సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్‌ను వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. సీఎం జగన్ సమక్షంలో వైద్యాధికారులు నెలల చిన్నారికి పీసీవీ వ్యాక్సిన్‌ను వేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మంత్రుల సమక్షంలో అన్ని జిల్లాలలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. కాగా న్యూమోనియా వ్యాధితో రెండేళ్ల లోపు చిన్నారుల ఎక్కువగా మృతి చెందుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన న్యూమో కాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ తో శిశుమరణాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రతీ చిన్నారికి మూడు డోసుల టీకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా చిన్నారులకి వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఆరు వారాలు నిండిన 5,45,506 మంది చిన్నారులకి ఈ ఏడాది న్యూమోనియా తొలి డోసు వేయనున్నారు. ఇక 14 వారాలు నిండిన 4,09,130 మంది చిన్నారులకి రెండవ డోసు....తొమ్మిది నెలల నిండిన 68,188 మంది చిన్నారులకి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది రకాల వ్యాక్సిన్‌లను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా కొత్తగా ఇస్తున్న న్యుమోకాకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు పిల్లలకు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్
Comments
Please login to add a commentAdd a comment