిగ్గానే స్పందిస్తున్నారు’అని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం వివరించింది. శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్‌తోనూ ఆయన ఇబ్బంది పడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. ఇలా ఉండగా, పోప్ ఫ్రాన్సిస్ దీర్ఘకాలంపాటు ఆస్పత్రిలోనే కొనసాగాల్సి అవసరం వస్తే పరిస్థితి ఏమిటి? ముఖ్యమైన రోజు వారీ విధులను నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటారా అన్న చర్చ కార్డినల్స్‌లో ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు.