గాంధీ వైద్యులు, సిబ్బందితో సెల్ఫీ దిగుతున్న మంత్రి హరీశ్
గాంధీ ఆస్పత్రి/లక్డీకాపూల్: వైద్యశాఖలో రెండు రోజుల్లో 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అలాగే పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి 10 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలోనే మరో 140 మంది మిడ్ వైఫరీలు అందుబాటులోకి వస్తారని చెప్పారు.
గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ ఐసీయూలు, సెమినార్ హాలు, గాంధీ ఆస్పత్రి వెబ్ పోర్టల్‌ను డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో కలసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారిందన్నారు.
గాంధీ, పేట్లబురుజు, ఎంజీఎంలలో సంతాన సాఫల్య కేంద్రాలు
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, పాతబస్తీలోని పేట్లబురుజు ఆస్పత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో రూ. 7.50 కోట్ల వ్యయంతో ప్రభుత్వ రంగంలో తొలిసారి సంతాన సాఫల్య కేంద్రాలను 3 నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే జిల్లా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 55 అత్యాధునిక అల్ట్రాసౌండ్ మెషీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో 200 పడకల హైఎండ్ ఎంసీహెచ్ ఆస్పత్రిని జనవరిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు.
గాంధీ ఆస్పత్రి 8వ అంతస్తులో స్టేట్ ఆర్గాన్ ట్రాన్‌ప్లాంటేషన్ సెంటర్ నిర్మాణం కోసం రూ. 35 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు చేపట్టే ఆపరేషన్ల వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ వ్యవస్థ కోసం రూ. 13.55 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు రూ. 14 కోట్లు, డైట్ కిచెన్ నిర్మాణానికి రూ. 1.20 కోట్లు కేటాయించామన్నారు.
సామర్థ్యానికి మించి గాంధీలో సేవలు..
గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రస్తుతం సామర్థ్యానికి మించి 1,683 మంది ఇన్‌పేషెంట్లు గాంధీలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో గత 3 నెలల్లో రూ. కోటి విలువగల వైద్య సేవలు, చికిత్సలు, సర్జరీలు నిర్వహించారని వివరించారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు 95 లక్షల మంది పేదలకు వైద్యసేవలు అందించామని ఆయన వివరించారు.
ఇన్ఫెక్షన్‌ను అరికట్టకుంటే కఠిన చర్యలు..
నిమ్స్ ట్రామా బ్లాక్ ఆడిటోరియంలో అంటువ్యాధుల నివారణ, నియంత్రణపై శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి గదులు, డయాలసిస్ వార్డుల్లో ఎక్కువగా ఉండే ఇన్ఫెక్షన్‌ను అరికట్టే విషయంలో తప్పు చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు. కాగా, అత్యవసర వైద్య విభాగంలో రోగులను 24 గంటలకు మించి ఉంచొద్దని, వారిని సంబంధిత స్పెషాలిటీ విభాగానికి తరలించా లని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా హరీశ్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు.
సెల్ఫీటైం
గైనకాలజీ వైద్యులు, సిబ్బందితో సెల్ఫీ దిగిన మంత్రి హరీశ్.. లేబర్ వార్డు వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీగార్డు అడిగిన వెంటనే అంగీకరించి, ఆమె వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగడంతో సెక్యూరిటీగార్డు ఆనందంతో తబ్బిబ్బయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment