నిండాముంచిన ‘నిమిషం ’
Published Fri, Nov 11 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
జమ్మికుంట/జనగామ: గ్రూప్ 2 పరీక్షలో ప్రభుత్వం విధించిన ఒక్క నిమిషం నిబంధన వల్ల పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సరైన సమయంలో చేరుకోలేకపోవడంతో.. వారిని అధికారులు పరీక్ష హోలులోకి అనుమతించలేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 4,272 మంది గ్రూప్ 2 అభ్యర్థుల కోసం 13 సెంటర్లను ఏర్పాటు చేశారు. వివిధ కారణాల వల్ల ఈ పరీక్షకు సుమారు పది మంది అభ్యర్థులు ఒకటి, రెండు నిమిషాల ఆలస్యంగా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోగా.. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు.
దీంతో అభ్యర్థులు ఆవేదనకు గురయ్యారు. అదిలాబాద్, జగిత్యాల, నిర్మల్ నుంచి వచ్చిన తమకు పరీక్ష కేంద్రాలు గుర్తించడంలోనే ఆలస్యమైందని విద్యార్థులు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోలేదు. కాగా.. అదిలాబాద్‌కు చెందిన సురేష్ అనే అభ్యర్థి జనగామలో పరీక్ష రాయడానికి వచ్చి సెంటర్ అడ్రస్ తెలియక మరొక కళాశాల వద్దకు చేరుకున్నాడు. ఇది గుర్తించిన సాక్షి సిబ్బంది అతన్ని బైక్‌పై ఎక్కించుకొని అతను పరీక్ష రాయాల్సిన ఏకశిల డిగ్రీ కళాశాల వద్దకు చేర్చారు.
Advertisement