సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 234 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా జరగనున్నాయి. దీంతో ఆ పోస్టులను దక్కించుకునేందుకు అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలోకి దిగారు. వారికి ఉన్నతస్థాయి పలుకుబడి కలిగిన కొందరు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయానికి చెందిన మరికొందరు కీలకాధికారులూ సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అక్రమార్కులకు అండగా అన్నట్లు ఇంటర్వ్యూ కోసం ఏకంగా 25 మార్కులు కేటాయించారు. గతంలో కేవలం 5–10 మార్కులే ఇంటర్వ్యూలో ఉండేవి. తాజాగా ఇంటర్వ్యూకు అధిక మార్కులు కేటాయించడంతో అన్ని అర్హతలు కలిగిన వారిని కూడా బరి నుంచి తప్పించి, పైరవీ చేసుకునే వారిని ఎంపికచేసే అవకాశం కల్పించినట్లయిందని అదే వర్సిటీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు విశ్లేషిస్తున్నారు. ఇంటర్వ్యూకు అన్ని మార్కు లు కేటాయించాల్సిన అవసరమేంటన్న ప్రశ్న అందరిలో నెలకొంది. ఇటీవల మహారాష్ట్రలో ఇలాగే వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తే, కేవలం 15 మార్కులే ఇంటర్వ్యూకు కేటాయించారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇంటర్వ్యూకు అధిక మార్కులు కేటాయించి అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్కారు విడుదల చేసిన జీవో ప్రకారం ఈ పోస్టుల ఎంపిక కోసం 100 మార్కులు కేటాయించారు. అందులో అకడమిక్ రికార్డు, డొమైన్ నాలెడ్జ్, అనుభవం, పబ్లికేషన్లు, అవార్డులకు 75 మార్కులు కేటాయించారు. ఇక ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయించారు. ఆ ప్రకారం ఇంటర్వ్యూలో కాంప్రెహెన్సివ్ డొమైన్ నాలెడ్జికి 10 మార్కులు, టీచింగ్/శిక్షణ, డెమో లెక్చర్‌కు 5 మార్కులు, టీచింగ్, పరిశోధన, ఎక్స్‌టెన్షన్ ఆప్టిట్యూడ్‌కు 5 మార్కులు, టెక్నాలజీ బదిలీలో అనుసరించే నైపుణ్యానికి 5 మార్కులు కేటాయించారు. మొదటి 75 మార్కులు కేవలం అభ్యర్థి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానే సాధిస్తారు. ఇక ఇంటర్వ్యూలోని 25 మార్కుల ద్వారా అక్రమాలకు తెరలేపుతారన్న ఆరోపణలున్నాయి.
పీహెచ్‌డీకి వెయిటేజీ తొలగింపు?
పీహెచ్‌డీకి గతంలో వెయిటేజీ ఉండేది. ఇప్పుడు దాన్ని ఎందుకు తీసేశారని పలువు రు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల పీహెచ్‌డీ చేసిన వారికి, ఎంఎస్సీ చేసిన వారికి ఎలాంటి తేడా ఉండదని అంటున్నారు.
ఇంటర్వ్యూ మార్కులు తగ్గించాలనుకున్నాం... కానీ
వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూకు మార్కులు తక్కువగానే ఉండాలని భావించాం. కానీ 25 మార్కులు కేటాయించక తప్పలేదు. తగ్గించే వెసులుబాటు లేకే ఇలా చేశాం. - పార్థసారథి, కార్యదర్శి, వ్యవసాయశాఖ
ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు?
కొందరు దళారులు, అభ్యర్థులు రాష్ట్రంలో కీలకమైన కొద్దిమంది ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి పైరవీలు ముమ్మరం చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఏకంగా 234 పోస్టులు ఉండడంతో కొందరు దళారులు పైరవీలపై తీవ్రంగా దృష్టిసారించారని తెలుస్తోంది. ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదని పెద్ద ఎత్తున దందా మొదలుపెట్టారని తెలిసింది. వివిధ విభాగాల్లో ఒక్కో పోస్టుకున్న డిమాండ్‌ను బట్టి వసూళ్ల పర్వం ఉంటుందని అంటున్నారు. కొన్ని విభాగాల్లో ఒక పోస్టుకు 15 నుంచి 20 మంది అభ్యర్థులు పోటీ పడితే, కొన్ని పోస్టులకు ఒక్కో దానికి ఐదుగురు, నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువున్న పోస్టులకు అత్యధికంగా డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని అదే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లే అంటున్నారు. గత అనుభవాల ప్రకారం చూసినా పోస్టుల దందా అత్యంత పకడ్బందీగా జరుగుతోందని వారు చెబుతున్నారు. గతంలో ఇంటర్వ్యూకు ముందే అభ్యర్థుల జాబితాను తయారు చేసుకొని ఎవరికి పోస్టులు ఇవ్వాలో నిర్ణయించేవారట. కొన్ని సందర్భాల్లో అభ్యర్థి పేరుకు ముందు మార్కులు, ఎవరి నుంచి పైరవీ అనే కాలమ్‌లు పెట్టుకొని కూడా దందా జరిగేదని ఒక ప్రొఫెసర్ పేర్కొన్నారు. అంతేకాక ఒకానొక సందర్భంలోనైతే పాలకవర్గ సభ్యునికో రెండు పోస్టుల చొప్పున కేటాయించారన్న ప్రచార మూ ఉంది. అంతేకాదు ప్రభుత్వ పెద్దల్లో ఎవరిరెవరి నుంచి పైరవీలు వచ్చాయో ముందే ఒక రహస్య జాబితా తయారు చేసుకొని ఆ ప్రకారం కేటాయింపులు జరిగేవి. ఇంటర్వ్యూకు 5–10 మార్కులున్నప్పుడే అన్ని అక్రమాలు జరిగితే, 25 మార్కులకు పెంచాక ఇప్పుడు ఇంకెన్ని అవకతవకలు జరుగుతాయోనన్న ప్రచారం జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment