ఆఫ్ లైన్ విధానంలో నిర్వహణ
ఏపీపీఎస్సీ ప్రకటన
ఫిబ్రవరిలో ప్రిలిమ్స్... ఏప్రిల్‌లోనే ఫలితాల వెల్లడి
899 పోస్టులకు 89,900 మందికి అర్హత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌పై వివరణ తీసుకుని గ్రూప్–2 మెయిన్స్ తేదీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 899 గ్రూప్–2 కేటగిరీ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహించగా, 4,04,039 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 5న ఫలితాలు ప్రకటించారు. ఇందులో మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో 89,900 మంది అర్హత సాధించినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించినప్పటికీ... నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.
వాస్తవానికి జూన్‌లోనే మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ చైర్మన్ లేకపోవడం, ఇతర కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా జనవరి 5న మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆఫ్ లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించి పేపర్–1, పేపర్–2లలో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే...
ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్‌లో డిప్యూటీ తహసీల్దార్–114, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్–150, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్–4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్–16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్–28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏవో), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరో రెండు పోస్టులను కలిపారు.
Comments
Please login to add a commentAdd a comment