ఏపీలో నిరుద్యోగుల అవస్థలు (ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారు. గత నాలుగున్నరేళ్లల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ కలిపి రెండు లక్షలకుపైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే ఆ ఊసే మరిచారు. అదే సమయంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన పోస్టులకు సైతం టీడీపీ సర్కారు ఎసరు పెట్టింది. ఖాళీగా ఉన్న 148 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉండగా.. వాటిని తాత్కాలిక పదోన్నతుల పేరుతో అస్మదీయులకు కట్టబెట్టింది. తద్వారా నిరుద్యోగుల పొట్టకొడుతోంది.
అస్మదీయులకోసం నిబంధనలకు తిలోదకాలు..
వ్యవసాయ శాఖలో 173 వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా ఏపీపీఎస్సీ 25 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించిందని, మిగతా 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈలోగా తెలుగునాడు బీఎస్సీ (వ్యవసాయ) విస్తరణ అధికారుల అసోసియేషన్ రంగంలోకి దిగింది. పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేయాలంటూ వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసింది. అంతే.. సర్వీసు నిబంధనలను సైతం ఉల్లంఘించి మరీ అస్మదీయులకు ప్రయోజనం కల్పించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టుల్లో తాత్కాలిక పదోన్నతులకు వీలు కల్పించారు. తద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాకు పాతరేశారు. ఒకవైపు వ్యవసాయ బీఎస్సీ చదివి వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టుల భర్తీకోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఖాళీగా ఉన్న 148 వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేసేశారు. ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం పెట్టినా, డైరెక్టు రిక్రూట్‌మెంట్ కోటాలోని పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేయడమంటే ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996లోని రూల్ 4 (బి) 11 ఉల్లంఘించడమేనని స్పష్టం చేసినా బాబు సర్కారు పట్టించుకోలేదు.148 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తూ వ్యవసాయ శాఖ గత నెల 12న మెమో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆ మెమోను ఇటీవల జరిగిన కేబినెట్‌లో పెట్టి సక్రమం చేస్తూ బాబు సర్కారు ఆమోదించింది. తెలుగునాడు అసోసియేషన్ విన్నవించడం ఆలస్యం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే.. అసోసియేషన్‌ను ఎవరు ఏర్పాటు చేయించారో తేటతెల్లం అవుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులను తాత్కాలిక పదోన్నతులతో నింపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment