
ఆస్పత్రి నుంచి వాటికన్ నివాసానికి
వాటికన్ సిటీ: ప్రాణాంతక నిమోనియాతో ఐదు వారాల పాటు పోరాడిన పోప్ ఫ్రాన్సిస్ (88) పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారు. జెమెల్లీ ఆసుపత్రి నుంచి ఆదివారం వాటికన్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వందలాది మంది ఆస్పత్రి దగ్గర గుమిగూడి ఆయనకు వీడ్కోలు పలికారు. ఆసుపత్రి ప్రధాన ప్రవేశం ఎదురుగా ఉన్న బాల్కనీ నుంచి వారికి పోప్ అభివాదం చేశారు. ఆయనను చూడటానికి రోగులు కూడా బయటికొచ్చారు. అనంతరం పోప్ ఆక్సిజన్ పైపులను ధరించి తెల్ల ఫియట్ కారులో వాటికన్ చేరుకున్నారు.
తన నివాసానికి వెళ్లడానికి ముందు ఆనవాయితీ మేరకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. పోప్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రజలు భారీగా గుమిగూడారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ కండరాలు దెబ్బతినడంతో పోప్ ఇప్పటికీ మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ‘‘వృద్ధులైన రోగుల్లో ఇవి మామూలే. గొంతు త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటుంది. అప్పటిదాకా శ్రమ పడకూడదు. ఎక్కువమందిని కలవకూడదు’’ అని సూచించారు. దాంతో ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు.
పోప్ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో ఫిబ్రవరి 14న ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. రెండు ఊపిరితిత్తుల్లో నిమోనియా ఉన్నట్లు నిర్ధారించి 38 రోజులపాటు చికిత్స అందించారు. 12 ఏళ్ల పదవీకాలంలో పోప్‌కు ఇదే అతిపెద్ద విరామం. ఒకానొక దశలో ఆయన వారుసుడు ఎవరన్న చర్చ కూడా జరిగింది. అంత పెద్ద వయసులో డబుల్ నిమోనియాతో బాధపడే రోగులు ఆరోగ్యంగా బయటపడటం చాలా అరుదు. కానీ పోప్ మాత్రం ఇంత సమస్యలోనూ నిబ్బరంగా వ్యవహరించారు. ఎలా ఉందన్న వైద్యులతో బతికే ఉన్నానంటూ చెణుకులు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment