Department of Medicine
-
వైద్య రంగం బలోపేతానికి రూ. 4,944 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా సామాన్యులకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలోకి తేవాలని యోచిస్తోంది. దీనికోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసింది. ప్రభుత్వంలో డయాగ్నొస్టిక్ సెంటర్లు మొదలు... మానవ వనరుల అభివృద్ధి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల వరకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై దృష్టిసారించింది. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లు, కొత్త ఉస్మానియా, టిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు, ఆరోగ్య కార్డులు, పీఎంయూలు, కేన్సర్ కేర్‌లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.డయాగ్నొస్టిక్ సేవలకే అత్యధికంటి–డయాగ్నొస్టిక్ సేవల బలోపేతానికి వైద్య ఆరోగ్యశాఖ అత్యధికంగా రూ. 1,044 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులోభాగంగా మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హబ్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.600 కోట్లు కేటాయించనుంది. అలాగే ప్రతీ బోధనాసుపత్రిలో ఒక ఎంఆర్ఐ ఏర్పాటుకు మొత్తం రూ.444 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యంగా ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్లపై దృష్టిసారించింది. అందుకోసం రూ. 921 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కొత్తగా 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 35 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు సహా నిమ్స్ పరిధిలో ఇవి ఏర్పాటు కానున్నాయి.పరికరాలకు రూ.750 కోట్లుటిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టిమ్స్‌లు, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తారు. సనత్‌నగర్ టిమ్స్‌లో రూ.50 కోట్లతో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే గచ్చిబౌలి టిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 35 జీజీహెచ్ ఆసుపత్రుల్లో ఒక్కోచోట రూ.350 కోట్లతో 30 పడకలతో డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లను నెలకొల్పుతారు.మరికొన్ని నిర్ణయాలు...⇒ కొత్తగా 108 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 54 కోట్లు⇒ ఆరోగ్య మహిళ కార్యక్రమం సహా ఎంసీహెచ్ సేవలను బలోపేతం చేస్తారు. ప్రస్తుతం 376 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాలు జరుగుతుండగా, వాటిని వెయ్యికి పెంచుతారు. అందుకోసం రూ.300 కోట్లు ఖర్చుచేస్తారు. రూ. 10 కోట్ల వ్యయంతో 10 నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న 44 యూనిట్లను ఆధునీకరిస్తారు. ⇒ నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రూ. 11 కోట్లతో కొత్తగా ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటు. ⇒ 35 జీజీహెచ్‌ల్లో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు. ఒక్కో సెంటర్‌కు రూ. 1.37 కోట్ల చొప్పున రూ. 49 కోట్లు.⇒ 35 బోధనాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేర్ ట్రైనింగ్ కోసం సిములేషన్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సెంటర్‌కు రూ.7 కోట్ల చొప్పున రూ. 245 కోట్లు కేటాయిస్తారు. ⇒ ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కోసం రూ.510 కోట్లు కేటాయిస్తారు. అందులో 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.180 కోట్లు, 10 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.70 కోట్లు, 10 వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.160 కోట్లు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఆధునీకరణ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తారు. ⇒ హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులు సహా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌లలో ఆర్గాన్ రిట్రీవల్ అండ్ స్టోరేజ్ సెంటర్ల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తారు. ⇒ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లను రూ.79 కోట్లతో నెలకొల్పుతారు. ⇒ కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు రూ. 250 కోట్లు ఖర్చు చేస్తారు. ⇒ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ కార్డులు, ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ల కోసం రూ.180 కోట్లు వ్యయం చేస్తారు. ⇒ రూ. 165 కోట్లతో డీ సెంట్రలైజ్డ్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. -
AP: రోగం తిరగబెట్టింది
మునుపటికొకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని.. ‘అది పిచ్చి కుక్క’ అని అరిచాడట. పక్కనున్న వారందరూ తలో రాయి వేసి దానిని హతమార్చారట. ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వ తీరు అచ్చం అలానే ఉంది. రెండున్నర నెలల వరకు ప్రభుత్వాసు పత్రులంటే పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఉద్దేశ పూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ.. పేద రోగులకు వైద్య సేవలు సరిగా అందకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. మందులు అయిపోయినా, సిబ్బంది సీట్లలో లేకపోయినా పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల నిర్వహణను అంతకంటే పట్టించు కోవడం లేదు. క్రమంగా ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా చేసి.. ‘ప్రైవేట్’కు కట్టబెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. రాష్ట్రంలో ఆ చివర ఉన్న అనంతపురం నుంచి ఈ చివరనున్న శ్రీకాకుళం వరకు కేవలం ఈ రెండు నెలల్లోనే ఏ ఆస్పత్రి నిర్వహణ చూసినా అస్తవ్యస్తంగా మారిపోవడమే ఇందుకు తార్కాణం. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వాస్తవమిది.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ ఆస్పత్రులు, వ్యక్తులకు మేలు చేయాలన్న లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మారుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ వ్యవస్థలను తీసుకుని వెళ్లేలా ఆ పార్టీ నాయకులు లీకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య శాఖలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకుని వెళతామని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా 2014–19 తరహాలోనే టెలీమెడిసిన్, ల్యాబ్‌లు, ఇతర సేవలను ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ నిధులను లూఠీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి కొరత లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి కూటమి సర్కార్ ఇప్పటికే తిలోదకాలు ఇచ్చేసింది. గత ప్రభుత్వంలో సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఖాళీ అయిన వైద్య పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. ఎన్నికలకు ముందు నియామకాలు దాదాపు పూర్తయిన పోస్టుల ప్రక్రియనూ కూటమి ప్రభుత్వం ఆపేసింది. నోటిఫికేషన్లను సైతం రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం నిరంతర నియామక ప్రక్రియకు ఇలా పుల్‌స్టాప్ పెట్టడంతో ఆస్పత్రుల్లో రోగుల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంకో వైపు మందులు, సర్జికల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాస్పత్రులు, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో కొరత నెలకొంది. పలు చోట్ల గ్లౌజ్‌లు, సిరంజులకూ దిక్కులేదుజిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో ఇందులో చాలా మందులు లేవు. విశాఖ కేజీహెచ్, గుంటూరు, కర్నూలు, విజయవాడ జీజీహెచ్, తదితర పెద్దాసుపత్రుల్లో సైతం 100 రకాల మందుల కొరత ఉంది. పాడేరు ఆస్పత్రిలో చాలా వ్యాధుల నివారణకు సంబంధించిన యాంటిబయాటిక్స్ మందులు లేవు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పంపిణీ కాకపోవడంతో రోగులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మందులనే పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిరంజులు కూడా బయటకు రాసిస్తున్నారు. రూ.30 నుంచి రూ.1000 విలువ చేసే మందుల వరకు చీటి రాసి బయటకు పంపుతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో గ్లౌజ్‌ల కొరత ఉంది. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ల సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు రూ.5 వేలు లోపు వస్తువులను ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఆపరేషన్ సమయంలో రోగులు ప్రైవేట్ మందుల దుకాణంలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వైద్యులకు ఇస్తున్నారు. రెండు నెలల నుంచి ఫాంటాప్ ఇంజక్షన్లు లేవు. విజయవాడ జీజీహెచ్‌లో షుగర్ ఇన్ఫెక్షన్, నరాల సమస్య, గుండె జబ్బుల రోగులు బయట మందులు కొనుగోలు చేస్తున్నారు. కాంబినేషన్ మందులు, మల్టీ విటమిన్ మందులు దాదాపు పూర్తిగా బయటే కొనాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు హై యాంటిబయోటిక్ ఇంజక్షన్ అవసరమైన వారు బయట కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన ఆల్బుమిన్ ఇంజక్షన్లు, ఇన్‌పేషెంట్‌గా చేరి, డిశ్చార్జి అయిన రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేక పోవడంతో బయటకు రాస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందించారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. ఈ ఏడాది రెండో క్వార్టర్‌కు సంబంధించి మందుల సరఫరాను కూటమి ప్రభుత్వం ఆలస్యంగా సరఫరా చేయడంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీ వద్ద బారులుతీరిన రోగులు నోటిఫికేషన్లు రద్దుకు యత్నాలుప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం మొత్తం నోటిఫికేషన్లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అంశాన్ని వైద్య శాఖ పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో వైద్య శాఖలో మానవ వనరుల కొరతకు తావు లేకుండా ఏకంగా 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ప్రత్యేకంగా వైద్య శాఖ నియామకాల కోసమే రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి ఓపీ కౌంటర్ వద్ద రోగుల పడిగాపులు ఇంటి నుంచి తెచ్చుకున్న కుర్చీలోనేఇతని పేరు శ్రావణ్‌కుమార్. నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పేద వ్యక్తి. వయస్సు 60 ఏళ్లు పైబడి ఉన్నాయి. షుగర్ ఉండటంతో ఇన్ఫెక్షన్ వచ్చి నాలుగు నెలల క్రితం ఒక కాలుకు యాంపుటేషన్ (సర్జరీ చేసి మోకాలు వరకు తొలగించారు) చేశారు. నడవలేడు కనుక మూత్ర విసర్జనకు కెథీటర్ వేశారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ కెథీటర్ను వారం, లేదా పది రోజులకు ఒకమారు మార్చి కొత్తది వేయాలి. ఇలా మార్పించుకునేందుకు తరచూ పెద్దాస్పత్రిలోని ఎమర్జెన్సీ (క్యాజువాలిటీ)కి ఆటోలో వస్తాడు. ఇటీవల ఒకటి, రెండు దఫాలుగా వీల్ చైర్ దొరకలేదు. ఎండలో గంటకు పైగా ఉంచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుంచే కుర్చీ తెచ్చుకున్నారు. దానిలోనే ఎమర్జెన్సీ వార్డు వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారు గంటల కొద్దీ చూస్తే గాని కెథీటర్ మార్పు జరగ లేదు.బిడ్డతో పాటు ఆక్సిజన్ సిలిండర్ నెల్లూరు నగరానికి చెందిన ఈ ఫొటోలోని పసిబిడ్డ పేరు హృతిక్నందన్. ఇతనికి మూడేళ్లు. తలలో గడ్డ ఉండటంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నెల్లూరులోని పెద్దాస్పత్రిలో చిన్న పిల్లల వార్డులో చేర్చారు. ఆక్సిజన్ మీద వైద్యం పొందుతున్నాడు. ఇక్కడ వాంతులు కావడంతో డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. పిల్లల వార్డు నుంచి ఎంఆర్ఐ తీసే చోటు కొంత దూరంలో ఉంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆ పసిబిడ్డ తండ్రి.. బిడ్డకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్‌ను తోసుకుంటూ పరీక్షలకు తీసుకెళ్లాడు. ఆక్సిజన్ సిలెండర్‌ని తోసుకుంటూ వెళ్తున్న ఈమె పేరు శాంతి. గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మకు సీరియస్‌గా ఉందని మధురవాడ నుంచి 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. లోపలికి వెళ్లి త్వరగా క్యాజువాలిటీకి తీసుకెళ్లి వైద్యం అందించాలంటూ అక్కడున్న సిబ్బందిని వేడుకున్నారు. ఎవ్వరూ స్పందించలేదు. ఓ నర్స్ వచ్చి వివరాలు తీసుకున్నారు. వెంటనే ఆక్సిజన్ సిలిండర్‌ని ఇచ్చి.. శాంతి తీసుకొచ్చిన అమ్మ బాధ్యతని వార్డు బాయ్‌కి అప్పగించారు. నర్స్ అటు వెళ్లగానే.. సిలెండర్‌ని వార్డు బాయ్ శాంతి చేతికి ఇచ్చి.. నువ్వే తీసుకురావమ్మా అంటూ విసుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. శాంతి ఆ సిలెండర్‌ని మోసుకుంటూ బయటికి వచ్చింది. తన కుటుంబ సభ్యులు, 108 వాహన సిబ్బంది సహాయంతో సిలెండర్‌ని తానే తోసుకుంటూ క్యాజువాలిటీకి అమ్మని తీసుకెళ్లింది. అరగంట నుంచి అడుగుతున్నా.. ఎవ్వరూ స్పందించలేదు.. అమ్మకి ఏదైనా అయితే.. ఎవరిది బాధ్యత సార్ అంటూ కన్నీటి పర్యంతమైంది.ఇలాగైతే ఎలా? నా బిడ్డ శ్రీవిద్యకు రెండ్రోజులుగా జ్వరం వస్తోంది. ఆత్మకూరులో అంతంత మాత్రంగానే చూస్తారని తెలిసి, అనంతపురం పెద్దాస్పత్రిలోనైతే బాగా వైద్యం అందిస్తారని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఉదయం 10 గంటలైనా వైద్యులు రాలేదు. ఉదయం 8 గంటల నుంచి వేచి చూస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – ఆదినారాయణ, బి.యాలేరు, ఆత్మకూరు మండలంరాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఇదీ సంగతి⇒ శ్రీకాకుళంలోని రిమ్స్‌లో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆధార్‌కార్డులతో వచ్చినప్పటికీ సెల్‌ఫోన్ లేక ఓపీ రశీదు పొందలేకపోతున్నారు. కాళ్లావేళ్లా బతిమాలిడితే... ఎవరో ఒకరు స్పందించి కొందరికి ఓపీ ఇప్పిస్తున్నారు. ఫోన్లు లేని చాలా మంది వైద్యం పొందలేక ఇళ్లకు వెనుదిరిగారు. ఫ్యాన్లు, ఏసీలు, సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఐసీయూలో కూడా ఏసీలు పని చేయని దుస్థితి.⇒ రాజమహేంద్రవరం, ఒంగోలు, నంద్యాల, విశాఖ, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, పాడేరు, విజయనగరం, నర్సరావుపేట, పార్వతీపురం, కాకినాడ, తిరుపతి రుయా ఆస్పత్రుల్లో పాలన అస్తవ్యస్తమైంది. నాలుగవ తరగతి సిబ్బందితో ఇబ్బందులెదురయ్యాయి. స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో లేవు. చాలా చోట్ల ఈసీజీ, 2డీ ఎకో మిషన్లు మొరాయిస్తున్నాయి. రక్త పరీక్షల రిపోర్టుల కోసం రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. పారిశుధ్య లోపం బాగా ఇబ్బంది పెడుతోంది. బాత్రూంలు, మరుగుదొడ్లలో చాలా చోట్ల రన్నింగ్ వాటర్ లేదు. మంచి నీరు కూడా అందుబాటులో లేదు. ఆక్సిజన్ సిలెండర్లు సైతం బంధువులే మోసుకెళ్లారు. రెండు నెలలుగా మందుల సరఫరా నిలిచి పోయింది. మృతదేహాలు పెట్టేందుకు తగినన్ని ప్రీజర్లు లేవు. ఆసుపత్రిలో రోగులకు పెడుతున్న భోజనం నాసిరకంగా ఉంది. నిధులు లేక శానిటేషన్ లోపం కనిపిస్తోంది. సెక్యూరిటీకి సైతం జీతాలు సక్రమంగా అందడం లేదు. వార్డుల్లోకి కోతులు, కుక్కలు చొరబడుతున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవు. మహాప్రస్తానం వాహనాలు అందుబాటులో లేవు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే జనరేటర్ వేయడం లేదు. దోమలను అరికట్టలేక పోతున్నారు. ⇒ భీమవరంలో బాలింతల వార్డుల్లో ఏసీలు పని చేయడం లేదు. ఎక్స్‌రే, ఈసీజీ టెక్నీషియన్లు లేరు. రక్త పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. డెడ్ బాడీ ఫ్రీజర్లు దెబ్బ తిన్నాయి. స్కానింగ్ కోసం ఏలూరుకు రిఫర్ చేస్తున్నారు. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో ఒకటి, రెండు రకాల యాంటిబయాటిక్స్ మాత్రమే ఉన్నాయి. దళారులు, ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు ఆసుపత్రిలో బాహాటంగా తిరుగుతున్నారు. వార్డు బాయ్‌లు, స్ట్రెచర్ బాయ్‌లు లేక రోగుల కుటుంబీకులే ఆ పని చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది సగానికి సగం డ్యూటీలో కనిపించలేదు. కోతుల బెడద విపరీతంగా ఉంది. ఆసుపత్రిలో సైన్ బోర్డులు లేవు.⇒ హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ మిషన్ చెడిపోయింది. మరమ్మతులు చేయలేదు. చాలా మంది రోగులను స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ⇒ అనంతపురం జీజీహెచ్‌లో పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉంది. వార్డుల్లో బయోవేస్ట్ డబ్బాలు ఏర్పాటు చేయలేదు. మందుల కొరత ఉంది. రక్త పరీక్షల రిపోర్టుల్లో జాప్యం జరుగుతోంది. 160కి గాను 60 ఏసీలు మాత్రమే పని చేస్తున్నాయి. గైనిక్, ఎక్స్‌రే, రక్తనిధి వార్డుల్లో కరెంటు పోతే చిమ్మ చీకటే.⇒ అనకాపల్లిలో ఉదయం 10 గంటల నుంచి 11.45 గంటల వరకూ కరెంట్ లేదు. జనరేటర్ ఉన్నా, 10 నిమిషాల పాటు మాత్రమే పని చేసింది. ఎక్స్‌రే కోసం చాలా మంది ఇబ్బంది పడ్డారు. గర్భిణీలకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తున్నా.. రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్‌పై పెన్‌తో రాసి పంపిస్తున్నారు. సర్జికల్ గ్లౌజులు, కాటన్, ఐవి క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. రోగులకు ఇచ్చే భోజనంలో నాణ్యత తగ్గింది. ⇒ కృష్ణాజిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్ట్రక్చరు, వీల్‌చైర్స్ సరిపడా లేవు. ఉన్న వాటిలో బంధువులే తోసుకెళ్తున్నారు. బాగా పని చేస్తున్న వెంటిలేటర్లను గదుల్లో పెట్టి తాళాలు వేశారు. రోగులకు కనీసం బీపీ కూడా చూడటం లేదు. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో నాల్గవ తరగతి సిబ్బంది కొరత చాలా ఉంది. అవుట్‌పేషెంట్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులే చూస్తున్నారు. ఓపీలో ఇన్‌పేషెంట్స్‌గా చేర్చిన వారిని మరుసటి రోజు పరీక్షించి మందులు రాస్తున్నారు. అత్యవసర కేసుల్లో వార్డుకు తరలించడానికి ఎక్కువ సమయం పడుతోంది.⇒ ఏలూరు జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం రోగులు కనీసం 15, 20 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు సరిపడా లేవు. ఓపీకి వచ్చే రోగులు, వారి బంధువులు గంటల తరబడి బయట షెడ్ల కింద ఉండాల్సి వస్తోంది. కనీసం ఫ్యాన్లు కూడా లేవు. రెండు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రైవేటు సంస్థ సరఫరా చేస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి మాత్రమే రోగులకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ⇒ కడపలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లోని ఐపీ, ఓపీ విభాగాల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఓపీ విభాగంలో కుర్చీలు, స్ట్రక్చర్లను మూలన పడేశారు. మెడికల్ ఐసీయూలో ఏసీలు పని చేయడం లేదు. పెడస్టల్ ఫ్యాన్లు పెట్టారు. ఎంఆర్ఐ, ఇతర ఓపీ విభాగాల్లోకి యథేచ్చగా కోతులు, కుక్కలు వస్తున్నాయి. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయి ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని, అందువల్ల ఈ నెల 15వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. సమస్యను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ఆరోగ్యశ్రీ సీఈవోకు మంగళవారం లేఖ రాసింది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులు లేక సిబ్బంది జీతాల చెల్లింపు, మౌలిక సదుపాయాలు, మందులు, డిస్పోజబుల్స్ నిర్వహించడం కూడా కష్టతరంగా మారినట్టు పేర్కొంది. గత నెల 30న సీఈవోను కలిసి సమస్యల్ని వివరించినప్పటికీ ఎటువంటి కదలిక లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయిన ఓ క్షతగాత్రుడు ఆస్పత్రికి వస్తే.. గంట పాటు అతనికి వైద్యం అందించకుండా శ్రీకాకుళం రిమ్స్ వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రణస్థలం వద్ద యూబీ పరిశ్రమకు చెందిన కార్మికుడు పతివాడ సన్యాసినాయుడును మంగళవారం మ«ధ్యాహ్నం లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయాయి. మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రమాదం జరిగింది. సన్యాసినాయుడును యూబీ కంపెనీ అంబులెన్స్‌లో 2.55 గంటలకు శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువచ్చారు. అంబులెన్సు నుంచి అతడ్ని తీసుకెళ్లడానికి అరగంట వరకు ఎవరూ రాలేదు. 3.45 ప్రాంతంలో సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స మాత్రమే చేశారు. -
డెంగీ హైరిస్క్ ప్రాంతాలు 2,071
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. జూలై నెలలోనే 800 కేసులు వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు. -
భయం గుప్పెట్లో జగ్గయ్యపేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బిపేట/జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డయేరియా (అతిసార) విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఈ కారణంతో మృత్యువాత పడడంతో జగ్గయ్యపేట పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదుకాగా, ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయి. కొందరు బాధితులు ఖమ్మం, విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతుండడంతో ఇవి అధికార లెక్కల్లోకి రావటంలేదు. ఇక్కడ ఇప్పటికే ఆరుగురు మృతిచెందినప్పటికీ ఇద్దరు మాత్రమే మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరోవైపు.. ఆదివారం ఒక్కరోజే జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన11 మంది వాంతులు, విరేచనాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇప్పటికే 32 మంది చికిత్స పొందుతుండగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైద్య, ఆరోగ్యశాఖ జాప్యం..జగ్గయ్యపేట పట్టణంతో పాటు, షేర్ మహమ్మద్‌పేట, మక్కపేట, చిల్లకల్లు, బూదవాడ, అనుమంచిపల్లి, గండ్రాయిల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మృత్యువాత పడిన వారు కూడా ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నిజానికి.. వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల 20నే డయేరియా కేసులను గుర్తించినా అదుపు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసింది. కానీ, అధికారుల హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీరు కలుషితం.. లోపించిన పారిశుధ్యం..ఇదిలా ఉంటే.. డయేరియా సోకుతున్న గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అలాగే, పారిశుధ్యం కూడా అస్తవ్యస్థంగా ఉందని.. నీటిని సరఫరా చేసే రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ఉదా.. షేర్‌హమ్మద్‌పేట చెరువు ఒడ్డునే తాగునీటి బావి ఉంది. అక్కడ బావి పక్కనే చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. పైగా ఆ బావిపైన మెస్ కూడా లేకపోవడంతో నీరు పూర్తిగా కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, అనుమంచిపల్లి, గండ్రాయి, బూదవాడ ప్రాంతాల్లోని పారిశుధ్యం పరిస్థితి కూడా ఇంతే. మక్కపేట ప్రాంతంలో తాగునీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం.ప్రత్యేక బృందాల ఏర్పాటు..ఇక డయేరియా సోకుతున్న గ్రామాల్లో శానిటేషన్ మెరుగుదలకు వైద్య, ఆరోగ్యశాఖ 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 45 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. మరోవైపు.. జగ్గయ్యపేట ప్రాంతాన్ని ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆయా శాఖాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా ఉండడంలేదని, అలసత్వం వహిస్తున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేచేయాలని, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్ వెంకటేశ్వర్, జేసీ సంపత్‌కుమార్, ఆర్డీఓలు రవీందర్, మాధవి, డీఎంహెచ్ఓ సుహాసిని, వైద్యారోగ్య శాఖ అడిషనల్ ఏడీ సుబ్రహ్మణ్యశ్రీ, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.217 చోట్ల నీరు కలుషితం రాష్ట్రవ్యాప్తంగా 168 డయేరియా కేసులు నమోదయ్యాయని.. ఇందులో ఒక్క జగ్గయ్యపేటలోనే 58 కేసులున్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటరీ చానళ్లను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీటిలో డ్రెయినేజీ మురుగు కలవడం ఇందుకు కారణమన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇప్పటికే 30 వేలకు పైగా నీటి వనరులు నమూనాలు పరీక్షించగా 217 ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు అధికారులు గుర్తించారన్నారు. -
వైద్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎంఐడీసీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), బ్లడ్‌బ్యాంక్‌లు, ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని వసతి గృహాలు, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
అలా వాడేయటం ఆరోగ్యానికి ‘యాంటీ’
సాక్షి, అమరావతి: జలుబుకు మందు వేస్తే వారానికి.. వేయకపోతే ఏడు రోజులకు తగ్గుపోతుందనేది తెలుగు నాట తరచూ వినిపించే మాటే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక దగ్గు.. జలుబు.. జ్వరం.. ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో సూచించే మందులను మెడికల్ షాపులకు వెళ్లి కొనేస్తున్నారు. వాటిలో యాంటీ బయోటిక్స్ కూడా ఉంటున్నాయి. కొందరైతే మెడికల్ షాపులకు వెళ్లి తనకొచ్చిన నలత ఏమిటో చెప్పి నేరుగా యాంటీ బయోటిక్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి పెనుముప్పు తెచ్చిపెడుతోంది. చాలా ప్రమాదం సుమా! యాంటీ బయోటిక్స్‌ను మితిమీరి వినియోగించడం వల్ల సూక్ష్మజీవనాశక నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సమస్య ఉత్పన్నం అవుతోంది. వైద్య నిపుణుల సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను ఇష్టారీతిన వినియోగిస్తే.. వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకుని.. చివరకు ఏ మందుకూ లొంగకుండా మరింత బలం పుంజుకుంటాయి. టీకాలు, ఔషధాలు ప్రయోగించినా ఫలితం లేకుండాపోతుంది. ఇలా తయారు కావటాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఏఎంఆర్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. కాగా.. 2050 నాటికి ఏఎంఆర్ కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య కోటికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తొలి పది ఆరోగ్య సంక్షోభాల్లో ఏంఎఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం స్పష్టం చేస్తోంది. ప్రి్రస్కిప్షన్ లేకుండానే.. వైద్యులను సంప్రదించకుండా.. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదని ఔషధ నియంత్రణా శాఖ హెచ్చరిస్తున్నా మెడికల్ షాపుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. మరోవైపు వైద్య శాఖ సైతం ఏంఎఆర్పై ప్రత్యేక ప్రణాళికను రచించింది. పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ఏంఎఆర్ నియంత్రణపై ముందుకు అడుగులు వేస్తోంది. ప్రజలకు సైతం యాంటీబయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పిస్తోంది. -
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యశాఖ బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి రెండు వారాల్లోనే 16.98శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోను వైద్యశాఖ పాటిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు. హైరిస్క్ వర్గాలకు... క్షయ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి టీకా పంపిణీ వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు.. ఇలా ఆరు వర్గాలకు చెందిన వారికి తొలి దశలో టీకా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఆరు వర్గాలకు చెందినవారు 50లక్షల మంది వరకు ఉన్నట్టు వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తొలి మూడు నెలల్లో 20లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా, రెండు వారాల్లోనే 16.98 శాతం 3,39,640 మందికి పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 45,891మందికి, నెల్లూరులో 38,602మందికి, వైఎస్సార్ జిల్లాలో 37,995మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఎంపికచేసిన 12 జిల్లాల్లో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు టీకా ఇప్పటికే వైద్యశాఖ పిల్లలకు సాధారణ టీకాలతోపాటు టీబీకి సంబంధించిన టీకాను వేస్తోంది. వైద్యశాఖ 2022లో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తొమ్మిది నెలల్లోపు పిల్లలకు మూడు డోసులుగా ఈ టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాలలోపు ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోపు మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. -
వైద్యశాఖలో 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 144, విశాఖపట్నంలోని విమ్స్‌లో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాక్ ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బోధనాస్పత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఈనెల 18, 20 తేదీల్లో విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు. ఇక విమ్స్‌లో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం కోసం ఈనెల 15న విశాఖపట్నంలోని విమ్స్‌లోనే వాక్ ఇన్ రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీల్లో ని ర్ణీత ప్రదేశాలకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత, ఇతర నియమనిబంధనలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను https:// dme. ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వైద్యపోస్టుల భర్తీకి బిడ్డింగ్ తమ పరిధిలోని ఆస్పత్రుల్లో శాశ్వత, కాంట్రాక్టు విధానంలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాక్ ఇన్ రిక్రూట్మెంట్తో పాటు గిరిజన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల ఖాళీలను బిడ్డింగ్ విధానంలో అధిక వేతనంతో నియమించేందుకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఖాళీల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి తాడేపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. బిడ్డింగ్ విధానంలో నియామకానికి ఆసక్తి చూపే వైద్యులు నిర్ణీత తేదీల్లో వాకింగ్ రిక్రూట్మెంట్ వేదిక వద్ద తమ కొటేషన్లను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సూచించారు. ఈ విధానానికి సంబంధించిన సవరించిన నోటిఫికేషన్ cfw.ap.gov.in, hmfw.ap.gov.in వెబ్సైట్లలో ఉంచారు. -
రాష్ట్ర వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ చెప్పారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న హరియాణ ట్రైనీ సివిల్ సర్విసెస్ అధికారుల బృందం బుధవారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో వైద్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ బృందానికి కమిషనర్ నివాస్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి వివరించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలే ఈ ప్రభుత్వం వైద్యశాఖలో తెచ్చిన మార్పునకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వైద్యపరమైన సమస్యలు, అవసరాలు తీర్చేలా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.250 చొప్పున ఆరునెలల వరకు భృతిని ఇస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి పథకం బహుశా దేశంలోనే ఎక్కడా అమలులో లేదన్నారు. సీఎం చైర్మన్‌గా వ్యవహరించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీతో పాటు 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానమైన 104 మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హరియాణ ట్రైనీ అధికారులు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యరంగంపై ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం అభినందనీయమని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును తాము పరిశీలించామన్నారు. 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను నెలకొల్పడమే కాకుండా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న సీహెచ్‌వోలను నియమించి మారుమూల గ్రామాలకు సైతం వైద్యసేవల్ని విస్తరించడం ప్రశంసనీయమని చెప్పారు. అత్యధిక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లను సృష్టించడంలో కూడా దేశంలోనే ఏపీ ముందు నిలిచిందన్నారు. ఏపీలోని వలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను ఎంతో చేరువ చేశారని వారు పేర్కొన్నారు. -
దీర్ఘకాలిక జబ్బులకు ‘సురక్ష’తో భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వైద్య శాఖ ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజలందరినీ స్క్రీనింగ్ చేయడమే కాకుండా.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ), క్షయ జబ్బులతో బాధపడుతున్నవారిని గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1.84 కోట్ల మందిలో షుగర్ లక్షణాలు.. గత నెలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 4.63 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారు. 2.16 కోట్ల మందిలో బీపీ, 1.84 కోట్ల మందిలో షుగర్ జబ్బు లక్షణాలను గుర్తించారు. గతంలో నిర్వహించిన నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో నిర్ధారించిన పాత బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బీపీ కేసులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 12,790, నెల్లూరులో 12,583, విజయనగరంలో 12,124 వెలుగులోకి వచ్చాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 9,279, నెల్లూరులో 8,275, విజయనగరంలో 7,363 షుగర్ కేసులను గుర్తించారు. మరోవైపు క్షయ అనుమానిత లక్షణాలున్న 1,78,515 మంది నుంచి నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించగా.. 417 మందిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలున్న 9,925 మందిని గుర్తించగా.. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 8 లక్షల మందిలో కంటి సమస్యలున్నట్టు గుర్తించిన వైద్యులు.. సాధారణ మందులతో తగ్గే సమస్యలున్న 2.44 లక్షల మందికి మందులు అందజేశారు. 4.86 లక్షల మందిని కళ్లద్దాలకు, 69,676 మందిని కేటరాక్ట్ సర్జరీలకు రిఫర్ చేశారు. వీరిలో 833 మందికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా సర్జరీలు నిర్వహించింది. కొత్తగా బయటపడిన బీపీ, షుగర్, క్షయ తదితర జబ్బులున్న వారికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. ప్రారంభదశలోనే గుర్తిస్తే ఎంతో మేలు.. చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. చాలా మందికి బీపీ, షుగర్ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. ఇలా అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే.. 20 శాతం పెరాలసిస్ కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్ సమస్యను కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీ, గుండె, ఇతర సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముంది. దేశంలో బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా 64.9 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా గుర్తించిన మధుమేహం, రక్తపోటు, క్షయ, ఇతర సమస్యలన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అనుసంధానం చేశాం. కొత్తగా గుర్తించిన మధుమేహం కేసుల్లో సంబంధిత వ్యక్తులకు హెచ్1బీ ఏసీ టెస్టులు నిర్వహిస్తాం. సంబంధిత వ్యక్తుల ఆరోగ్యాలను ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు మందులు అందిస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే తగిన సహకారం అందిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 6 లక్షల మందికిపైగా బీపీ బాధితులకు, 4.10 లక్షల మందికిపైగా మధుమేహం బాధితులకు నిరంతర వైద్య సేవలందిస్తున్నాం. –జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజారోగ్యంలో మంచి ఫలితాలు గ్రామాల్లో వ్యవసాయం, ఇతర కూలిపనులు చేసుకుంటూ జీవించే పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వమే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వైద్య సేవలందించడం శుభపరిణామం. ఇలా చేయడం ద్వారా బీపీ, షుగర్, ఇతర జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ప్రజారోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ -
గుండెకు గండం
ఖమ్మం వైద్యవిభాగం: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి భరోసా కల్పించేలా జిల్లా జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా మెరుగైన సేవలు అందుతుండడంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తీరాయి. అయితే, వారం రోజులుగా మాత్రం ఇక్కడ చికిత్సకు అంతరాయం ఏర్పడింది. శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో బాధితులు బెడ్ల మీదే ఉంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. త్వరగా తమకు శస్త్రచికిత్స నిర్వహించాలని వేడుకుంటున్నారు. అత్యాధునిక యంత్రాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లాలో గుండె జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోయేవారు. మరికొందరు నిరుపేదలు వైద్యం చేయించుకునే స్థోమత లేక తనువు చాలించేవారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుండె సంబంధిత బాధితుల కోసం కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శస్త్రచికిత్సలు నిర్వహించడానికి రూ.7 కోట్ల విలువైన క్యాథల్యాబ్ మిషన్‌ను కేటా యించగా, గత ఏడాది జనవరిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. తద్వారా ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స ఉచితంగా అందుబాటులోకి రాగా, వందలాది మందికి శస్త్రచికిత్స చేశారు. కార్డియాలజీ విభాగంలో కరోనరీ యాంజియోగ్రామ్ శస్త్రచికిత్సతో పాటు, స్టంట్లు, బలూన్ యాంజియోప్లాస్టీ, రెనల్ యాంజియోగ్రామ్, రూట్ యాంజియోగ్రామ్, కారోటిడ్ యాంజియోగ్రామ్, పెరిపెరల్ యాంజియోగ్రామ్, బ్రాంకియల్ యాంజియోగ్రామ్, పెరీకార్డియో సెంటెసిస్ తదితర సేవలందిస్తున్నారు. బిల్లులు పేరుకుపోవడంతో... క్యాఽథల్యాబ్ యంత్రం ద్వారా చికిత్స చేయాలంటే కాంట్రాస్ట్ ఇంజక్షన్లు అవసరమవుతాయి. బాధితులకు శస్త్రచికిత్స చేసే ముందు ఈ ఇంజక్షన్ ఇచ్చి గుండె పనితీరు, ఎక్కడ ఏ సమస్య ఉంది, స్టంట్ ఎక్కడ వేయాలనే అంశాన్ని మానిటర్ ద్వారా తెలుసుకుంటారు. అనంతరమే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమవుతారు. కానీ కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేకపోవడంతో వారం రోజులుగా శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ గాందీ, నిమ్స్ తదితర ఆస్పత్రుల మాదిరిగానే ఈ ఇంజక్షన్లు ఇండెంట్ పెట్టి బయట నుంచి తెప్పిస్తారు. అయితే, సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు పేరుకుపోవడం వారు నిలిపివేశారని తెలుస్తోంది. కారణాలు ఏమైనా శస్త్రచికిత్సలు నిలిచి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా... కొందరు చేసేదేం లేక బయటి ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇంజక్షన్ వస్తేనే.. ఈయన పేరు సీహెచ్.నాగేశ్వరరావు. వయస్సు 38 ఏళ్లు మాత్రమే. ఐదు రోజుల క్రితం గుండె భాగంలో నొప్పి రావటంతో కూలబడగా ఆయన భార్య ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి తీసుకొచ్చింది. వైద్యులు పరీక్షించి గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. కానీ సమస్య తీవ్రత తెలియాలన్నా, శస్త్రచికిత్స చేయాలన్నా కాంట్రాస్ట్ ఇంజక్షన్ అవసరం. అవి లేకపోవడంతో యాంజియోగ్రామ్ నిర్వహించకపోగా ఏమవుతుందోనన్న బెంగతో నాగేశ్వరరావు, ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం... కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేక శస్త్రచికిత్సలు నిలిచిన మాట వాస్తవమే. బయట నుండి తెప్పించాల్సి ఉంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. అయితే, ఇన్పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్డియాలజీ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. – బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
అవయవదానంపై నూతన విధానం రావాలి
సాక్షి, అమరావతి: దేశంలో అవయవదానం, అవయవమార్పిడికి నూతన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సమాఖ్యతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్త్య చింతన్ శిబిర్ కార్యక్రమంలో శనివారం రెండో రోజు మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం గొప్ప విరుగుడుగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 2021 అక్టోబర్‌లో అసంక్రమిత వ్యాధులపై స్క్రీనింగ్ ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో క్యాన్సర్, గుండె వ్యాధులకు ముందస్తు నిర్ధారణ పరీక్షలను గ్రామాల్లోనే చేపడతామన్నారు. ఇప్పటికే 600కుపైగా క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి ఏటా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. రూ.350 కోట్లతో బోధన ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, వసతులు, స్టేట్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఎం నిధులను మరింత అదనంగా కేటాయించి సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్, ఏపీ కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామస్థాయిలోనే దంత వైద్యం
సాక్షి, అమరావతి : గ్రామస్థాయిలోనే అన్నిరకాల వైద్య సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) స్థాయిలోనే వైద్యశాఖ దంత వైద్యసేవలు అందిస్తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో 245 దంత వైద్య విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రజలకు దంత వైద్యసేవలను చేరువ చేసేందుకు ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోని దంత వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,142 పీహెచ్‌సీలను అనుసంధానించారు. ఈ క్రమంలో దంత వైద్యులు నెలలో ఒకసారి ప్రతి పీహెచ్‌సీనీ సందర్శిస్తూ అక్కడే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. 2.14 లక్షల మందికి సేవలు.. నిజానికి.. రెండేళ్ల క్రితం పీహెచ్‌సీల్లో డెంటల్ క్లినిక్స్ నిర్వహణను ప్రారంభించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో 35,151 డెంటల్ క్లినిక్‌లను నిర్వహించారు. వీటిల్లో 2,14,410 మంది పీహెచ్‌సీల్లో దంత వైద్యసేవలు అందుకున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే దంత వైద్యులు అక్కడే ప్రజలకు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. చిన్నపాటి దంత సమస్యలకు పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం ఉంటే దగ్గర్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే సమస్యల గుర్తింపు చాలావరకూ ప్రజలు చిన్నచిన్న దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి దీర్ఘకాలం పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. ప్రాథమిక దశలోనే దంత సమస్యలను గుర్తించి నివారించడానికి చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పీహెచ్సీ స్థాయిలోనే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నాం. తద్వారా ప్రజలు సులువుగా వైద్యులను సంప్రదించడానికి వీలుంటుంది. ఓరల్ స్క్రీనింగ్‌పై పీహెచ్సీ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. దీంతో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్తున్న పీహెచ్సీ వైద్యులు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తింపునకు.. మరోవైపు.. ప్రాథమిక దశలోనే నోటి క్యాన్సర్ గుర్తించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లా కడప, విజయవాడ డెంటల్ కళాశాలలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని బోధనాస్పత్రుల్లోని దంత వి భాగాలకు అధునాతన వెల్‌స్కోప్ పరికరాలను సమకూర్చారు. వీటిద్వారా నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి మే నెల మధ్య ఐదుచోట్ల 1,676 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 61 మందిలో నోటి క్యాన్సర్ నిర్ధారణ అయింది. బాధితులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. -
వైద్య ఆరోగ్య రంగంలో అగ్రగామి ఏపీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం నూరా హెల్త్ సంస్థ, యూనిసెఫ్ల సహకారంతో వైద్య శాఖ కేర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంపై ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి విజయవాడలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతి లక్ష ప్రసవాలకు దేశంలో ఎంఎంఆర్ 97గా ఉంటే ఏపీలో 45గా ఉందని, ఐఎంఆర్ దేశంలో 28గా ఉంటే రాష్ట్రంలో 24కు తగ్గిందని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్‌ను సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ కేర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ, రక్తహీనత సమస్య నివారణ.. ఇలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దేశంలోనే ఒకటి, రెండోస్థానాల్లో రాష్ట్రం ఉండాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, నూరా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సీమామూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్.ఎస్.అనిల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగవు రాష్ట్రంలో మే ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కృష్ణబాబు కోరారు. ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రా«దాన్యం ఇస్తున్న సీఎం జగన్ బిల్లుల చెల్లింపు విషయంలోను తీవ్రజాప్యం లేకుండా చూస్తున్నారని చెప్పారు. ఇటీవల బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, పెండింగ్ బిల్లుల్లో కొంత భాగాన్ని త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. రూ.రెండువేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నది వాస్తవం కాదని, రూ.800 కోట్ల మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంటే.. ప్రస్తుతం రూ.మూడువేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీన్నిబట్టి ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోందని చెప్పారు. -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
హృదయం పదిలం
సాక్షి, అమరావతి: సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా హృద్రోగ మరణాలను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాపాయ పరిస్థితిని తప్పించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్.టి. ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) కార్యక్రమాన్ని అమలు చేసేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది. సాధారణ పరిభాషలో స్టెమీ అంటే గుండె రక్తనాళాలు 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు. ఇలాంటి సందర్భాల్లో ఆరు గంటల్లోగా లక్షణాలను గుర్తించి పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్) అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. రాష్ట్రంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 32.4 శాతం హృదయ సంబంధిత వ్యాధులే కారణం. 38 లక్షల మందికి పైగా గుండె జబ్బు బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం జగన్ వీటిపై దృష్టి సారించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ బాధితుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచాలని ఆదేశించారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో.. హబ్ అండ్ స్పోక్ విధానంలో ‘స్టెమీ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 26 జిల్లాల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం కలిగిన ఆస్పత్రులను హబ్‌గా అభివృద్ధి చేసి జిల్లా, ఏరియా ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇప్పటికే క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉండగా మిగిలిన చోట్ల కూడా అందుబాటులోకి తేనున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రులను హబ్స్‌గా నోటిఫై చేస్తారు. హబ్‌లో కార్డియాలజీ, యాంజియోప్లాస్టీ సదుపాయాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో జనరల్ ఫిజీషియన్, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ఛాతీ నొప్పి, గుండె పోటు సంబంధిత లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి అత్యవసర వైద్య సేవలు అందించేలా సదుపాయాలు సమకూరుస్తారు. ఐసీయూ సెట్టింగ్‌తో (కరోనరీ కేర్ యూనిట్), ఎలక్టో కార్డియోగ్రామ్ (ఈసీజీ), కార్డియోవర్టర్, థ్రాంబోలైసిస్ థెరపీ నిర్వహించడానికి అవసరమైన మందులు, ఇతర సదుపాయాలు ఉంటాయి. బాధితులను అత్యవసరంగా పెద్దాస్పత్రులకు తరలించేందుకు వీలుగా 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులోనూ ఈసీజీ సౌకర్యం ఉంటుంది. సేవలు ఇలా.. ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఛాతీ నొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. రిపోర్టు హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. దీన్ని పరిశీలించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా? అనే అంశాలను కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. స్పోక్ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేసి అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్’ ఇంజక్షన్ ఇస్తారు. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హబ్/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు. రెండు నెలల్లో.. స్టెమీ కార్యక్రమాన్ని రెండు నెలల్లో అన్ని చోట్లా ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. స్పోక్ ఆస్పత్రులకు స్టెమీ కిట్స్ పంపిణీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దీంతో గోల్డెన్ అవర్‌లో బాధితులకు సత్వర వైద్యం లభిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తిరుపతిలో ఇప్పటికే అమలు.. స్టెమీ కార్యక్రమాన్ని గత రెండున్నరేళ్లుగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. తిరుపతి, చిత్తూరు, రాజంపేట, వైఎస్సార్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు రుయా ఆస్పత్రిలోని హబ్‌కు అనుసంధానమై గుండెపోటు బాధితులకు సత్వర వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ వంద మందికిపైగా ప్రాణాలను కాపాడామని రుయా మెడిసిన్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మునీశ్వరరెడ్డి తెలిపారు. -
పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి వారికి ముందుగానే వైద్యం చేయడం ద్వారా మరణాలను కట్టడి చేయడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా న్యూమోనియా వ్యాధి నివారణ, ప్రజల్లో అవగాహన కల్పించడానికి గత నెల 12 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వాతావరణంలో వచ్చే మార్పులతో పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఆ సమస్యల్లో న్యూమోనియా ప్రధానమైనది. దేశంలో ఏటా ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో 16శాతం న్యూమోనియా కారణంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూమోనియా నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే టీకా పంపిణీ చేస్తోంది. 7.32 లక్షల మంది చిన్నారుల స్క్రీనింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 21,50,790 మంది ఉన్నారు. కాగా సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ 7,32,820 మంది చిన్నారులను ఏఎన్ఎంలు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 92,396 మందిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు దగ్గు, జలుబు, ఇతర సమస్యలున్నట్టు గుర్తించారు. తీవ్ర న్యూమోనియా సమస్య ఉన్న పిల్లలను మెరుగైన వైద్యం కోసం పీహెచ్‌సీల నుంచి పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అనంతరం ఆరోగ్య పరిస్థితిపై పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఫాలోఅప్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నడుస్తోంది. అనకాపల్లి టాప్ ఐదేళ్లలోపు పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాల్లో 61,822 మంది చిన్నారులుండగా వీరిలో 62.59 శాతం మందికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తయింది. 58.55 శాతంతో శ్రీకాకుళం రెండో స్థానంలో, 56.46 శాతంతో కాకినాడ మూడో స్థానంలో ఉన్నాయి. కేవలం 19.05శాతంతో ప్రకాశం జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకు.. ఐదేళ్ల లోపు పిల్లల్లో న్యూమోనియా సమస్యను నివారించడానికి చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేస్తున్నాం. న్యూమోనియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభిస్తున్నాం. తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పిల్లల్లో సమస్య తీవ్రమయ్యే పరిస్థితులుంటాయి. ఈ క్రమంలోనే సర్వే చేపడుతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సర్వే కొనసాగుతుంది. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
1,140 వైద్య పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్
గాంధీ ఆస్పత్రి/లక్డీకాపూల్: వైద్యశాఖలో రెండు రోజుల్లో 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అలాగే పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి 10 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలోనే మరో 140 మంది మిడ్ వైఫరీలు అందుబాటులోకి వస్తారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ ఐసీయూలు, సెమినార్ హాలు, గాంధీ ఆస్పత్రి వెబ్ పోర్టల్‌ను డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో కలసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారిందన్నారు. గాంధీ, పేట్లబురుజు, ఎంజీఎంలలో సంతాన సాఫల్య కేంద్రాలు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, పాతబస్తీలోని పేట్లబురుజు ఆస్పత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో రూ. 7.50 కోట్ల వ్యయంతో ప్రభుత్వ రంగంలో తొలిసారి సంతాన సాఫల్య కేంద్రాలను 3 నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే జిల్లా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 55 అత్యాధునిక అల్ట్రాసౌండ్ మెషీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో 200 పడకల హైఎండ్ ఎంసీహెచ్ ఆస్పత్రిని జనవరిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. గాంధీ ఆస్పత్రి 8వ అంతస్తులో స్టేట్ ఆర్గాన్ ట్రాన్‌ప్లాంటేషన్ సెంటర్ నిర్మాణం కోసం రూ. 35 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు చేపట్టే ఆపరేషన్ల వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ వ్యవస్థ కోసం రూ. 13.55 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు రూ. 14 కోట్లు, డైట్ కిచెన్ నిర్మాణానికి రూ. 1.20 కోట్లు కేటాయించామన్నారు. సామర్థ్యానికి మించి గాంధీలో సేవలు.. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రస్తుతం సామర్థ్యానికి మించి 1,683 మంది ఇన్‌పేషెంట్లు గాంధీలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో గత 3 నెలల్లో రూ. కోటి విలువగల వైద్య సేవలు, చికిత్సలు, సర్జరీలు నిర్వహించారని వివరించారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు 95 లక్షల మంది పేదలకు వైద్యసేవలు అందించామని ఆయన వివరించారు. ఇన్ఫెక్షన్ను అరికట్టకుంటే కఠిన చర్యలు.. నిమ్స్ ట్రామా బ్లాక్ ఆడిటోరియంలో అంటువ్యాధుల నివారణ, నియంత్రణపై శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి గదులు, డయాలసిస్ వార్డుల్లో ఎక్కువగా ఉండే ఇన్ఫెక్షన్ను అరికట్టే విషయంలో తప్పు చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు. కాగా, అత్యవసర వైద్య విభాగంలో రోగులను 24 గంటలకు మించి ఉంచొద్దని, వారిని సంబంధిత స్పెషాలిటీ విభాగానికి తరలించా లని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా హరీశ్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. సెల్ఫీటైం గైనకాలజీ వైద్యులు, సిబ్బందితో సెల్ఫీ దిగిన మంత్రి హరీశ్.. లేబర్ వార్డు వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీగార్డు అడిగిన వెంటనే అంగీకరించి, ఆమె వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగడంతో సెక్యూరిటీగార్డు ఆనందంతో తబ్బిబ్బయ్యింది. -
కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తు.. వచ్చే ఏడాదికల్లా మరో ఐదు..
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు వీలుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు చేసే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలలో ఏర్పాటవుతున్న కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైద్యశాఖ వేగంగా చేపడుతోంది. వీటి ఏర్పాటు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులను డీఎంఈ పరిధిలోకి బదలాయించి, ఈ ఐదుచోట్ల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లను నియమించారు. వీరే కొత్త కాలేజీల అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. రూ.401 కోట్ల వ్యయంతో.. ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.401.40 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతోంది. రూ.100 కోట్లతో అవసరమైన పరికరాలను కూడా సమకూరుస్తోంది. అలాగే, వైద్య కళాశాలల కార్యకలాపాల కోసం నంద్యాల, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం మచిలీపట్నంలలో రూ.146 కోట్లతో ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ) నిర్మిస్తున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లెక్చర్ హాళ్లు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ బ్లాకులతో పీఈబీలు నిర్మిస్తున్నారు. రూ.16 వేల కోట్లతో నాడు–నేడు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రూ.16వేల కోట్లకు పైగా వ్యయంతో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఇతర ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు 16 నూతన వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.12,268 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాలలో 2023–24 నాటికి, మిగిలిన 11 చోట్ల 2024–25లోగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది ఆఖరులో తనిఖీలు ఐదు కొత్త వైద్య కళాశాలల అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశాం. ఈ ఏడాది ఆఖరులో ఎన్ఎంసీ బృందం తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. తనిఖీల అనంతరం అనుమతులు మంజూరు అవుతాయి. – డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, డీఎంఈ కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా ఏర్పాటయ్యే ఈ ఐదు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రెండు వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి కొత్త కాలేజీల ఏర్పాటు ఎంతో వరంగా మారనుంది. -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందించడానికి భారీగా ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు. చదవండి: ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. సెపె్టంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్టికెట్లలో తెలియజేస్తారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అర్హతలు అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. పరీక్ష ఇలా.. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు (మూడు గంటలు)లుగా నిర్ణయించారు. -
ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ రాష్ట్రంలో 1,51,419 ప్రసవాలు జరగ్గా ఇందులో ఏకంగా 99.99 శాతం అంటే 1,51,405 ప్రసవాలు ఆస్పత్రుల్లోనే చేశారు. కేవలం 0.01 శాతం మాత్రమే ఆస్పత్రుల బయట జరిగాయి. వీటిని కూడా అధిగమించి వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలుండగా కాకినాడ (99.98), అల్లూరి సీతారామరాజు (99.82), శ్రీ సత్యసాయి (99.78), చిత్తూరు (99.98) మినహా మిగిలిన 22 జిల్లాల్లో వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగాయి. 46.19 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో.. ఒకప్పుడు మొత్తం ప్రసవాల్లో 30–35 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉండేవి. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. దీంతోపాటు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం జరిగితే కలిగే ప్రయోజనాలపై ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ జరిగిన ప్రసవాల్లో 46.19 శాతం అంటే 69,932 ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే చేపట్టారు. పార్వతీపురం మన్యంలో 85.11 శాతం, అనకాపల్లిలో 75.12 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్వహించారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేస్తున్నాం. పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే అసలు ప్రసవాలే చేయని పీహెచ్‌సీలను గుర్తించాం. వాటిలో ప్రసవాలు చేసేలా చర్యలు చేపట్టాం. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీల్లో లేబర్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిల్లో పనులు నడుస్తున్నాయి. – జె.నివాస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
ఫీ'జులుం' సాగడంలేదిక్కడ
ఎంబీబీఎస్ చదివిన ప్రతి విద్యార్థికీ ఇప్పుడు పీజీ తప్పనిసరి. ఇందుకోసం వైద్య విద్యార్థులు అహోరాత్రాలూ కష్టపడతారు. తీరా నీట్ పరీక్ష రాసి, ర్యాంకులు వచ్చాక.. ప్రభుత్వ కళాశాలల్లో సీటు రాక, ప్రైవేటు కళాశాలల్లో చేరలేక నిరుత్సాహ పడిపోతారు. ఫీజులు అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత వైద్య విద్యకు దూరమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇదే విషయంపై ఆలోచన చేశారు. వెంటనే భారీగా ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిస్థితి మారింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీటు పొందాలని ప్రయత్నిస్తున్నారు. – నాగా వెంకటరెడ్డి చంద్రబాబు దుర్మార్గం.. జగన్ మానవత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకునేలా నిర్ణయం తీసుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టగానే ఆయన బంధువుకు చెందిన విశాఖలోని గీతం మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదా కల్పించి, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, పీజీ సీట్ల ఫీజులు ఇష్టానుసారం పెంచుకొనే అవకాశమిచ్చారు. ఇందుకు అడ్డు చెప్పిన అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను తప్పించి మరీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ పీజీ వైద్య ఫీజు ఏడాదికి రూ.11 లక్షలు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏడాదికి రూ.24.20 లక్షలకు పెంచేసింది. అంటే రెండింతలకు పైగా పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేకమంది ఉన్నత వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీని సాకుగా చూపుతూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు కూడా ఫీజులు పెంచేశాయి. జగన్ సర్కారు వచ్చిన తర్వాత మానవతా దృక్పధంతో ఆలోచించింది. సీఎం జగన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య నేతృత్వంలో ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నియమించారు. దేశంలోని మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను పరిశీలించారు. సహేతుకత ఆధారంగా 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తగ్గించారు. దీంతో ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ ఫీజు రూ.24.20 లక్షల నుంచి రూ.8.64 లక్షలకు దిగొచ్చింది. అంటే ఏడాదికి రూ.15.56 లక్షలు చొప్పున మూడేళ్ల కోర్సుకు రూ.46.68 లక్షల భారం తల్లిదండ్రులకు తగ్గింది. దీంతో అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఏపీ వైపు చూస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో బి కేటగిరి సీట్లకు తీవ్రమైన పోటీ ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ తెలిపారు. ఫీజులు తక్కువ కావడంతో పాటు ఏపీలో కోర్సు పూర్తయిన తరువాత సర్వీసు బాండ్లు అమల్లో లేవు. ఇది కూడా విద్యార్థులకు సానుకూల అంశమని వైద్య కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు. పీజీ అయ్యేలోగా రుణం తీర్చేసుకోవచ్చు ఆంధ్రలో బి కేటగిరిలో పీజీ సీటు తెచ్చుకోగలిగితే పేద, మధ్య తరగతి వారు కూడా ధైర్యంగా చేరవచ్చు. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కోర్స్ పూర్తయ్యేలోగా స్టయిఫండ్‌తో, సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తూ అప్పు తీర్చేసుకోవచ్చు అని ఓ వైద్య విద్యార్థి అభిప్రాయపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ఫీజులు ఇలా.. జగన్ సర్కారు చర్యల కారణంగా మెడికల్ పీజీ క్లినికల్ డిగ్రీ, పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమా, ప్రి క్లినికల్ కోర్సుల కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఇన్స్టిట్యూషనల్/ఎన్ఆర్ఐ కోటా ఫీజులు మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. ► క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా ఫీజు రూ.4.32 లక్షలు కాగా, మేనేజ్మెంట్ కోటా రూ.8.64 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.50 లక్షలుగా ఉండగా కళాశాలల యాజమాన్యాలు కోర్సు డిమాండ్ ఆధారంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. క్లినికల్ డిగ్రీ బి కేటగిరి కింద ఏపీలో మూడేళ్లలో చెల్లించే ఫీజు 25.92 లక్షలు. అదే తెలంగాణలో ఏడాదికి రూ.23 లక్షలు చొప్పున మూడేళ్లలో రూ.69 లక్షలు చెల్లించాలి. ఇది ఏపీలో కన్నా 62.43 శాతం అధికం. ► పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమా కన్వీనర్ కోటా ఫీజు రూ.1.35 లక్షలు కాగా, మేనేజ్మెంట్ కోటా రూ.2.70 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.15 లక్షలు. తెలంగాణలో ఇవే రూ.4.30 లక్షలు, రూ.5.30 లక్షలు, రూ.15.90 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవి ఏపీలోకన్నా 68.60, 49.06, 5.66 శాతం అధికం. ► ప్రి క్లినికల్ కోర్సు ఫీజుల్లోనూ ఇదే విధంగా తేడాలు ఉన్నాయి. ► కర్ణాటక, కేరళలోనూ ఫీజులు ఏపీలోకన్నా ఎక్కువే. కర్ణాటక ప్రైవేటు మెడికల్ కాలేజీలో పీజీ సీటుకు కోర్సును బట్టి రూ.11.50 లక్షల నుంచి వసూలు చేస్తున్నారు. అదే డీమ్డ్ యూనివర్శిటీల్లో పీజీ బి కేటగిరి సీటు ఏడాది ఫీజు 25.30 లక్షలు. క్లినికల్ డిగ్రీ ఫీజు కేరళలో ఏపీలోకన్నా 42.4 శాతం అధికం. పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమో కోర్సుల ఫీజులు ఏకంగా 70.35 శాతం ఎక్కువ. పీజీ మెడికల్ సీట్లు ఇలా.. ► 2021– 2022 ప్రకారం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లు 2,358. ► ప్రభుత్వ కాలేజీల్లో 1,034 సీట్లు కాగా ఆల్ ఇండియా కోటా కింద 505, స్టేట్ కోటా కింద 529 ఉన్నాయి. ► ప్రైవేటు కాలేజీల్లో సీటు 1,324 కాగా కాంపిటెంట్ కోటా కింద 639, మేనేజ్మెంట్ కోటా 685 ఉన్నాయి. థ్యాంక్యూ.. జగన్ అంకుల్ ‘నీట్’లో ర్యాంకు వచ్చింది. ‘బీ’ కేటగిరిలో ఆం్ర«ధాలో సీటు వచ్చింది. పెంచిన ఫీజుల భారాన్ని భరించే ఆర్థిక పరిస్థితులు లేక అమ్మనాన్నలను, ఆంధ్రాను వదిలి 2016లో కర్ణాటకకు రావాల్సి వచ్చింది. నాకన్నా మెరుగైన ర్యాంకులు పొందిన నా ప్రెండ్స్ ఫీజులు భరించలేక వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీలో 2014 వరకు ఎంబీబీఎస్ సీటు బీ కేటగిరిలో ఏడాదికి రూ.2.50 లక్షలు ఉండేది. దాన్ని రూ.11 లక్షలకు పెంచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏపీని చూసి కర్ణాటకలోనూ పెంచేశారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మంచి ర్యాంకులు తెచ్చుకుని డబ్బు లేనివారు మెడిసిన్‌కు దూరమవుతున్నారు. ఆంధ్రాలో బీ కేటగిరీలో పీజీ సీటు వచ్చేలా ర్యాంకు తెచ్చుకోవాలని.. ఇక్కడ సీటొస్తే కుటుంబమంతా కలిసి ఉండవచ్చని అమ్మానాన్నలు పదేపదే చెపుతున్నారు. ఈ ఆకాంక్ష మా ఒక్కరిదే కాదు.. తల్లిదండ్రులందరిదీ. థాంక్యూ జగన్ అంకుల్. – ఎం.కావ్య (ఎంబీబీఎస్), కర్ణాటక -
ఐహెచ్ఐపీతో అంటువ్యాధులకు చెక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు వైద్య శాఖ చర్యలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం(ఐహెచ్ఐపీ)ను వినియోగించడం ద్వారా అంటువ్యాధులు విస్తరించకుండా చూస్తోంది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, డయేరియా తదితర 33 రకాల కేసుల వివరాలను ఐహెచ్‌ఐపీలో నమోదు చేయించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని 7,305 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 1,956 ప్రభుత్వాస్పత్రులు, 1,910 ప్రభుత్వ ల్యాబ్‌లను ఐహెచ్ఐపీ పోర్టల్‌కు మ్యాపింగ్ చేశారు. తొలుత ఏఎన్ఎం స్థాయిలో అనుమానిత లక్షణాలున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. రెండో స్థాయిలో ఆస్పత్రిలో, మూడో స్థాయిలో ల్యాబ్‌లో నిర్ధారణ అయిన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గత వారం రోజుల్లో విలేజ్ క్లినిక్ స్థాయిలో 94 శాతం, ఆస్పత్రుల్లో 98 శాతం, ల్యాబ్‌లలో 97 శాతం కేసుల వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ వివరాల ఆధారంగా అధికంగా అంటు వ్యాధులు నమోదైన ప్రాంతాలను వైద్య శాఖ హాట్ స్పాట్లుగా గుర్తిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతోంది. సచివాలయాల మ్యాపింగ్కూ చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించింది. వీరి ద్వారా ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలను మరింత చేరువ చేసింది. ఈ క్రమంలో ఐహెచ్‌ఐపీలో సచివాలయాలను కూడా మ్యాపింగ్ చేస్తే.. ఆ స్థాయిలోనే అంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని వైద్య శాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యాధికారులు ఇటీవల కేంద్ర వైద్య శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేంద్ర వైద్య శాఖ నుంచి సానుకూల స్పందన లభించినట్లు అధికారులు చెప్పారు. వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఐహెచ్ఐపీ వల్ల అంటువ్యాధులు విస్తరించకుండా అరికట్టవచ్చన్నారు. అలాగే ప్రస్తుత సీజన్లో నమోదైన కేసుల ఆధారంగా.. వచ్చే సీజన్లో వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కార్యాచరణ కూడా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. ‘విశిష్ట విద్యావేత్త’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ ప్రదానం చేసే ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు ఆయనే. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ (ఏజీఏ) 2022లో ఇచ్చే వార్షిక గుర్తింపు బహుమతులలో డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధనాసంస్థ. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ విభాగాల్లో అత్యుత్తమ సహకారం అందించే, విజయాలను సాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను వైద్యులను గుర్తించి వారికి బహుమతి ప్రదానం చేస్తుంది. భారతదేశంలో ఎండోస్కోపిక్ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేస్తున్న జీవితకాల కృషికి ఈ అవార్డే నిదర్శనం. డాక్టర్ రెడ్డి నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ ఇప్పుడు జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణ కోసం ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇచ్చినట్లు ఏఐజీ వెల్లడించింది. ఏజీఏ అవార్డును ఎంతో వినమ్రంగా స్వీకరిస్తానని, భారతీయ వైద్యవిభాగం నుంచి ఒక వైద్యుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అమెరికాలో మే 21 నుంచి 24 తేదీ వరకు జరిగే ‘డైజెస్టివ్ డిసీజ్ వీక్ కాన్ఫరెన్స్’లో డాక్టర్ రెడ్డిని ఈ అవార్డుతో సత్కరిస్తారు. -
గాంధీ ఆస్పత్రిలో సీబీఆర్ఎన్ సెంటర్
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్య ప్రదాయిని గాంధీ ఆస్పత్రిలో కీలక వైద్య విభాగం త్వరలో అందుబాటులోకి రానుంది. రసాయన, జీవ, అణుధార్మిక ఏజెంట్ల వాడకం... ప్రత్యేకించి అణువిద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాల బారినపడే క్షతగాత్రులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు వీలుగా కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్‌ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రక్రియలో ముందడుగు పడింది. గాంధీలో ఈ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తాజాగా లిఖితపూర్వక ఆదేశాలు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు, గాంధీ పాలనా యంత్రాంగం రెండు రోజులు సమాలోచనలు చేసి ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపుల వెనుకగల వైద్యుల వాహన పార్కింగ్ స్థలంలో సీబీఆర్ఎన్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లను పార్కింగ్‌కు కేటాయించి పిల్లర్ల సాయంతో పైఅంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో 2 వేల చదరపు మీటర్ల వైశ్యాలంగల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి తెలియజేశామని, త్వరలోనే కేంద్ర నిపుణుల బృందం గాంధీని సందర్శించే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి 2018లోనే గాంధీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావించినప్పటికీ పలు కారణాలతో అది వాయిదాపడింది.