AP CM YS Jagan Review Meeting With Agriculture Department, Details Inside - Sakshi
Sakshi News home page

సాగుకు డ్రోన్ల సాయం..ఈ ఏడాది నుంచే వాటి వినియోగం: సీఎం జగన్‌

Published Fri, May 6 2022 1:07 PM | Last Updated on Sat, May 7 2022 10:03 AM

AP CM YS Jagan Review Meeting With Agriculture Department - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నానో ఫెర్టిలైజర్స్, నానో పెస్టిసైడ్స్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ల పాత్ర కీలకం కానుందని తెలిపారు. డ్రోన్ల రాకతో మోతాదుకు మించి రసాయనాల వాడకం తగ్గిపోయి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలోడ్రోన్లు అందుబాటులోకి తేవడంతోపాటు నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పంటల బీమా, సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, కిసాన్‌ డ్రోన్లు, ఖరీఫ్‌ సన్నద్ధత, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

 వీడియోలతో అవగాహన..
విద్యావంతులైన రైతులతో ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి మాస్టర్‌ ట్రైనర్స్‌ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ జారీ చేయాలి. డ్రోన్లతో పురుగు మందుల స్ప్రే, ఎరువులను వినియోగించడంపై వీడియోల ద్వారా ఆర్బీకేల స్థాయిలో రైతులకు విస్తృత అవగా>హన కల్పించాలి. 

రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు...
రైతులకు ఈ ఏడాది నుంచి సబ్సిడీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలి. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన సీహెచ్‌సీలు, క్లస్టర్‌ సీహెచ్‌సీల్లో ఉన్న యంత్రాలు కాకుండా డిమాండ్‌ సర్వే ఆధారంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీపై పరికరాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలి. జూన్‌ మొదటి వారంలో 3 వేల ట్రాక్టర్లను అందచేయాలి. 4,014 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ప్రారంభించాలి. 402 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలను కూడా ప్రారంభించాలి. 

 రైతు చేతికి పెట్టుబడి సొమ్ము
ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతుల చేతిలో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ ఉండాలి. మే 16న వైఎస్సార్‌ రైతు భరోసా, జూన్‌ 15లోగా పంటల బీమా పరిహారం రైతులకు చెల్లించాలి. దీనివల్ల ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతుల చేతిలో పెట్టుబడులు పెట్టినట్లు అవుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలి. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలి. ఎక్కడా స్టాక్‌ లేదన్న సమాధానం ఆర్బీకేల్లో వినిపించడానికి వీల్లేదు. ఆర్బీకేల నుంచి జిల్లా స్థాయి వరకూ వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించాలి. ఆర్బీకేల్లో ఇన్‌పుట్స్‌ కోసం స్టోరేజీ గదులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి, సహజ వ్యవసాయ సాగును ప్రోత్సహించేలా సీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి.

మామిడి, అరటిపై రూపొందించిన కరదీపిక విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. 
చిత్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అధికారులు

ఆర్బీకేల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌
‘ఆర్బీకేలు, ఇ– క్రాపింగ్‌ మిళితం చేయాలి. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థంగా, పారదర్శకంగా ఉండాలి. పంటల బీమా నుంచి ప్రతి పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. సీఎం యాప్‌ పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాలి. పంటలకు ఎక్కడైనా మద్దతు ధర లభించకుంటే అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాలి. ఆర్బీకేల్లో కియోస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. ప్రతీ ఆర్బీకేలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీల ద్వారా విద్యార్థులు ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను ఆర్బీకేల్లో పూర్తి చేసేలా కోర్సులను రూపొందించాలని గతంలోనే సూచించాం. విద్యార్థుల పరిశీలన, సలహాలు ఆర్బీకేల పనితీరును మెరుగుపర్చేందుకు దోహదం చేస్తాయి.

నా తరపున లేఖలు పంపండి..
కౌలు రైతులకు సీసీఆర్సీ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డు) జారీపై అవసరమైతే భూ యజమానుల ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలి. సీసీఆర్సీ వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని వివరించాలి. ఈమేరకు అన్ని వివరాలతో ముఖ్యమంత్రిగా నా తరఫున వారికి లేఖలు పంపాలి. సాధ్యమైనంత ఎక్కువ మందికి సీసీఆర్సీలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కౌలు రైతులకు అందచేయాలి.

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మిల్లెట్‌ పాలసీకి అనుగుణంగా చిరుధాన్యాలు సాగును ప్రోత్సహించాలి. చిరు ధాన్యాలకు మద్దతు ధర, ప్రాసెసింగ్, అదనపు విలువ జోడించడం, వినియోగం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలి. నీటి వసతి అరకొరగా ఉన్న ప్రాంతాల్లో పంట మార్పిడిని ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించాలి.

వేసవిలో రికార్డు స్థాయి పంట
గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో పదేళ్ల తర్వాత వేసవి పంట (మూడో పంట)కు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు. వేసవి పంట గతేడాది 13 వేల హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో సాగు జరుగుతోందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 477 శాతం విస్తీర్ణం పెరిగిందని, ఈసారి కనీసం లక్ష హెక్టార్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడుల్లో నాలుగు శాతం అదనంగా నమోదైనట్లు తెలిపారు. ఖరీఫ్‌–2022 సీజన్‌కు సరిపడా ఎరువులతో పాటు ఆర్బీకేల స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 6 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేశామన్నారు. 

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మీటర్లు
వ్యవసాయ ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్‌ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలో విజయవంతమైందని అధికారులు తెలిపారు. మీటర్ల వల్ల రైతులకు నాణ్యమైన కరెంటు అందడంతోపాటు విద్యుత్తు సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి రైతులకు జరిగే మేలును వివరించాలని సూచించారు.

అధికారులకు సీఎం అభినందన
వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు మన దేశం నుంచి ఐరాస ప్రతిష్టాత్మక ఎఫ్‌ఏవో చాంఫియన్‌ అవార్డుకు నామినేట్‌ కావడంపై వ్యవసాయ శాఖ అధికారులను సీఎం  జగన్‌ అభినందించారు. ఇది గొప్ప అచీవ్‌మెంట్‌ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మామిడి, అరటిపై రూపొందించిన కరదీపికలను సీఎం ఆవిష్కరించారు. వెదురు ఉప ఉత్పత్తులను పరిశీలించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్‌ఎస్‌ శ్రీధర్, ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌ బాబు, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరామ్, రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement