
23వ తేదీన 175 కేంద్రాల్లో పరీక్షలు
92,250 మంది అభ్యర్థులు హాజరు
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్(Group 2 main exam) రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ.అనురాధతో కలసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్లు, ఎస్‌పీలను ఆదేశించారు.
13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు సోషల్ మీడియాలో ప్రసారం చేసినా లేదా సర్క్యులేట్ చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదు
చైర్‌పర్సన్ అనురాధ మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్– 1 రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం.9.30 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలని, ఆలస్యంగా వచ్చిన ఎవ్వరినీ లోనికి అనుమతించ కూడదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్–2 పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటల్లోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోను అభ్యర్థులెవరినీ లోనికి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు.
గ్రూప్–2 పరీక్ష నిలిపివేయలేం
హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఈ నెల 23న జరిగే గ్రూప్–2 ప్రధాన పరీక్ష నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరి ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. ప్రధాన పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారని, అందులో ఇద్దరే హారిజాంటల్ రిజర్వేషన్‌పై అభ్యంతరం తెలుపుతూ తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్లు ఈ వ్యాజ్యంలో విజయం సాధిస్తే, అప్పుడు ఈ కోర్టు మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తుందని తెలిపింది.
అయితే ప్రధాన పరీక్షను నిలిపేస్తే అనేక మంది అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొంది. అందువల్లే ప్రధాన పరీక్షను నిలుపుదల చేయడం లేదంది. అయితే నోటిఫికేషన్‌కు అనుగుణంగా చేపట్టే తదుపరి చర్యలన్నీ ఈ వ్యాజ్యాల్లో వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment