
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కొత్తగా 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్య కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) పరిధిలోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం (https://mhsrb. telangana. gov. in) బోర్డు వెబ్‌సైట్‌లో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ నెల 20 ఉదయం 10:30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆన్‌లైన్ దరఖాస్తులను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా సమర్పించాలన్నారు. ఫలితాలు ప్రకటించే వరకు ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం చేస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నియమితులయ్యే వారు ప్రైవేటు ప్రాక్టీస్‌కు అర్హులు కాదని ఆయన స్పష్టం చేశారు.
►అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ అర్హత పొందిన తర్వాతే వారి వెయిటేజీని లెక్కిస్తారు.
►దరఖాస్తుదారుల గరిష్ట వయసు 01–07–2022 నాటికి 44 ఏళ్లు మించకూడదు.
►రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసే డాక్టర్లకు వారు పనిచేసిన కాలానికి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అయితే టీఎస్‌ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మొదలైన వాటిల్లో పనిచేసినవారికి ఇది వర్తించదు. మాజీ సైనికులకు మూడేళ్ల వరకు, ఎన్‌సీసీలో డాక్టర్లుగా పనిచేసిన వారికి మూడేళ్ల వరకు వయో పరిమితి సడలిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. పీహెచ్‌లకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
►ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులు రిజర్వేషన్లకు అర్హులు కాదు.
►పోస్ట్‌లను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక రిజర్వేషన్ 95 శాతం ఇస్తారు.
►వేతన స్కేల్ రూ. 68,900 నుంచి రూ. 2,05,500గా ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment