Assistant professor posts
-
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విజయవాడ, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయన్నుట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘‘సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్ , హనుమాన్ పేట , విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంద’’ని ఆయన తెలిపారు. అలాగే.. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుండి 15వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదంటే.. http://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లను పరిశీలించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కోరుతోంది. -
వైద్యశాఖలో 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 144, విశాఖపట్నంలోని విమ్స్‌లో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాక్ ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బోధనాస్పత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఈనెల 18, 20 తేదీల్లో విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు. ఇక విమ్స్‌లో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం కోసం ఈనెల 15న విశాఖపట్నంలోని విమ్స్‌లోనే వాక్ ఇన్ రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీల్లో ని ర్ణీత ప్రదేశాలకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత, ఇతర నియమనిబంధనలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను https:// dme. ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వైద్యపోస్టుల భర్తీకి బిడ్డింగ్ తమ పరిధిలోని ఆస్పత్రుల్లో శాశ్వత, కాంట్రాక్టు విధానంలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాక్ ఇన్ రిక్రూట్మెంట్తో పాటు గిరిజన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల ఖాళీలను బిడ్డింగ్ విధానంలో అధిక వేతనంతో నియమించేందుకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఖాళీల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి తాడేపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. బిడ్డింగ్ విధానంలో నియామకానికి ఆసక్తి చూపే వైద్యులు నిర్ణీత తేదీల్లో వాకింగ్ రిక్రూట్మెంట్ వేదిక వద్ద తమ కొటేషన్లను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సూచించారు. ఈ విధానానికి సంబంధించిన సవరించిన నోటిఫికేషన్ cfw.ap.gov.in, hmfw.ap.gov.in వెబ్సైట్లలో ఉంచారు. -
1,147 వైద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కొత్తగా 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్య కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) పరిధిలోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం (https://mhsrb. telangana. gov. in) బోర్డు వెబ్సైట్లో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 20 ఉదయం 10:30 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆన్లైన్ దరఖాస్తులను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా సమర్పించాలన్నారు. ఫలితాలు ప్రకటించే వరకు ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం చేస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నియమితులయ్యే వారు ప్రైవేటు ప్రాక్టీస్‌కు అర్హులు కాదని ఆయన స్పష్టం చేశారు. ►అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ అర్హత పొందిన తర్వాతే వారి వెయిటేజీని లెక్కిస్తారు. ►దరఖాస్తుదారుల గరిష్ట వయసు 01–07–2022 నాటికి 44 ఏళ్లు మించకూడదు. ►రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసే డాక్టర్లకు వారు పనిచేసిన కాలానికి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అయితే టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మొదలైన వాటిల్లో పనిచేసినవారికి ఇది వర్తించదు. మాజీ సైనికులకు మూడేళ్ల వరకు, ఎన్సీసీలో డాక్టర్లుగా పనిచేసిన వారికి మూడేళ్ల వరకు వయో పరిమితి సడలిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. పీహెచ్‌లకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ►ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులు రిజర్వేషన్లకు అర్హులు కాదు. ►పోస్ట్‌లను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక రిజర్వేషన్ 95 శాతం ఇస్తారు. ►వేతన స్కేల్ రూ. 68,900 నుంచి రూ. 2,05,500గా ఖరారైంది. -
1,140 వైద్య పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్
గాంధీ ఆస్పత్రి/లక్డీకాపూల్: వైద్యశాఖలో రెండు రోజుల్లో 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అలాగే పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి 10 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలోనే మరో 140 మంది మిడ్ వైఫరీలు అందుబాటులోకి వస్తారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ ఐసీయూలు, సెమినార్ హాలు, గాంధీ ఆస్పత్రి వెబ్ పోర్టల్‌ను డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో కలసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారిందన్నారు. గాంధీ, పేట్లబురుజు, ఎంజీఎంలలో సంతాన సాఫల్య కేంద్రాలు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, పాతబస్తీలోని పేట్లబురుజు ఆస్పత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో రూ. 7.50 కోట్ల వ్యయంతో ప్రభుత్వ రంగంలో తొలిసారి సంతాన సాఫల్య కేంద్రాలను 3 నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే జిల్లా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 55 అత్యాధునిక అల్ట్రాసౌండ్ మెషీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో 200 పడకల హైఎండ్ ఎంసీహెచ్ ఆస్పత్రిని జనవరిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. గాంధీ ఆస్పత్రి 8వ అంతస్తులో స్టేట్ ఆర్గాన్ ట్రాన్‌ప్లాంటేషన్ సెంటర్ నిర్మాణం కోసం రూ. 35 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు చేపట్టే ఆపరేషన్ల వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ వ్యవస్థ కోసం రూ. 13.55 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు రూ. 14 కోట్లు, డైట్ కిచెన్ నిర్మాణానికి రూ. 1.20 కోట్లు కేటాయించామన్నారు. సామర్థ్యానికి మించి గాంధీలో సేవలు.. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రస్తుతం సామర్థ్యానికి మించి 1,683 మంది ఇన్‌పేషెంట్లు గాంధీలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో గత 3 నెలల్లో రూ. కోటి విలువగల వైద్య సేవలు, చికిత్సలు, సర్జరీలు నిర్వహించారని వివరించారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు 95 లక్షల మంది పేదలకు వైద్యసేవలు అందించామని ఆయన వివరించారు. ఇన్ఫెక్షన్ను అరికట్టకుంటే కఠిన చర్యలు.. నిమ్స్ ట్రామా బ్లాక్ ఆడిటోరియంలో అంటువ్యాధుల నివారణ, నియంత్రణపై శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి గదులు, డయాలసిస్ వార్డుల్లో ఎక్కువగా ఉండే ఇన్ఫెక్షన్ను అరికట్టే విషయంలో తప్పు చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు. కాగా, అత్యవసర వైద్య విభాగంలో రోగులను 24 గంటలకు మించి ఉంచొద్దని, వారిని సంబంధిత స్పెషాలిటీ విభాగానికి తరలించా లని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా హరీశ్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. సెల్ఫీటైం గైనకాలజీ వైద్యులు, సిబ్బందితో సెల్ఫీ దిగిన మంత్రి హరీశ్.. లేబర్ వార్డు వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీగార్డు అడిగిన వెంటనే అంగీకరించి, ఆమె వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగడంతో సెక్యూరిటీగార్డు ఆనందంతో తబ్బిబ్బయ్యింది. -
1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం కొత్తగా 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. త్వరలో పీజీ, ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటికే ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల కోసం తాత్కాలిక భర్తీ ప్రక్రియ జరుగుతోంది. కొందరిని డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. కొందరికి పదోన్నతులు కల్పించడం ద్వారా నియమించారు. కాగా, 1,125 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది, ఇతర మౌలిక వసతులను పరిశీలించేందుకు కేంద్ర బృందం రానున్న నేపథ్యంలో వేగంగా భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే.. గతంలో మెడికల్ పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేవారు. అయితే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)ను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారానే వైద్య పోస్టులను భర్తీ చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డే చూస్తుంది. రిటైర్మెంట్లు, ఖాళీలు ఏర్పడగానే సంబంధిత సమాచారం బోర్డుకు చేరుతుంది. బోర్డు ఆదేశం మేరకు వాటికి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పటివరకు కొన్ని పోస్టులను మాత్రమే ఈ బోర్డు ద్వారా భర్తీ చేశారు. అయితే అనుకున్నట్లు ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ జరగట్లేదన్న విమర్శలున్నాయి. కాగా, తాజాగా 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. -
పీహెచ్డీ ఉంటేనే అసిస్టెంటు ప్రొఫెసర్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగంలో ప్రమాణాల పెంపులో భాగంగా యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హతగా పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని నిబంధనలపై కేంద్రం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దృష్టి సారిస్తున్నాయి. కనీస అర్హతగా పీహెచ్డీ ఉండేలా 2018లోనే యూజీసీ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడంలో ఆలస్యమవుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు పలువురు కోవిడ్ వల్ల తమ కోర్సులు పూర్తికానందున కొంత సమయం కావాలని విన్నవించారు. దీంతో పీహెచ్డీ కనీస అర్హత నిబంధనను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇకపై అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హత పీహెచ్‌డీని తప్పనిసరిగా అమలు చేయనున్నారని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వివరించాయి. సెంట్రల్ వర్సిటీల్లో 10 వేల వరకు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రాల్లోని పలు వర్సిటీల్లోనూ వేలాదిగా ఖాళీలున్నాయని తెలిపాయి. వీటన్నిటి భర్తీలో కనీస అర్హత పీహెచ్డీ ఉన్న వారినే అనుమతించనున్నారని పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ప్రకటించారు. -
50 వేల మంది ఆశలు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దాదాపు 50 వేల మంది అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకు ముందే ఆయా పోస్టులను భర్తీచేసి ఉంటే వారంతా అర్హులయ్యేవారని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పీహెచ్డీ చేసి ఉండాలన్న యూజీసీ నిర్ణయం అనేకమంది నిరుద్యోగులకు నష్టం చేకూర్చుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రానికి లేఖ రాయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దశాబ్దంగా వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరగలేదు. 2017లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఈ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. గతంలో ఈ పోస్టులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) అర్హతగా నిర్ధారించారు. ఇవి లేనివారికి ఎంఫిల్, పీహెచ్డీ చేసినా సరిపోయేది. కానీ తాజాగా నెట్, స్లెట్ ఉన్నా వాటికి వెయిటేజీ మార్కులు మాత్రమే ఉం టాయని, పీహెచ్డీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. పైగా ఈ నిర్ణయాన్ని గత నెల ఒకటో తేదీ నుంచే అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఉన్నత విద్యా మండలి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంతో కష్టపడి నెట్ లేదా స్లెట్‌లలో అర్హత సాధించిన వారంతా నష్టపోతారని అంటున్నారు. వారికి పీహెచ్డీ చేసే అవకాశం ఉన్నా అసిస్టెంట్ ప్రొఫె సర్ పోస్టులకు నెట్, స్లెట్ సరిపోతుందని భావించి చాలామంది ఊరుకున్నారు. కానీ యూజీసీ నిర్ణ యం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని అం టున్నారు. యూజీసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కేవలం ఆరు వేల మంది పీహెచ్డీ పూర్తి చేసిన వారే అర్హులవుతారని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే పోస్టుల భర్తీ జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పరిశోధన అంశంపై నిర్ణయం యూజీసీదే.. ప్రస్తుతం పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారు ఏ అంశంపై పరిశోధన చేయాలన్నది వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. ఆ మేరకు అభ్యర్థి తాను ఎంచుకున్న అంశంలో పరిశోధన తీరును వివరిస్తూ క్లుప్తంగా నివేదిక తయారు చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించాలి. అయితే వారి సొంతానికి పరిశోధన అంశాన్ని వదిలేయడం వల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని, సులువైన అంశాలు తీసుకొని చాలామంది తూతూమంత్రంగా పీహెచ్డీ పూర్తి చేస్తున్నారన్నది నిపుణుల ఆరోపణ. అంతేకాక ఇతరులు పూర్తి చేసిన పీహెచ్డీ థీసిస్‌లను దగ్గర పెట్టుకొని కొందరు కాపీ కొడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పరిశోధన అంటే అది సమాజానికి ఉపయోగపడాలన్నది యూజీసీ భావన. కాబట్టి ఏ అంశంపై పీహెచ్డీ చేయాలన్నది కూడా యూజీసీనే నిర్ణయిస్తుందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. -
అప్పుడు కాదు.. ఇప్పుడే!
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు రాకముందే యూనివర్సిటీల్లోని దాదాపు 1,110 పోస్టులను తమ వారికి కట్టబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యామండలిలోని తన మనుషుల ద్వారా పావులు కదుపుతోంది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అధికారం చేజారితే ఏమీ చేయలేమన్న ఆందోళనతో అంతకు ముందుగానే ఈ పోస్టుల భర్తీని ముగించాలని హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యామండలిలోని వైస్ చైర్మన్, సీఎంఓలోని కొందరు అధికారుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు చేయించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఇంటర్వ్యూలు, నియామకాలు చేయడానికి వీల్లేనందున ఉన్నత విద్యామండలి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. ఈ లేఖను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించగా ఇంటర్వ్యూల నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపింది. దీని ఆధారంగా నియామకాలు చేయాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అనుమతించినా, పోస్టుల రేషనలైజేషన్, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని యూనివర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడంపై రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలపై స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవేవీ పరిష్కారం కాకుండానే నియామకాలు ముగించాలని ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు ఇంటర్వ్యూల నిర్వహణకు నిబంధనల మేరకు ముందుకు వెళ్లవచ్చని గత నెల 25న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ పోస్టుల భర్తీకి వీలుగా కోర్టుల్లో ఉన్న న్యాయవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందులోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ ముఖ్యులు ఈ విషయాన్ని పక్కన పెట్టి నియామకాలు త్వరగా పూర్తి చేయించాలని ఆయా వర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూళ్లు పంపించాలని ఉన్నత విద్యామండలి ద్వారా ఆయా వర్సిటీలకు ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. ఆ షెడ్యూళ్లు వచ్చాక కామన్ షెడ్యూల్ ఇచ్చి భర్తీ చేయించాలని చూస్తున్నారు. భారీ మొత్తాలకు పోస్టుల అమ్మకాలు వర్సిటీల్లోని బోధనా పోస్టులను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీ మొత్తాలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల నుంచి డబ్బును కూడా తీసుకున్నారు. ఇందులో ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తేటతెల్లమవుతుండడంతో వారందరి నుంచి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఇంటర్వ్యూలు పూర్తి చేయించాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వర్సిటీల్లో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై న్యాయస్థానంలో ఉన్న కేసులు పరిష్కారం కాకుండానే ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడం సరికాదని, దీన్ని నిలుపుదల చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీల అధ్యాపక సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం అనుమతిచ్చిందన్న సాకుతో భర్తీకి ముందుకు వెళ్తే ఆయా యూనివర్సిటీల అధికారులపై కోర్టు ధిక్కార కేసులు కూడా దాఖలు చేయాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటర్వ్యూలు, నియామకాలు చేపడితే తదనంతర పరిణామాలకు ఆయా వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని వర్సిటీల అధికారులకు నిపుణులు సూచిస్తున్నారు. యూజీసీ ఉత్తర్వులూ బేఖాతర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున తుది నిర్ణయం వెలువడే వరకు భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కొన్ని నెలల క్రితం యూజీసీ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు పోస్టుల భర్తీని నిలిపి వేయాలని ఉన్నత విద్యాశాఖ ఇంతకు ముందు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. హైకోర్టు కూడా ఈ మేరకు ఆదేశించింది. అయినా ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి ఉన్నత విద్యామండలి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ఒకరు ఫోన్ చేసి ఆయా వర్సిటీల అధికారులపై ఒత్తిడి చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అంతా అక్రమాల మయం యూనివర్సిటీ బోధనా పోస్టుల భర్తీ వ్యవహారం ఆది నుంచి అక్రమాలమయంగా మారిందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 1,385 పోస్టులకు కుదించింది. ఇది కూడా సీఎంవోలో ఉన్న ఒక సలహాదారు, ఉన్నత విద్యామండలిలోని ఉపాధ్యక్షుడొకరు కలసి తమకు నచ్చిన రీతిలో తమ సామాజికవర్గ వ్యక్తులకు వీలుగా చేయించారన్న ఆరోపణలున్నాయి. రేషనలైజేషన్ అక్రమాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొత్తం పోస్టుల్లో ప్రొఫెసర్ 101, అసోసియేట్ ప్రొఫెసర్ 174, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,110 ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపైనా కోర్టుల్లో వ్యాజ్యం నడుస్తోంది. ఇన్ని వివాదాలున్నప్పటికీ పోస్టుల భర్తీకి ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తుండటానికి కారణం జేబులు నింపుకోవడానికేనని స్పష్టమవుతోంది. -
అంగట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 234 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా జరగనున్నాయి. దీంతో ఆ పోస్టులను దక్కించుకునేందుకు అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలోకి దిగారు. వారికి ఉన్నతస్థాయి పలుకుబడి కలిగిన కొందరు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయానికి చెందిన మరికొందరు కీలకాధికారులూ సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు అండగా అన్నట్లు ఇంటర్వ్యూ కోసం ఏకంగా 25 మార్కులు కేటాయించారు. గతంలో కేవలం 5–10 మార్కులే ఇంటర్వ్యూలో ఉండేవి. తాజాగా ఇంటర్వ్యూకు అధిక మార్కులు కేటాయించడంతో అన్ని అర్హతలు కలిగిన వారిని కూడా బరి నుంచి తప్పించి, పైరవీ చేసుకునే వారిని ఎంపికచేసే అవకాశం కల్పించినట్లయిందని అదే వర్సిటీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు విశ్లేషిస్తున్నారు. ఇంటర్వ్యూకు అన్ని మార్కు లు కేటాయించాల్సిన అవసరమేంటన్న ప్రశ్న అందరిలో నెలకొంది. ఇటీవల మహారాష్ట్రలో ఇలాగే వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తే, కేవలం 15 మార్కులే ఇంటర్వ్యూకు కేటాయించారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇంటర్వ్యూకు అధిక మార్కులు కేటాయించి అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్కారు విడుదల చేసిన జీవో ప్రకారం ఈ పోస్టుల ఎంపిక కోసం 100 మార్కులు కేటాయించారు. అందులో అకడమిక్ రికార్డు, డొమైన్ నాలెడ్జ్, అనుభవం, పబ్లికేషన్లు, అవార్డులకు 75 మార్కులు కేటాయించారు. ఇక ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయించారు. ఆ ప్రకారం ఇంటర్వ్యూలో కాంప్రెహెన్సివ్ డొమైన్ నాలెడ్జికి 10 మార్కులు, టీచింగ్/శిక్షణ, డెమో లెక్చర్‌కు 5 మార్కులు, టీచింగ్, పరిశోధన, ఎక్స్టెన్షన్ ఆప్టిట్యూడ్‌కు 5 మార్కులు, టెక్నాలజీ బదిలీలో అనుసరించే నైపుణ్యానికి 5 మార్కులు కేటాయించారు. మొదటి 75 మార్కులు కేవలం అభ్యర్థి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానే సాధిస్తారు. ఇక ఇంటర్వ్యూలోని 25 మార్కుల ద్వారా అక్రమాలకు తెరలేపుతారన్న ఆరోపణలున్నాయి. పీహెచ్‌డీకి వెయిటేజీ తొలగింపు? పీహెచ్‌డీకి గతంలో వెయిటేజీ ఉండేది. ఇప్పుడు దాన్ని ఎందుకు తీసేశారని పలువు రు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల పీహెచ్డీ చేసిన వారికి, ఎంఎస్సీ చేసిన వారికి ఎలాంటి తేడా ఉండదని అంటున్నారు. ఇంటర్వ్యూ మార్కులు తగ్గించాలనుకున్నాం... కానీ వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూకు మార్కులు తక్కువగానే ఉండాలని భావించాం. కానీ 25 మార్కులు కేటాయించక తప్పలేదు. తగ్గించే వెసులుబాటు లేకే ఇలా చేశాం. - పార్థసారథి, కార్యదర్శి, వ్యవసాయశాఖ ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు? కొందరు దళారులు, అభ్యర్థులు రాష్ట్రంలో కీలకమైన కొద్దిమంది ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి పైరవీలు ముమ్మరం చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఏకంగా 234 పోస్టులు ఉండడంతో కొందరు దళారులు పైరవీలపై తీవ్రంగా దృష్టిసారించారని తెలుస్తోంది. ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదని పెద్ద ఎత్తున దందా మొదలుపెట్టారని తెలిసింది. వివిధ విభాగాల్లో ఒక్కో పోస్టుకున్న డిమాండ్‌ను బట్టి వసూళ్ల పర్వం ఉంటుందని అంటున్నారు. కొన్ని విభాగాల్లో ఒక పోస్టుకు 15 నుంచి 20 మంది అభ్యర్థులు పోటీ పడితే, కొన్ని పోస్టులకు ఒక్కో దానికి ఐదుగురు, నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువున్న పోస్టులకు అత్యధికంగా డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని అదే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లే అంటున్నారు. గత అనుభవాల ప్రకారం చూసినా పోస్టుల దందా అత్యంత పకడ్బందీగా జరుగుతోందని వారు చెబుతున్నారు. గతంలో ఇంటర్వ్యూకు ముందే అభ్యర్థుల జాబితాను తయారు చేసుకొని ఎవరికి పోస్టులు ఇవ్వాలో నిర్ణయించేవారట. కొన్ని సందర్భాల్లో అభ్యర్థి పేరుకు ముందు మార్కులు, ఎవరి నుంచి పైరవీ అనే కాలమ్‌లు పెట్టుకొని కూడా దందా జరిగేదని ఒక ప్రొఫెసర్ పేర్కొన్నారు. అంతేకాక ఒకానొక సందర్భంలోనైతే పాలకవర్గ సభ్యునికో రెండు పోస్టుల చొప్పున కేటాయించారన్న ప్రచార మూ ఉంది. అంతేకాదు ప్రభుత్వ పెద్దల్లో ఎవరిరెవరి నుంచి పైరవీలు వచ్చాయో ముందే ఒక రహస్య జాబితా తయారు చేసుకొని ఆ ప్రకారం కేటాయింపులు జరిగేవి. ఇంటర్వ్యూకు 5–10 మార్కులున్నప్పుడే అన్ని అక్రమాలు జరిగితే, 25 మార్కులకు పెంచాక ఇప్పుడు ఇంకెన్ని అవకతవకలు జరుగుతాయోనన్న ప్రచారం జోరందుకుంది. -
వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీ
242 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే నెల 20 వరకు దరఖాస్తు గడువు రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 242 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 185 వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 22 వ్యవసాయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 హోం సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 19 బ్యాక్లాగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 20 సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దరఖాస్తు కాపీలను అదే నెల 29 సాయంత్రం 4 గంటల్లోపు పంపాల్సి ఉంటుందన్నారు. అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎక్స్టెన్షన్, మైక్రోబయాలజీ, అగ్రోనమీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, ప్లాంట్ పెథాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయో టెక్నాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, స్టాటిటిక్స్ అండ్ మ్యాథ్స్, లైబ్రరీ సైన్స్ సబ్జెక్టుల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, టెక్నాలజీలో 5 సబ్జెక్టుల కోసం భర్తీ చేస్తారు. హోం సైన్స్‌లోనూ ఐదు సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీచేస్తారు. రిజర్వేషన్లు, పోస్టుల పూర్తి వివరాలను www.pjtsau.ac.in వెబ్సైట్లో చూడొచ్చని, ఈ సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించరు. ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ చేస్తారు.