Pneumonia
-
ఆస్పత్రిలోనే పోప్ ఫ్రాన్సిస్
రోమ్: పోప్ ఫ్రాన్సిస్(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్‌లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది. వచ్చే వారమంతా ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని కూడా వైద్యులు స్పష్టం చేశారు. బ్రాంకైటిస్, న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన పోప్ ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరిన విష యం తెల్సిందే. శుక్రవారం మొదటిసారిగా పోప్ ఆరోగ్యంపై వారు స్పష్టత ఇచ్చారు. ‘అప్పుడప్పుడూ ఆయనకు విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆక్సిజన్‌ను అందజేస్తున్నాం. న్యుమోనియా రెండు ఊపిరితిత్తుల్లోనూ ఉంది. దీని నివారణ వైద్య చికిత్సలకు ఆయన సరిగ్గానే స్పందిస్తున్నారు’అని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం వివరించింది. శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్తోనూ ఆయన ఇబ్బంది పడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. ఇలా ఉండగా, పోప్ ఫ్రాన్సిస్ దీర్ఘకాలంపాటు ఆస్పత్రిలోనే కొనసాగాల్సి అవసరం వస్తే పరిస్థితి ఏమిటి? ముఖ్యమైన రోజు వారీ విధులను నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటారా అన్న చర్చ కార్డినల్స్లో ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు. -
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి
చలికాలం వచ్చిందంటే చాలా మంది చిన్నపిల్లల్లో న్యూమోనియా వ్యాధి ప్రబలుతుంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పలు రకాల వైరస్లు, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఈ వ్యాధి చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నెల 12న ప్రపంచ న్యూమోనియా డే సందర్భంగా ప్రత్యేక కథనం.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో న్యూమోనియాకు అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల ఓపీకి ప్రతిరోజూ 300 మంది పలు రకాల వ్యాధులతో చికిత్స కోసం వస్తుండగా అందులో 60 మంది దాకా న్యూమోనియా బాధితులు ఉంటున్నారు. చలికాలంలో ఈ సంఖ్య 150 నుంచి 200 దాకా ఉంటోంది. వీరిలో అవసరమైన వారిని వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. వీరికి అవసరమైన యాంటీబయాటిక్ మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్, నెబులైజేషన్ ఇస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేస్తున్నారు. పీసీవీతో న్యూమోనియాకు చెక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రొటీన్ ఇమ్యూనైజేషన్‌లో భాగంగా ఆరు వారాలు, 14 వారాలు, 9వ నెల వయస్సులో చిన్నారులకు మూడు డోసుల పీసీవీ వ్యాక్సిన్ (నీమోకోకల్) ఇస్తున్నారు. ఇది భవిష్యత్‌లో చిన్నారులకు న్యూమోనియా రాకుండా అడ్డుకుంటుంది. దీంతో పాటు న్యూమోనియా వచ్చిన చిన్నారులను ఆశాలు, ఏఎన్ఎంలు గుర్తించి వారికి దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అమాక్సిలిన్ సిరప్ ఇస్తారు. తీవ్రంగా ఉంటే సీహెచ్‌సీ, పీహెచ్సీ, ఏరియా ఆసుపత్రి, బోధనాసుపత్రికి రెఫర్ చేసి అక్కడ మెరుగైన వైద్యం అందేలా చేస్తారు. న్యూమోనియా అంటే.. సాధారణంగా ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను వైద్యులు న్యూమోనియాగా పరిగణిస్తారు. ఇది ముఖ్యంగా పిల్లల్లో, వయోవృద్ధుల్లో, ఇమ్యూనిటీ (వ్యాధినిరోధక శక్తి) తక్కువగా ఉన్నవారు, ధూమపానం అలవాటు ఉన్న వారిలో వస్తుంది. ఇందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌కు సంబంధించిన క్రిముల కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఊపిరితిత్తుల్లో అలి్వయోలి ద్రవం లేదా చీముతో నిండినప్పుడు శ్వాస తీసుకోవడం నరకంగా మారుతుంది. కొన్నిసార్లు ఈ పరిస్థితి ప్రాణాంతకమవుతుంది. వ్యాధినిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఛాతి ఎక్స్‌రే, ఛాతి సీటీ స్కాన్, గళ్ల పరీక్షలు, రక్త పరీక్షలు, అవసరమైన వారికి బ్రాంకోస్కోపి ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. లక్షణాలు న్యూమోనియాలో కఫంతో కూడిన దగ్గు, చలి, వణుకుతో పాటు జ్వరం, ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం(ఆయాసం), బలహీనం, నీరసంగా శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించడం, వికారం, వాంతులు విరేచనాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒ దగ్గు/తుమ్మేటప్పుడు ముక్కు, నోరును కప్పుకోవాలి ⇒ సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ⇒ ముక్కు, నోరు, కళ్లను తరచుగా తాకరాదు ⇒ ప్రొటీన్, విటమిన్–సి, జింక్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి ⇒దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి ⇒వ్యాక్సిన్, రొటీన్ చెకప్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు ⇒ ముఖ్యంగా ధూమపానం అలవాటు మానేయాలి సకాలంలో చికిత్స అందించాలి న్యూమోనియా సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. దగ్గు, ఆయాసం, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆయాసం కనిపిస్తే వెంటనే పిల్లలను వైద్యుల వద్దకు తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు చేయించి మందులు ఇప్పించాలి. ఆలస్యం చేసే కొద్దీ ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. అప్పుడు వెంటిలేటర్‌పై ఉంచి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సకాలంలో ఆసుపత్రికి తీసుకొస్తే వైరస్, బ్యాక్టీరియాను బట్టి మందులు ఇస్తాం. – డాక్టర్ బి.విజయానందబాబు, చిన్నపిల్లల విబాగాధిపతి, జీజీహెచ్, కర్నూలువ్యాధి తీవ్రతను బట్టి చికిత్స మనం పీల్చే గాలితో పాటు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి న్యూమోనియా మారుతుంది. పిల్లలు, వృద్ధులు, డయాబెటీస్, ఆల్కహాలు, స్మోకింగ్, హెచ్ఐవీ, ఆస్తమా, ఇతర దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్న వా రిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి న్యూమోనియాకు చికిత్స అందిస్తాం. –డాక్టర్ కమ్మర వినోద్ఆచారి, పల్మనాలజిస్టు, కర్నూలు -
World Pneumonia Day: చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ..
ఈరోజు (నవంబర్ 12) ప్రపంచ న్యుమోనియా దినోత్సవం. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ, అన్ని వయసులవారినీ ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య న్యుమోనియా. ఈ వ్యాధిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రపంచ న్యుమోనియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇది సోకుతుంది. న్యుమోనియాను ప్లూరిసీ అని కూడా అంటారు. పిల్లలు లేదా వృద్ధులు ఎవరికైనా ఈ వ్యాధి సొకే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపిన వివరాల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 7,40,000 మంది ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో మృత్యువాత పడ్డారు.న్యుమోనియా వ్యాధి ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా, ఈ వ్యాధిని నియంత్రించే దిశగా జరిగే ప్రచార కార్యక్రమంలో వందకుపైగా సంస్థలు పాల్గొంటున్నాయి. స్టాప్ న్యుమోనియా సంస్థ అంచనా ప్రకారం 2009లో 6,72,000 మంది పిల్లలు సహా దాదాపు 2.5 మిలియన్ల మంది న్యుమోనియా బారినపడి మరణించారు.ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని 2009, నవంబర్ 12న గ్లోబల్ కోయలిషన్ ప్రారంభించింది. 2030 నాటికి న్యుమోనియా మరణాల సంఖ్యను సున్నాకి తగ్గించడమే ఈ దినోత్సవ లక్ష్యం. న్యుమోనియా చికిత్స అందించగల వ్యాధి. అయితే ఈ వ్యాధి విషయంలో అధిక మరణాల రేటు నమోదవుతోంది. ఈ ప్రాణాంతక శ్వాసకోశ రుగ్మతపై పోరాడటం, పిల్లలు, పెద్దలలో మరణాల రేటును తగ్గించడం అత్యవసరమని వైద్య నిపుణులు గుర్తించారు. న్యుమోనియా కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంటుంది. అందుకే దీనిని తొలి దశలోనే గుర్తించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో న్యుమోనియాను తేలిగ్గా గుర్తించొచ్చు. చిన్నారుల్లో ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే పెద్దలు అప్రమత్తం కావాలి. ఊపిరితిత్తుల్లోని ఈ వైరస్ శరీరమంతటా వ్యాపించడానికి రోజుల నుంచి వారాల వరకు పట్టవచ్చు. బ్యాక్టీరియా కారణంగా సోకే న్యుమోనియాకు యాంటీబయోటిక్స్ ద్వారా చికిత్స అందించవచ్చు. న్యుమోనియా తీవ్రం అయినప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అధికంగా విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం లాంటి ఉపశమన చర్యలతో న్యుమోనియా నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు... -
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్‌కాంత్ కూడా..
కోలివుడ్‌కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్‌కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్‌గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్‌గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
భారత్‌లో అంతకంతకు పెరుగుతున్న 'వాకింగ్ న్యూమోనియా కేసులు'!
భారత్‌లో కూడా చైనా మాదిరి కేసులు పెరగుతున్నాయంటూ కలకలం రేగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుకు సంబంధించిన ఏడు కేసులు గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ ఆందోళన రేకెత్తింది. ఐతే ఎయిమ్స్ ఆస్పత్రి ఈ కేసులకి చైనా న్యూమోనియాతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అవి సాధారణ 'వాకింగ్ న్యూమోనియో' కేసులేనని తేల్చి చెప్పింది. అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు చెందొద్దని పేర్కొంది. అసలేంటీ వాకింగ్ న్యూమోనియా? దానికీ ఆపేరు ఎలా వచ్చింది? అంత ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం. వాకింగ్ న్యూమోనియో అంటే..? ఈ న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. వారే సులభంగా ఈ వ్యాధి బారినపడుతారు. రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబతున్నారు. ఇది చాలా వరకు సాధారణమైన తేలిక పాటి లక్షణాలు గల వ్యాధేనని తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులను తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసం ఉండదని చెబుతున్నారు. అయితే ఈ రోగ నిర్థారణ అనేది సరైన పద్ధుతుల్లో చేయాలి. అందుకు తగట్టుగా చికిత్స తీసుకుంటే చాలని పేర్కొన్నారు డాక్టర్లు. ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 'వాకింగ్ న్యూమోనియా' అనేది ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్తో బాధపడే రోగులను ఉద్దేశించి పెట్టిన పేరు. దీని కారణంగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. పైగా జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి సాధారణ లక్షణాలే కనిపస్తాయి. ఇవి కూడా రెండు నుంచి మూడు వారాలు మాత్రమే కనిపిస్తాయి. పరిస్థితి సాధారణ న్యుమోనియా కంటే తక్కువగానే ఉంటుంది. తేలికపాటి లక్షణాలే ఉండటంతో ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతారు. కాబట్టి దీన్ని 'వాకింగ్ న్యుమోనియాగా' పిలిచారు వైద్యులు. ఐతే చైనాలో వచ్చే న్యూమోనియాకు దీనికి సంబంధం లేదు. అది అడెనోవైరస్, రెస్పిరేటరి సిన్సిటియల్ వైరస్(ఆర్ఎస్వీ) వల్ల వన్తున్నట్లు నివేదికలో తెలిపింది. అవి విలక్షణమైన న్యూమోనియాకి సంబంధించిన కేసులు. అయితే ఇది కరోనా మాదిరిగా ప్రబలంగా లేదని తీవ్రత తక్కువగానే ఉందని చైనా స్పష్టం చేసింది కూడా. వైద్యులు సైతం ఈ న్యూమోనియా తీవ్రత రేట్లు ఒక్కోసారి మారుతూ ఉంటాయిని చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి అని, ఇది దగ్గినా లేదా తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అందువల్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది యాంటీబయోటిక్‌లకు లొంగినప్పటికీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెడుతుంటుందని తెలిపారు. ముఖ్యంగా కౌమరదశలో ఉన్న పిల్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆందోళన చెందాలా? వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తి గ్రత శుభ్రత తోపాటు జాగ్రత్తుల పాటిస్తే చాలని చెప్పారు. ముక్కుకి మాస్క్‌ల ధరించడం, చేతి పరిశుభ్రత పాటించడం వంటివి చేస్తే ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదని అన్నారు. చికిత్స.. నోటి ద్వారా తీసుకునే యాంటీబయోటిక్స్‌ని ఐదు నుంచి 10 రోజుల వాడితే చాలు. పొరపాటును కూడా దగ్గును తగ్గించే మందులను వాడకూడదు. ఎందుకంటే వచ్చింది వాకింగ్ న్యూమోనియా అని తేలితే వైద్యుల సూచించిన మందులే వాడాలి. దగ్గుని కంట్రోల్ చేసే మందులు వాడితే శ్లేష్మం ఊపిరితిత్తులోనే ఉండి సమస్య మరింత జటిలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కుటుంబంలో ఎవ్వరైన ఈ వ్యాధి బారినపడి అందరూ జాగ్రత్తలు పాటించాలి. అంటువ్యాధి కావున ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. అందువల్ల చేతి పరిశుభ్రతలు, వ్యక్తిగత శుభ్రత పాటించటం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
అవి చైనా న్యుమోనియా కేసులు కావు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసిన న్యుమోనియా కేసులను చైనాలో వ్యాప్తిస్తున్న చిన్న పిల్లల న్యుమోనియా కేసులతో మూడిపేడుతూ ప్రచురించిన మీడియా కథనాలపై కేంద్రం సీరియస్ అయింది. ఆ కథనాలు తప్పుదోవ పట్టించే అసత్యాలని స్పష్టం చేసింది. ఎయిమ్స్ వెలుగులోకి వచ్చిన కేసులు సాధారణమైన బ్యాక్టీరియల్ న్యుమోనియా కేసులని తెలిపింది. ఎయిమ్స్‌లో బయటపడ్డ న్యూమోనియా కేసులకు చైనాలోని కేసులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. Media reports claiming detection of bacterial cases in AIIMS Delhi linked to the recent surge in Pneumonia cases in China are misleading and inaccurate. Mycoplasma pneumonia is the commonest bacterial cause of community-acquired pneumonia. Pneumonia Cases in AIIMS Delhi have no… pic.twitter.com/rZkpgPEwv1 — ANI (@ANI) December 7, 2023 అదీ కాగా ప్రస్తుతం వెలుగు చూసిన న్యుమోనియా కేసులు ఎయిమ్స్‌లో గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన అధ్యయనంలో భాగమని తెలిపింది. ఈ కేసులను చైనా కేసులుగా భావించి.. ఎవరు భయాందోళనకు గురికావొద్దని స్పష్టం చేసింది. న్యుమోనియాపై మీడియాలో ప్రచురించే నివేదికలు అసత్యమని పేర్కొంది. -
నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాససమస్య. అనేక రకాల ఇన్ఫెక్షన్లు నిమోనియాకు దారితీస్తాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చే నిమోనియా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... నివారణ ఇలా... కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం అనే ఓవర్ క్రౌడింగ్ పరిస్థితికి దూరంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగవాతావరణానికి ఎక్స్పొజ్ కాకుండా చూసుకోవాలి. అలాగే పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ అలవాటుకూ దూరంగా ఉండాలి. మద్యం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు... మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లూ నివారితమవుతాయి. చిన్నపిల్లలకు, పెద్దవయసు వారికి నిమోనియాను నివారించే వ్యాక్సిన్ ఇవ్వడం మంచిది. -
వామ్మో చైనా ఇన్ఫెక్షన్
వాషింగ్టన్: చైనాలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ నిమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనాకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. -
విస్తరిస్తున్న మిస్టీరియస్ న్యుమోనియా: ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్?
ప్రపంచవ్యాప్తంగా అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇటీవల చైనాలో ఆందోళన రేపిన చిన్నపిల్లలో న్యుమోనియా కేసులు తరహాలోనే ముఖ్యంగా అమెరికా మసాచుసెట్స్ ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతునట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. వైట్ లంగ్ సిండ్రోమ్‌గా పిలుస్తున్న శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. మూడునుంచి ఎనిదేళ్ల వయస్సున్న పిల్లల్లోఈ న్యుమోనియా వ్యాపిస్తోంది. దీనికి కచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సాధారణ బాక్టీరియా మైకోప్లాస్మానే కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ప్రభావితమైన పిల్లలలో ఛాతీ ఎక్స్-కిరణాలపై విలక్షణమైన తెల్లటిపొరలా ఏర్పడుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత పరిస్థితులులాంటి పలు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి.శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం , అలసట లాంటివి ప్రధాన లక్షణాలు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) అనేది ఊపిరితిత్తుల్లో నీరు చేరినపుడు సంభవించే తీవ్ర పరిస్థితి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. న్యుమోనియా, సెప్సిస్ , ట్రామా వంటి అనేక కారణాల వల్ల ARDS సంభవించవచ్చు. ఊపిరితిత్తుల అల్వియోలార్ మైక్రోలిథియాసిస్ (PAM) అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులలో కాల్షియం పేరుకుపోవడం సంభవించే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి వస్తుంది. సిలికోసిస్ అనేది సిలికా ధూళిని పీల్చడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా దుమ్ము ఇసుక, రాయి, ఇతర ఇతర పదార్థాలలో కనిపిస్తుంది. సిలికోసిస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు ఛాతీ నొప్పికి కారణమవుతుంది. మూల కారణం వైట్ లంగ్ సిండ్రోమ్ మూలకారణాలు ఏంటి అనేది ఇంకా పరిశోధనలోఉంది. అయితే ఇది బాక్టీరియా, వైరల్ , పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తోందనేది అంచనా. ఇన్ఫ్లుఎంజా లేదా COVID-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం ద్వారా తెల్ల ఊపిరితిత్తుల సిండ్రోమ్‌ను కలిగిస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా వంటి బాక్టీరియా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగించడం ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. సిలికా ధూళి, ఇతర కాలుష్య కారకాలను పీల్చడం వంటి పర్యావరణ కారకాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధి వస్తోంది. దీంతో మరో కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తోందా అనే ఆందోళన నెలకొంది. దీనికి చికిత్స వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, కార్టికో స్టెరాయిడ్స్ ద్వారా చికిత్సగా భావిస్తున్నారు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో చైనా పొరుగు దేశాలైన తైవాన్, నేపాల్ , అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వైట్ లంగ్ సిండ్రోమ్' వ్యాప్తి అమెరికాకు ముందు నెదర్లాండ్స్ , డెన్మార్క్ కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు మైకోప్లాస్మా కారణంగా భావిస్తున్నారు.ప్రతి లక్షమంది పిల్లలలో 80 మంది న్యుమోనియా సోకింది. నాలుగు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కేసులు కూడా పెరుగుతున్నాయి. న్యుమోనియా కేసులు 'అంటువ్యాధి' స్థాయికి చేరుకున్నాయని డానిష్ ఆరోగ్య ముఖ్యులు కూడా ప్రకటించారు. గత ఐదు వారాల్లో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని డెన్మార్క్ స్టాటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ (SSI) వెల్లడించింది. -
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా
చైనాలో మళ్లీ కొత్త రకం కరోనావైరస్ విస్తరిస్తోందన్న ఆందోళనల మధ్య చైనా స్పందించింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు పలు వ్యాధికారక కారకాల కలయికు కారణమని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ప్రధాన కారణాల్లో ఇన్ఫ్లుఎంజా ఒకటని ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. చైనాలో నమోదవుతోన్న న్యూమోనియా కేసుల్లో ఎలాంటి అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారకాలను గుర్తించ లేదని, కోవిడ్ -19 మహమ్మారి సమయం నాటి తీవ్రత లేదని కూడా స్పష్టం చేసింది. తద్వారా కొత్త కరోనా వస్తోందన్న ఆందోళనలకు చెక్ పెట్టింది. ఇన్ఫ్లుఎంజా, రైనోవైరస్, అడెనోవైరస్లు, మైకోప్లాస్మా న్యుమోనియా వంటి అనేక రకాల వ్యాధికారక కారకాల వల్ల కేసులు పెరుగుతున్నాయని నివేదించింది. అలాగే శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత అసాధారణం కాదని కూడా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ ఆంక్షలు అవసరం లేవని కూడా వెల్లడించింది. బీజింగ్, లియానింగ్ ,ఇతర ప్రదేశాలలో పిల్లల ఆసుపత్రులలో గుర్తించబడని న్యుమోనియా గురించి నివేదిక తర్వాత పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనా నుండి మరింత సమాచారం కోరిన తర్వాత ఈ వివరాలు వచ్చాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చైనాను కోరింది. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈమేరకు చైనా అధికారులు స్పందించారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు WHO తెలిపింది. చైనాలో చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కేసులు కలవర పెట్టాయి. కరోనా బాగా ప్రబలిన నాటి రోజులను తలపించేలా చైనాలో ఆసుపత్రుల వద్ద చిన్నారులతో తల్లిదండ్రులు గంటల తరబడి వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇది వ్యాప్తి చెందకుండా పాఠశాలల్ని తాత్కాలికంగా మూసివేశాయి. మరోవైపు వాకింగ్ న్యుమోనియా" కేసులు పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యులు హెచ్చరించారు. కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల పిల్లలలో మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదించాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండే పెద్ద పిల్లలు, పెద్దలలో తేలికపాటి జలుబు మాత్రమే కనిపిస్తోంది. అయితే ,కొన్ని వారాల పాటు కొనసాగుతున్న లక్షణాలతో చిన్న పిల్లల్లో న్యుమోనియా డెవలప్ అయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైకోప్లాస్మా న్యుమోనియా మైకోప్లాస్మా న్యుమోనియా అనేది ఒక బాక్టీరియా, ఇది సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది, సాధారణ జలుబు మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. ఇది చాలా అరుదుగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు దగ్గు వారాల పాటు కొనసాగుతుంది. ఫలితంగా చిన్న పిల్లలకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. -
చైనాలో నిమోనియా కలకలంపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనాలో కొత్తగా నిమోనియా కేసులు వెలుగుచూస్తుండటంపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో సమగ్రస్థాయిలో ఆరోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన జారీచేసింది. ‘ఉత్తర చైనాలో చిన్నారుల్లో శ్వాససంబంధ కేసుల ఉధృతి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని భారత సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుటికిప్పుడు భయపడాల్సిన పని లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా మీమీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సన్నద్ధతపై సమీక్ష నిర్వహించుకోండి’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకు లేఖ రాశారు. ‘‘ ఇంఫ్లూయెంజా తరహా కేసు(ఐఎల్ఐ), అత్యంత తీవ్రమైన శ్వాస(ఎస్ఏఆర్ఐ) కేసుల విషయంలో కోవిడ్‌కాలంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు పాటించండి. ఈ తరహా కేసులు, ముఖ్యంగా చిన్నారుల్లో కనిపిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోండి. ఈ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయండి. అనుమానిత కేసుల శాంపిళ్లను వైరస్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలకు పంపించండి. ఇలాంటి ముందస్తు, అప్రమత్త చర్యల ద్వారానే ఆరోగ్య అత్యయక స్థితి దాపురించకుండా పౌరులను కాపాడగలం’’ అని లేఖలో కార్యదర్శి పేర్కొన్నారు. ఉత్తర చైనాలో శ్వాస సంబంధ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా నిమోనియా, సార్స్–కోవ్–2 కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. చలికాలం కావడంతో చైనాలో సాధారణంగానే మైకోప్లాస్మా నిమోనియా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తుంటాయి. ‘‘కేసులపై అదనపు సమాచారం ఇవ్వాలని చైనా యంత్రాంగాన్ని డబ్ల్యూహెచ్ఓ కోరింది. అంతమాత్రాన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాదు’’ అని కార్యదర్శి స్పష్టంచేశారు. -
చైనాలో కొత్తవైరస్ టెన్షన్.. ఆస్పత్రుల్లో పిల్లలు (ఫొటోలు)
-
చైనాలో కొత్త వైరస్.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది.
ఢిల్లీ: కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో వైరస్ వచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి. కోవిడ్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా అక్కడి నుంచి మరో వ్యాధి పుట్టుకువస్తుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చైనాలోని చిన్నారుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల పిల్లలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపరితిత్తుతుల ఇన్ఫెక్షన్, జ్వరం వంటివి వ్యాపిస్తుండటంతో బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని ఆసుపత్రులు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఈ కొత్త వైరస్‌పై హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందకూరి స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పిల్లలో నమోదవుతున్న న్యూమోనియయా కేసుల్లో కొత్త వైరల్ ఏది లేదని తెలిపారు. దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. టీకాలు తీసుకోవడం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, న్యుమోనియా కేసులపై ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ చైనా నుంచి వివరణాత్మక వివరణ కోరిందని చెప్పారు. ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2)తో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా డైరెక్టర్ అజయ్ శుక్లా హెచ్చరించారు. శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైతే ఇతర వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని అధికారులు చెబుతున్నప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేశారు. డాక్టర్ శుక్లా మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలకు వెళుతున్నట్లయితే, వారికి దగ్గు, జలుబు, జ్వరం లేదా ఇతర లక్షణాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. తరగతి గదిలో పిల్లలెవరికైనా న్యుమోనియా ఉంటే ఉపాధ్యాయుడికి తెలియజేయండి. పిల్లలు అనారోగ్యంతో ఉంటే పాఠశాలకు పంపవద్దు." అని పేర్కొన్నారు. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ గురించి పూర్తి స్థాయిలో ఖచ్చితమైన వివరాలు లేవని తెలిపిన డాక్టర్ శుక్లా.. డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటు.. చైనాలో శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వెళ్లే చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్ని కేంద్రాలలో దాదాపు 1200 మంది పిల్లలు పెరిగినట్లు వారు నివేదించారు. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరల్ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్‌లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు.. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: Mysterious Pneumonia Outbreak: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు -
తెలంగాణపై ఆర్ఎస్వీ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రెస్పిరేటరీ సింకీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రులు, ఇతర సాధారణ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ వ్యాధుల్లో ఆర్ఎస్వీ ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు వారా లుగా వైరల్ న్యుమోనియా కేసులు పెరుగుతున్నా యి. జలుబు కాస్తా న్యుమోనియాగా దారితీస్తుంది. దమ్ము కూడా వస్తుంది. 5 ఏళ్లలోపు... 60 ఏళ్లు పైబడిన లేదా దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఇతర వయసువారిపైనా ప్రతాపం చూపిస్తోంది. జ్వరం, జలుబు, కఫంతో కూడిన తీవ్రమైన దగ్గు, నిమ్ము, బలహీనత రెండు వారాల వరకు ఉంటుంది. చిన్న పిల్లల్లో ఐసీయూకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దగ్గు వచ్చిన మొదట్లోనే అప్రమత్తం కావాలని, చిన్నపిల్లలు మూడు నాలుగు రోజుల తర్వాత అది నిమ్ము దశకు చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌వీలో ఏ, బీ అనే రెండు రకాలున్నాయి. ఇప్పటివరకు ఇండియా 587 ఏ రకం వైరస్, 344 బీ రకం వైరస్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఏడాదికి సగటున దేశంలో 3.31 కోట్ల చిన్నారులపై వైరస్ పంజా... ప్రతీ ఏడాది భారత్‌లో సగటున 3.31 కోట్ల మంది చిన్నారులు ఆర్ఎస్వీ బారిన పడుతున్నారు. వారిలో 10 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏడాదికి ఈ వైరస్ వల్ల దేశంలో 59,600 మంది చనిపోతున్నారు. రెండేళ్లు నిండిన ప్రతి చిన్నారి ఒక్కసారైనా ఈ వైరస్ బారినపడతారు. ఈ సంవత్సరం దాని ప్రభావం మరింత పెరిగింది. ఐదు వారాల క్రితం వరకు ఈ వైరస్ పాజిటివిటీ రేటు 5 శాతంలోపుగా ఉంటే, ప్రస్తుతం 10 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్ డ్యాష్‌బోర్డ్ ప్రకారం వైరల్ కేసుల్లో 15 శాతం ఆర్ఎస్వీ కేసులే. -
బాల్యంలో నిమోనియా బారిన పడితే... భయంపుట్టిస్తున్న స్టడీ వివరాలు..
లండన్: బాల్యంలో నిమోనియా వంటివాటి బారిన పడ్డవారికి పెద్దయ్యాక శ్వాసపరమైన ఇన్ఫెక్షన్ల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయసులో శ్వాస సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదమూ ఎక్కువేనని అది తేల్చింది. ‘‘రెండేళ్లు, అంతకంటే తక్కువ వయసులో బ్రాంకైటిస్, నిమోనియా వంటివాటి బారిన పడేవారిలో పెద్దయ్యాక శ్వాస సంబంధిత వ్యాధులతో అకాల మరణం సంభవించే ఆస్కారం ఇతరులతో పోలిస్తే 93 శాతం ఎక్కువ’’ అని వివరించింది. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. వీటివల్ల 2017లో ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) కారణమని అధ్యయనం పేర్కొంది. అందుకే శ్వాస సంబంధిత సమస్యలను చిన్నతనంలోనే సంపూర్ణంగా నయం చేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఇంపీరియల్కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన జేమ్స్ అలిన్సన్ అభిప్రాయపడ్డారు. దీని ఫలితాలు ద లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
చిన్నారుల్లో నిమోనియా!
చిన్న పిల్లల్లో నిమోనియా చాలా సాధారణంగా కనిపించే ఊపిరితిత్తుల వ్యాధి. మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే వయసు తక్కువ చిన్నారుల్లో ఇది ఎక్కువగానే కనిపిస్తుంది. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ పిల్లల్లో ఇమ్యూనిటీ అంతే పటిష్టంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని తేలిగ్గా తగ్గించవచ్చు కాబట్టి దీని పట్ల అవగాహన ముఖ్యం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై... ఇవన్నీ నిమోనియాకు కారణమవుతాయి. లక్షణాలు : నిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలివి... ♦ దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/గళ్లను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు ఎక్కువ. ♦ తీవ్రమైన జ్వరం. ♦ ఆకలి తగ్గిపోతుంటుంది. ♦ తీవ్రమైన అలసట, నీరసం, ♦ కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు. వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) క్రమంగా కనిపిస్తాయి. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నిర్ధారణ : ♦ ఛాతీ ఎక్స్‌రే, ♦ కొన్ని రక్తపరీక్షలు ♦ కళ్లె పరీక్ష ♦ సీటీ స్కాన్ (ఛాతీది) ♦ అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్నీ పరీక్ష చేస్తారు. సెకండరీ నిమోనియా : పిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియా అంటారు. ఇది కాస్తంత ప్రమాదకరం. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గళ్ల తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడటం జరగాలి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించడం మేలు. నివారణ : ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ♦ అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ♦ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వడం, బాగా దగ్గుతున్న పెద్దలు, రోగగ్రస్తుల వద్దకు పిల్లలను కాస్త దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలకు, కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి జాగ్రత్తలతో నిమోనియాను కొంతవరకు నివారించవచ్చు. అయితే పిల్లల్లో ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వస్తున్నప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించి, తగిన చికిత్స తీసుకోవడమే మేలు. చికిత్స: బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దుష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు పుష్కలంగా నీళ్లు తాగించడం, గది కాస్తంత సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు. - డా. శాశ్వత్ మొహంతీ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఫోన్ : 8882 730 730 www.rainbowhospitals.in -
నిలోఫర్‌లో నిమోనియా కలకలం.. రెండ్రోజుల్లో ఆరుగురు శిశువుల మృతి
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశు సంరక్షణ కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో నిమోనియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నిమోనియా జడలు విప్పుతోంది. నిలోఫర్‌లో ఈ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఏ వార్డులో చూసినా జ్వరం, దగ్గుతో బాధపడే రోగులే దర్శనమిస్తున్నారు. గడిచిన రెండ్రోజుల్లో వ్యాధి సోకిన అయిదేళ్ల లోపు చిన్నారులు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరంతా ఎన్ఐసీయూలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యాధి లక్షణాలు ఇవీ.. ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధిని నిమోనియాగా పిలుస్తారు. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తల్లి పాలు లేకుండా పెరిగే పిల్లల్లో, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే శిశువులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, పౌష్టికాహారం లోపంతో పెరిగే పిల్లల్లో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. నిమోనియా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కూడా చిన్నారులకు సంక్రమిస్తుంటుంది. శీతాకాలంలో వీచే చలి ప్రభావం శిశువుల ఊపిరితిత్తులను చిత్తు చేస్తోంది. కఫంతో కూడిన దగ్గు చలి జ్వరం, ఛాతి నొప్పితో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శిశువు బలహీనంగా, నీరసంగా శక్తి తక్కువగా బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముక్కు నుంచి నీరు కారుతూ.. తేలికపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తే నిమోనియాగా గుర్తించాలని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం.. పిడియాట్రిక్ కేసులే అధికం. . నిలోఫర్ ఓపీలో జ్వర పీడితుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్క పిడియాట్రిక్ విభాగంలోనే ఓపీ రోగుల నమోదు సంఖ్య 1,300కు చేరుకుంది. ప్రతి రోజూ గైనిక్ విభాగంలో 200. సర్జరీ విభాగంలో 100 కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు నిలోఫర్‌ను సిబ్బంది లేమి సమస్య వెంటాడుతోంది. పరికరాల కొరత, సకాలంలో అందని రక్తం, అంబులెన్స్‌లు ఉన్నా అందుబాటులో లేని డ్రైవర్లు, అరకొర స్ట్రెచర్లు, సరిపోని వీల్చైర్లు.. ఒక్కో పడకపై ముగ్గురేసి చొప్పున రోగులు, వాయిదాల పద్ధతిలో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు, వేళకు అందని రక్త నమూనా ఫలితాల నివేదికల వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఫలితంగా వైద్య సేవలు సరిగా అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి వారికి ముందుగానే వైద్యం చేయడం ద్వారా మరణాలను కట్టడి చేయడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా న్యూమోనియా వ్యాధి నివారణ, ప్రజల్లో అవగాహన కల్పించడానికి గత నెల 12 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వాతావరణంలో వచ్చే మార్పులతో పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఆ సమస్యల్లో న్యూమోనియా ప్రధానమైనది. దేశంలో ఏటా ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో 16శాతం న్యూమోనియా కారణంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూమోనియా నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే టీకా పంపిణీ చేస్తోంది. 7.32 లక్షల మంది చిన్నారుల స్క్రీనింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 21,50,790 మంది ఉన్నారు. కాగా సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ 7,32,820 మంది చిన్నారులను ఏఎన్ఎంలు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 92,396 మందిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు దగ్గు, జలుబు, ఇతర సమస్యలున్నట్టు గుర్తించారు. తీవ్ర న్యూమోనియా సమస్య ఉన్న పిల్లలను మెరుగైన వైద్యం కోసం పీహెచ్‌సీల నుంచి పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అనంతరం ఆరోగ్య పరిస్థితిపై పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఫాలోఅప్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నడుస్తోంది. అనకాపల్లి టాప్ ఐదేళ్లలోపు పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాల్లో 61,822 మంది చిన్నారులుండగా వీరిలో 62.59 శాతం మందికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తయింది. 58.55 శాతంతో శ్రీకాకుళం రెండో స్థానంలో, 56.46 శాతంతో కాకినాడ మూడో స్థానంలో ఉన్నాయి. కేవలం 19.05శాతంతో ప్రకాశం జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకు.. ఐదేళ్ల లోపు పిల్లల్లో న్యూమోనియా సమస్యను నివారించడానికి చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేస్తున్నాం. న్యూమోనియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభిస్తున్నాం. తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పిల్లల్లో సమస్య తీవ్రమయ్యే పరిస్థితులుంటాయి. ఈ క్రమంలోనే సర్వే చేపడుతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సర్వే కొనసాగుతుంది. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
Pneumonia: అశ్రద్ధ చేస్తే ‘ఊపిరి’ తీస్తుంది
గుంటూరు మెడికల్: ఊపిరితిత్తులకు వచ్చి, ప్రాణాలు తీసే వ్యాధుల్లో న్యుమోనియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యుమోనియా వ్యాధితో చనిపోతున్నారు. ప్రతి ఏడాది ఐదేళ్లలోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. భారత దేశంలో ప్రతి ఏడాది రెండులక్షల మంది పిల్లలు ఈ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధి నివారణకు ఉన్న టీకాను వినియోగించటం ద్వారా ఒక మిలియన్ పిల్లల మరణాలు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. చలికాలంలో న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారినపడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాధి లక్షణాలు... ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుదాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దగ్గు, కళ్లె పడటం, కళ్లె పసుపు లేదా పచ్చగా ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఆయాసం, అలసట, ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం, చలి, వణుకు ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం లేదా తక్కువగా కొట్టుకోవటం, వికారం, వాంతులు, విరేచనాలు, పిల్లలు పాలు తాగలేకపోవటం తదితర లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. చలికాలంలో న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. ఆడవారితో పోల్చితే మగవారిలోనే వ్యాధి బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. కారణాలు... వ్యాధి ఉన్న వ్యక్తి ముఖానికి కర్చీఫ్ పెట్టుకోకుండా దగ్గినా, తుమ్మినా వారి నోటి తుంపర్ల ద్వారా పక్కన ఉండే వారికి వ్యాధి సోకుతుంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో, పొగతాగేవారిలో, మద్యపానం చేసేవారిలో, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం అధికం. నిర్ధారణ... ఛాతీ ఎక్సరే, సీటీ స్కాన్ పరీక్ష, రక్తపరీక్షలు, కళ్లె పరీక్ష, బ్క్రాంకోస్కోపీ, పల్స్ ఆక్సీమెట్రీ, ఫ్లూయిడ్ కల్చర్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వ్యాధి బాధితులు... ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మంది, పిల్లల వైద్య నిపుణులు, 300 మంది పల్మనాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ ఇద్దరు బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నివారణ చర్యలే ఉత్తమం.. వ్యాధి రాకుండా ముందస్తుగా పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్లు చేయించాలి. వ్యాధి సోకకుండా నివారించే వ్యాక్సిన్లు పిల్లలకు, పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తుంది. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వినియోగించకూడదు. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవటం చాలా మంచిది. – డాక్టర్ పి.పద్మలత, జీజీహెచ్ పిల్లల వైద్య విభాగాధిపతి జాగ్రత్తలు తీసుకోవాలి... వ్యాధి బాధితులు త్వరగా కోలుకోవటానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండటంతోపాటుగా మద్యపానం, ధూమపానం చేయకూడదు. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారంలో కనీసం ఐదురోజులపాటు వ్యాయామం చేయాలి. – డాక్టర్ గోపతి నాగేశ్వరరావు, పల్మనాలజిస్ట్, గుంటూరు -
గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా..
న్యూఢిల్లీ: దేశంలో 2020లో సంభవించిన మరణాల్లో 42 శాతం మరణాలకు కేవలం గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని అధ్యయనంలో తేలింది. ఏడాదిలో 18,11,688 మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల గణాంకాల ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘ఇండియా రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్’ తాజాగా మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ 2020 పేరిట నివేదిక విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల 2020లో 1,60,618 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తం మరణాల్లో కరోనా సంబంధిత మరణాలు కేవలం 8.9 శాతమే. అలాగే రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల కారణంగా 32.1 శాతం మంది, శ్వాస సంబంధిత జబ్బుల వల్ల 10 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక టీబీ, సెప్టిసెమియా కారణంగా 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. అంతేకాకుండా డయాబెటిస్, పోషకాహార లేమి వంటి వాటితో 5.8 శాతం మంది, గాయాలు, విషం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటితో 5.6 మంది, క్యాన్సర్‌తో 4.7 శాతం మంది మృతిచెందారు. 2020లో మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం మరణాల్లో 28.6 శాతం మంది(5,17,678) బాధితులు 70 ఏళ్ల వయసు దాటినవారే కావడం గమనార్హం. బాధితుల్లో ఏడాదిలోపు వయసు ఉన్నవారు 5.7 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 24 ఏళ్లవారిలో 19 శాతం మందిని రక్తప్రసరణ సంబంధిత వ్యాధులే పొట్టనపెట్టుకున్నాయి. -
నిమోనియా వ్యాధితో జరభద్రం..
నిమోనియాతో జరభద్రం నిమోనియా అన్నది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అనే విషయం తెలిసిందే. గతంలో వచ్చిన నిమోనియాలతో పోలిస్తే 2020, 2021ల్లో వచ్చిన నిమో నియాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గతేడాదీ, ఈ ఏడాదీ కోవిడ్ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదనీ, కోవిడ్ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్గా వచ్చిన నిమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల (నవంబరు) 12న ‘ప్రపంచ నిమోనియా డే’ సందర్భంగా ఆ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది ‘నిమోనియా’. 2019లో అది 25 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 6.72 లక్షలు చిన్నారులు కావడం విషాదం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది ఐదేళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులే. అగ్నికి ఆజ్యంలా... కోవిడ్ తోడుకావడంతో ఒక్క గతేడాది లెక్కలే చూస్తే... ఎప్పుడూ నమోదయ్యే నిమోనియా మృతులకు అదనంగా 19 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఓ అంచనా. నిమోనియాని పూర్తిగా నయం చేసేలా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయంటే పైన పేర్కొన్న గణాంకాలతో దాని తీవ్రత తేటతెల్లమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి నిమోనియా మరణాల సంఖ్యను ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కేవలం ముగ్గురికి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ లక్ష్యం. వ్యాధి నిర్ధారణ ►రోగిలో కనిపించే లక్షణాలతో ►సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ►ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె/గల్ల/తెమడ పరీక్ష వంటి పరీక్షలూ అవసరం కావచ్చు. నివారణ... ►పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. ►పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ కూడా. ►పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ►ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ►క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు. ►పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతంది. అది నిమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. నిమోనియాకు తక్షణం చికిత్స అవసరం... లేదంటే... పైన పేర్కొన్న అనేక కారణాల్లో దేని వల్ల నిమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు... మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా (అంటే రక్తానికి ఇన్ఫెక్షన్ సోకి, అది విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా నిమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది. అన్ని వయసుల వారిలోనూ... చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకు నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నారులూ, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం. ఈ సమస్యలుంటే మరింత అప్రమత్తత తప్పదు ►ఝఝసీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవారు గుండె సమస్యలు ఉన్నవారు ►స్పీన్ తొలగించిన వాళ్లు ►పొగతాగేవారు ►ఇక క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారిలో నిమోనియా రావడం మిగతావాళ్ల కంటే కాస్తంత ఎక్కువే. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను గుర్తించాక, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే, వారిలో అది మరెన్నో సమస్యలకు దారితీసే ముప్పు పొంచి ఉంటుంది. చికిత్స నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దాని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో... మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే. వారు వీలైనంత త్వరగా ఫిజీషియన్/మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకోవాలి. ఇవీ కారణాలు ఇటీవల విస్తరించిన, ఈ ఏడాది కూడా రెండోవేవ్‌తో స్వైరవిహారం చేసిన కరోనా వైరస్ ఓ ప్రధానమైన కారణమే అయినప్పటికీ... ఇది మాత్రమేగాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఇవే... ►బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా, హీమోఫీలస్ (మొదటిది పెద్దల్లో, రెండోది పిల్లల్లో నిమోనియాకు కారణమవుతుంది). అవే కాకుండా... గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల. ►ఫంగస్ వల్ల ►కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). ఇప్పుడు వ్యాప్తి చెందే కరోనా, ఇంకా అన్ని వైరస్‌లతో పాటు, నిమోనియాకి కూడా ఓవర్ క్రౌడింగ్ ఓ ప్రదాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్లడం నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తప్పదు. ►మైక్రో యాస్పిరేషన్ – ఒక్కోసారి తినే, తాగే సమయాల్లో మనకు తెలియకుడానే కొన్ని పదార్థాలూ, ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ►ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. ►ఆల్కహాల్ – దీనితో మనుషుల్లో రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. నిమోనియా లక్షణాలివే... ►దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా అనిపించటం, కొందరిలో ఆకలి లేకపోవడం ►కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది... తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ►నిమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం రావచ్చు. ►నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు. ఇంటస్టిషియల్ నిమోనియాలో అనే తరహా రకంలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. దాంతోఒక్కోసారి శ్వాసప్రక్రియ పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. ►ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ‘ఎగ్జుడస్’ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. దాంతో ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ►ఊపిరి అందకపోవడంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు. డాక్టర్ తపస్వి కె. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
సీఎం జగన్ సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్‌ను వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. సీఎం జగన్ సమక్షంలో వైద్యాధికారులు నెలల చిన్నారికి పీసీవీ వ్యాక్సిన్‌ను వేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మంత్రుల సమక్షంలో అన్ని జిల్లాలలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. కాగా న్యూమోనియా వ్యాధితో రెండేళ్ల లోపు చిన్నారుల ఎక్కువగా మృతి చెందుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన న్యూమో కాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ తో శిశుమరణాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ చిన్నారికి మూడు డోసుల టీకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా చిన్నారులకి వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఆరు వారాలు నిండిన 5,45,506 మంది చిన్నారులకి ఈ ఏడాది న్యూమోనియా తొలి డోసు వేయనున్నారు. ఇక 14 వారాలు నిండిన 4,09,130 మంది చిన్నారులకి రెండవ డోసు....తొమ్మిది నెలల నిండిన 68,188 మంది చిన్నారులకి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది రకాల వ్యాక్సిన్లను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా కొత్తగా ఇస్తున్న న్యుమోకాకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ -
ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత
అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు బెజన్ దారువాలా (89) మరణించారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన భారతదేశంలోని ప్రసిద్ధ జోతిష్య శాస్త్ర కాలమిస్ట్‌లలో ఒకరు. తన దశాబ్ధాల కెరీర్లో అనేక వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. బెజన్‌కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన చేతిని చూపించానని చెప్పడం విశేషం. అయితే తన తండ్రి కరోనా బారిన పడి మరణించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కుమారుడు నాస్టూర్ దారువాలా ఖండించారు. కాగా.. బెజన్ దారువాలా మరణానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి స్మతి ఇరానీలు సంతాపం ప్రకటిస్తూ.. 'ఆయన మరణం మమ్మల్ని కలిచివేసింది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే -
షాకింగ్ : కరోనాకు ముందు - ఆ తర్వాత!
కాలిఫోర్నియా: కరోనా వైరస్ బారినపడిన ఓ వ్యక్తి కోలుకున్న తర్వాత అతడి శరీరంలో ఎలాంటి మార్పు వచ్చిందో చూసి నెటిజన్లు కంగుతింటున్నారు. కాలిఫోర్నియాకు చెందిన మైక్ షుల్ట్జ్ అనే వ్యక్తి గత మార్చిలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయితే మహమ్మారి నుంచి కోలుకోవడానికి అతడికి 6 వారాలు పట్టింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి దాదాపు 23 కిలోగ్రాముల బరువు తగ్గాడు. బరువు తగ్గిన విషయాన్ని ఆయనే వెల్లడించాడు. కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చనీ, దాని ప్రభావం ఎంతలా ఉంటుందో అవగాహన కల్పించేందుకు కరోనా సోకినప్పుడు ఆసుపత్రిలో తీసుకున్న ఫోటోతో పాటు కరోనాకు ముందు తీసుకున్న ఫొటోలను మైక్ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘కరోనాకు ముందు నా బరువు 86 కిలోగ్రాములు. కరోనా తర్వాత ఇప్పుడు నా బరువు 63 కిలోగ్రాములకు పడిపోయింది. నిజానికి మైక్ శారీరకంగా బలమైన వాడే. అయితే కరోనా ఎలాంటి వారినైనా ప్రభావితం చేయగలదు. దానికి వయసుతో సంబంధం లేదు. మీరు ఆరోగ్య వంతులైనప్పటికీ కూడా ఈ మహమ్మారి మిమ్మల్ని ప్రభావితం చేయగలదు’ అంటూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మైక్ హెచ్చరించాడు. (దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు) గత మార్చిలో కరోనా బారిన పడ్డ మైక్.. కరోనా చికిత్సలో భాగంగా వెంటిలేటర్‌పై 6 వారాల పాటు ఉన్నట్లు చెప్పాడు. అదే విధంగా ఈ కోవిడ్-19 న్యూమోనియాతో పాటు తన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా తగ్గించిందని పేర్కొన్నాడు. దీంతో తను 23 కిలో గ్రాముల బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. ‘‘నేను వారానికి ఆరు నుంచి ఏడు సార్లు జిమ్‌లో వర్కవుట్ చేసేవాడిని. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే కరోనా ప్రభావం అధికంగా ఉన్న మయామి బీచ్‌లో మార్చిలో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యాను. అందువల్లే నేను కరోనా వైరస్ బారిన పడ్డాను. ఈ మహమ్మారి సోకడంతో నేను న్యూమోనియతో బాధపడటం.. క్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం మొదలయ్యింది. దీంతో వైద్యులు నన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. నేను స్వయంగా శ్వాస తీసుకోవడానికి 4 వారాల సమయం పట్టింది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే కరోనా కారణంగా న్యూమోనియా సమస్యలు రావడంతో చాలా చిక్కిపోయాను. ప్రస్తుతం మళ్లీ నా మునుపటి శరీరం పొందే పనిలో పడ్డాను’’ అని మైక్ పేర్కొన్నాడు. (పారిస్‌లో వైద్య సిబ్బందికి జరిమానా) -
వైరస్‌లూ తెచ్చే అనర్థం నిమోనియా
మామూలు ఫ్లూ జ్వరం (ఇన్ఫ్లుయెంజా) మొదలుకొని ఇప్పుడొచ్చే కరోనా అయినా నేరుగా మనిషిని చంపలేదు. వైరస్ సోకాక సెకండరీ ఇన్ఫెక్షన్లా వచ్చే నిమోనియాతో మనిషి మరణం అంచులకు వెళ్తాడు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు మరింత ఎక్కువ. ఇప్పుడొస్తున్న కరోనాగానీ... ఒకప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బర్డ్‌ఫ్లూ (హెచ్1ఎన్1), సార్స్, స్వైన్‌ఫ్లూ, మధ్యప్రాచ్యాన్ని భయపెట్టిన మెర్స్ వంటి వైరస్ల వల్ల వచ్చిన జ్వరాలు ఆ తర్వాత నిమోనియాకు కారణమవుతాయి.అలాంటి నిమోనియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మన ఊపిరితిత్తుల ద్వారా అనుక్షణం శ్వాసిస్తూ ఉంటామన్న విషయం తెలిసిందే కదా. అప్పుడే మన ప్రాణాలు నిలబడతాయి. ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచెలో ఉండే గాలి గదులను ‘ఆల్వియోలై’ అంటారు. ఈ ఆల్వియోలైలోనే బయటి నుంచి ఆక్సిజన్ మన శరీర అవయవాలకు అందడం, అక్కడే లోపలి కలుషితమైన గాలి బయటికి రావడం వంటి గ్యాసెస్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఆల్వియోలైలో ఈ కార్యక్రమం జరగడానికి అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. నిమోనియాకు కారణాలు ఇప్పటి కరోనా మాత్రమే గాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. ప్రధానంగా అవి... ♦ బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల. ♦ ఫంగస్ వల్ల కూడా నిమోనియా వస్తుంది. ♦ కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). కరోనా మొదలుకొని ఏ వైరస్ అయినా సోకడానికి ప్రధాన కారణం కాబట్టి గుంపులుగా వ్యక్తులుండే ప్రదేశాలకు అవసరమైతే తప్ప వెళ్లకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పక ధరించాలి. ♦ ఆల్కహాల్ తాగడం – దీనివల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తు లో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. ♦ మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుడానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. నిమోనియా లక్షణాలుసాధారణ నిమోనియాలో... ♦ దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడం ♦ కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ♦ నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు. ♦ నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా రావచ్చు. ♦ అసహజంగా అనిపించే ఇంటర్‌స్టిషియల్ నిమోనియాలో దగ్గు కూడా ఉంటుంది. ఇది ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఫెయిలయ్యే అవకాశమూ ఉంది. ♦ ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం. గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ఎగ్జుడస్ అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ♦ ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు. ♦ కొందరు రోగుల్లో ఛాతీలో తీక్షణమైన నొప్పి (షార్ప్ పెయిన్) రావచ్చు. సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే... ఏ కారణం వల్ల నిమోనియా వచ్చినప్పటికీ దానికి చికిత్స తీసుకోకపోతే అది మరింత సంక్లిష్టతలకు దారితీస్తుంది. అంటే దాని ఇతర కాంప్లికేషన్లయిన సెప్టిసీమియా (అంటే రక్తానికి అంతా ఇన్ఫెక్షన్ సోకి, రక్తమంతా విషపూరితంగా మారడం) వంటివి కనిపిస్తాయి. అంతేకాదు... రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం వంటివి రావచ్చు. చివరికి మరణం కూడా సంభవించవచ్చు. మరికొన్ని జబ్బుల్లో కూడా... మరికొన్ని జబ్బులు ఉన్నప్పుడు నిమోనియా సోకడం చాలా సాధారణం. డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇలాంటి వ్యక్తులకు వైరస్ సోకితే మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే వారు మరణించే అవకాశాలు ఎక్కువ. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను సక్రమంగా గుర్తించి, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే అది ఎన్నో కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. వ్యాధి నిర్ధారణ ♦ రోగిలో కనిపించే లక్షణాలను బట్టి ♦ సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ♦ ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు. నివారణ ♦ పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్లతోపాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దీన్ని నివారించవచ్చు. ♦ పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి. ♦ బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి. ♦ ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు. ♦ అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతోపాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. చికిత్స ♦ నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ♦ ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని గుర్తుంచుకోండి.- డాక్టర్ ఎస్. మల్లికార్జున్ రావు,సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
చైనాలో కరోనా కల్లోలం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు. చైనాలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఈ వ్యాధి రేపుతున్న కల్లోలం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసాధారణ రీతిలో కొత్త సంవత్సరం వేడుకల్ని చైనా సర్కార్ రద్దు చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ భారత్‌నూ భయపెడుతోంది. 13 నగరాలకు రాకపోకలు బంద్ కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా ఆంక్షలు విధించింది. మొట్టమొదటి సారి ఈ వైరస్ కనిపించిన సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో 13 నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకల్ని నిలిపివేసింది. బస్సులు, రైళ్లను రద్దు చేసింది. దీంతో 4.1 కోట్ల మందిపై ప్రభావం చూపించింది. హుబీ ప్రావిన్స్‌లో హువాన్, దాని చుట్టుపక్కల ఉన్న 13 నగరాల నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పట్టణాల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. కొత్త సంవత్సర వేడుకలకి దూరం చైనాలో శనివారం కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది. గణతంత్ర వేడుకలు కూడా రద్దు ఈ నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషే«ధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు కరోనా వైరస్ సోకిందన్న అనుమానం కలిగిన వారికి వైద్యపరీక్షలు, చికిత్సల కోసం రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ (ఎయిమ్స్) ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది ముంబైలో ఇద్దరికి వైద్య పరీక్షలు ముంబై, సాక్షి: చైనా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు జలుబు, దగ్గు ఉండటంతో ముందు జాగ్రత్తగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచే ముంబై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, చైనాకు వెళ్లి వచ్చిన 80 మందిని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో ఏడుగురికి దగ్గు, జ్వరం, గొంతువాపు ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ నుంచి?: ఈ వైరస్ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అయితే సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. వుహాన్‌లోని ఈ మార్కెట్లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు. క్రెయిట్ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల అభిప్రాయం. 10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం! వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా ఫీల్డ్ ఆస్పత్రిని వుహాన్‌లో చైనా నిర్మిస్తోంది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు. కాగా, అమెరికాలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. చికాగోకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ణయించారు. గత డిసెంబరులో ఈమె వుహాన్‌ను పర్యటించినట్లు తెలిపారు. మరో 50 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. లక్షణాలు తీవ్రమైన జ్వరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది న్యుమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు కిడ్నీలు విఫలం కావడం మాస్క్‌లు ధరించడం జాగ్రత్తలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం మాంసాహారం మానేయడం లేదా బాగా ఉడికించి తినడం మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం ఉతికిన దుస్తులు ధరించడం వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం దగ్గు, తుమ్ములు వచ్చినపుడు రుమాలు ఉపయోగించడం వన్యప్రాణులకు దూరంగా ఉండటం వుహాన్‌లో నిర్మించనున్న ఆస్పత్రి కోసం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు -
ప్రపంచ పొట్టి మనిషి మగర్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లోకి ఎక్కిన నేపాల్‌కు చెందిన 27 ఏళ్ల ఖగేంద్ర థాప మగర్ శుక్రవారం రాత్రి మరణించారు. 2.4 అంగులాల ఎత్తు మాత్రమే ఉన్న మగర్ గత కొంత కాలంగా నిమోనియాతో బాధ పడుతున్నారని, ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో మరణించారని సోదరుడు మహేష్ థాప మగర్ తెలిపారు. మగర్ తన 18వ ఏట సందర్భంగా 2010లో ప్రపంచంలోనే పొట్టి మనిషిగా ‘గిన్సిస్’ సర్టిఫికేట్ అందుకున్నారు. అదే సంవత్సరం జరిగిన నేపాల్ భామల అందాల పోటీలో హల్‌చల్‌చేసి విజేతలతో ఫొటోలకు ఫోజిచ్చారు. ‘ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడు పుట్టిన నేపాల్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎంతైన శిఖరం అందాలు’ నేపాల్ పర్యాటక శాఖ ప్రచారానికి మగర్ అంబాసిడర్‌గా పనిచేసి పలు దేశాలు తిరిగారు. ప్రపంచంలోని అత్యంత పొట్టి అబ్బాయిలను, అమ్మాయిలను కలుసుకున్నారు. పొట్టి అమ్మాయిని కలుసుకోవడానికి ఆయన భారత్ దేశానికి వచ్చారు. ఆ తర్వాత నేపాల్‌లోనే పుట్టిన చంద్ర బహదూర్ డాంగీ (ఒక అడుగు 7.9 అంగుళాలు) చేతుల్లో మగర్ గిన్నీస్ రికార్డు కోల్పోయారు. 2015లో డాంగీ మరణించడంతో మళ్లీ ప్రపంచ రికార్డు మగర్‌కే దక్కింది. -
జనవరి నెలలో పశువుల యాజమాన్యం
చలికాలం ముసుగుపోయి జనవరి మధ్యలో ఎండలు వెల్లిగా మొదలవుతాయి. పశువుల యాజమాన్యం గురించి జనవరి నెలలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంది. ► వేసవి మొదలు కావడంతో ముందుగా మనకు కానవచ్చేది పచ్చిమేత కొరత వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పచ్చిమేతను సైలేజీ గడ్డిగాను, ‘హే’గాను తయారు చేసుకునే సమయమిది. పాతర గడ్డిని తయారు చేసుకొని వేసవి సమయంలో పశువులకు మేపుకోవచ్చు. ► పశువులను పొగమంచు నుంచి రక్షించుకోవాలి. లేకపోతే న్యూమోనియా వస్తుంది. ► పశువు శరీరంలో తగినంత వేడిని పుట్టించడానికి ప్రొటీన్ కేకులు, బెల్లం కలిపి పశువుకు మేపాలి. ► ఖనిజాల లోపం రాకుండా పశువుల కొట్టాల్లో ఖనిజలవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీయాలి. ► జనవరి నెలలో తప్పనిసరిగా నట్టల మందు తాపించాలి. ► బాహ్య పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవడానికి కొట్టాల్లో తులసి, లెమన్‌గ్రాస్ లాంటి మొక్కలను వేలాడదీయాలి. ఆ వాసనకు కొన్ని పరాన్న జీవుల నియంత్రణ జరుగుతుంది. ► ఈగలు వాలకుండా వేపనూనె సంబంధిత ద్రావకాలను షెడ్లలో పిచికారీ చేయాలి. ∙జీవాల వలస సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిందటి వారం ‘సాగుబడి’ శీర్షికలో ప్రచురితమైంది. ► పశువుల్లో గాలికుంటు, పి.పి.ఆర్., చిటుక వ్యాధికి టీకా వేయించాలి. ► పండ్ల తోటలున్న వారు, వారి తోటల్లో స్టైలో హెమాటా లాంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
సైలెంట్ కిల్లర్.. న్యుమోనియా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవలి కాలంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు వాతావరణ కాలుష్యంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ప్రాంతంలో అత్యధికశాతం మంది నివాసం ఉండటం, పొగ వంటివి కారణాలుగా చెపుతున్నారు. వ్యాధి నిరోధక టీకాలు సరిగా వేసుకోని వారిలో కూడా న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు న్యుమోనియా సోకితే ప్రాణాంతకంగా మారుతుందని, పెద్దవారికి సోకినా సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. శీతాకాలంలో న్యుమోనియా మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా సోకుతుంది... న్యుమోనియా వ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజువాల వలన సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. మనం శ్యాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి, కొద్దికాలానికి తెల్లరక్తకణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువుగా ఉన్నా, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కోలేకపోవచ్చు. ధూమపానం, మద్యపానం చేసే వారిలో, సమతుల ఆహారం తీసుకోని వారిలో మధుమేహం, హెచ్ఐవీ, క్యాన్సర్, గుండె, ఊపిరి తిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో వ్యాధి నిరోధకశక్తి తక్కువుగా ఉంటుంది. అలాంటి వారిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్సిరేటర్ సిన్సిషియల్ వైరస్(ఆర్ఎస్వీ), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయోంజా వైరస్ వలన వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యుమోనియా తరచుగా వస్తుందంటున్నారు. న్యుమోనియా లక్షణాలు.. చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి వంటి సాధారణంగా ఉంటాయి. కొందరిలో దగ్గుతో పాటు రక్తం కూడా పడవచ్చు. కొందరిలో కఫం చిక్కగా, కొందరిలో పలుచగా పడుతుంది. నోటి వెంట పడే కఫం రంగును బట్టీ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు.. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం ద్వారా ఇతర అవయవాలకు సోకే అవకాశం ఉంది. దీనినే బాక్టీరిమియా సెప్టిసీమియా అంటారని వైద్యులు చెపుతున్నారు. నిర్ధారణ ఇలా... రక్త పరీక్షలో తెల్ల రక్తకణాల సంఖ్య, ఈఎస్ఆర్ వంటి పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వరుసగా చేసే ఈ పరీక్షలో వ్యాధి తగ్గుముఖం పట్టిందా..లేదా అనే వి«షయం కూడా తెలుస్తుంది.. కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే, బ్రాంకోస్కోపీ వంటి వాటి ద్వారా నిర్ధారించవచ్చు. ముందు జాగ్రత్త ఎంతో మేలు ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా సోకితే ప్రాణాంతకంగా మారవచ్చు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకూ తల్లిపాలు ఇవ్వడం, చక్కని శుభ్రత పాటించడం వలన చిన్నారుల్లో న్యుమోనియా రాకుండా చాలా వరకూ నివారించవచ్చు. న్యుమోకోకల్ టీకాను బిడ్డకు ఇప్పించడం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూడవచ్చు. సాధారణ న్యూమోనియా కన్నా, బాక్టీరియా ద్వారా సంక్రమించే న్యుమోకోకల్ వ్యాధులు చాలా తీవ్రమైనవి. వీటితో మెదడు వాపు, చెవిలో ఇన్ఫెక్షన్తో పాటు మరణాలకు దారితీస్తాయి, న్యుమోనియా లక్షణాలు గుర్తించి తొలిదశలో చికిత్స చేస్తే పూర్తిగా నివారించవచ్చు. – డాక్టర్ ఎన్.ఎస్.విఠల్‌రావు, ప్రొఫెసర్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల -
న్యుమోనియానూ ఎదుర్కోలేకపోతున్నాం
ఐక్యరాజ్యసమితి: అదేమి అరికట్టలేని భయంకరమైన వ్యాధి కాదు. చికిత్స లేని ప్రాణాంతకమైన జబ్బు కూడా కాదు. కానీ భారత్ మాత్రం ఆ వ్యాధిని నియంత్రించడంలో చతికిలపడిపోతోంది. అదే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది. 2018లో న్యుమోనియా వ్యాధి సోకి ఎందరు చిన్నారులు బలయ్యారో యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను సేకరించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియో సోకి మరణిస్తున్నారు. ఆ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన పుట్టిస్తోంది. 2018లో ప్రపంచ దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 8 లక్షల మందికి పైగా న్యూమోనియా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయిన పసివారు లక్షా 53 వేలుగా ఉంది. పేదరికమే కారణం అసలు న్యుమోనియా అన్న వ్యాధి ఉందన్న సంగతి కూడా ఎన్నో దేశాలు మర్చిపోయిన వేళ హఠాత్తుగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరగడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయిదేళ్ల కంటే తక్కువ వయసున్న వారి మృతుల్లో 15 శాతం న్యుమోనియా కారణంగా నమోదవుతున్నాయని చెప్పింది. పేదరికానికి, ఈ వ్యాధికి గల సంబంధాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలుగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. న్యుమోనియా మరణాల్లో ఆ దేశాలే టాప్ న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే నమోదవుతున్నాయి. నైజీరి యా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా దేశాలే దీనికి బాధ్యత వహించాలని యూఎన్ వెల్లడించింది గత ఏడాది మృతుల సంఖ్య నైజీరియా 1,62,000 భారత్ 1,27,000 పాకిస్తాన్ 58,000 డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 40,000 ఇథియోపియా 32,000 -
కృష్ణంరాజుకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కృష్ణంరాజు ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. -
పొంచి ఉన్న ప్రాణాంతక నిమోనియా ..
సాక్షి, ఆలేరు : చలిగాలుల తీవ్రత అధికమౌతుంది. దీంతో చిన్నారులతో సహా పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు అస్తమయం కాకుండానే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు చర్మ సంబంధ వ్యాధులను కలగచేస్తాయి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్టుగా మారిన లక్షణాలు కనిపిస్తాయి. పొంచి ఉన్న నిమోనియా .. శీతాకాలంలో చిన్నారులకు ప్రాణాంతకమైన నిమోనియా వ్యాధి పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారింది. మండలంలో ఇటీవల న్యుమోనియా కేసులు అక్కడ క్కడా నమోదవుతున్నాయి. ఇటీవల మండల పరిధిలో అనేక మంది చిన్నారులకు జలుబు, జ్వరం వచ్చి ఆస్పత్రిపాలు అయ్యారు. వైరస్ లేదా, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోగ నిరోధక శక్తి, తక్కువగా ఉండే చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతుంది. మొదట జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతుంది. న్యూమోనియా తీవ్రత పెరిగితే అస్తమా, ఫిడ్స్‌కు గురవుతారు. సూక్ష్మజీవుల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. పిల్లలకు తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, డొక్కలు ఎగరవేయడం, పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం తదితర వంటివి నిమోనియా లక్షణాలు. తేమశాతం తగ్గడం, పెరగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కూడా నిమోనియా బారిన పడే అవకాశముందని వైద్యులు చెపుతున్నారు. అందుబాటులోకి పెంటావాలెంట్ వ్యాక్సిన్: చిన్నారుల ప్రాణాంతక నిమోనియా బారిన పడకుండా పెంటావాలెంట్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమోనియా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది చిన్నారులు మరణించారని 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. అప్పటి నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించి దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ టీకాలు సరఫరా చేస్తున్నారు. పెంటావాలెంట్ టీకాతో హిమోíఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (íß బ్) బ్యాక్టీరియా వలన కలిగే నిమోనియా పూర్తిగా తగ్గిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి .. పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. కాలుష్యం, అపరిశుభ్రత, ఆహార కాలుష్యం, పౌష్టికాహారలోపం లేకుండా చూసుకోవాలి, నిద్ర సమయంలో గురక, ఎక్కువగా చాతి కదలడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చల్లటి పదార్థాలు, చల్లటి నీరు తాగించవద్దు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అజాగ్రత్త వహించవద్దు. గోరువెచ్చటి నీటిని చిన్నారులకు తాగించాలి ఒకటి రెండు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. -
నిమోనియా.. ప్రాణాలు తీసేనయా!
ఈ ఫొటోలో చిన్నారితో కలిసి ఉన్న ఈమె పేరు లక్ష్మి. రూరల్ పరిధిలోని వికలాంగుల కొట్టాల్లో నివాసముంటోంది. చిన్నారికి కొన్ని రోజులుగా దగ్గు, జలుబు, జ్వరం వస్తుండడంతో సర్వజనాస్పత్రిలో చేర్పించింది. అలాగే మరో చిన్నారి పేరు అర్బన(5 నెలలు) శెట్టూరు మండలం బలపంపల్లి గ్రామం. నాలుగు రోజుల నుంచి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఆస్పత్రిలో నిమోనియాతో బాధపడుతూ ఎంతో మంది చేరుతున్నారు. అనంతపురం న్యూసిటీ: నిమోనియా వ్యాధి చిన్నారులను ప్రాణాలను కబలిస్తోంది. సీజినల్ వ్యాధుల్లో జ్వరపీడితులకు దీటుగా నిమోనియా బాధితులు పెరిగిపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా చిన్నారులు దీని బారిపడి మృత్యువాత పడుతున్నారు. అప్రమత్తతే శరణ్యమని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటుని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు అనుభవజ్ఞులైన చిన్నపిల్లల వైద్యులతోనే వైద్యం ఇప్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దగ్గు, జలుబు వస్తే చిన్నపాటి సూది మందు వేసుకుని పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. పెరుగుతున్న మరణాలు చిన్నారులు నిమోనియాతో బాధపడుతూ మృత్యువాతపడుతున్నారు. ఈ నెల 12న కళ్యాణదుర్గానికి చెందిన లక్ష్మి(2) నిమోనియాతో బాధపడుతూ సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో మృతి చెందింది. ఈ నెల 13న కుందుర్పికు చెందిన బేబీ ఆఫ్ బొమ్మక్క(2 నెలలు) సివియర్ నిమోనియాతో మృతి చెందింది. అలాగే ఈ నెల 14న ఉరవకొండ చిన్నకౌకుంట్లకు మధు(3నెలలు) నిమోనియాతో మృతి చెందాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. కిక్కిరిస్తున్న సర్వజనాస్పత్రి సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లలో వార్డులో గత మూడు నెలల్లో 50కిపైగా నిమోనియా కేసులు నమోదయ్యాయంటే వ్యాధి తీవ్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల వార్డులో 60 పడకల సామర్థ్యం ఉంటే అందులో వందకుపైగా కేసులున్నాయి. దీంతో వార్డు కిక్కిరిసిపోతోంది. వ్యాధి లక్షణాలు నిమోనియా అనేది బ్యాక్టీరియల్ వైరస్. పెద్దల్లో దగ్గు, జలుబు ఉంటే పిల్లలకు త్వరగా అంటుకుంటుంది. చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరితగతిన దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం, పిల్లికూతలు, కడుపు ఎగిరేస్తూ ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. టీకాలు సరిగా వేయించని, బరువు తక్కువ పిల్లలకు, నెలలు నిండని పిల్లలకు నిమోనియా వచ్చే అవకాశాలున్నాయి. ఏం చేయాలి? ⇔ ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తే తక్షణం వైద్యున్ని సంప్రదించాలి. ⇔ ఇంట్లో ఎవరికైనా పెద్దలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే వారి వద్దకు పిల్లలను పంపరాదు. వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ⇔ పసివయసులో తల్లిపాలతో పాటు టీకాలు తప్పక వేయించాలి. ప్రైవేట్‌గా నిమోకోకల్ వ్యాక్సిన్ లభిస్తుంది. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఇంత వరకు ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టడం లేదు. అర్చన(బలపంపల్లి, శెట్టూరు) -
‘‘యా అల్లా’’ ఎంత పనిచేశావయ్యా..
ఆడపిల్లను భారంగా భావించే రోజులు..ముగ్గురు బంగారు తల్లులు.రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప..పూట గడవని కుటుంబం.పిల్లల చిరునవ్వులే..ఆ ఇంట్లో వెలుగు దివ్వెలు.పట్టుమని పదేళ్లు కూడా లేవు..ఇద్దరు పిల్లలను మృత్యువు కబలించింది.కళ్లెదుటే ఒక్కో ప్రాణం నిలిచిపోయింది..కన్నపేగు విలవిల్లాడింది.అల్లారుముద్దుగా పెంపకం..ఆ ఇంటి పెద్ద హృదయం ముక్కలైంది.తల్లి కంట్లో కన్నీటి సుడులు.. తండ్రి చేతుల్లో కంటి పాపలు..మూడంతస్తుల మేడ..ఒక్కో మెట్టూ కరిగిపోయింది.రాలిన పూల సాక్షిగా..ప్రభుత్వాసుపత్రి మూగబోయింది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో గురువారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృత్యువొడి చేరారు. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల కళ్లముందే రక్తం కక్కుకుని మృతి చెందిన ఘటనతో ఆసుపత్రి ఆవరణ మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. పెనుకొండ పట్టణంలోని బీటీఆర్ కాలనీకి చెందిన మహబూబ్‌బాషా, షబానా దంపతులకు గౌసియా(8), హర్షియా (4), ఆలియా(2) సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే ఆయినా మహబూబ్‌బాషా ఏమాత్రం దిగులు చెందలేదు. భార్యతో కలిసి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బట్టీల వద్ద పనిలేనప్పుడు కార్పెంటర్ల వద్ద కూలీ పనులకు వెళ్లేవాడు. బాషా రెక్కాడితేనే ఆ ఇంట్లో పిల్లల డొక్క నిండుతుంది. అయినప్పటికీ బిడ్డలందరినీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పెద్దకుమార్తె గౌసియా(8) పుట్టుకతో డౌన్‌సిండ్రోమ్(జన్యుపరమైన సమస్య)తో బాధపడుతుండగా.. తన శక్తిమేరకు చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిన్న అమ్మాయి ఆలియా(2) కూడా పదిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు గౌసియాకు కూడా తీవ్ర జ్వరం రావడంతో భయాందోళన చెందిన మహబూబ్‌బాషా ఈ నెల 25న పెనుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. అయితే అక్కడి వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే మందులురాసి ఇంటికి పంపాడు. ఇంటికెళ్లాక ఇద్దరు పిల్లలకు మందులు వేయగా.. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో హుటాహుటిన చిన్నారులిద్దరినీ కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. 26వ తేదీ ఉదయం 1.45 గంటల సమయంలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే గౌసియా నోరు, ముక్కు నుంచి రక్తాస్రావం అవుతోంది. వైద్యులు పరీక్షించి, బ్లీడింగ్ డయాతసిస్గా నిర్ధారణకు వచ్చారు. రక్తం ఆగేందుకు మందులు పెట్టారు. అలాగే ఆలియాకు జ్వరం తగ్గేందుకు చికిత్స చేశారు. అయితే ఉదయం 10.10 గంటల సమయంలో గౌసియాకు ఫిట్స్రాగా ఆ అమ్మాయి కాసేపటికి మృతి చెందింది. గౌసియా గొంతులో వాపు రావడం కంఠసర్పి లక్షణాలను తలపిస్తోంది. ‘‘యా అల్లా’’ ఎంత పనిచేశావయ్యా.. తమ కళ్లముందే చనిపోయిన ఇద్దరు బిడ్డలను చూసి మహబూబ్‌బాషా, షబానాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు పిల్లలు మంచంపై రక్తం కక్కుని పడి ఉండడాన్ని చూసి తల్లి షబానా బోరున విలపించింది. ‘‘యా అల్లా’’ ఎంత పని చేశావయ్యా... అంటూ విలపించింది. ఆలియా ‘‘భేటీ ఉఠో..ఉఠో’’ అంటూ ఆమె విలపించిన తీరు చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. పెంచిన చేతులతోనే... మృతి చెందిన చిన్నారులను ఆస్పత్రి నుంచి అంబులెన్స్ వరకు తరలించడానికి కనీసం స్ట్రెచ్చర్ కూడా లేని పరిస్థితి. చిన్నపిల్లల విభాగంలో స్ట్రెచ్చర్, వీల్చైర్లు లేకపోవడం.. అక్కడ నాల్గో తరగతి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులే ప్రాణం లేని ఆ పసిబిడ్డలను మూడో అంతస్తు నుంచి కిందవరకూ చేతుల్లోనే మోసుకువెళ్లారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు..గానీ ఆస్పత్రి సిబ్బందిలోని ఏ ఒక్కరూ వారికి కనీస సాయం చేయలేకపోయారు. అలా బిడ్డలను చేతులమీదే కిందకు తీసుకువచ్చిన మహబూబ్‌బాషా దంపతులు మహాప్రస్థానం వాహనంలో ఇంటికి తీసుకువెళ్లారు. వ్యాధి నిరారించడంలో వైద్యుల విఫలం గౌసియా, ఆలియా మృతి ఘటనలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పెనుకొండ, హిందూపురం ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రమాదకర కేసులను తేలిగ్గా తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం వ్యాధి నిర్ధారించలేనట్లు అవగతమవుతోంది. చివరి నిమిషంలో సర్వజనాస్పత్రికి పంపి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడినట్లు తెలుస్తోంది. ప్రారంభంలోనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువచ్చింటే చిన్నారులకు మెరుగైన వైద్యం అందేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. అక్క వెంటే చెల్లి... నిమోనియా, మాల్ న్యూట్రీషియన్తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ఆలియాకు వైద్యులు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. ఆ సమయంలో గౌసియా చనిపోవడంతో కన్నీరుమున్నీరైన తల్లి.. చిన్నకుమార్తె ఆలియా ఆక్సిజన్ మాస్క్ తొలగించి బయటకు తీసుకెళ్లింది. దీంతో వెంటనే ఆలియా నోరు, ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఆ కొద్దిసేపటికే ఆలియా కూడా మృతి చెందింది. శోకసంద్రంలో పెనుకొండ పెనుకొండ: గౌసియా, ఆలియా మృతి వార్త తెలిసిన వెంటనే పెనుకొండలోని బీటీఆర్ కాలనీకి తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను తీసుకురాగానే బంధువులు, సమీప ప్రాంతాల వారు మహబూబ్‌బాషా ఇంటికి తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న చిన్నారులు చూసి చలించిపోయారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి సాయంత్రం వేళ చిన్నారులిద్దరినీ ఖననం చేశారు. కాగా, ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారని తెలుసుకున్న పోలీసులు మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫిట్స్, నిమోనియాతో పిల్లలు మృతి గౌసియా జన్యుపరమైన సమస్య(డౌన్‌సిండ్రోమ్) బ్లీడింగ్ డయాతసిస్తో బాధపడుతూ అడ్మిట్ అయ్యింది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావమయ్యే సమయంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో గుండె, ఊపిరితిత్తులు పనిచేయక మృతి చెందింది. ఆలియా నిమోనియాతో పాటు మాల్ న్యూట్రీషియన్(పౌష్టికాహారం లోపం)తో బాధపడుతోంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో మృతి చెందింది.– డాక్టర్ మల్లీశ్వరి(హెచ్ఓడీ) -
అయ్యో పాపం..!
కొత్తగూడెంఅర్బన్: ఈ పాల బుగ్గల పసికందును చూస్తుంటే ఎవరి హృదయమైనా ఇలాగే రోదిస్తుంది. కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం ఓ మూడు నెలల పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. చుంచుపల్లి ఎస్సై నరేష్, చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. టేకులపల్లి మండలం ముత్యాలంపాడుకు చెందిన ఎం.అనూష, నాగరాజు దంపతులకు రెండవ సంతనంగా మూడు నెలల క్రితం పాప పుట్టింది. శుక్రవారం ఉదయం పాప బాగా ఏడుస్తోంది. పాలు కూడా తాగడం లేదు. తల్లిదండ్రులు భయాందోళనతో కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడు వంతెన సమీపంలోగల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ సిబ్బంది తప్ప వైద్యులు లేరు. వచ్చిన తరువాత పాపను పరీక్షించారు. ఆక్సిజన్తోపాటుసెలైన్ ఇచ్చారు. ఆ తరువాత ఎక్స్‌రేకు పంపించారు. క్స్‌రే రిపోర్ట్ చూసి, వెంటనే ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యలోనే పాప ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు కలిసి ఆస్పత్రి ఎదుట రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. త్రీ టౌన్, వన్ టౌన్, చుంచుపల్లి పోలీస్ స్టేషన్ల సిబ్బంది సర్దిచెప్పి వచ్చి ఆందోళనను విరమింపజేశారు. వైద్యులు, తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆస్పత్రి డాక్టర్ మొరిశెట్టి హరిపై చుంచుపల్లి ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.దీనిపై డాక్టర్ మొరిశెట్టి హరిని వివరణ కోరగా.. ‘‘పాపకు శ్వాస సంబంధ వ్యాధి ఉంది. నిమోనియా ఉండడంతో వలన శ్వాస తీసుకోలేకపోయింది’’ అని చెప్పారు. -
ఒక్క వాతతో జబ్బులన్ని నయం
సవాయి మాధోపూర్, రాజస్థాన్ : ఓ పక్క అంగారకునిపై ఆవాసానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరొపక్క దగ్గు, జలుబు లాంటి చిన్నచిన్న వ్యాధులను తగ్గించడానికి నేటికి నాటువైద్యాన్ని, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్న పరిస్థితుల్లో భారత గ్రామీణం ఉంది. అనారోగ్యాన్ని నయం చేస్తుందని నమ్మి మంత్రగత్తె వద్దకు వెళ్తే యాసిడ్‌తో చిన్నారి ఛాతి, కాళ్లను కాల్చిన సంఘటన రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక నెల వయసున్న పసికందు ప్రియాంషు కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. బంధువుల సలహతో ఈ నెల 26న పసివాడి తల్లి ప్రియాంషును వినోబా బస్తీలో ఉన్న ఓ మహిళ వద్దకు తీసుకెళ్లింది. న్యూమోనియాను తగ్గించడం కోసం ఆ మహిళ చిన్నారి ఛాతి మీద రసాయనాలు పోసింది. దాంతో చిన్నారి ఛాతి, పాదాలు కాలిపోయాయి. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలతో ఉన్న చిన్నారిని చూసి డాక్టర్లు కొత్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆస్పత్రిలో చేర్చుకున్నారు. పోలీసులు శుక్రవారం సదరు మహిళను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న సవాయి మాధోపూర్ జిల్లా కలెక్టర్ కేసీ వర్మ ఆస్పత్రికి వచ్చి చిన్నారిని పరమార్శించారు. ఈ విషయం గురించి గ్రామస్తులను విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మాయగాళ్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. సవాయి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ నాలుగు నెలల చిన్నారికి దగ్గు, జలుబు నయం చేయడానికి ఇనుపకడ్డితో వాత పెట్టారు. ఈ విషయం గురించి పోలీసులకు తెలియడంతో చిన్నారిని మహాత్మ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే మరో 10నెలల చిన్నారికి న్యూమోనియా తగ్గడం కోసం ఆమె తాత ఇనుప కడ్డితో వాత పెట్టాడు. దాంతో ఆ పాప మరణించింది. మూఢవిశ్వాసానికి సంబంధించిన కేసులు ఇక్కడ సాధరణమని మహాత్మ గాంధీ ఆస్పత్రి పీడియాట్రిక్ ఇన్చార్జ్ డాక్టర్ ఓపీ అగల్ తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం న్యూమోనియాను నివారించడం కోసం ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని 9జిల్లాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యూమోనియా నివారణ కోసం పిల్లలకు న్యూమోనియా ‘కాన్జుగేట్’ టీకాను ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. -
హిల్లరీ క్లింటన్ ఫిట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆరోగ్యంపై అనేక వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో వాటిని తెరదించేందుకు ఆమె సిద్ధమయ్యారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను విడుదల చేశారు. హిల్లరీ ఆరోగ్యంగానే ఉన్నారని, అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వ్యక్తిగత వైద్యుడు లిసా బర్డాక్ చెప్పారు. నాలుగు రోజుల క్రితం న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 దాడుల మృతులకు నివాళులర్పిస్తుండగా స్పృహ తప్పి పడిపోయిన విషయం విదితమే. దీంతో ఎన్నికల ప్రచారంతో పాటు నిధుల సేకరణ కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న కాలిఫోర్నియా పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. దీంతో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హిల్లరీకి ఆరోగ్య సమస్యలు కొత్త కాదని, గతంలో అనేకమార్లు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. గతంలో ఒకసారి క్లేవ్‌ల్యాండ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా గుక్కతిప్పుకోలేని దగ్గుతో హిల్లరీ ఇబ్బంది పడ్డారు. 2013 డిసెంబర్లో అకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోవడంతో న్యూయార్క్‌లోని ప్రెస్పిటేరియన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె వ్యక్తిగత వైద్యుడు బర్డాక్ మాత్రం ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నారని, అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన ఫిట్నెస్తో ఉన్నారని చెబుతున్నారు. -
అసోం పీసీసీ అధ్యక్షుడు కన్నుమూత
న్యూఢిల్లీ : అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ దత్తా (64) గురువారం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా అంజన్ దత్తా గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 17న చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. అయితే అంజన్ దత్త ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 25న అంజన్ దత్తాను పరామర్శించిన వషయం తెలిసిందే. మరోవైపు అంజన్ దత్తా మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. -
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే న్యుమోనియా!
పల్మనాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. మాకు తెలిసిన కొన్ని మందులు వాడినా లక్షణాలు తగ్గలేదు. గత ఏడాది కూడా చలికాలంలో ఇలాంటి సమస్యే కనిపించి, కొంతకాలం తర్వాత తగ్గింది. మా బాబుకు చలికాలంలోనే ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. దానంతట అదే తగ్గిపోతుందని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ సమస్య క్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. మా బాబుకు ఏమైందో తెలియడం లేదు. చలికాలంలోనే ఇలాంటి సమస్య ఎందుకు వస్తోంది. దయచేసి వాడి సమస్యకు తగిన పరిష్కారం చూపించగలరు. - రాజేశ్వరి, మహబూబ్‌నగర్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ బాబు న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్య ఉన్నవారికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే వ్యాది తీవ్రమైపోయి, శ్వాస ఆడక పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే న్యుమో నియా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచించిన జాగ్రత్తలు పాటించండి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, అధిక చల్లదనం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. సులువుగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ బాబుకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించారా లేదా ఒకసారి చూసుకోండి. న్యుమోకోకల్, ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) అనే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేయించడం ద్వారా పిల్లలకు న్యుమోనియా రాకుండా నివారించవచ్చు. అపరిశుభ్ర వాతావరణం, పోషకాహార లోపం, శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల న్యుమోనియా వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలం అనర్థాలను నివారించడానికి మీ బాబు శరీరం పూర్తిగా కప్పి ఉండేలా స్వెటర్లు వేయండి. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బాబును బయటకు తీసుకెళ్లకండి. వీలైనంత వరకు చలిగాలి తగలకుండా చూడండి. ఈ సీజన్లో చల్లటి పానీయాలు, చల్లటి పదార్థాలు ఇవ్వకపోవడమే మంచిది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయు 64 ఏళ్లు. గత రెండేళ్లుగా నేను హైబీపీతో బాధపడుతున్నాను. నిరుడు రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్ 6, యూరియా 120 వరకు ఉన్నాయి. నా కిడ్నీలు పనిచేయడం లేదని చెబుతున్నారు. కానీ నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. నాకు ఇలా ఏ లక్షణాలూ కనిపించకపోయినా లోపల ఏవైనా సమస్యలు ఉండి ఉంటాయా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? - లోకేశ్వరరావు, నేలకొండపల్లి మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బు వచ్చినవారిలో రెండు కిడ్నీల పనితీరు బాగా తగ్గిపోతుంది. రక్తపరీక్షలూ ఏమీ తెలియకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం కంటే తగ్గగానే ఈ జబ్బు లక్షణాలు వెంటనే తెలుస్తాయి. కాబట్టి మీరు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. హైబీపీ, డయాబెటిస్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉంటే... వారికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏడాదీ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే... కిడ్నీలను కాపాడుకునే వీలు అంత ఎక్కువ. నా వయసు 48 ఏళ్లు. నేను గత ఏడాదిగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోదా? - రమేశ్‌కుమార్, కరీంనగర్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ కిడ్నీ కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే పనిచేస్తోందని అనుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)లో ఇలాంటి పరిస్థితే సంభవిస్తుంది. ఈ దశలో మీరు వారానికి మూడుసార్లు తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాల్సిందే. ఒకవేళ మీరు క్రమం తప్పితే ఆ ప్రభావం మీ శరీరంలోని ఇతర కీలక అవయవాల మీద పడే అవకాశం ఉంది. జీవన నాణ్యత కూడా తగ్గుతుంది. పై పరిణామాలను నివారించడానికి మీరు తప్పనిసరిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోక తప్పదు. లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ ఆస్తమా ఉన్నవారు చలికాలంలో అనుసరించాల్సిన జీవనశైలిలో మార్పులు చెప్పండి. - శ్రీధర్, తుంగతుర్తి ఈ సీజన్ ఆస్తమా రోగులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. మీరు అనుసరించాల్సిన సూచనలివి... చేతులు కడుక్కోవడం : మీరు వీలైనన్ని ఎక్కువసార్లు మీ చేతుల్ని కడుక్కుంటూ ఉండండి. సబ్బుతో కడుక్కుంటూ ఉండటం వల్ల చేతులకు అంటుకునే జలుబును కలిగించే వైరస్‌లను ముక్కు వరకూ చేరకుండా ఉంచవచ్చు. అలాగే ఇతర హానికారక క్రిములూ కొట్టుకుపోతాయి ఫ్లూని నివారించే వ్యాక్సిన్ తీసుకోండి : చాలా చిన్న వయసు పిల్లలూ, వయసు పైబడిన వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఆస్తమాకు తేలిగ్గా గురవుతారు. పైగా ఫ్లూను కలుగజేసే క్రిముల వల్ల ఆస్తమా బారినపడే అవకాశాలు మరింత ఎక్కువ. కాబట్టి ఈ సీజన్లో ఫ్లూని నివారించే వ్యాక్సిన్ (ఫ్లూ షాట్) తీసుకోండి. దీనివల్ల మీకు ఫ్లూ తర్వాతి నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలుగుతుంది చలిమంట, కాలే కట్టెల దగ్గర కూర్చోకండి : చలికాలంలో ఆస్తమా ఉన్నవారికి మంట దగ్గర ఉండటం మరింత ఉపశమనంగా ఉంటే ఉండవచ్చు. కానీ చలిమంట దగ్గర, కాలే కట్టెల వద్ద ఆస్తమా రోగులు కూర్చోకపోవడం మంచిది. కట్టెలపొయ్యి దగ్గర కూర్చొని ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఉపశమనం దొరుకుతుందనుకుంటే పొరబాటే. ఎందుకంటే చలిమంట, కట్టెలపొయ్యి నుంచి వచ్చే పొగలు, ఆవిర్లు ఊపిరితిత్తులను మరింతగా మండిస్తాయి. ఆస్తమాను ప్రేరేపిస్తాయి నోటిని మూసి ఉంచండి: కేవలం ముక్కుతో మాత్రమే శ్వాసతీసుకుంటూ ఉండాలి. నోటిద్వారా ఎంత మాత్రమూ శ్వాసించకూడదు. ఇక ముక్కుకు ఏదైనా అడ్డంకి ఉంచుకోవడం మరీ మంచిది ఏసీ ఫిల్టర్లను మార్చుకోండి : మీ ఏసీ ఫిల్టర్లను మార్చుకుంటూ ఉండండి. ఈ ఫిల్టర్లను మార్చుకోవడం క్రమం తప్పకుండా జరగాలి ఇంట్లోనే వ్యాయామం చేయండి : వ్యాయామం ఇంట్లో చేయాలి లేదా ఇన్‌డోర్స్‌లో మాత్రమే జరగాలి వార్మప్ తర్వాతే వ్యాయామాలు : వ్యాయామం చేసే ముందర తగినంత సేపు వార్మప్ ప్రక్రియలతో దానికి సంసిద్ధం కావాలి. ఇలా వార్మప్ చాలాసేపు చేశాక, వ్యాయామం చేసే వారిలో ఊపిరితిత్తుల పనిసామర్థ్యం పెరుగుతుందనీ, వాళ్లు తక్కువగా ఆస్తమాకు గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా ఇలాంటివాళ్లు ఆస్తమాకు గురైతే తేరుకోవడమూ చాలా వేగంగా జరుగుతుందనీ పరిశోధనలు పేర్కొంటున్నాయి మందులు తప్పక వాడండి : ఆస్తమాను నివారించే మందులు, ఇన్హేలర్స్ మరచిపోకుండా వాడండి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. లక్షణాలు కనిపించన వెంటనే డాక్టర్‌ను కలవండి. -
ఉక్రెయిన్‌లో నల్లగొండ విద్యార్థి మృతి
రామన్నపేట (నల్లగొండ) : ఉక్రెయిన్‌లోని జెప్రోసియాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నల్లగొండ జిల్లాకు చెందిన దేవరపల్లి శ్రీకాంత్‌రెడ్డి (20) అనే విద్యార్ధి బుధవారం ఉదయం మృతి చెందాడు. శ్రీకాంత్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. రామన్నపేట మండలం దుబ్బాక పంచాయతీ రొంటకోలు గ్రామానికి చెందిన దేవరపల్లి భిక్షంరెడ్డి-సూర్యకళ దంపతుల కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి. ఉక్రెయిన్‌లో జెప్రోసియాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వారం రోజులుగా న్యుమోనియాతో బాధపడుతూ పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది. -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా బాబు వయసు ఏడాదిన్నర. దగ్గు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌కి చూపించాం. ఛాతీలో నెమ్ము ఉందని చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. ఈ నెమ్ము సమస్య ఎందుకు వస్తుంది? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సంతోషి, కమలాపురం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. డయేరియా తర్వాత పిల్లల్లో ప్రమాదకరంగా పరిణమించే వ్యాధుల్లో ఇది రెండోదని చెప్పవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల వల్ల, రోగనిరోధక శక్తి లోపాల వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. ఒక ఏడాది వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్యచికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే గుంపులు గుంపులుగా జనం ఉన్న చోట్లకు నిమోనియాతో బాధపడే పిల్లలను పంపకూడదు ఇంట్లో చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులు ఉంటే వారి నుంచి కూడా ఈ పిల్లలను దూరంగా ఉంచాలి పిల్లలందరికీ టీకాలు వేయించడం ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పల్మొనాలజీ కౌన్సెలింగ్
మావారికి ఆస్థమా ఉంది. ఇది ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ అని తేలింది. ఒక్కోసారి అది ప్రమాదకరం కూడా అని తెలిశాక ఆందోళనగా ఉంది. నిమోనియా నివారించడానికి జాగ్రత్తలు చెప్పండి. - సునీత, గుంటూరు పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి బయటి వాతావరణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. మావారు సిగరెట్లు ఎక్కువగా తాగుతారు. దగ్గు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌ను కలిశాం. సీవోపీడీ అనే జబ్బు ఉందని చెప్పి మందులు ఇచ్చారు. దీన్ని ఎలా నిర్ధారణ చేశారు? నివారించుకునే అవకాశం చెప్పండి. - శ్రీలత, విజయవాడ సీఓపీడీని నిర్ధారణ చేయడానికి స్పైరోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని సహాయంతో కొన్ని శ్వాస పరీక్షలు చేసి వ్యాధితో పాటు... అది తక్కువ (మైల్డ్)గా ఉందా, ఓ మోస్తరా (మాడరేట్) లేక తీవ్రం (సివియర్)గా ఉందా అన్నది నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు అతడు పనిచేసే ప్రదేశం, వాతావరణం, వృత్తిగత సమస్యల (ప్రొఫెషనల్ హజార్డ్స్) వంటి అంశాల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. నివారణ: పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండాలి / పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం మానేయాలి. ఊపిరితిత్తుల్లోకి పొగ ప్రవేశిస్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం (కళ్లె) మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ (ప్రాణవాయువు) పాళ్లు బాగా తగ్గి, పనిచేసే శక్తిని, సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే వ్యాధి ఉన్నవారు ముందుగా పొగతాగే అలవాటుపై కష్టమైనా నియంత్రణ సాధించాలి. డాక్టర్ రమణప్రసాద్ వి.వి. సీనియర్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సౌదీ అరేబియా రాజు కన్నుమూత
రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా(90) కన్నుమూశారు. అబ్దుల్లా శుక్రవారం ఒంటి గంటకు (స్థానిక కాలమాన ప్రకారం) మరణించారని సౌదీ అరేబియా రక్షణ మంత్రి సల్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి రాజుగా దివంగత అబ్దుల్లా తమ్ముడు మోక్రేన్ కు బాధ్యతలు అప్పచెబుతున్నట్లు ఆయన తెలిపారు. తొలుత అబ్దుల్లా సంస్మరణార్ధం రాయల్ ప్యాలెస్ లో నిర్వహించే ప్రార్థనలకు దేశ ప్రజలందరినీ ఆహ్వానించారు. అనంతరం అబ్దుల్లా అంత్యక్రియలు జరగనున్నాయి. గత డిసెంబర్ లో అబ్దుల్లా న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు గొట్టాల ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఆయన 2005లో సౌదీ అరేబియా రాజుగా దేశ పగ్గాలు చేపట్టారు. ఆయన ఈ మధ్యే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన మారణకాండకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో చేరారు. ఆయన మరణానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. -
ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీకి అస్వస్థత
లూయీస్ విల్లే (అమెరికా): ప్రముఖ బాక్సర్, మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మహ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అలీని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహ్మద్ అలీ పరిస్థితి నిలకడగా ఉందని అలీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఊపిరితిత్తుల సమస్య అధికం కావడంతో ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చేర్చామన్నాడు. త్వరలో అలీ కోలుకుని తొందర్లోనే ఇంటికి వస్తాడని తెలిపాడు. అయితే అలీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిగతా వివరాలను వెల్లడించడాని కి మాత్రం నిరాకరించాడు. గత కొంతకాలంగా అలీ అవయవాల వణుకు సంబంధిత రోగంతో కూడా బాధపడుతున్న సంగతి తెలిసిందే. -
న్యూమోనియాతో రోజూ 100 మంది మృతి
భారతదేశాన్ని న్యూమోనియా వణికిస్తోంది. ముఖ్యంగా బీహార్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. న్యూమోనియా మరణాలపై నిర్వహించిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే ప్రతి గంటకూ ఐదుగురి వంతున రోజుకు 100 మంది వరకు మరణిస్తున్నారని ఈ సర్వేలో తెలిసింది. ప్రతియేటా బీహార్ రాష్ట్రంలో 40,480 మంది చిన్నారులు న్యూమోనియాతో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ వ్యాధి ఏడాదికి 18.40 లక్షల మందిని కబళిస్తోంది. అయినా ఇంతవరకు ఈ వ్యాధి నివారణకు సరైన చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు. -
పిల్లలకు ప్రాణాంతకం.. న్యుమోనియా
ముందస్తు జాగ్రత్తలు ముఖ్యమంటున్న వైద్యులు జాతీయ టీకాల కార్యక్రమంలో న్యూమోకోకల్ వ్యాక్సిన్ వెయ్యాలి ఐఏపీ వైద్యుల డిమాండ్ విజయవాడ : ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యూమోనియా వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని, అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చని భారతీయ పిల్లల వైద్యుల సమాఖ్య(ఐఏపీ) జిల్లా కార్యదర్శి డాక్టర్ పి.ఎస్.ఎన్.మూర్తి పేర్కొన్నారు. న్యూమోని యా సోకకుండా నివారణకు న్యూమోకోకల్ కాంజుగేటెడ్ అనే వ్యాక్సిన్ ఉందన్నారు. ఖరీదు ఎక్కువ కావడంతో దీని ని అందరూ వేయించుకోలేకపోతున్నట్లు తెలిపారు. దీనిని జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చాలని ఆయన డిమాం డ్ చేశారు. నవంబరు 12 ప్రపంచ న్యుమోనియా డేను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ఓ హోటల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా న్యూమోనియాతో ఐదేళ్లలోపు చిన్నారులు 1.4 మిలియన్ల వరకు మృతి చెందుతున్నారన్నారు. వారిలో నాలుగో వంతు భారతీయులేనన్నారు. ఎయిడ్స్, మలేరియా, క్షయ మూడు వ్యాధుల కారణంగా కన్నా, న్యూమోనియాతో మరణించేవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. అపరిశుభ్ర వాతావరణం, పోషకాహార లోపం, శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వకపోవడం, సకాలంలో వ్యాక్సిన్లు వేయించకపోవడం, ఆరోగ్య పరిరక్షణ లేక న్యూమోనియా వ్యాధి సోకుతుందని వివరించారు. పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ న్యూమోనియో తీవ్రమైన శ్యాసకోశ వ్యాధి అని అన్నారు. బాక్టీరియా, వైరస్, ఫంగస్ లేక పరాన్నజీవుల ద్వారా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి ఈ వ్యాధి వస్తుందన్నారు. న్యూమోనియా వ్యాధికి దారితీసే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఇది సోకకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు. పిల్లలకు సోకే మీజిల్స్(తట్టు), హిబ్, న్యూమోనియా లాంటి వ్యాధులను అరికట్టడానికి టీకాలు ఒక్కటే శ్రేయస్కరమన్నారు. సమావే శంలో ఐఏపీ ప్రతినిధి డాక్టర్ సిహెచ్.మల్లిఖార్జునరావు కూడా పాల్గొన్నారు. -
నిమోనియా హాయైన శ్వాస కోసం!
శ్వాసక్రియ జరగకుండా మనిషి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల చివరి భాగమైన అల్వియైలై అనే గాలి గదిలో మార్పిడి చేసి... జీవక్రియల్లో విడుదలైన హానికర వ్యర్థవాయువులైన కార్బన్డయాక్సైడ్ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఊపిరితిత్తులలోని అత్యంత కీలకమైన గాలిగది ఆల్వియోలై అనే భాగంలో ఈ ఆక్సిజన్, కార్బన్డైయాక్సైడ్ల మార్పిడి జరుగుతుంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో ద్రవాలు చేరితే వాయుమార్పిడి జరగక శ్వాసక్రియ సక్రమంగా సాగదు. ఆ పరిస్థితినే నిమోనియా అంటారు. ఈ నెల 12న ప్రపంచ నిమోనియా దినం సందర్భంగా ఆ వ్యాధిపై అవగాహన కోసమే ఈ కథనం. నిమోనియా వచ్చే పరిస్థితులు ఎవరెవరిలో..? నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకడం అంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితే. సాధారణంగా ఏ వయసు వారిలోనైనా కనిపించే ఇది పిల్లల్లోనూ, 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ ఎక్కువ. దీనికి తోడు సాధారణంగా గుండెజబ్బులు, డయాబెటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, వంటివి ఉన్నవారికి తేలిగ్గా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా చలికాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పొగతాగే అలవాటు ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఊపిరితిత్తుల పనితీరు ఇలా..! మనం శ్వాసించే సమయంలో ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటాం. ఇది తొలుత ట్రాకియా అనే గాలిగొట్టం నుంచి లోనికి ప్రవేశిస్తుంది. ఇదే ట్రాకియా బ్రాంకై అనే రెండు గొట్టాలుగా విడిపోయి- ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి... బ్రాంకియోల్స్ అని పిలిచే అనేక శాఖలుగా చీలిపోతాయి. ఈ బ్రాంకియోల్స్ చివర గాలి తిత్తులు ఉంటాయి. వీటినే ఆల్వియోలై అంటారు. మనం గాలి పీల్చే సమయంలో మన ముక్కు, నోరు ద్వారా రోగకారక క్రిములు ట్రాకియా మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆల్వియోలైలోకీ చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా చూసేందుకు మన రోగనిరోధక శక్తి, దాంతోపాటు... మన ముక్కు ఆకృతి, ఫ్యారింగ్స్ తోడ్పడతాయి. అవి ప్రవేశించినప్పుడు దగ్గడం ద్వారా వాటిని బయటకు పంపే ఏర్పాటుతో పాటు... బ్రాంకై అనే గాలిగొట్టాల్లో ఉన్న సీలియా అనే వెంట్రుకల వంటి నిర్మాణం... ఎల్లప్పుడూ ఒక ఎస్కలేటర్లా స్పందిస్తూ రోగకారక అంశాలను బయటకు పంపివేస్తూ ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల మన రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, రోగకారక క్రిములు శరీరంలోకి ప్రవేశించడమో లేదా మనమే ఎక్స్పోజ్ కావడమో జరిగినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి సమయాల్లో మన తెల్లరక్తకణాలు ఆల్వియోలైలోకి ప్రవేశించి అక్కడ ఉన్న రోగకారక క్రిములపై దాడి చేస్తాయి. ఇలా జరిగే క్రమంలో మన ఆల్వియోలైలో తెల్లరక్తకణాలు, ప్రోటీన్లు, ఇతర ద్రవాలు, ఎర్రరక్తకణాలు నిండిపోతాయి. ఫలితంగా నిమోనియా లక్షణాలు బయటపడతాయి. నిమోనియా - దుష్ర్పభావాలు నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలా తేలిగ్గానే తగ్గించవచ్చు. అయితే కొందరిలో కొన్ని సందర్భాల్లో నిమోనియాను నిర్లక్ష్యం చేయడం వల్ల కనిపించే దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) చాలా త్రీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా హై-రిస్క్ గ్రూపునకు చెందిన వారిలో ఈ దుష్ర్పభావాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులైన సీఓపీడీ (ఎంఫసిమా) లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలోనూ ఈ దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. అవి... ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండటం : ఊపిరితిత్తుల పొరలైన ప్లూరాకూ, ఛాతీ లోపలి పొరకూ మధ్య ఒక్కోసారి ద్రవాలు నిండవచ్చు. ఈ కండిషన్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. నిమోనియా వల్ల ఇలా ద్రవాలు నిండితే... ఒక్కోసారి ఛాతీలో ట్యూబ్ వేసిగానీ లేదా చిన్న శస్త్రచికిత్స ద్వారాగాని ఆ ద్రవాలను తొలగించాల్సి వస్తుంది. ఆబ్సెస్ : నిమోనియాతో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో చీము నిండటాన్ని యాబ్సెస్ అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు సాధారణంగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అయితే చీమును తొలగించడానికి అరుదుగా సర్జరీ కూడా అవసరం కావచ్చు. బ్యాక్టీరిమియా : ఒక్కోసారి ఊపిరితిత్తులకు సోకిన నిమోనియా వాటికే పరిమితం కాకుండా రక్తప్రవాహానికీ వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించడం అన్నది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి రక్తప్రవాహానికి విస్తరించాక ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో పాటు అన్ని అవయవాలకూ విస్తరిస్తుంది. ఈ కండిషన్‌ను బ్యాక్టీరిమియా అంటారు. ఇది ఒక్కోసారి రోగి తాలూకు రక్తపోటును గణనీయంగా పడిపోయేలా చేస్తుంది.సాధారణంగా నిమోనియా వచ్చిన రోగుల్లో కోలుకోడానికి ఉండే అవకాశాలే చాలా ఎక్కువ. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం కేవలం 5 నుంచి 10 శాతం కేసుల్లో మాత్రమే ఒక్కోసారి పరిస్థితి విషమించిపోయే పరిస్థితికి దారితీయవచ్చు. నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారు సాధారణంగా కొందరిలో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. వారినే హై-రిస్క్ గ్రూప్ గా అభివర్ణిస్తారు. వారు ఎవరంటే... 65 ఏళ్లు పైబడినవారు పొగతాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యకారణాల వల్లగానీ లేదా ఇతరపరిస్థితుల వల్లగాని తగినంత పోషకాహారం తీసుకోనివారు ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు (అంటే... సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్, ఎంఫసిమా వంటివి) డయాబెటిస్ లేదా గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులు ఉన్నవారు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వల్లగానీ లేదా అవయవమార్పిడి చికిత్స వల్లగాని, కీమోథెరపీతోగాని లేదా దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతుండటం వల్ల స్వతహాగా ఉండే వ్యాధినిరోధకశక్తి లోపించిన వారు ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల సమర్థంగా దగ్గలేనివారు శ్వాసకోశవ్యవస్థలో పైభాగానికి ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్ సోకిన వారు. వ్యాధి నిర్ధారణ రోగి చెప్పిన లక్షణాలను బట్టి, రోగిని పరీక్షించడం ద్వారా నిమోనియా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దాంతోపాటు ఎక్స్‌రే, కళ్లె పరీక్ష, కొన్ని సందర్భాల్లో యూరిన్ యాంటిజెన్ పరీక్ష, రక్త పరీక్ష వంటివి వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఇక రక్తంలో ఆక్సిజన్ పాళ్లను పరీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి నిమోనియా వల్ల రక్తంలోని ఆక్సిజన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. తీవ్రమైన నిమోనియాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు యాంటీబయాటిక్ చికిత్స తర్వాత కూడా మెరుగుదల కనిపించని సందర్భాల్లోనూ లేదా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి నిలకడగా లేక దిగజారుతున్న సందర్భాల్లోనూ బ్రాంకోస్కోపీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగే ఒక గొట్టానికి కెమెరాను అమర్చి ట్రాకియా, బ్రాంకైలలోని లోపలి దృశ్యాలను పరిశీలించడంతో పాటు అక్కడి ద్రవాల నమూనాలను సేకరించడం, అవసరాన్ని బట్టి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపడం వంటివి చేస్తారు. నివారణ నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నిమోనియాను చాలా ప్రభావపూర్వకంగా నివారించవచ్చు.పొగతాగే అలవాటు ఉన్నవారు దాన్ని పూర్తిగా మానేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తాము నివసించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులను నిత్యం సబ్బుద్వారాగాని లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్‌ల సహాయంతోగాని శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా దీన్ని నివారించవచ్చు. రోగి తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడమో, పొడవు చేతుల చొక్కా ఉంటే చేతి మడతలో తుమ్మడమో చేయాలి. చికిత్స సాధారణంగా ఇరుకు ప్రదేశాల్లో గుంపులుగా ఉండటం వల్ల వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా ఇన్ఫెక్షన్కు చికిత్సతో పాటు నిమోనియా వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్లకూ చికిత్స చేస్తారు. నిమోనియా కేసుల్లో తొలుత దానికి కారణమైన అంశాలను కనుగొని దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. సాధారణంగా నిమోనియా రోగుల్లో అత్యధికులకు నోటిద్వారా యాంటీబయాటిక్స్ ఇస్తారు. అయితే నిమోనియా తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో నిమోనియా రోగులకు నిత్యం గుండె స్పందన రేటు, శ్వాసించే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు వంటి అంశాలను నిత్యం పర్యవేక్షిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేర్చిన రోగులకు రక్తనాళం (ఐవీ) ద్వారా యాంటీబయాటిక్స్‌ను అందిస్తారు. రోగికి ఉన్న ఇతర వ్యాధులు, అతడు చికిత్సకు స్పందిస్తున్న తీరును బట్టి ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాలన్నది నిర్ణయిస్తారు. అప్పటికే ఊపిరితిత్తులకు ఏదైనా వ్యాధి ఉన్నవారు, ఊపిరితిత్తులలో ఒకదాని కంటే ఎక్కువ తమ్మెల (లోబ్స్)లో వ్యాధి ఉండే వాళ్లు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రోగికి ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలన్నది... రోగికి సంక్రమించిన సూక్ష్మజీవి ఎలాంటిదన్న అంశంతో పాటు... ఆ మందుకు అతడు ఎలా స్పందిస్తున్నాడనేలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే... ఏదైనా వ్యాధి వల్ల అప్పటికే రోగి ఇతర యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే ఆ తరహా యాంటీబయాటిక్స్‌కు ఆ క్రిములు నిరోధకత పెంచుకొని ఉండవచ్చు. అందుకే చికిత్స ప్రక్రియలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కారణాలు సాధారణంగా అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిముల వల్ల నిమోనియా సోకవచ్చు. అయితే ఫంగస్‌తో వచ్చే అవకాశాలు ఒకింత తక్కువ. ఏదైనా ఇతర వ్యాధులు లేదా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఇది ఫంగై కారణంగా రావచ్చు. ఇక మైకోప్లాస్మా అని పిలిచే మరికొన్ని సూక్ష్మక్రిముల వల్ల కూడా నిమోనియా రావచ్చు. కానీ ఇది అంత తీవ్రమైనది కాదు. అయితే ఒక్కోసారి ఇది కూడా తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చు. నిమోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. అలాగే ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది గుంపులుగా నివసించాల్సిన పరిస్థితుల్లోని 20 శాతం కేసుల్లో కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా (సీఏపీ) అనే ఈ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. లక్షణాలు జ్వరం చలిగా అనిపించడం ఊపిరి సరిగా అందకపోవడం శ్వాస తీసుకునే సమయంలో ఒక్కోసారి నొప్పి చాలా వేగంగా శ్వాసతీసుకోవడం గుండెవేగం పెరగడం వికారం వాంతులు దగ్గు ఒక్కోసారి దగ్గుతున్నప్పుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కళ్లె పడటం కొన్ని సందర్భాల్లో కళ్లె తుప్పు రంగులో కనిపించడం అయోమయానికి గురికావడం, ఆలోచనల్లో స్పష్టతలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డా. టి. అనూరాధ, పల్మొనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పశు పోషణలో.. దూడల సంరక్షణే కీలకం
న్యూమోనియా దూడ పుట్టిన నెల రోజుల తర్వాత ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. శీతాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దూడలు ఉన్న షెడ్లలో తేమ ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులు రావటం, రాత్రి సమయంలో లేగదూడలను బయట కట్టేయడం, చలి గాలుల బారిన పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. న్యూమోనియా సోకిన దూడల్లో జ్వరం, అజీర్ణం, ముక్కు నుంచి చీమిడి కారటం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి తక్షణమే చికిత్స అందించాలి. లేదంటే దూడలు మరణించే ప్రమాదం ఉంటుంది. నివారణ చర్యలు... దూడలు ఉండే పాకల్లో తేమ శాతం అధికంగా లేకుండా చూసుకోవాలి. ఈదురు గాలులు, చలి లేకుండా జాగ్రత్తపడాలి. పుట్టిన అరగంటలోపు దూడకు జున్నుపాలు తాగించాలి. లేదంటే ఈ వ్యాధి సులభంగా సోకుతుంది. వ్యాధి బారిన పడిన దూడలకు యాంటీబయోటిక్స్, యాంటీహిస్టమీన్ సూదులు ఇప్పించాలి. పారుడు వ్యాధి లేగదూడల్లో ఎక్కువ శాతం పారుడు వ్యాధి సోకి మృత్యువాత పడుతుంటాయి. నట్టలు, ప్రోటోజువా, వైరస్, బ్యాక్టీరియా వలన దూడలకు తెల్లని, పచ్చని విరేచనాలవుతాయి. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి నీరసపడి మరణిస్తుంటాయి. మట్టి, అపరిశుభ్ర పరిసరాలు తదితర కారణాల వల్ల దూడల్లో నట్టలు తయారవుతాయి. సకాలంలో దీన్ని గుర్తించకపోతే తర్వాత చికిత్స అందించినా ఫలితం ఉండదు. లేగదూడలకు జున్నుపాలు అందించకపోవడం, తగిన మోతాదులో పాలు లేకపోవటం, పోషకాల లోపం, చలిగాలులు, మట్టితినడం లాంటి లోపాల వల్ల కూడా లేగదూడల్లో పారుడు వ్యాధి వస్తుంది. నివారణ చర్యలు... లేగలు పుట్టిన వెంటనే జున్నుపాలు తాగించాలి. వైద్యుల సలహా ప్రకారం నట్టల నివారణ మందులు వేయాలి. లేగదూడ పుట్టిన ఐదురోజుల లోపు టెటానస్, విటమిన్-ఏ ఇంజక్షన్లు తప్పక ఇప్పించాలి. దూడలు మట్టి తినకుండా మూతికి ప్రత్యేకంగా తయారు చేసిన బట్టలు కట్టాలి. బొడ్డు, కీళ్ల వాపు లేగదూడ యొక్క బొడ్డు నరం ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని ద్వారా దూడలు జ్వరంతో బాధపడుతుంటాయి. బొడ్డు వాచి లోపల చీము చేరుతుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. సూక్ష్మజీవులు కీళ్లకు కూడా వ్యాపిస్తాయి. దీని ద్వారా దూడలు పాలు తాగవు. పుట్టిన నాటినుంచి ఆరు వారాల్లోపు ఎప్పుడైనా బొడ్డు, కీళ్ల వ్యాధి రావచ్చు. మెదడు వాపు క్లామిడియా సూక్ష్మజీవుల వల్ల దూడలకు మెదడు వాపు వ్యాధి వస్తుంది. దీంతో జ్వరం, ఆకలి మందగించడం, కండరాల వణుకు, నిలబడలేకపోవటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్సలు అందించాలి. లేదంటే దూడలు వారం రోజుల్లో మరణించే ప్రమాదం ఉంటుంది. అంధత్వం గర్భస్థ సమయంలో పశువులకు విటమిన్-ఏ సరిగ్గా అందించకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో లేగదూడలు దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంధత్వం సోకిన దూడల కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. కండరాలు వణుకుతుంటాయి. నరాల్లో పటుత్వం కోల్పోయి లేగదూడలు సరిగా నిలబడలేవు. నివారణ చర్యలు... గర్భం సమయంలో పశువుకు తగిన నీటిని అందించటంతో పాటు, విటమిన్-ఏ విధిగా ఇవ్వాలి. దీనికోసం మేలురకం పశుగ్రాసం అందించాలి. విటమిన్ -ఏ ఇంజక్షన్లు వేయించడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు. పుట్టిన దూడలకు సమృద్ధిగా జున్ను పాలు తాగించాలి. -
వ్యాధుల కాలం.. జీవాలు జర భద్రం
జిల్లాలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మూగ జీవాలు, పాడి పశువులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పశు సంవర్ధక శాఖ లైవ్‌స్టాక్ అధికారి సలావుద్దీన్ తెలిపారు. వారం రోజులుగా వాతావరణం చల్లగా ఉండటంతో పాటు వర్షాలు పడుతుండటంతో చెరువులు, కుంటల్లోకి వచ్చిన నీటిని తాగి పశువులు రోగాలపాలవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో గొర్రెలు, మేకలు న్యుమోనియా, ఆవులు, గేదెలు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వివరించారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సలు చేయించకపోతే తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరించారు. - మెదక్ రూరల్ గొర్రెలు, మేకల్లో వచ్చే వ్యాధులు... వర్షాకాలం సీజన్లో గొర్లు, మేకలు న్యుమోనియా, ఫుట్రాట్ వ్యాధుల బారిన పడతాయి. న్యుమోనియా సోకిన జీవాలు దగ్గుతో బాధపడుతుంటాయి. ముక్కు నుంచి చీము కారడం, శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వర్షాల వల్ల ఏర్పడే బురద వల్ల జీవాలకు ఫుట్రాట్ వ్యాధి సోకుతుంది. దీనివల్ల మేకలు, గొర్రెల గెటికెల్లో పుండ్లు ఏర్పడి కుంటుతాయి. వ్యాధి ప్రభావం వల్ల జ్వరం బారిన పడుతాయి. దీంతో రోజురోజుకు మేత మేయడం బాగా తగ్గిస్తాయి. ఈ వ్యాధుల నివారణకు దగ్గర్లోని పశువైద్య అధికారుల సూచనల మేరకు మందులు వాడాలి. యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్ మందులు వాడాలి. పశువుల్లో గొంతు జబ్బవాపు... వర్షాలు కురిసినప్పుడు చెరువు, కుంటల్లోకి వచ్చే కలుషిత నీటిని తాగిన పశువులకు గొంతు, జబ్బువాపు వ్యాధులు వస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే పశువైద్యులను సంప్రదించి చికిత్సలు చేయించాలి. వ్యాధి లక్షణాలు... గొంతువాపు సోకిన పశువులకు తీవ్ర జ్వరం వస్తుంది. కంటి నుంచి నీరు, గొంతు నుండి చొంగ కారుతుంది. గొంతు, మెడ వాపు వస్తుంది. కష్టంగా శ్వాస తీస్తాయి. గురక వంటి శబ్దం వస్తుంది. ఈ వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్సలు చేయించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా 24 గంటల్లోనే పశువు మరణించే ప్రమాదం ఉంది. సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్, టాజు తదితర మందులు వాడాలి. జబ్బవాపు వ్యాధి లక్షణాలు... ఆరు మాసాల వయస్సులోని యుక్త వయస్సు గల పెయ్యలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కలుషిత నీరు, ఆహారం, గాలి వల్ల వ్యాపిస్తుంది. దీంతో జ్వరం వచ్చి ఆకలి మందగిస్తుంది. నెమరు వేయకపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం, శ్వాస కష్టంగా తీసుకోవటం తదితర లక్షణాలు అధికంగా ఉంటాయి. తొడ ప్రాంతంలో కండరాలను సూక్ష్మక్రిములు ఆశించి మాంసం కుళ్లిపోయేలా చేస్తాయి. దీంతో పవుశుల ఆరోగ్యం బాగా కుంటుపడుతుంది. ఈ సమయంలో జబ్బు పడ్డ కాలిని పైకి ఎత్తి కుంటుతాయి. వాపు వచ్చిన ప్రాంతంలో చర్మం ఎర్రగా మారి నొప్పి ఉంటుంది. దీంతో పశువులు 1నుంచి రెండు రోజుల్లో మరణిస్తాయి. చికిత్స విధానం... జబ్బవాపు వ్యాధికి గురైన గురైన పశువులను గుర్తించి ప్రారంభంలో పెన్సిలిన్ తదితర యాంటీబయోటిక్ మందులు వాడాలి. యాంటీపెరైటిక్, యాంటీహిస్టమిన్ వాడాలి. కార్టిజోన్సు, డెక్రోజ్, వాడితే జబ్బవాపును నిరోధించవచ్చు. -
అమ్మో... న్యుమోనియా
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: శీతాకాలం ప్రారంభమవడంతో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువైంది. దీంతో న్యుమోనియా వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున జిల్లాలో 200 నుంచి 400 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలతో బాధపపడుతూ ఒక్క కేంద్రాస్పత్రికే రోజుకు 20 నుంచి 30 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పసికందు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. 70 శాతం రైలో వైరస్ వల్ల, 30 శాతం బ్యాక్టీరియాల ప్రభావంతో న్యుమోనియా వ్యాపించే అవకాశం ఉంది. న్యుమోనియా(ఊపిరిత్తులకు సోకే ఇన్ఫెక్షన్) ఈ వ్యాధి వైరస్ వల్ల, బాక్టీరియా వల్ల, క్షయవ్యాధి వల్ల వ్యాప్తి చెందుతుంది. పొగతాగడం, చలిగాలిలో తిరగడం, కుటుంబ పరంగా అస్తమా, అనారోగ్య పరిస్థితుల వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. శరీరంలో ఉన్న కురుపులు వల్ల రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి న్యుమోనియాగా మారుతుంది. ఈ వ్యాధిని ఎక్స్‌రే, సి.టి.స్కాన్, రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు తరచూ దగ్గు వస్తుంది. దగ్గేటప్పుడు ఛాతీలో నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శారీరకంగా బలహీనడతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వ్యాధి సోకేముందు ఎలాం టి ఆహారమూ తీసుకోరు. పాలు తాగేందుకు నిరాకరిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి. క్షయ వ్యాధి కోసం కఫం పరీక్ష చేసుకోవాలి. న్యుమోనియా పిల్లలకు సోకితే ప్రమాదకరం. పిల్లలను చలికాలంలో బయట తిప్పకూడదు. జలుబు, దగ్గు ఉన్న వారు పిల్లలను ఎత్తుకోరాదు. జనసంచారం ఎక్కువగా ఉన్న చోటకి, గ్రూపులుగా ఉన్న చోట పిల్లలను తిప్పకూడదు. గోరు వెచ్చని నీళ్లు స్నానం చేయించాలి. పెద్దలయితే ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ వ్యాధికి ముందు జలుబు, కొద్దిగా దగ్గు వస్తాయి. ఆ సమయంలో వెచ్చని దుస్తులు ధరించడం, ఆవిరి పట్టడం చేస్తే వ్యాధిని కొంతవరకూ నిరోధించవచ్చు. రికార్డు కాని కేసులు ప్రాణంతకమైన ఈ వ్యాధి పట్ల వైద్య ఆరోగ్యశాఖాధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏటా ఎంత మందికి వ్యాధి సోకుతోంది. అందులో పిల్లలు ఎంతమంది తదితర వివరాలు వైద్య ఆరోగ్యశాఖాధికారులు నమోదుచేయవలసి ఉన్నా అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏటా ఎంత మంది మృత్యువాత పడుతున్నారో , ఎంత మంది వ్యాధి బారిన పడుతున్నారో తెలియన పరిస్థితి నెలకింది. అప్రమత్తత అవసరం... శీతకాలంలో ఈ వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. చల్లగాలిలో తిరగడం సాధ్యమైనంతవరకు మానుకోవాలి. అత్యవసరమనుకుంటే ముఖాన్ని పూర్తిగా కప్పే విధంగా ఉండే టోపీలు, స్వెట్టర్లు వంటి వాటిని ధరించి వెళ్లాలి. పిల్లలను బయటకు తీసుకుని వెళ్లినప్పుడు తప్పని సరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా క్రీములు రాయాలి. పొగతాగడం పూర్తిగా మానుకోవాలి. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. - బి.వెంకటేష్, ఫిజిషియన్, పిల్లల వైద్యులు, కేంద్రాస్పత్రి. గత ఏడాది కంటే అధికంగా కేసులు గత ఏడాది రోజుకు 10 నుంచి 20 కేసులు వస్తే, ఈఏడాది 20 నుంచి 30 వరకు వస్తున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా చలి ఎక్కువైంది. పిల్లలు , వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. - బి.గౌరీశంకర్, పిల్లల వైద్యుడు