group 2 exam
-
Andhra pradesh: జనవరి 5న గ్రూప్–2 మెయిన్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. డీఎస్సీ, ఎస్ఎస్సీ తదితర పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌పై వివరణ తీసుకుని గ్రూప్–2 మెయిన్స్ తేదీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.కాగా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 899 గ్రూప్–2 కేటగిరీ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహించగా, 4,04,039 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 5న ఫలితాలు ప్రకటించారు. ఇందులో మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో 89,900 మంది అర్హత సాధించినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించినప్పటికీ... నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.వాస్తవానికి జూన్‌లోనే మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ చైర్మన్ లేకపోవడం, ఇతర కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా జనవరి 5న మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆఫ్ లైన్లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించి పేపర్–1, పేపర్–2లలో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే...ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో డిప్యూటీ తహసీల్దార్–114, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్–150, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్–4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్–16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్–28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏవో), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరో రెండు పోస్టులను కలిపారు. -
గ్రూప్-2 వాయిదా యోచనలో తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 2 వాయిదా వేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తం కావడం తో వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళితో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం గ్రూప్-2 వాయిదాపై ప్రకటన చేసే అవకాశం ఉంది.గ్రూప్-2 పరీక్షను ఆగస్టులో నిర్వహించాల్సి ఉండగా, డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడం, పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
నేడే గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్ సిబ్బంది.. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్‌ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
APPSC Group-2: ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా పకడ్భందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్-2 పరీక్షకు 4,83,535 అభ్యర్థులు దరఖాస్తు చేయగా 4,63,517 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరైన ఒకరిని పట్టుకున్నారు. నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో నకిలీ హాల్ టికెట్లతో పరీక్ష రాసేందుకు యత్నించారనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జూన్, జూలైలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మార్చి 17న గ్రూప్-1 పరీక్షను పకడ్భందీగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 పరీక్షకు సెంటర్లకు కొరత వచ్చే అవకాశం లేదన్నారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వదంతులు ఎవరూ నమ్మొద్దన్నారు. పరీక్షలు వాయిదా పడతాయనే వదంతులు నమ్మకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావాలన్నారు. -
ఏపీలో యధావిధిగా గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష
-
Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్‌పోన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పరీక్ష తేదీ రీ షెడ్యూల్ చేస్తారా.. లేక కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలపై రివ్యూ చేసిన ప్రభుత్వం.. గ్రూప్ ఎగ్జామ్స్‌పై స్పష్టత ఇవ్వలేదు. కాగా తెలంగాణలో గ్రూప్-2కు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని మోదీతో భేటీ -
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్ పరీక్ష వాయిదా వేయాలని 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. అభ్యర్థుల స్గోగన్స్‌తో TSPSC పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. Group 2 aspirants protested at TSPSC office, demanding to postpone the exam. INC leader Addanki Dayakar, TJS President Kodandaram extended support to unemployed#Telangana #Students #Unemployed #Group2 pic.twitter.com/NZi1vTiYha — Aapanna Hastham (@AapannaHastham) August 10, 2023 పై పరీక్షల అన్ని కూడా వేరు వేరు సిలబస్ ఉండడం వల్ల ప్రిపేర్ కావడం కష్టం అంటున్నారు అభ్యర్థులు. గ్రూప్-2 సిలబస్‌లో కొత్త అంశాలను చేర్చటం వల్లవాటి బుక్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ల లీకేజీలతో మానసికంగా కుంగిపోయామని, 7 సంవత్సారాలు ఆపారు.. మూడు నెలలు ఆపలేరా అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ చెబుతోంది. అయితే వాయిదా వేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. -
గ్రూప్–2 పరీక్షా పేపర్లో బాబు భక్తి!
సాక్షి, అమరావతి/చిత్తూరు కలెక్టరేట్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమనరీ పరీక్షలో పలు ప్రశ్నలు అభ్యర్థులను విస్తుపోయేలా చేశాయి. ఎన్నికలకు కొద్దికాలం ముందు ఓట్ల కోసం తన పేరుతో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టిన కొన్ని పథకాల గురించిన ప్రశ్నలను ఏపీపీఎస్సీ అడగడం వివాదాస్పదంగా మారింది. సాధారణ ఎన్నికల కోడ్ మే 27వ తేదీ వరకు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పైగా రాష్ట్రంలోని ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా ఇంకా ముగియలేదు. మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్‌కు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ తరుణంలో జరిగిన గ్రూప్–2 పరీక్షలో ఏపీపీఎస్సీ అడిగిన పలు ప్రశ్నలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగేలా ఏపీపీఎస్సీ ప్రశ్నలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలను అడగడం ద్వారా చంద్రబాబుపై తన స్వామిభక్తిని ఏపీపీఎస్సీ చాటుకున్నట్లుగా ఉందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వాయిదా వినతిని పట్టించుకోని ఏపీపీఎస్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, మరోవైపు.. ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఈ తరుణంలో గ్రూప్–2 పరీక్షలు సరికాదని, రెండు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీకి విన్నవించారు. తమకు ప్రిపరేషన్‌కు సరైన సమయం కూడా ఇవ్వకుండా పరీక్షలు పెట్టడంవల్ల నష్టపోతామని అభ్యర్థులు చాలా కాలంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటూ రీపోలింగ్ జరుగుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం జరిగేలా ప్రశ్నలు అడగడంపై మండిపడుతున్నారు. 77.92శాతం మంది హాజరు రాష్ట్రంలోని 447 గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 727 కేంద్రాల్లో ప్రిలిమనరీ (స్క్రీనింగ్ టెస్టు)ను నిర్వహించింది. మొత్తం 2,95,036 మంది దరఖాస్తు చేయగా 2,28,263 మంది హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే, పరీక్షకు హాజరైనది మాత్రం కేవలం 1,77,876 (77.92 శాతం) మంది మాత్రమే. 50,383 మంది పరీక్ష రాయలేకపోయారు. ఉ.9.45 గంటల తరువాత ఎవరినీ అనుమతించరాదన్న నిబంధనతో కొన్నిచోట్ల అభ్యర్థులను అనుమతించలేదు. కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామా హాల్‌టిక్కెట్లలో అది ఏ ప్రాంతంలో ఉందో స్పష్టంగా లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. అడ్రస్ ప్రకారం ఆ ప్రాంతాలకు వెళ్లగా వారికి అక్కడ పరీక్ష కేంద్రం లేకపోవడం వంటి సంఘటనలూ ఎదురయ్యాయి. పలువురు దీనిపై ఏపీపీఎస్సీని సంప్రదించగా సరిచేసి మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడంతో అలాంటి వారు డౌన్లోడ్ చేసుకున్నారు. అలా చివరివరకు చూసుకోలేని వారు చివరి నిమిషంలో కేంద్రం ఎక్కడుందో తెలియక పరీక్షకు దూరమయ్యారు. బాబు పథకాలపై ఇవీ ప్రశ్నలు.. గతంలో ఏ ప్రభుత్వంలో లేని రీతిలో ఏపీపీఎస్సీ ఈసారి ప్రశ్నలను రూపొందింపజేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పట్ల స్వామిభక్తిని చాటుకుంది. చంద్రబాబు పేరిట అమలవుతున్న పథకాలతో పాటు పేదరికంపై గెలుపు, ఆదరణ, ఎన్టీఆర్ విదేశీ విద్య తదితర స్కీములపైనా ప్రశ్నలను అభ్యర్థులపై సంధించింది. అవి.. – చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత? – పసుపు కుంకుమ పథకం ఏ వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఎన్టీఆర్ విదేశీ విద్య, ఆదరణ పథకం ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది? – చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు? – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ కింది వాటికి సాధారణ వేదిక? – ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు? – ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది? ఆంగ్లంలో ఒకలా.. తెలుగులో మరోలా.. మరోవైపు.. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమనరీ ప్రశ్నలు ఆంగ్లంలో ఒక మాదిరిగా, తెలుగులో మరో రకంగా ఉండడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. రెండు మాధ్యమాల్లోని ప్రశ్నలను చదువుకుని సమాధానాలను గుర్తించడం ఇబ్బందిగా మారడంతో పాటు సమయం కూడా చాలా వృధా చేసుకోవలసి వచ్చిందని వారు వాపోయారు. ఉదాహరణకు.. – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని ఎన్ని ప్రధాన విభాగాలను అమలుచేశారు అని తెలుగులో ప్రశ్న ఉంది. ఇదే ప్రశ్న ఇంగ్లీషులో ‘ఫుల్లీ’ (పూర్తిగా) అని అడగ్గా తెలుగులో ఆ పదాన్నే ఇవ్వలేదు. విభజన చట్టంలోని కొన్నిటిని పాక్షికంగా.. కొన్నిటిని పూర్తిగా అమల చేశారు. తెలుగు మాధ్యమంలో ‘పూర్తి’ అని అడగకపోవడంవల్ల అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. – మరో ప్రశ్నలో.. ఏపీ రాజధాని అమరావతిని ఉద్దేశించి.. ‘భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా జస్టిస్ సిటీ నిర్మించుకుంది’ అని అడిగారు. వాస్తవానికి అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమూ లేకున్నా.. జస్టిస్ సిటీ నిర్మాణం అయిపోయినట్లుగా కమిషన్ అడగడం విశేషం. జస్టిస్ సిటీ మాట దేవుడెరుగు హైకోర్టు శాశ్వత నిర్మాణం కూడా చేయలేదు. ప్రస్తుతం జిల్లా కోర్టుల కోసం నిర్మించిన భవనాల్లో హైకోర్టును తాత్కాలికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. – అలాగే, పేపర్ కోడ్ ‘డి’లోని 5వ ప్రశ్నలో ఆంగ్ల ప్రశ్నకు సమాధానం 22గా వస్తుండగా.. తెలుగు ప్రశ్నకు 20 సమాధానంగా వస్తుండడంతో అభ్యర్థులు సందిగ్థంలో పడ్డారు. – 26వ ప్రశ్నలో ఆంగ్లలో సీ ఫ్లోర్ (సముద్రపు అడుగుభాగం) అని ఉండగా తెలుగులో సముద్రపు అంతస్తు అని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వాకం.. 20మంది పరీక్షకు దూరం ఏపీపీఎస్సీ చేసిన తప్పిదాలకు పలువురు అభ్యర్థులు ఆదివారం గ్రూప్–2 పరీక్షను రాయలేకపోయారు. దాదాపు 20 మంది విద్యార్థులు ఏపీపీఎస్సీ జారీచేసిన హాల్‌టికెట్ల ప్రకారం చిత్తూరులో పరీక్ష కేంద్రం ఉందని భావించి ఆదివారం ఉ.9 గంటలకు కొందరు అభ్యర్థులు చిత్తూరు రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాలకు చేరుకున్నారు. కానీ, అక్కడ పరీక్ష హడావుడి ఏమీ కనబడకపోయేసరికి వారు అవాక్కయ్యారు. హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రం వివరాలు స్పష్టంగా లేకపోవడంతో వారు పరీక్ష రాయలేకపోయారు. వాస్తవానికి శ్రీకాళహాస్తిలోని రాంనగర్‌కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, అభ్యర్థులు చిత్తూరులోని రాంనగర్ కాలనీ శ్రీ చైతన్య పాఠశాల వద్దకు వెళ్లారు. అధికారులు హాల్‌టికెట్‌లో ప్రాంతం పేరు సరిగా ముద్రించి ఉంటే ఈ గందరగోళానికి ఆస్కారం ఉండేది కాదని బాధిత అభ్యర్థులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. -
నేడు గ్రూప్-2 ప్రిలిమినరీ
-
గ్రూప్ 2 రాసిన తండ్రీ కొడుకులు
ఇబ్రహీంపట్నం : కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, గోధూర్ గ్రామానికి చెందిన గురుడు అశోక్, కొడుకు విశాల్ గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తండ్రి అశోక్ గోధూర్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా, విశాల్ ఎర్దండి ప్రభుత్వ పాఠశాలలో సెంకడరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. గ్రూప్–2 ఉద్యోగానికి ఓపెన్ కేటగిరిలో అభ్యర్థులకు 44 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వగా బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇవ్వడంతో 49 ఏళ్ల వయస్సులో 2015లో అశోక్ దరఖాస్తులు చేసుకున్నారు. అశోక్‌కు ఆర్మూర్‌లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో, విశాల్‌కు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాల సెంటర్లో పరీక్షకు హాజరయ్యారు. తండ్రి, కొడుకు గ్రూప్–2 పరీక్షలు రాయనుండడంతో ఎవరూ ఉద్యోగం సాధిస్తారో అని గ్రామస్తులు ముచ్చటిస్తున్నారు. -
గ్రూపు-2 వద్దు.. మంగళసూత్రమే ముద్దు
మంగళసూత్రానికే పరీక్ష పెట్టారు గ్రూప్-2 అధికారులు. శుక్రవారం జరిగిన గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాల్లోకి వెళ్లేముందు తమ ఒంటిపై ఉన్న రింగ్, చైన్లు, నగదు, మెట్టెలు, గాజులతో పాటు మంగళసూత్రాలను కూడా తీసేసి వెళ్లాలని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహిళా అభ్యర్థులతో పాటు వచ్చిన వారి భర్తలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లోని అంజుమన్ సొసైటీ పరీక్ష కేంద్రం వద్ద ఓ మహిళా అభ్యర్థిని మంగళసూత్రం తీసి కేంద్రంలోకి వెళ్లాలని అధి కారులు చెప్పగా అందుకు ఆమె నిరాకరించింది. అసలే శుక్రవారం అని, తాను మంగళసూత్రం తీయబోనని కరాఖండిగా చెప్పింది. దీంతో అధికారులు ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగింది. ఇలాంటి నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హాల్‌టికెట్ తప్పులు: 38 మంది పరీక్షకు దూరం
ములుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలో హాల్‌టికెట్‌పై తప్పుడు అడ్రస్ అచ్చువేయడంతో.. 38 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. హాల్‌టికెట్‌పై ములుగు మెయిన్ రోడ్ జయశంకర్ జిల్లాకు బదులుగా.. ములుగు మెయిన్‌రోడ్ వరంగల్ జిల్లా అని అచ్చవడంతో.. అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అడ్రస్ కనుక్కొని పరీక్ష కేంద్ర వద్దకు చేరుకునే సరికి పుణ్యకాలం ముగిసిందని వారిని లోనికి అనుమతించలేదు. దీంతో 38 మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష కోసం సిద్ధమైన తమను పరీక్ష రాయనివ్వకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. -
నిండాముంచిన ‘నిమిషం ’
జమ్మికుంట/జనగామ: గ్రూప్ 2 పరీక్షలో ప్రభుత్వం విధించిన ఒక్క నిమిషం నిబంధన వల్ల పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సరైన సమయంలో చేరుకోలేకపోవడంతో.. వారిని అధికారులు పరీక్ష హోలులోకి అనుమతించలేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 4,272 మంది గ్రూప్ 2 అభ్యర్థుల కోసం 13 సెంటర్లను ఏర్పాటు చేశారు. వివిధ కారణాల వల్ల ఈ పరీక్షకు సుమారు పది మంది అభ్యర్థులు ఒకటి, రెండు నిమిషాల ఆలస్యంగా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోగా.. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు ఆవేదనకు గురయ్యారు. అదిలాబాద్, జగిత్యాల, నిర్మల్ నుంచి వచ్చిన తమకు పరీక్ష కేంద్రాలు గుర్తించడంలోనే ఆలస్యమైందని విద్యార్థులు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోలేదు. కాగా.. అదిలాబాద్‌కు చెందిన సురేష్ అనే అభ్యర్థి జనగామలో పరీక్ష రాయడానికి వచ్చి సెంటర్ అడ్రస్ తెలియక మరొక కళాశాల వద్దకు చేరుకున్నాడు. ఇది గుర్తించిన సాక్షి సిబ్బంది అతన్ని బైక్‌పై ఎక్కించుకొని అతను పరీక్ష రాయాల్సిన ఏకశిల డిగ్రీ కళాశాల వద్దకు చేర్చారు.