గ్రూప్‌–2 పరీక్షా పేపర్‌లో బాబు భక్తి! | Election Code Violation In APPSC Group 2 Exam Paper | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 పరీక్షా పేపర్‌లో బాబు భక్తి!

Published Mon, May 6 2019 2:16 AM | Last Updated on Mon, May 6 2019 1:52 PM

Election Code Violation In APPSC Group 2 Exam Paper - Sakshi

సాక్షి, అమరావతి/చిత్తూరు కలెక్టరేట్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమనరీ పరీక్షలో పలు ప్రశ్నలు అభ్యర్థులను విస్తుపోయేలా చేశాయి. ఎన్నికలకు కొద్దికాలం ముందు ఓట్ల కోసం తన పేరుతో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టిన కొన్ని పథకాల గురించిన ప్రశ్నలను ఏపీపీఎస్సీ అడగడం వివాదాస్పదంగా మారింది. సాధారణ ఎన్నికల కోడ్‌ మే 27వ తేదీ వరకు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పైగా రాష్ట్రంలోని ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కూడా ఇంకా ముగియలేదు. మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్‌కు కూడా ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ తరుణంలో జరిగిన గ్రూప్‌–2 పరీక్షలో ఏపీపీఎస్సీ అడిగిన పలు ప్రశ్నలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగేలా ఏపీపీఎస్సీ ప్రశ్నలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలను అడగడం ద్వారా చంద్రబాబుపై తన స్వామిభక్తిని ఏపీపీఎస్సీ చాటుకున్నట్లుగా ఉందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
 
వాయిదా వినతిని పట్టించుకోని ఏపీపీఎస్సీ
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని, మరోవైపు.. ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఈ తరుణంలో గ్రూప్‌–2 పరీక్షలు సరికాదని, రెండు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీకి విన్నవించారు. తమకు ప్రిపరేషన్‌కు సరైన సమయం కూడా ఇవ్వకుండా పరీక్షలు పెట్టడంవల్ల నష్టపోతామని అభ్యర్థులు చాలా కాలంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటూ రీపోలింగ్‌ జరుగుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం జరిగేలా ప్రశ్నలు అడగడంపై మండిపడుతున్నారు.

77.92శాతం మంది హాజరు
రాష్ట్రంలోని 447 గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 727 కేంద్రాల్లో ప్రిలిమనరీ (స్క్రీనింగ్‌ టెస్టు)ను నిర్వహించింది. మొత్తం 2,95,036 మంది దరఖాస్తు చేయగా 2,28,263 మంది హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే, పరీక్షకు హాజరైనది మాత్రం కేవలం 1,77,876 (77.92 శాతం) మంది మాత్రమే. 50,383 మంది పరీక్ష రాయలేకపోయారు. ఉ.9.45 గంటల తరువాత ఎవరినీ అనుమతించరాదన్న నిబంధనతో కొన్నిచోట్ల అభ్యర్థులను అనుమతించలేదు. కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామా హాల్‌టిక్కెట్లలో అది ఏ ప్రాంతంలో ఉందో స్పష్టంగా లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. అడ్రస్‌ ప్రకారం ఆ ప్రాంతాలకు వెళ్లగా వారికి అక్కడ పరీక్ష కేంద్రం లేకపోవడం వంటి సంఘటనలూ ఎదురయ్యాయి. పలువురు దీనిపై ఏపీపీఎస్సీని సంప్రదించగా సరిచేసి మళ్లీ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించడంతో అలాంటి వారు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అలా చివరివరకు చూసుకోలేని వారు చివరి నిమిషంలో కేంద్రం ఎక్కడుందో తెలియక పరీక్షకు దూరమయ్యారు.

బాబు పథకాలపై ఇవీ ప్రశ్నలు..
గతంలో ఏ ప్రభుత్వంలో లేని రీతిలో ఏపీపీఎస్సీ ఈసారి ప్రశ్నలను రూపొందింపజేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పట్ల స్వామిభక్తిని చాటుకుంది. చంద్రబాబు పేరిట అమలవుతున్న పథకాలతో పాటు పేదరికంపై గెలుపు, ఆదరణ, ఎన్టీఆర్‌ విదేశీ విద్య తదితర స్కీములపైనా ప్రశ్నలను అభ్యర్థులపై సంధించింది. అవి..
– చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత?
– పసుపు కుంకుమ పథకం ఏ వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది?
– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వపు ఎన్టీఆర్‌ విదేశీ విద్య, ఆదరణ పథకం ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది?
– చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు?
– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పోర్టల్‌ ‘పేదరికంపై గెలుపు’ ఈ కింది వాటికి సాధారణ వేదిక?
– ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు?
– ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది?

ఆంగ్లంలో ఒకలా.. తెలుగులో మరోలా..
మరోవైపు.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ప్రిలిమనరీ ప్రశ్నలు ఆంగ్లంలో ఒక మాదిరిగా, తెలుగులో మరో రకంగా ఉండడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. రెండు మాధ్యమాల్లోని ప్రశ్నలను చదువుకుని సమాధానాలను గుర్తించడం ఇబ్బందిగా మారడంతో పాటు సమయం కూడా చాలా వృధా చేసుకోవలసి వచ్చిందని వారు వాపోయారు. ఉదాహరణకు.. 
– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లోని ఎన్ని ప్రధాన విభాగాలను అమలుచేశారు అని తెలుగులో ప్రశ్న ఉంది. ఇదే ప్రశ్న ఇంగ్లీషులో ‘ఫుల్లీ’ (పూర్తిగా) అని అడగ్గా తెలుగులో ఆ పదాన్నే ఇవ్వలేదు. విభజన చట్టంలోని కొన్నిటిని పాక్షికంగా.. కొన్నిటిని పూర్తిగా అమల చేశారు. తెలుగు మాధ్యమంలో ‘పూర్తి’ అని అడగకపోవడంవల్ల అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. 
– మరో ప్రశ్నలో.. ఏపీ రాజధాని అమరావతిని ఉద్దేశించి.. ‘భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా జస్టిస్‌ సిటీ నిర్మించుకుంది’ అని అడిగారు. వాస్తవానికి అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమూ లేకున్నా.. జస్టిస్‌ సిటీ నిర్మాణం అయిపోయినట్లుగా కమిషన్‌ అడగడం విశేషం. జస్టిస్‌ సిటీ మాట దేవుడెరుగు హైకోర్టు శాశ్వత నిర్మాణం కూడా చేయలేదు. ప్రస్తుతం జిల్లా కోర్టుల కోసం నిర్మించిన భవనాల్లో హైకోర్టును తాత్కాలికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
– అలాగే, పేపర్‌ కోడ్‌ ‘డి’లోని 5వ ప్రశ్నలో ఆంగ్ల ప్రశ్నకు సమాధానం 22గా వస్తుండగా.. తెలుగు ప్రశ్నకు 20 సమాధానంగా వస్తుండడంతో అభ్యర్థులు సందిగ్థంలో పడ్డారు. 
– 26వ ప్రశ్నలో ఆంగ్లలో సీ ఫ్లోర్‌ (సముద్రపు అడుగుభాగం) అని ఉండగా తెలుగులో సముద్రపు అంతస్తు అని పేర్కొన్నారు. 

ఏపీపీఎస్సీ నిర్వాకం.. 20మంది పరీక్షకు దూరం
ఏపీపీఎస్సీ చేసిన తప్పిదాలకు పలువురు అభ్యర్థులు ఆదివారం గ్రూప్‌–2 పరీక్షను రాయలేకపోయారు. దాదాపు 20 మంది విద్యార్థులు ఏపీపీఎస్సీ జారీచేసిన హాల్‌టికెట్ల ప్రకారం చిత్తూరులో పరీక్ష కేంద్రం ఉందని భావించి ఆదివారం ఉ.9 గంటలకు కొందరు అభ్యర్థులు చిత్తూరు రాంనగర్‌ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాలకు చేరుకున్నారు. కానీ, అక్కడ పరీక్ష హడావుడి ఏమీ కనబడకపోయేసరికి వారు అవాక్కయ్యారు. హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రం వివరాలు స్పష్టంగా లేకపోవడంతో వారు పరీక్ష రాయలేకపోయారు. వాస్తవానికి శ్రీకాళహాస్తిలోని రాంనగర్‌కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, అభ్యర్థులు చిత్తూరులోని రాంనగర్‌ కాలనీ శ్రీ చైతన్య పాఠశాల వద్దకు వెళ్లారు. అధికారులు హాల్‌టికెట్‌లో ప్రాంతం పేరు సరిగా ముద్రించి ఉంటే ఈ గందరగోళానికి ఆస్కారం ఉండేది కాదని బాధిత అభ్యర్థులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement