సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతంగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి కూడా సంకల్పించారు.
ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఒక ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా ఏకీకృత హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం 16 వర్సిటీల్లో 3,480 పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో 474 ప్రొఫెసర్, 859 అసోసియేట్ ప్రొఫెసర్, 2,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో 2,635 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ల పోస్టుల భర్తీని ఒకే రిక్రూట్‌మెంట్‌లో చేపట్టనుంది.
ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు కూడా వర్సిటీలు ఇంటర్వ్యూలు చేసి, ఎంపిక చేస్తాయి.
త్వరలోనే ప్రత్యేక పోర్టల్‌లో వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అభ్యర్థులు వాటిని చూసుకొని నచ్చిన వాటికి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా సమయం ఆదాతో పాటు దరఖాస్తు రుసుము తగ్గుతుంది. వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీనీ ప్రభుత్వం కల్పిస్తోంది.
ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని చంద్రబాబు
చంద్రబాబు పాలనలో ఏనాడూ వర్సిటీలను పట్టించుకోలేదు. ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోగా వర్సిటీల్లో కుల రాజకీయాలను ప్రోత్సహించి భ్రష్టుపట్టించారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్టుల హేతుబద్ధీకరణకు కమిటీని నియమించారు. యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు.
వర్సిటీలను సంప్రదించకుండా, వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్ని చోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. వర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టులవారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలా మంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పూర్తిగా విస్మరించారు. ఈ అవకతవకలతో నష్టపోయిన వారు కోర్టుల్లో కేసులు వేశారు.
పనిభారం, కేడర్ నిష్పత్తి ప్రకారం..
సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేశారు. అనంతరం వర్సిటీల్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. వర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది.
ఇందుకోసం జేఎన్‌టీయూ–అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ కె.లాల్ కిషోర్ అధ్యక్షతన ఐదుగురితో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీల్లో అన్ని విభాగాల పనితీరును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పోస్టులపై మార్గదర్శకాలను రూపొందించింది. వర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాలవారీగా పోస్టుల హేతుబద్ధీకరణకు సిఫారసు చేసింది.
ఈ పోస్టులు తప్పనిసరి
బోధన పోస్టులతోపాటు ప్రతి వర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్శిటీ లైబ్రేరియన్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment