
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి వారికి ముందుగానే వైద్యం చేయడం ద్వారా మరణాలను కట్టడి చేయడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా న్యూమోనియా వ్యాధి నివారణ, ప్రజల్లో అవగాహన కల్పించడానికి గత నెల 12 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వాతావరణంలో వచ్చే మార్పులతో పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఆ సమస్యల్లో న్యూమోనియా ప్రధానమైనది. దేశంలో ఏటా ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో 16శాతం న్యూమోనియా కారణంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూమోనియా నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే టీకా పంపిణీ చేస్తోంది.
7.32 లక్షల మంది చిన్నారుల స్క్రీనింగ్
రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 21,50,790 మంది ఉన్నారు. కాగా సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ 7,32,820 మంది చిన్నారులను ఏఎన్‌ఎంలు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 92,396 మందిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు దగ్గు, జలుబు, ఇతర సమస్యలున్నట్టు గుర్తించారు. తీవ్ర న్యూమోనియా సమస్య ఉన్న పిల్లలను మెరుగైన వైద్యం కోసం పీహెచ్‌సీల నుంచి పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అనంతరం ఆరోగ్య పరిస్థితిపై పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌లు, ఏఎన్‌ఎంలు ఫాలోఅప్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నడుస్తోంది.
అనకాపల్లి టాప్
ఐదేళ్లలోపు పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాల్లో 61,822 మంది చిన్నారులుండగా వీరిలో 62.59 శాతం మందికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తయింది. 58.55 శాతంతో శ్రీకాకుళం రెండో స్థానంలో, 56.46 శాతంతో కాకినాడ మూడో స్థానంలో ఉన్నాయి. కేవలం 19.05శాతంతో ప్రకాశం జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది.
వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకు..
ఐదేళ్ల లోపు పిల్లల్లో న్యూమోనియా సమస్యను నివారించడానికి చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేస్తున్నాం. న్యూమోనియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభిస్తున్నాం. తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పిల్లల్లో సమస్య తీవ్రమయ్యే పరిస్థితులుంటాయి. ఈ క్రమంలోనే సర్వే చేపడుతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సర్వే కొనసాగుతుంది.
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment