సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, సీఎస్ జవహర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎం జగన్‌కు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో జూన్ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా 314.6 మి.మీ. వర్షం కురిసిందని తెలిపారు. 25శాతం తక్కువగా వర్షాలు కురిసినట్టు చెప్పారు.
కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఎస్పీఎస్ నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాల కొరత ఉన్నట్టు తెలిపారు. ఇందులో కొన్ని ప్రాంతాలకు ఇరిగేషన్ సదుపాయం ఉన్నందున అక్కడ వర్షాల కొరత ప్రభావం తక్కువగానే ఉందన్నారు.
రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 1174.58 టీఎంసీలు కాగా, 507.88 టీఎంసీల నీరు ఉందని తెలిపిన స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీటిని విడిచిపెడుతోందని అధికారులు చెప్పారు. ముందస్తుగా సాగునీటిని విడుదలచేయడం వల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని అందించగలిగామన్నారు.
సీఎం జగన్ ఆదేశాలు ఇవే..
► ఈ–క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
► రైతుల్ని ఆదుకునే చర్యలకు ఈ డేటా చాలా కీలకం.
► పశువులకు అవసరమైన దాణా, గ్రాసాన్ని సిద్ధంచేసుకోవాలి.
► వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలి.
► వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలి.
► రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు.
కరెంటు డిమాండు, పంపిణీలపై సీఎం జగన్ సమీక్ష..
గత ఏడాదితో పోలిస్తే గ్రిడ్ నుంచి డిమాండ్ కనీసంగా 18 శాతం వరకూ పెరిగిందని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3.3 లక్షల కనెక్షన్లు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. గాలి లేనందున విండ్ పవర్ గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే బొగ్గుకూడా తడి బొగ్గు రావడంతో సామర్థ్యం మేరకు థర్మల్ కేంద్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పొడివాతావరణం, వేసవిని తలపించేలా పరిస్థితులు ఉండడం వల్ల అనుకోకుండా అనూహ్యంగా ఈ డిమాండ్ వచ్చిందని తెలిపారు. ప్రతిరోజూ కూడా కనీసంగా 44.25 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలు చేస్తున్నామన్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకూ సుమారు రూ.2935 కోట్లు వెచ్చించామని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం జగన్.. దేశవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. అయినా ఎక్కడా కూడా రైతులకు, ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అధిక రేట్లు ఉన్నా సరే.. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్క ఆగస్టు-2023లోనే రూ.966.09కోట్లు విద్యుత్ కొనుగోలు చేశాం. యూనిట్ ధర రూ.7.52 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నాం. ఇంత ఖర్చు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: భూమి లేని పేదలకు అండగా ఉంటాం.. కౌలురైతుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment