అప్పుడు కాదు.. ఇప్పుడే! | Assistant Professor Posts In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అప్పుడు కాదు.. ఇప్పుడే!

Published Thu, May 2 2019 2:58 PM | Last Updated on Thu, May 2 2019 2:58 PM

Assistant Professor Posts In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు రాకముందే యూనివర్సిటీల్లోని దాదాపు 1,110 పోస్టులను తమ వారికి కట్టబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యామండలిలోని తన మనుషుల ద్వారా పావులు కదుపుతోంది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అధికారం చేజారితే ఏమీ చేయలేమన్న ఆందోళనతో అంతకు ముందుగానే ఈ పోస్టుల భర్తీని ముగించాలని హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యామండలిలోని వైస్‌ చైర్మన్, సీఎంఓలోని కొందరు అధికారుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు చేయించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎలాంటి ఇంటర్వ్యూలు, నియామకాలు చేయడానికి వీల్లేనందున  ఉన్నత విద్యామండలి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. ఈ లేఖను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించగా ఇంటర్వ్యూల నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపింది. దీని ఆధారంగా నియామకాలు చేయాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు.

అయితే ఎన్నికల సంఘం అనుమతించినా, పోస్టుల రేషనలైజేషన్, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని యూనివర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించడంపై రిట్‌ పిటిషన్లు, రిట్‌ అప్పీళ్లు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలపై స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవేవీ పరిష్కారం కాకుండానే నియామకాలు ముగించాలని ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు ఇంటర్వ్యూల నిర్వహణకు నిబంధనల మేరకు ముందుకు వెళ్లవచ్చని గత నెల 25న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ పోస్టుల భర్తీకి వీలుగా కోర్టుల్లో ఉన్న న్యాయవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందులోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ ముఖ్యులు ఈ విషయాన్ని పక్కన పెట్టి నియామకాలు త్వరగా పూర్తి చేయించాలని ఆయా వర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూళ్లు పంపించాలని ఉన్నత విద్యామండలి ద్వారా ఆయా వర్సిటీలకు ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. ఆ షెడ్యూళ్లు వచ్చాక కామన్‌ షెడ్యూల్‌ ఇచ్చి భర్తీ చేయించాలని చూస్తున్నారు. 

భారీ మొత్తాలకు పోస్టుల అమ్మకాలు
వర్సిటీల్లోని బోధనా పోస్టులను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీ మొత్తాలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల నుంచి డబ్బును కూడా తీసుకున్నారు. ఇందులో ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తేటతెల్లమవుతుండడంతో వారందరి నుంచి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఇంటర్వ్యూలు పూర్తి చేయించాలని చూస్తున్నారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు 
వర్సిటీల్లో 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీపై న్యాయస్థానంలో ఉన్న కేసులు పరిష్కారం కాకుండానే ఇంటర్వ్యూలు నిర్వహించి  భర్తీ చేయడం సరికాదని, దీన్ని నిలుపుదల చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీల అధ్యాపక సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం అనుమతిచ్చిందన్న సాకుతో భర్తీకి ముందుకు వెళ్తే ఆయా యూనివర్సిటీల అధికారులపై కోర్టు ధిక్కార కేసులు కూడా దాఖలు చేయాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటర్వ్యూలు, నియామకాలు చేపడితే తదనంతర పరిణామాలకు ఆయా వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని వర్సిటీల అధికారులకు నిపుణులు సూచిస్తున్నారు.

యూజీసీ ఉత్తర్వులూ బేఖాతర్‌
రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించడం లేదని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున తుది నిర్ణయం వెలువడే వరకు భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కొన్ని నెలల క్రితం యూజీసీ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు పోస్టుల భర్తీని నిలిపి వేయాలని ఉన్నత విద్యాశాఖ ఇంతకు ముందు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. హైకోర్టు కూడా ఈ మేరకు ఆదేశించింది. అయినా ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి ఉన్నత విద్యామండలి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ఒకరు ఫోన్‌ చేసి ఆయా వర్సిటీల అధికారులపై ఒత్తిడి చేస్తుండటమే ఇందుకు నిదర్శనం.

అంతా అక్రమాల మయం
యూనివర్సిటీ బోధనా పోస్టుల భర్తీ వ్యవహారం ఆది నుంచి అక్రమాలమయంగా మారిందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట 1,385 పోస్టులకు కుదించింది. ఇది కూడా సీఎంవోలో ఉన్న ఒక సలహాదారు, ఉన్నత విద్యామండలిలోని ఉపాధ్యక్షుడొకరు కలసి తమకు నచ్చిన రీతిలో తమ సామాజికవర్గ వ్యక్తులకు వీలుగా చేయించారన్న ఆరోపణలున్నాయి. రేషనలైజేషన్‌ అక్రమాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొత్తం పోస్టుల్లో ప్రొఫెసర్‌ 101, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 174, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 1,110 ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించడంపైనా కోర్టుల్లో వ్యాజ్యం నడుస్తోంది. ఇన్ని వివాదాలున్నప్పటికీ పోస్టుల భర్తీకి ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తుండటానికి కారణం జేబులు నింపుకోవడానికేనని స్పష్టమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement