పిల్లలకు ప్రాణాంతకం.. న్యుమోనియా
- ముందస్తు జాగ్రత్తలు ముఖ్యమంటున్న వైద్యులు
- జాతీయ టీకాల కార్యక్రమంలో న్యూమోకోకల్ వ్యాక్సిన్ వెయ్యాలి
- ఐఏపీ వైద్యుల డిమాండ్
విజయవాడ : ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యూమోనియా వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని, అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చని భారతీయ పిల్లల వైద్యుల సమాఖ్య(ఐఏపీ) జిల్లా కార్యదర్శి డాక్టర్ పి.ఎస్.ఎన్.మూర్తి పేర్కొన్నారు. న్యూమోని యా సోకకుండా నివారణకు న్యూమోకోకల్ కాంజుగేటెడ్ అనే వ్యాక్సిన్ ఉందన్నారు. ఖరీదు ఎక్కువ కావడంతో దీని ని అందరూ వేయించుకోలేకపోతున్నట్లు తెలిపారు. దీనిని జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చాలని ఆయన డిమాం డ్ చేశారు.
నవంబరు 12 ప్రపంచ న్యుమోనియా డేను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా న్యూమోనియాతో ఐదేళ్లలోపు చిన్నారులు 1.4 మిలియన్ల వరకు మృతి చెందుతున్నారన్నారు. వారిలో నాలుగో వంతు భారతీయులేనన్నారు. ఎయిడ్స్, మలేరియా, క్షయ మూడు వ్యాధుల కారణంగా కన్నా, న్యూమోనియాతో మరణించేవారి సంఖ్య అధికంగా ఉందన్నారు.
అపరిశుభ్ర వాతావరణం, పోషకాహార లోపం, శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వకపోవడం, సకాలంలో వ్యాక్సిన్‌లు వేయించకపోవడం, ఆరోగ్య పరిరక్షణ లేక న్యూమోనియా వ్యాధి సోకుతుందని వివరించారు. పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ న్యూమోనియో తీవ్రమైన శ్యాసకోశ వ్యాధి అని అన్నారు.
బాక్టీరియా, వైరస్, ఫంగస్ లేక పరాన్నజీవుల ద్వారా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకి ఈ వ్యాధి వస్తుందన్నారు. న్యూమోనియా వ్యాధికి దారితీసే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఇది సోకకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు. పిల్లలకు సోకే మీజిల్స్(తట్టు), హిబ్, న్యూమోనియా లాంటి వ్యాధులను అరికట్టడానికి టీకాలు ఒక్కటే శ్రేయస్కరమన్నారు. సమావే శంలో ఐఏపీ ప్రతినిధి డాక్టర్ సిహెచ్.మల్లిఖార్జునరావు కూడా పాల్గొన్నారు.