
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి భంగపాటు ఎదురైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. సమీక్షకు హాజరు కావాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బందికి ఆయన కార్యాలయం సమాచారం అందించింది. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో సమీక్షకు హాజరయ్యే విషయంలో ఎన్నికల సంఘాన్ని అధికారులు స్పష్టత కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షకు వారు దూరంగా ఉన్నారు.
అధికారుల కోసం సచివాలయంలో ఉదయం నుంచి దాదాపు మూడు గంటలపాటు వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి.. ఎంతకూ అధికారులు రాకపోవటంతో తిరిగి వెళ్లిపోయారు. తన సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, తన సమీక్షకు అధికారులు రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని గతంలో సోమిరెడ్డి ప్రకటించారు. అయినా, సోమిరెడ్డి సమీక్షకు అధికారులు రాకపోవడం.. సమీక్ష జరగకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని భావించారు.